భారతీయ సంస్కృతిలో ఆలయాలది విశిష్ట చరిత్ర
గజల్ శ్రీనివాస్
ఘంటసాల : భారతీయ సంస్కృతిలో గ్రామ దేవత, దేవాలయాలకు విశిష్ట చరిత్ర ఉందని మాస్ట్రో గజల్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఘంటసాలలో మంగళవారం ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన సాక్షితో మాట్లాడారు. ఘంటసాలలో శ్రీకోట ముత్యాలమ్మ తల్లి, భీమవరంలో మాఊళ్ల అమ్మవారు, కొల్లేరులో పెద్దింటి అమ్మవారు ఇలా పలు ప్రాచీన దేవాలయాలు ఉన్నాయన్నారు. ఆయా దేవతలే గ్రామాన్ని రక్షిస్తాయనే నమ్మకం ప్రజల్లో ఉండేదని చెప్పారు.
నేడు ఆదాయం ఉన్న దేవాలయాలను ప్రభుత్వం తీసుకుని ఆదాయం లేని వాటిని ప్రజలకు వదిలేసిందని ఆరోపించారు. గ్రామ దేవతల ఆలయాలు నిర్లక్ష్యానికి గురయ్యాయని, మరికొన్ని చారిత్రక ఆలయాలు శిథిలమై పోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. గ్రామ దేవతల ఆలయాల సుందరీకరణ, పురాతన దేవాలయాల జీవోద్ధరణ చేయాల్సిన అవసరముందన్నారు.
అర్చకులను ఆదుకోవాలి..
రాబోయే కృష్ణా పుష్కరాల సందర్భంగా కృష్ణా పరివాహక ప్రాంతంలో సుమారు 15 కోట్ల మంది భక్తులు స్నానమాచరించే అవకాశం ఉందని శ్రీనివాస్ తెలిపారు. ఈపుష్కరాలకు వచ్చే భక్తులు దేవాలయాలను సందర్శించుకునే విధంగా తగిన ఏర్పాట్లు, ప్రచారం పెద్ద ఎత్తున చేపట్టాల్సిన అవసరముందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో వేలాది మంది అర్చకుల పరిస్థితి దయనీయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి ప్రభుత్వం తెల్లరేషన్‌కార్డులు ఇచ్చి అందరికి ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కార్డులు ఇప్పించాలని ముఖ్యమంత్రిని కోరారు. అలాగే ఆయాప్రాంతాల్లో ఉన్న బుర్రకథ, భక్తిసంగీతం అందించే కళాకారులతో పాటు వివిద కళాకారులను దేవదాయ, ధర్మదాయశాఖ దేవాలయాల్లో ఆస్థాన విధ్వాంసులుగా నియమించి వారికి సముచిత గౌరవం ఇవ్వాలని కోరారు.
కృష్ణాష్టమిని గోపూజా దినోత్సవంగా ప్రకటించిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎండోమెంట్ భూముల కౌలు చట్టాన్ని మార్చి దేవదాయ, ధర్మదాయశాఖ భూములను గోక్షేత్రాలుగా మార్చేందుకు చర్యలు తీసుకోవడం వలన ఎన్నో వట్టిపోయిన గోవులకు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు. శ్రీకోట ముత్యాలమ్మ తల్లి ఆలయ అభివృద్ధికి సహకరిస్తున్న స్వాతిపత్రిక అధినేత వేమూరి బలరామ్, మరి కొందరు దాతలను అభినందించారు. ప్రతి ఒక్కరూ పురాతన దేవాలయాల జీవోద్ధరణకు పాటుపడాలని పిలుపునిచ్చారు.