ప్రసవానికి ముందు కాళ్ల వాపులు...!
గైనిక్ కౌన్సెలింగ్
నేను గర్భవతిని. ప్రస్తుతం ఎనిమిదో నెల. రోజూ కాళ్ల వాపులు వస్తున్నాయి. నేనెలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – రాజ్యలక్ష్మి, ఖమ్మం
గర్భవతుల్లో చివరి మూడు నెలల్లో చాలామందిలో కాళ్ల వాపు వస్తుంది. ఉదయం నిద్ర లేచినప్పుడు కాళ్ల వాపులు ఉండవు గానీ సాయంత్రం అవుతున్న కొద్దీ పెరుగుతుంటాయి. రాత్రి 6 నుంచి 8 గంటల విశ్రాంతి తర్వాత వాపు తగ్గుతుంటాయి. గర్భవతుల్లో కాళ్ల వాపును వైద్య పరిభాషలో జెస్టెషనల్ అడిమా అంటారు. దీని గురించి ఆందోళన అక్కర్లేదు. అయితే ఇలా వాపు వస్తున్న గర్భవతుల్లో హైపర్‌టెన్షన్ (హైబీపీ) ఏదైనా ఉందేమో చూడాలి.
కాళ్ల వాపునకు అదో కారణం కావచ్చు. మన భారతీయ మహిళల్లో రక్తహీనత చాలా ఎక్కువ. కాళ్ల వాపులకు ఈ అంశం కూడా ఒక కారణం. మహిళల్లో హిమోగ్లోబిన్ పాళ్లు కనీసం 11 ఉండటాన్ని ఒక మోస్తరుగా సాధారణంగా పరిగణిస్తుంటాం. అయితే కొందరిలో ఇది 7 కంటే తక్కువగా ఉన్నప్పుడు కాళ్ల వాపు రావడం చాలా సాధారణం. గుండెజబ్బులు, కాలేయవ్యాధులు, కిడ్ని సమస్యలు ఉన్నవారు గర్భం దాల్చినప్పుడు, వాళ్లలో కూడా కాళ్లవాపులు రావచ్చు. వాళ్లు డాక్టర్ సలహా మేరకు మందులు వాడాలి.
కాళ్ల వాపులు వస్తున్న గర్భవతులు పక్కమీద ఒరిగినప్పుడు ఎడమవైపునకు తిరిగి పడుకోవడం మంచిది. దీనివల్ల కాళ్ల నుంచి గుండెకు... మళ్లీ అక్కడి నుంచి మెదడుకు రక్తప్రవాహం సాఫీగా సాగి, కాళ్ల వాపు తగ్గి మళ్లీ మామూలు స్థితికి వచ్చేందుకు అవకాశం ఎక్కువ. కాళ్ల వాపు ఎక్కువగా ఉంటే అలా పక్క మీద ఒరిగి పడుకున్న గర్భవతులు తమ మడమల కింద తలగడను పెట్టుకుని, కాళ్లను కాస్త ఎత్తుగా ఉండేలా చూసుకుంటే కాళ్ల వాపులు తగ్గుతాయి.
కంప్యూటర్ ముందుగాని, డెస్క్ ముందుగాని అదేపనిగా కూర్చుని పనిచేసే వారు తమ కాళ్ల కింద ఏదైనా స్టూల్ వేసుకుని, కాళ్లు కాస్తంత ఎత్తు మీద ఉండేలా చూసుకోవాలి. ప్రతి రెండు మూడు గంటలకు ఒకమారు లేచి, కాస్తంత నడవాలి. దాంతో కాళ్ల వాపు తగ్గుతుంది. ఈ జాగ్రత్తలు పాటించాక కూడా కాళ్ల వాపులు తగ్గని వారు, ఆ సమస్యతో పాటు చేతులు, ముఖంలో వాపు కనిపిస్తున్నవారు, ఆరేడు గంటల విశ్రాంతి తర్వాత కూడా కాళ్ల వాపు తగ్గని వారు... తప్పనిసరిగా హైబీపీ, అనీమియాతో పాటు థైరాయిడ్ వంటి సమస్యలు ఏవైనా ఉన్నాయేమో అని పరీక్ష చేయించుకోవాలి.
డాక్టర్ భావన కాసు కన్సల్టెంట్ అబ్‌స్టెట్రిషియన్
అండ్ గైనకాలజిస్ట్, బర్త్ రైట్ బై రెయిన్‌బో,హైదరాబాద్