మోదీ హవా ‘వాపసీ’!
హిందూశక్తుల ఘర్ వాపసీ వంటి చర్యలతో తగ్గుతున్న ప్రధాని ప్రభ
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 27 సీట్లు కోల్పోనున్న బీజేపీ
తొమ్మిది స్థానాలను అదనంగ గెల్చుకోనున్న కాంగ్రెస్
నరేంద్రమోదీ.. ఒక ప్రభంజనం.. ఒక సునామీ..! 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో వినిపించిన మాటలివీ!! అందుకు తగ్గట్టే ఆ ఎన్నికల్లో మోదీ దుమ్మురేపారు. కమలం పార్టీకి ఒంటిచేత్తో అంఖండ విజయాన్ని సాధించిపెట్టారు. ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించారు. అధికార పగ్గాలు చేపట్టి ఇప్పటికీ దాదాపు 300 రోజులు గడిచిపోయాయి. మరి ఇప్పుడు మోదీని ప్రజలు ఎలా చూస్తున్నారు? వారి ఆశలు, ఆకాంక్షలను ప్రధానిగా మోదీ ఎంత మేరకు నెరవేర్చారు? ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీ జైత్రయాత్ర కొనసాగుతుందా..? మాటల మాంత్రికుడుడి హవా ఏమైనా తగ్గిందా..? ఈ అంశాల ఆధారంగా ఇండియా టుడే-సిసిరో తాజాగా ‘మూడ్ ఆఫ్ ద నేషన్’ పేరుతో ఒక సర్వే నిర్వహించింది. ఇందులో క్రమంగా మోదీ హవా తగ్గుతున్నట్టు తేలింది. ప్రధానంగా ఆయన అధికారం చేపట్టాక హిందూవాద సంస్థలు చేపట్టిన ‘ఘర్ వాపసీ’ వంటి చర్యలతో మోదీ ప్రభ మసకబారినట్టు సర్వేలో స్పష్టమైంది.
ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే.. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నెగ్గిన 282 సీట్లలో 27 సీట్లు కోల్పోతుందని తేలింది. దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాల్లోని 260 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో దాదాపు 12 వేల మందిని ఈ సర్వేలో భాగస్వాములను చేశారు. ప్రధానిగా మోదీ పనితీరు పట్ల 38 శాతం మంది బాగుందని చెప్పగా, 22 శాతం మంది ‘చాలా బాగుంది’ అని అభిప్రాయపడ్డారు. 11 శాతం మంది ప్రధాని పనితీరుపై అసంతృప్తి వ్యక్తంచేశారు. కాగా, కాంగ్రెస్ క్రమంగా బలం పుంజుకుంటోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ మొన్నటి ఎన్నికల కన్నా అదనంగా మరో తొమ్మిది స్థానాలను గెల్చుకుంటుందని సర్వే తెలిపింది.
ప్రధానిగా ఎవరు కావాలి?
ఇప్పుడు 2014 ఆగస్టు
నరేంద్రమోదీ 36 57
అరవింద్ కేజ్రీవాల్ 15 3
జయలలిత 7 3
రాహుల్‌గాంధీ 7 6
సోనియాగాంధీ 5 5
నిజాయితీగల నాయకుడెవరు?
ఇప్పుడు 2014 ఆగస్టు
మోదీ 31 36
కేజ్రీవాల్ 18 4
అద్వానీ 5 3
సోనియాగాంధీ 5 5
రాహుల్ 5 4