కో-పైలటే కూల్చేశాడు! | Germanwings plane crash: Co-pilot 'wanted to destroy plane' | Sakshi
Sakshi News home page

కో-పైలటే కూల్చేశాడు!

Published Fri, Mar 27 2015 12:30 AM | Last Updated on Sat, Sep 2 2017 11:26 PM

కో-పైలటే కూల్చేశాడు!

కో-పైలటే కూల్చేశాడు!

బాత్‌రూమ్‌కు వెళ్లిన కెప్టెన్.. కాక్‌పిట్‌ను లాక్ చేసుకున్న కోపైలట్
 
కెప్టెన్ తలుపు కొడుతూ ఎంతగా అడిగినా కోపైలట్ స్పందించలేదు
విమానం కూలిపోయేలా కోపైలటే ఆపరేట్ చేసినట్లు తెలుస్తోంది
ఎందుకు కూల్చివేశాడో తెలియదు.. ఉగ్రవాదంతో సంబంధం లేదు
విమానం కూలిపోయే ముందు ప్రయాణికులు హాహాకారాలు చేశారు
బ్లాక్‌బాక్స్‌ను విశ్లేషించి నిర్ధారించామన్న ఫ్రాన్స్ దర్యాప్తు అధికారులు

 
పారిస్: ఫ్రాన్స్‌లోని ఆల్ప్స్ పర్వతాల్లో మంగళవారం కుప్పకూలిన జర్మన్ విమానాన్ని కో-పైలట్ ఉద్దేశపూర్వకంగా కూల్చేశాడని.. ఫ్రాన్స్ ప్రాసిక్యూటర్ వెల్లడించారు. విమానం పైలట్ కాక్‌పిట్ నుంచి బయటకు(బహుశా బాత్‌రూమ్‌కు) వెళ్లాక.. కోపైలట్ ఆండ్రియాస్ లూబిట్జ్ కాక్‌పిట్ తలుపు మూసేశాడని, పైలట్ ఎంతగా అడిగినా తలుపు తెరవలేదని, లోపలకు రానీయలేదని.. ఆ తర్వాత విమానం పర్వతాలపై కూలిపోయేలా నడిపించాడని వివరించారు. విమాన శకలాల నుంచి లభ్యమైన ‘బ్లాక్ బాక్స్’ కాక్‌పిట్ వాయిస్ రికార్డర్‌లో రికార్డయిన సంభాషణలు, శబ్దాల ఆధారంగా ఈ నిర్ధారణకు వచ్చినట్లు ప్రాసిక్యూటర్ బ్రైస్ రాబిన్ తెలిపారు. జర్మనీ దేశపు జర్మన్‌వింగ్స్ విమానయాన సంస్థకు చెందిన ఎయిర్‌బస్ ఎ320 విమానం.. గత మంగళవారం ఉదయం 10 గంటలకు స్పెయిన్‌లోని బార్సిలోనా నుంచి బయల్దేరి జర్మనీలోని డ్యుసెల్‌డార్ఫ్ నగరానికి పయనమవటం.. 40 నిమిషాల్లోనే ఫ్రాన్స్‌లోని ఆల్ప్స్ పర్వతశ్రేణుల్లో కూలిపోవటం తెలిసిందే.

విమానంలోని ఆరుగురు సిబ్బందితో పాటు.. 144 మంది ప్రయాణికులు మొత్తం ఈ ఘోర దుర్ఘటనలో చనిపోయిన విషయమూ విదితమే. ఈ విమాన శకలాల నుంచి సేకరించిన బ్లాక్‌బాక్స్‌ను విశ్లేషించిన నిపుణులు.. విమానాన్ని కో-పైలట్ ఉద్దేశపూర్వకంగానే కూల్చివేశాడని బలంగా అనుమానిస్తున్నారు. ప్రాసిక్యూటర్ గురువారం మీడియాకు వివరించిన కథనం ప్రకారం...

విమానం బయల్దేరిన తర్వాత కాక్‌పిట్‌లో కెప్టెన్, కో-పైలట్‌ల మధ్య సంభాషణలు మామూలుగానే సాగాయి. ఎటువంటి ఆందోళనకరమైన అంశాలూ లేవు. చివరిగా.. విమానం నిర్ణీత ఎత్తుకు చేరిన తర్వాత ఆ ఎత్తులో ప్రయాణం సాగిం చేందుకు లాంఛనంగా గ్రౌండ్ కంట్రోల్ అనుమతి కోరటం నమోదయింది. ఆ తర్వాత కొద్ది నిమిషాలు ఎటువంటి సంభాషణలూ లేవు. కాసేపటికి.. కాక్‌పిట్ నుంచి కెప్టెన్ బయటకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఆయన కాక్‌పిట్ వెలుపలి నుంచి తలుపుపై నెమ్మదిగా తడుతూ తెరవాలని కోరటం వినిపించింది. దీనికి కో-పైలట్ నుంచి ఎటువంటి స్పందనా, సమాధానం లేవు. తలుపు తెరవాల్సిందిగా కెప్టెన్ పదే పదే అడుగుతుండటం.. తలుపుపై చేతులతో కొడుతున్న శబ్దం వినిపించింది. కానీ.. కో-పైలట్ తలుపు తెరవలేదు. మరి కొద్ది నిమిషాల్లోనే తలుపును పగలగొట్టటానికి కెప్టెన్ ప్రయత్నిస్తున్నట్లు గట్టి శబ్దాలు వినిపించాయి. కాక్‌పిట్‌లో ఉన్న కో-పైలట్ మామూలుగా శ్వాస తీసుకుంటున్న శబ్దం మినహా మరే శబ్దాలూ వినిపించలేదు. ఇక విమానం మరికొన్ని క్షణాల్లో కూలిపోతుందనగా ప్రయాణికులు హాహాకారాలు చేయటం నమోదయింది.

దీనినిబట్టి.. కాక్‌పిట్ నుంచి కెప్టెన్ బయటకు వెళ్లాక, తలుపు తెరుచుకోకుండా చేసి.. కో-పైలటే ఉద్దేశపూర్వకంగా.. విమానం నేరుగా నేలను తాకి కూలిపోయేలా నియంత్రణ వ్యవస్థను ఆపరేట్ చేశాడన్న నిర్ధారణకు వచ్చినట్లు ప్రాసిక్యూటర్ పేర్కొన్నారు. భూమికి 38,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న విమానం కూలిపోవటానికి ముందు చివరి పది నిమిషాల్లో ఏకంగా 36,000 అడుగులకు పైగా కిందకు దిగిపోయింది. చివరి క్షణాల వరకూ ప్రయాణికులకు ముంచుకొస్తున్న విపత్తు గురించి తెలియదని కాక్‌పిట్ వాయిస్ రికార్డర్‌లో రికార్డయిన శబ్దాలను బట్టి తెలుస్తోందని చెప్పారు. విమానం కూలిపోతున్నంతవరకూ కో-పైలట్ సృ్పహలోనే ఉన్నాడని తెలిపారు. కో-పైలట్ విమానాన్ని కూల్చివేయడానికి కారణమేమిటనేది ఇంకా తెలియదన్నారు. అయితే.. ఇందులో ఉగ్రవాద పాత్రకు అవకాశం లేదని, అతడికి ఉగ్రవాదులతో సంబంధాలున్నట్లు ఆధారాలు లేవని కొట్టివేశారు.

ఘటనా స్థలానికి మృతుల బంధువులు...

ఆల్ప్స్ పర్వతాల్లో గాలింపు, సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. పర్వతాలు, లోయల్లో చెల్లాచెదురుగా పడిపోయిన విమాన ప్రయాణికుల మృతదేహాలు, శరీరభాగాలను హెలికాప్టర్ల ద్వారా సమీపంలోని సెయిన్ లె ఆల్ప్స్‌కు తరలిస్తున్నారు. శరీరభాగాలు గుర్తించలేనంతగా ఛిద్రమయ్యాయని ఆ ప్రాంతానికి వెళ్లిన పర్వత మార్గదర్శకుడు ఒకరు పేర్కొన్నారు. దీంతో.. మృతులను గుర్తించేందుకు డీఎన్‌ఏ నమూనాలు సేకరిస్తున్నారు. ఈ దుర్ఘటనలో మొత్తం 18 దేశాలకు చెందిన పౌరులు మృతి చెందగా.. వారిలో అత్యధికంగా 72 మంది జర్మనీ వాసులు, 51 మంది స్పెయిన్ పౌరులు ఉన్నారు. స్పెయిన్, జర్మనీల నుంచి బాధిత ప్రయాణికుల కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఘటనా ప్రాంతానికి వెళ్లేందుకు ఫ్రాన్స్ వస్తున్నారు. బార్సిలోనా, డుసెల్‌డార్ఫ్‌ల నుంచి రెండు విమానాల్లో వీరు గురువారం ఫ్రాన్స్ చేరుకున్నారు. వారి నుంచి డీఎన్‌ఏ నమూనాలు సేకరించేందుకు ఘటనా ప్రాంతంలో టెంట్లను నెలకొల్పారు.
 
 
ఎవరీ లూబిట్జ్?
http://img.sakshi.net/images/cms/2015-03/81427396709_Unknown.jpg

కోపైలట్ ఆండ్రియాస్ లూబిట్జ్ (28) జర్మనీ పౌరు డు. జర్మనీలోని మోంటాబార్ అతడి స్వస్థలం. అక్కడ తన తల్లిదండ్రులతో కలసి జీవిస్తున్నాడు. టీనేజీ వయసులోనే గ్లైడర్ పైలట్ లెసైన్స్ పొందాడు. గత ఏడాదే పైలట్ లెసైన్స్‌ను పునరుద్ధరించుకున్నాడు. జర్మనీలోనే లుఫ్తాన్సా శిక్షణ కేంద్రంలో పైలట్ శిక్షణ పూర్తిచేసుకున్న వెంటనే జర్మన్‌వింగ్స్ సంస్థలో 2013 సెప్టెంబర్‌లో ట్రైనీ పైలట్‌గా చేరాడు. అతడికి 630 గంటల పాటు విమానం నడిపిన అనుభవం ఉంది. ఇటీవలి కాలంలో అతడు ఎలాంటి మానసిక ఒత్తిడికీ లోనైనట్లు కనిపించలేదని.. అతడిని దగ్గరగా తెలిసిన వ్యక్తులు పేర్కొన్నారు. జర్మన్‌వింగ్స్‌లో ఉద్యోగంలో చేరటం వల్ల సంతోషంగా కూడా ఉన్నాడని చెప్పారు. లూబిట్జ్ స్వతహాగా మితభాషి అయినా.. స్నేహశీలి అని వివరించారు. విమానం కెప్టెన్‌కు(పేరు వెల్లడించలేదు) 6,000 గంటల పాటు విమా నం నడిపిన అనుభవం ఉందని, 2014 మే నెల నుం చి జర్మన్‌వింగ్స్ సంస్థలో పనిచేస్తున్నాడని, అంతకుముందు జర్మన్‌వింగ్స్ మాతృసంస్థ లుఫ్తా న్సా, కాండోర్ విమానయాన సంస్థల్లో పనిచేశాడని.. లుఫ్తాన్సా సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.
 
ఆకాశంలో ఎయిర్‌బస్ ఏ320...
 
 
ప్రతీ రెండు సెకన్లకు ప్రపంచంలో ఏదో ఒక చోట ఒక ఏ320 విమానం టేకాఫ్ లేదా ల్యాండ్ అవుతోంది.
1988 నుంచి ఇప్పటివరకు ఎయిర్‌బస్ విమానాల్లో 8.5 కోట్ల సర్వీసుల్లో 600 కోట్ల మంది ప్రయాణించారు.
ఇప్పటివరకూ 60 సంఘటనలు, 11  ప్రమాదాల్లో 789 మంది మరణించారు.
మంగళవారం కూలిన విమానం తొలిసారిగా 1990లో సర్వీసు  ప్రారంభించింది.
1991లో లుఫ్తాన్సా దీన్ని కొని, 2014లో  జర్మన్‌వింగ్స్‌కు అమ్మేసింది.
చివరిసారిగా సోమవారం దీనిని ‘సాధారణ తనిఖీ’ చేశారు.
ఇప్పటివరకు 46,700 ప్రయాణాల్లో 58,313 గంటలు గాల్లో ఎగిరింది.
ఈ విమానం 60,000 గంటల సామర్థ్యం గలదని లుఫ్తాన్సా చెబుతోంది.
విమానంలో సీఎఫ్‌ఎం 56-5ఏ1 రకం ఇంజిన్లను అమర్చారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement