మెదక్: వాడుముఖం పట్టిన వరినారుకు సింగూర్ నీళ్లు ఊపిరి పోశాయి. కలబ్‌గూర్ డ్యాం నుంచి శనివారం సాయంత్రం విడుదల చేసిన 0.25 టీఎంసీల నీరు మంగళవారం ఘనపురం ఆనకట్టకు చేరుకుంది. ఘనపురం ఆనకట్ట ఎత్తు 8 అడుగులు కాగా, మంగళవారం సాయంత్రానికి 6.5 అడుగుల మేర నీరు చేరింది. జెడ్పీ చైర్‌పర్సన్‌రాజమణి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి దేవేందర్‌రెడ్డి, ఆర్డీఓ వనజాదేవిలు ఎం.ఎన్.కెనాల్‌కు, వర్క్ ఇన్‌స్పెక్టర్ శంకర్, ఆయకట్టు టీసీ బాబార్ పటేల్ ఎఫ్‌ఎన్ కెనాళ్లకు నీటిని విడుదల చేశారు.
ఈ ఏడు ఖరీఫ్ సీజన్‌లో వర్షాలు కురవక పోవడంతో ఘనపురం ఆయకట్టు పరిధిలోని 30 వేల ఎకరాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దీంతో వరినార్లు వేసుకున్న కొంతమంది రైతుల పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి చొరవతో మంత్రి హరీష్‌రావు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించి సింగూర్ నుండి 0.25 టీఎంసీల నీటిని ఘనపురం ఆనకట్టకు విడుదల చేయించారు. ఈ మేరకు మంగళవారం ఘనపురం ఆనకట్టలోకి 6.5 అడుగుల నీరొచ్చింది. అయితే మంగళవారం రాత్రిలోగా నీటిమట్టం మరింత పెరగవచ్చని ఇరిగేషన్ డిప్యూటీ ఈఈ సురేష్‌బాబు తెలిపారు. ఆనకట్ట పొంగిపొర్లితే ఆనకట్ట రైతులకు నష్టం జరుగుతుందన్న ఉద్దేశంతో ఇరిగేషన్ అధికారులు ఫతేనహర్, మహబూబ్‌నహర్ కెనాళ్లకు నీటిని విడుదల చేశారు.
నీరు విడుదలైనా..నిరాశే
ఖరీఫ్ కాలం కరిగి పోతున్నా, ఇంతవరకు ఆశించిన వర్షాలు పడలేదు. మరోవైపు ధైర్యం చేసి వరి తుకాలు వేసిన రైతులు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. దీంతో సింగూరు నీరు విడుదల చేయాలని ఘనపురం ఆయకట్ట రైతులు విజ్ఞప్తి చేశారు.
కానీ ఇపుడు వరి తుకాలకు నీరు విడుదల చేస్తే, తర్వాత వర్షాలు పడక పోతే పరిస్థితి ఏంటన్న ఉద్దేశంతో అధికారులు సందిగ్ధంలో పడిపోయారు. ఇదే సమయంలో డిప్యూటీ స్పీకర్, మంత్రి హరీష్ చొరవ చూపడంతో సింగూరు నుంచి నీరు విడుదలైంది. ఈ నీటితో ఘనపురం ప్రాజెక్టు ఎగువన ఉన్న రైతులకు అందరి కన్నా ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది.
మంజీరా నదిలో ఉన్న మడుగులు నిండటం ద్వారా అక్కడి రైతులు ఖరీఫ్ గట్టెక్కే పరిస్థితి ఏర్పడింది. కానీ ఎంఎన్, ఎఫ్‌ఎన్ కెనాళ్ల పరిధిలోని చివరి ఆయకట్టు దారులకు మాత్రం నీరందని పరిస్థితి నెలకొంది. అలాగే ప్రాజెక్టు దిగువన ఉన్న రైతులకు కూడా ఎలాంటి ప్రయోజనం కలగటం లేదు. ప్రస్తుతం సింగూరు ప్రాజెక్టులో 11.87 టీఎంసీల నీరుంది.
గత ఏడు ఈ సమయానికి కేవలం 3.2 టీఎంసీల నీరు మాత్రమే ఉన్నట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. ప్రస్తుత నీటితో కొంత మేర వరి నాట్లు పూర్తవుతాయని, అవసరమైతే మరో మారు సింగూరు నుంచి నీరు విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు.
వరినారుకు ఊపిరి
Published Wed, Aug 6 2014 2:33 AM | Last Updated on Fri, Nov 9 2018 6:05 PM
Advertisement