సాక్షి, అమరావతి: గర్భధారణ సమయంలో మహిళల శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ మార్పుల మధ్య వారిలో మనస్థితి ఊగిసలాట (మూడ్ స్వింగ్స్), ఒత్తిడి, కోపం, నిరాశ (డిప్రెషన్) వంటివి కనిపిస్తుంటాయి. ఈ లక్షణాలు మరీ తీవ్రంగా మారితే తల్లీ, బిడ్డ ఇద్దరికీ ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయి.
పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలపై ప్రభావం పడుతుంటుంది. ఇదిలావుంటే.. గర్భధారణ సమయంలో తీవ్రమైన డిప్రెషన్‌కు లోనైతే ప్రసవానంతరం గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం పెంచుతుందని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్ ఓ అధ్యయనాన్ని ప్రచురించింది.
1.20 లక్షల మంది గర్భిణులపై అధ్యయనం
అధ్యయనంలో భాగంగా 2007 నుంచి 2019 మధ్య ప్రసవించిన 1.20 లక్షల మంది స్త్రీల ఆరోగ్య వివరాలను పరిశోధకులు విశ్లేషించారు. అధిక రక్తపోటు కలిగిన గర్భిణులను అధ్యయనం నుంచి మినహాయించారు. ఈ క్రమంలో గర్భధారణ సమయంలో తీవ్ర డిప్రెషన్‌తో బాధపడిన మహిళల్లో 6 రకాల గుండె సంబంధిత జబ్బులు ప్రమాదం ఎక్కువగా ఉన్నట్టు తేల్చారు.
ఇస్కీమిక్ గుండె జబ్బు (గుండె రక్తనాళాల సంకోచ వ్యాధి) ప్రమాదం 83 శాతం అధికంగా ఉందని గుర్తించారు. అదేవిధంగా కార్డియోమయోపతి (గుండె కండరాల వ్యాధి) బారినపడే ప్రమాదం 61 శాతం, అరిథ్మియా/కార్డియాక్ అరెస్ట్ (రక్తప్రసరణ లోపం/గుండెపోటు) ప్రమాదం 60 శాతం ఉన్నట్టు నిర్థారించారు. కొత్తగా అధిక రక్తపోటు నిర్థారణకు 32 శాతం, పక్షవాతం వచ్చే ప్రమాదం 27 శాతం ఉన్నట్టు తేల్చారు.
ఈ నేపథ్యంలో గర్భధారణ సమయంలో స్త్రీలు వివిధ జాగ్రత్తలు తీసుకోవాలని పరిశోధకులు సూచించారు. తద్వారా తమకు దీర్ఘకాలంలో అనారోగ్య సమస్యలు తలెత్తకుండా, ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిస్తారని తెలియజేశారు. గర్భంతో ఉన్న సమయంలో ప్రతి ఒక్కరూ మధుమేహం, కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకుని, వాటిని అదుపులో ఉంచుకోవాలని వైద్యులు పేర్కొన్నారు.
కుటుంబ సభ్యులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి
మన దగ్గర కూడా ప్రసవానంతర కార్డియోమయోపతి (గుండె కండరాల వ్యాధి) కేసులు చూస్తుంటాం. గర్భధారణ సమయంలో తీవ్ర ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్‌కు లోనవడం వల్ల ఇది సంభవిస్తుంది. గర్భిణుల ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఆ సమయంలో శరీరంలో అనేక మార్పులు సంభవిస్తుంటాయి. దీంతో గర్భిణులు ఆందోళన, ఒత్తిడి, నిరాశకు గురవుతుంటారు. దీనికి తోడు ఒత్తిడికి సంబంధించిన హార్మోన్లు ఎక్కువగా విడుదల అవుతుంటాయి.
ఈ నేపథ్యంలో క్రమం తప్పకుండా వైద్యులను సంప్రదిస్తుండాలి. ప్రస్తుతం ఫ్యామిలీ డాక్టర్ విధానంలో వైద్యులు గ్రామాలకు నెలలో రెండుసార్లు వెళుతున్నారు. దీంతో గర్భిణులు తమ సొంత ఊళ్లలోనే వైద్యుల సేవలు పొందొచ్చు. ఒత్తిడి, ఆందోళనను తగ్గించుకుని మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి యోగా, ధ్యానం వంటివి చేయాలి. ఇష్టమైన సంగీతం వినాలి. – డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి, డిప్యూటీ సూపరింటెండెంట్, కర్నూలు
Comments
Please login to add a commentAdd a comment