ghanapuram dam
-
ఏడుపాయల అభివృద్ధికి కృషి
పాపన్నపేట(మెదక్): తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన ఏడుపాయల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని కలెక్టర్ «ధర్మారెడ్డి ప్రకటించారు. ఆదివారం ఆయన మొదటి సారి ఏడుపాయలకు వచ్చి దుర్గమ్మ తల్లి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పాలక వర్గ చైర్మన్ ఆలయ మర్యాదల ప్రకారం స్వాగతం పలికారు. అనంతరం వేద పండితులు శాస్త్రయుక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన ఏడుపాయల పూర్వ చరిత్రను అడిగి తెలుసుకున్నారు. చైర్మన్ విష్ణువర్దన్‌రెడ్డి ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాలు, వాటి ఆదాయ మార్గాలు, సిబ్బంది సంఖ్య, సేవలు, భక్తులకు మౌలిక సౌకర్యాల గురించి అడిగి తెలసుకున్నారు. బకాయిలు చెల్లించాలి.. చైర్మన్ మాట్లాడుతూ ఏడుపాయలకు 12.5 ఎకరాల అటవీ భూమి అవసరమైనందున, ఈ మేరకు అటవీభూమిని కేటాయించాల్సిందిగా కోరారు. అయితే ఈ విషయమై అటవీ శాఖ అధికారులతో మాట్లాడుతానని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఏడుపాయలకు ఏటా వచ్చే ఆదాయం, ఖర్చు, నగదు డిపాజిట్లు, చేపట్టిన మౌలిక సౌకర్యాల గురించి ఆరా తీశారు. మొండి బకాయిలపై అవసరమైతే పోలీసు కేసులు నమోదు చేయించాలన్నారు. ఏడుపాయల్లో పరిశుద్ధ్యాన్ని పరిరక్షించేందుకు ప్లాస్టిక్ నిషేధించాలని ఆదేశించారు. ఇందులో తడి, పొడి చెత్తను వేరువేరుగా సేకరించాలని సూచించారు. అనంతరం ఘనపురం ఆనకట్టను పరిశీలించారు. ప్రాజెక్టు నిల్వ నీటి సామర్థ్యం, నీటి విడుదల తదితర విషయాలను తెలసుకున్నారు. కార్యక్రమంలో మెదక్ ఆర్డీఓ మెంచు నగేశ్, అసిస్టెంట్ కమిషనర్ కృష్ణ ప్రసాద్, ఈఓ వెంకట్ కిషన్‌రావు, డైరెక్టర్లు జ్యోతి అంజిరెడ్డి, దుర్గయ్య, నాగప్ప, నారాయణ, సంగప్ప, గౌరీ శంకర్, గౌరీశంకర్, సిబ్బంది రవికుమార్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. -
వరినారుకు ఊపిరి
మెదక్: వాడుముఖం పట్టిన వరినారుకు సింగూర్ నీళ్లు ఊపిరి పోశాయి. కలబ్గూర్ డ్యాం నుంచి శనివారం సాయంత్రం విడుదల చేసిన 0.25 టీఎంసీల నీరు మంగళవారం ఘనపురం ఆనకట్టకు చేరుకుంది. ఘనపురం ఆనకట్ట ఎత్తు 8 అడుగులు కాగా, మంగళవారం సాయంత్రానికి 6.5 అడుగుల మేర నీరు చేరింది. జెడ్పీ చైర్పర్సన్రాజమణి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి దేవేందర్‌రెడ్డి, ఆర్డీఓ వనజాదేవిలు ఎం.ఎన్.కెనాల్‌కు, వర్క్ ఇన్స్పెక్టర్ శంకర్, ఆయకట్టు టీసీ బాబార్ పటేల్ ఎఫ్ఎన్ కెనాళ్లకు నీటిని విడుదల చేశారు. ఈ ఏడు ఖరీఫ్ సీజన్లో వర్షాలు కురవక పోవడంతో ఘనపురం ఆయకట్టు పరిధిలోని 30 వేల ఎకరాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దీంతో వరినార్లు వేసుకున్న కొంతమంది రైతుల పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి చొరవతో మంత్రి హరీష్‌రావు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించి సింగూర్ నుండి 0.25 టీఎంసీల నీటిని ఘనపురం ఆనకట్టకు విడుదల చేయించారు. ఈ మేరకు మంగళవారం ఘనపురం ఆనకట్టలోకి 6.5 అడుగుల నీరొచ్చింది. అయితే మంగళవారం రాత్రిలోగా నీటిమట్టం మరింత పెరగవచ్చని ఇరిగేషన్ డిప్యూటీ ఈఈ సురేష్‌బాబు తెలిపారు. ఆనకట్ట పొంగిపొర్లితే ఆనకట్ట రైతులకు నష్టం జరుగుతుందన్న ఉద్దేశంతో ఇరిగేషన్ అధికారులు ఫతేనహర్, మహబూబ్‌నహర్ కెనాళ్లకు నీటిని విడుదల చేశారు. నీరు విడుదలైనా..నిరాశే ఖరీఫ్ కాలం కరిగి పోతున్నా, ఇంతవరకు ఆశించిన వర్షాలు పడలేదు. మరోవైపు ధైర్యం చేసి వరి తుకాలు వేసిన రైతులు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. దీంతో సింగూరు నీరు విడుదల చేయాలని ఘనపురం ఆయకట్ట రైతులు విజ్ఞప్తి చేశారు. కానీ ఇపుడు వరి తుకాలకు నీరు విడుదల చేస్తే, తర్వాత వర్షాలు పడక పోతే పరిస్థితి ఏంటన్న ఉద్దేశంతో అధికారులు సందిగ్ధంలో పడిపోయారు. ఇదే సమయంలో డిప్యూటీ స్పీకర్, మంత్రి హరీష్ చొరవ చూపడంతో సింగూరు నుంచి నీరు విడుదలైంది. ఈ నీటితో ఘనపురం ప్రాజెక్టు ఎగువన ఉన్న రైతులకు అందరి కన్నా ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. మంజీరా నదిలో ఉన్న మడుగులు నిండటం ద్వారా అక్కడి రైతులు ఖరీఫ్ గట్టెక్కే పరిస్థితి ఏర్పడింది. కానీ ఎంఎన్, ఎఫ్ఎన్ కెనాళ్ల పరిధిలోని చివరి ఆయకట్టు దారులకు మాత్రం నీరందని పరిస్థితి నెలకొంది. అలాగే ప్రాజెక్టు దిగువన ఉన్న రైతులకు కూడా ఎలాంటి ప్రయోజనం కలగటం లేదు. ప్రస్తుతం సింగూరు ప్రాజెక్టులో 11.87 టీఎంసీల నీరుంది. గత ఏడు ఈ సమయానికి కేవలం 3.2 టీఎంసీల నీరు మాత్రమే ఉన్నట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. ప్రస్తుత నీటితో కొంత మేర వరి నాట్లు పూర్తవుతాయని, అవసరమైతే మరో మారు సింగూరు నుంచి నీరు విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు.