Gestational edema
-
చాలాసేపు కదలకుండా కూర్చుంటున్నారా.. అయితే జాగ్రత్త!
'చాలాసేపు కదలకుండా కూర్చున్నా, అలా కూర్చుని చాలాసేపు ప్రయాణాలు చేసినా కాళ్లవాపులు రావడం మామూలే. గర్భవతుల్లోనైతే ప్రసవానికి ముందు చివరి మూడు నెలల్లో (చివరి ట్రైమిస్టర్లో) కాళ్ల వాపు రావడం ఇంకా సాధారణం. గర్భవతుల్లో కాళ్ల వాపు వచ్చే ఈ కండిషన్‌ను వైద్య పరిభాషలో ‘జెస్టెషనల్ అడిమా’ అంటారు. ఇలా కాళ్లవాపులు రావడానికి కారణాలేమిటి, వాటితో వచ్చే సమస్యలూ – పరిష్కారాలపై అవగాహన కోసం ఈ కథనం.' గర్భవతుల్లో ప్రసవం ముందరి నెలల్లో కాళ్ల వాపులు రావడం.. అందునా అవి ఉదయం పూట కొద్దిగా ఉండి, క్రమంగా సాయంత్రానికి వాపులు పెరుగుతుండటం చాలామందిలో జరుగుతుంటుంది. కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటల విశ్రాంతితో ఆ నొప్పులు వాటంతట అవే తగ్గిపోతాయి. దేహనిర్మాణ పరమైన (అనటామికల్) కారణం.. గర్భవతుల్లో ప్రసవానికి ముందు రోజుల్లో గర్భసంచి కుడి వైపునకు కాస్తంత ఒరుగుతుంది. కాళ్ల నుంచి గుండెకు రక్తాన్ని తీసుకుపోయే పెద్ద రక్తనాళమైన ఇన్ఫీరియర్ వీన కేవా శరీరానికి కుడివైపునే ఉంటుంది. గర్భసంచి కుడి వైపునకు ఒరగడం వల్ల.. అది ఇన్ఫీరియర్ వీన కేవాపై ఒత్తిడిని కలిగిస్తుంది. దాంతో కాళ్ల నుంచి గుండె వైపునకు రక్తప్రవాహం సాఫీగా సాగక కాళ్లవాపులు వస్తుంటాయి. అందువల్ల గర్భవతులు విశ్రాంతిగా పక్కమీద ఒరిగినప్పుడు తమ ఎడమవైపునకు తిరిగి పడుకోవడం మంచిది. కాళ్లవాపులు వస్తుంటే దృష్టి పెట్టాల్సిన మెడికల్ సమస్యలు.. గర్భవతుల్లో కాళ్ల వాపు వస్తున్నప్పుడు ముందుగా హైబీపీ ఉందేమోనని పరీక్షించుకోవాలి. మనదేశ మహిళల్లో రక్తహీనత (అనీమియా) చాలా ఎక్కువ. కాళ్ల వాపులు రావడానికి ఈ అంశం కూడా ఒక ప్రధాన కారణం. కంప్లీట్ బ్లడ్ పిక్చర్/కౌంట్ (సీబీపీ/సీబీసీ) వంటి రక్తపరీక్షలు నిర్వహించినప్పుడు మహిళల్లో హిమోగ్లోబిన్ మోతాదు కనీసం 11 ఉండాలి. కొందరిలో ఇది 7 కంటే తక్కువగా ఉన్నప్పుడు కాళ్ల వాపు రావడం సాధారణం. మహిళల్లో గుండెజబ్బులు, కాలేయవ్యాధులు, కిడ్ని సమస్యలు ఉన్నవారు గర్భం దాల్చినప్పుడు కూడా కాళ్లవాపులు రావచ్చు. కాళ్లవాపు తగ్గడానికి చేయాల్సిందిదే.. మామూలుగానైతే ఈ కాళ్లవాపుల గురించి పెద్దగా ఆందోళన పడాల్సిందేమీ లేదు. వాపు ఎక్కువగా ఉంటే పక్క మీద ఒరిగి పడుకున్న గర్భవతులు మడమల కింద తలగడను పెట్టుకుని, కాళ్లను కాస్త ఎత్తుగా ఉండేలా చూసుకోవాలి. కంప్యూటర్ ముందుగాని, డెస్క్ ముందుగాని అదేపనిగా కూర్చుని పనిచేసే వారు తమ కాళ్ల కింద ఏదైనా పీటగానీ, స్టూల్‌గాని వేసుకుని, కాళ్లు కాస్తంత ఎత్తు మీద ఉండేలా చూసుకోవాలి. ప్రతి రెండు మూడు గంటలకు ఒకమారు లేచి, కాస్తంత నడవాలి. దాంతో కాళ్ల వాపు తగ్గుతుంది. పైన పేర్కొన్న జాగ్రత్తలు ΄ాటించాక కూడా కాళ్ల వాపులు తగ్గని వారూ,.. అలాగే ఆ సమస్యతో పాటు చేతులు, ముఖంలో వాపు కనిపిస్తున్నవారూ, ఆరేడు గంటల విశ్రాంతి తర్వాత కూడా కాళ్ల వాపులు తగ్గని వారు.. తప్పనిసరిగా హైబీపీ, అనీమియాతో పాటు థైరాయిడ్ వంటి సమస్యలు ఏవైనా ఉన్నాయేమోనని డాక్టర్ల చేత పరీక్ష చేయించుకోవాలి. - డాక్టర్ రమ్యతేజ కడియాల, సీనియర్ గైనకాలజిస్ట్ అండ్ ఆబ్స్టెట్రీషియన్ ఇవి కూడా చదవండి: చలిగాలిలో వాకింగ్: ఊపిరితిత్తులు జాగ్రత్త! -
దిగులొద్దు తల్లీ!
సాక్షి, అమరావతి: గర్భధారణ సమయంలో మహిళల శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ మార్పుల మధ్య వారిలో మనస్థితి ఊగిసలాట (మూడ్ స్వింగ్స్), ఒత్తిడి, కోపం, నిరాశ (డిప్రెషన్) వంటివి కనిపిస్తుంటాయి. ఈ లక్షణాలు మరీ తీవ్రంగా మారితే తల్లీ, బిడ్డ ఇద్దరికీ ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయి. పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలపై ప్రభావం పడుతుంటుంది. ఇదిలావుంటే.. గర్భధారణ సమయంలో తీవ్రమైన డిప్రెషన్‌కు లోనైతే ప్రసవానంతరం గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం పెంచుతుందని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్ ఓ అధ్యయనాన్ని ప్రచురించింది. 1.20 లక్షల మంది గర్భిణులపై అధ్యయనం అధ్యయనంలో భాగంగా 2007 నుంచి 2019 మధ్య ప్రసవించిన 1.20 లక్షల మంది స్త్రీల ఆరోగ్య వివరాలను పరిశోధకులు విశ్లేషించారు. అధిక రక్తపోటు కలిగిన గర్భిణులను అధ్యయనం నుంచి మినహాయించారు. ఈ క్రమంలో గర్భధారణ సమయంలో తీవ్ర డిప్రెషన్‌తో బాధపడిన మహిళల్లో 6 రకాల గుండె సంబంధిత జబ్బులు ప్రమాదం ఎక్కువగా ఉన్నట్టు తేల్చారు. ఇస్కీమిక్ గుండె జబ్బు (గుండె రక్తనాళాల సంకోచ వ్యాధి) ప్రమాదం 83 శాతం అధికంగా ఉందని గుర్తించారు. అదేవిధంగా కార్డియోమయోపతి (గుండె కండరాల వ్యాధి) బారినపడే ప్రమాదం 61 శాతం, అరిథ్మియా/కార్డియాక్ అరెస్ట్ (రక్తప్రసరణ లోపం/గుండెపోటు) ప్రమాదం 60 శాతం ఉన్నట్టు నిర్థారించారు. కొత్తగా అధిక రక్తపోటు నిర్థారణకు 32 శాతం, పక్షవాతం వచ్చే ప్రమాదం 27 శాతం ఉన్నట్టు తేల్చారు. ఈ నేపథ్యంలో గర్భధారణ సమయంలో స్త్రీలు వివిధ జాగ్రత్తలు తీసుకోవాలని పరిశోధకులు సూచించారు. తద్వారా తమకు దీర్ఘకాలంలో అనారోగ్య సమస్యలు తలెత్తకుండా, ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిస్తారని తెలియజేశారు. గర్భంతో ఉన్న సమయంలో ప్రతి ఒక్కరూ మధుమేహం, కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకుని, వాటిని అదుపులో ఉంచుకోవాలని వైద్యులు పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి మన దగ్గర కూడా ప్రసవానంతర కార్డియోమయోపతి (గుండె కండరాల వ్యాధి) కేసులు చూస్తుంటాం. గర్భధారణ సమయంలో తీవ్ర ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్‌కు లోనవడం వల్ల ఇది సంభవిస్తుంది. గర్భిణుల ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఆ సమయంలో శరీరంలో అనేక మార్పులు సంభవిస్తుంటాయి. దీంతో గర్భిణులు ఆందోళన, ఒత్తిడి, నిరాశకు గురవుతుంటారు. దీనికి తోడు ఒత్తిడికి సంబంధించిన హార్మోన్లు ఎక్కువగా విడుదల అవుతుంటాయి. ఈ నేపథ్యంలో క్రమం తప్పకుండా వైద్యులను సంప్రదిస్తుండాలి. ప్రస్తుతం ఫ్యామిలీ డాక్టర్ విధానంలో వైద్యులు గ్రామాలకు నెలలో రెండుసార్లు వెళుతున్నారు. దీంతో గర్భిణులు తమ సొంత ఊళ్లలోనే వైద్యుల సేవలు పొందొచ్చు. ఒత్తిడి, ఆందోళనను తగ్గించుకుని మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి యోగా, ధ్యానం వంటివి చేయాలి. ఇష్టమైన సంగీతం వినాలి. – డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి, డిప్యూటీ సూపరింటెండెంట్, కర్నూలు -
ప్రసవానికి ముందు కాళ్ల వాపులు...!
గైనిక్ కౌన్సెలింగ్ నేను గర్భవతిని. ప్రస్తుతం ఎనిమిదో నెల. రోజూ కాళ్ల వాపులు వస్తున్నాయి. నేనెలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – రాజ్యలక్ష్మి, ఖమ్మం గర్భవతుల్లో చివరి మూడు నెలల్లో చాలామందిలో కాళ్ల వాపు వస్తుంది. ఉదయం నిద్ర లేచినప్పుడు కాళ్ల వాపులు ఉండవు గానీ సాయంత్రం అవుతున్న కొద్దీ పెరుగుతుంటాయి. రాత్రి 6 నుంచి 8 గంటల విశ్రాంతి తర్వాత వాపు తగ్గుతుంటాయి. గర్భవతుల్లో కాళ్ల వాపును వైద్య పరిభాషలో జెస్టెషనల్ అడిమా అంటారు. దీని గురించి ఆందోళన అక్కర్లేదు. అయితే ఇలా వాపు వస్తున్న గర్భవతుల్లో హైపర్‌టెన్షన్ (హైబీపీ) ఏదైనా ఉందేమో చూడాలి. కాళ్ల వాపునకు అదో కారణం కావచ్చు. మన భారతీయ మహిళల్లో రక్తహీనత చాలా ఎక్కువ. కాళ్ల వాపులకు ఈ అంశం కూడా ఒక కారణం. మహిళల్లో హిమోగ్లోబిన్ పాళ్లు కనీసం 11 ఉండటాన్ని ఒక మోస్తరుగా సాధారణంగా పరిగణిస్తుంటాం. అయితే కొందరిలో ఇది 7 కంటే తక్కువగా ఉన్నప్పుడు కాళ్ల వాపు రావడం చాలా సాధారణం. గుండెజబ్బులు, కాలేయవ్యాధులు, కిడ్ని సమస్యలు ఉన్నవారు గర్భం దాల్చినప్పుడు, వాళ్లలో కూడా కాళ్లవాపులు రావచ్చు. వాళ్లు డాక్టర్ సలహా మేరకు మందులు వాడాలి. కాళ్ల వాపులు వస్తున్న గర్భవతులు పక్కమీద ఒరిగినప్పుడు ఎడమవైపునకు తిరిగి పడుకోవడం మంచిది. దీనివల్ల కాళ్ల నుంచి గుండెకు... మళ్లీ అక్కడి నుంచి మెదడుకు రక్తప్రవాహం సాఫీగా సాగి, కాళ్ల వాపు తగ్గి మళ్లీ మామూలు స్థితికి వచ్చేందుకు అవకాశం ఎక్కువ. కాళ్ల వాపు ఎక్కువగా ఉంటే అలా పక్క మీద ఒరిగి పడుకున్న గర్భవతులు తమ మడమల కింద తలగడను పెట్టుకుని, కాళ్లను కాస్త ఎత్తుగా ఉండేలా చూసుకుంటే కాళ్ల వాపులు తగ్గుతాయి. కంప్యూటర్ ముందుగాని, డెస్క్ ముందుగాని అదేపనిగా కూర్చుని పనిచేసే వారు తమ కాళ్ల కింద ఏదైనా స్టూల్ వేసుకుని, కాళ్లు కాస్తంత ఎత్తు మీద ఉండేలా చూసుకోవాలి. ప్రతి రెండు మూడు గంటలకు ఒకమారు లేచి, కాస్తంత నడవాలి. దాంతో కాళ్ల వాపు తగ్గుతుంది. ఈ జాగ్రత్తలు పాటించాక కూడా కాళ్ల వాపులు తగ్గని వారు, ఆ సమస్యతో పాటు చేతులు, ముఖంలో వాపు కనిపిస్తున్నవారు, ఆరేడు గంటల విశ్రాంతి తర్వాత కూడా కాళ్ల వాపు తగ్గని వారు... తప్పనిసరిగా హైబీపీ, అనీమియాతో పాటు థైరాయిడ్ వంటి సమస్యలు ఏవైనా ఉన్నాయేమో అని పరీక్ష చేయించుకోవాలి. డాక్టర్ భావన కాసు కన్సల్టెంట్ అబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్, బర్త్ రైట్ బై రెయిన్బో,హైదరాబాద్