girl child education
-
బాల్య వివాహాలకు ముగింపు
సాక్షి, అమరావతి: బాల్య వివాహాల నివారణకు గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. గత ఏడాది ఒక్కో నెలలో వందకు పైగా బాల్య వివాహాలపై ఫిర్యాదుల రాగా.. ఈ ఏడాది జనవరి నెలలో ఆ సంఖ్య గణనీయంగా తగ్గింది. జనవరి నెలలో 60 బాల్య వివాహాలపై ఫిర్యాదులు రాగా.. అందులో 57 బాల్య వివాహాలను ప్రభుత్వం నివారించింది. ఏలూరు జిల్లాలో రెండు, పల్నాడు జిల్లాలో ఒకటి కలిపి మొత్తం మూడు బాల్య వివాహాలు మాత్రమే జరగ్గా.. అందులో రెండు వివాహాలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మొత్తం 26 జిల్లాలకు గాను 17 జిల్లాల్లో మాత్రమే జనవరి నెలలో ఫిర్యాదులు వచ్చాయి. మిగతా తొమ్మిది జిల్లాల్లో ఒక్క ఫిర్యాదు కూడా రాలేదు. బాల్య వివాహాలపై 1098 హెల్ప్‌లైన్‌తో పాటు వివిధ మార్గాల ద్వారా ఫిర్యాదులు రాగానే సంబంధిత శాఖల సిబ్బంది అప్రమత్తమై రంగంలోకి దిగుతున్నారు. గ్రామస్థాయి నుంచే పటిష్ట చర్యలు బాల్య వివాహాల నివారణకు గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో బాల్య వివాహాల నిషేధ, పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేసింది. బాల్య వివాహాల నివారణకు సంబంధించి వివిధ శాఖల అధికారులు, సిబ్బందికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చింది. యుక్త వయసులో ఉన్న బాలికల తల్లిదండ్రులకు బాల్య వివాహాలు వల్ల ఉత్పన్నమయ్యే చెడు ప్రభావాలపై అవగాహన సమావేశాల్ని నిర్వహిస్తున్నారు. బాల్య వివాహాల నివారణలో భాగంగా వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫాకు కనీసం పదవ తరగతి ఉత్తీర్ణత సాధించాలనే నిబంధన విధించారు. బాల్య వివాహాల నిరోధించడంపై రోజువారీ, నెలవారీ చేపడుతున్న చర్యలు ఫలిస్తున్నాయి. గత నెలలో ఫిర్యాదులు గణనీయంగా తగ్గడం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. బాల్య వివాహాల నివారణకు నెలవారీ క్యాలండర్ ‘బేటీ బచావో.. బేటీ పఢావో’ (ఆడపిల్లను రక్షించండి. ఆడపిల్లలకు చదువు చెప్పండి) పథకం కింద జిల్లాల వారీగా రూ.5.56 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఆ నిధులతో బాలికల విద్యతో పాటు బాల్య వివాహాల నివారణకు అవసరమైన కార్యకలాపాలను నెలవారీ క్యాలెండర్‌గా నిర్వహిస్తున్నారు. ఈ పథకం కింద ఆడ పిల్లలకు విద్యనందించడం, లింగ వివక్షను నివారించడం, ఆడ పిల్లల రక్షణ, సంరక్షణ, బాల్య వివాహాల నివారణ కార్యకలాపాలను జిల్లాల వారీగా నిర్వహిస్తున్నారు. దీనికి తోడు బాల్య వివాహాల నివారణకు తీసుకుంటున్న చర్యలపై సీఎస్ కేఎస్ జవహర్‌రెడ్డి ప్రతినెలా జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహిస్తున్నారు. -
కేజీబీవీల సంఖ్య పెంచాలి
సాక్షి, న్యూఢిల్లీ: బాలికా విద్యపై ఏర్పాటైన సబ్ కమిటీ (కేబ్స్) ఇచ్చిన నివేదిక ఆధారంగా కస్తూర్బా గాంధీ బాలికల కళాశాలల్లో (కేజీబీవీ) ఇంటర్ వరకు విద్యనందించే విషయంలో పాఠశాలల అప్‌గ్రేడేష్‌ను కొన్నింటికే పరిమితం చేయడం సరికాదని, వీటి సంఖ్యను పెంచాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 475 కేజీబీవీలు ఉంటే 94 స్కూళ్లలోనే ఇంటర్ విద్యనందించేందకు కేంద్రం అనుమతించిందని, తరగతి గదికి 20 మంది విద్యార్థులనే పరిమితం చేయడం సరికాదని ఆయన వివరించారు. పలు అంశాలపై కడియం మంగళవారం ఢిల్లీలో ఎంపీలు వినోద్‌కుమార్, సీతారాం నాయక్, బండ ప్రకాశ్‌లతో కలసి కేంద్ర మంత్రికి నివేదిక అందజేశారు. అందులో ప్రముఖంగా ఇంటర్ వరకు విద్యాబోధనకు కేజీబీవీల సంఖ్యను పెంచడం, గ్రూపుల వారిగా తరగతికి 40 మంది విద్యార్థులకు అవకాశం కల్పించాలని కోరారు. పాఠశాలల అప్‌గ్రేడేషన్‌పై ప్రధానంగా దృష్టి సారించాలని, ఇంటర్ వరకు విద్యాబోధనకు ప్రతి పాఠశాలకు 15 మంది టీచర్ల అవసరం ఉంటుందని, కేంద్రం 9 మందినే నియమిస్తామనడం సరికాదన్నారు. అందులో కూడా క్వాలిఫైడ్ టీచర్ల నియమించి, రూ.40 వేల వేతనాలు చెలించాలని కోరారు. ప్రతి పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం రూ.7.5 కోట్లు విడుదల చేయాలని, ప్రస్తుతం నిర్ణయించిన వరంగల్ జిల్లా మాము నూరు ప్రభుత్వ పశు వైద్య కళాశాలలో ఈ ఏడాది నుంచి అడ్మిషన్లను ప్రారంభించేందుకు జాతీయ పశువైద్య మండలి అనుమతులిచ్చిన నేపథ్యంలో.. అడ్మిషన్లపై కడియం వెటర్నరీ కౌన్సిల్ డైరెక్టర్ కరుణ్ శ్రీధర్‌తో సమావేశమై చర్చించారు. -
ఇండియన్ మలాలా... మరియం సిద్ధిఖీ..!
ఆమె ప్రస్తుతం నోబెల్ శాంతి బహుమతి విజేత మలాలాను తలపిస్తోంది. పేద బాలికల అభ్యున్నతే ధ్యేయంగా... వారికి విద్య సులభతరం చేయాలన్నదే ఆశయంగా ముందుకు సాగుతోంది. పలు పోటీల్లో పాల్గొని గెలిచి, అలా వచ్చిన నగదును పేద విద్యార్థులకు విరాళంగా అందిస్తోంది. ఇటీవల ఇస్కాన్ నిర్వహించిన భగవద్గీత పోటీల్లో అగ్రస్థానంలో నిలిచి అందర్నీ ఆశ్చర్యపరచిన ముస్లిం బాలిక మరియం సిద్ధిఖీ.. చిన్న వయసులోనే తన ప్రతిభను ప్రదర్శించడంతోపాటు ఆమె దాతృత్వాన్ని, సేవా దృక్పథాన్ని చాటుతోంది. మహారాష్ట్రలోని 195 పాఠశాలల నుంచి 4వేల మంది విద్యార్థులు పాల్గొన్న పోటీల్లో మొదటి బహుమతి గెలుచుకొని, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర సంస్థల నుంచే కాక దేశం నలుమూలల నుంచి పలువురి ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం తనకు బహుమతిగా వచ్చిన డబ్బును సిద్ధిఖీ... పేద బాలికల విద్యకోసం విరాళంగా ఇచ్చింది. ప్రభుత్వం పేద బాలికలకు మెరుగైన విద్య అందించేందుకు ఏర్పాటుచేసిన పథకాల ద్వారా తన బహుమతి నగదును కూడా వారికి వినియోగించాలని మరియం సిద్ధిఖీ అభ్యర్థించింది. గుజరాత్ ముఖ్యమంత్రి అనందిబెన్ పటేల్, యూపీ సీఎం అఖిలేష్ యాదవ్‌లు సిద్ధిఖీని సత్కరిస్తున్న సమయంలో ఆమె తన నిర్ణయాన్ని వెల్లడించింది. ముంబై మహానగరం థానేలోని మీరారోడ్ వద్ద నివసించే ఓ మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన మరియం సిద్ధిఖీ తండ్రి పేరు ఆసిఫ్ సిద్ధిఖీ. ఓ హిందీ పత్రికలో ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ''మేము ఆర్థికంగా వెనుకబడ్డవారమే అయినా... మా అమ్మాయి పేద బాలల అభ్యున్నతి కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. అందులో భాగంగానే తన బహుమతి నగదును పేదవిద్యార్థులకు వినియోగించేందుకు విరాళంగా ఇచ్చేసింది'' అని సిద్ధిఖీ తండ్రి అసిఫ్ చెబుతున్నారు. ఆమె త్వరలో మధ్యప్రదేశ్ సీఎంను కూడా కలసి తన ఆర్థిక సాయాన్ని అందించనున్నారు. తాను చదివిన మీరారోడ్ లోని కాస్మోపాలిటన్ హైస్కూల్‌తో పాటు కొన్ని ప్రదేశాల్లో పర్యటించి, పేద విద్యార్థులకు స్వీట్లు, పండ్లు, డబ్బును పంచారు.