సాక్షి, అమరావతి: బాల్య వివాహాల నివారణకు గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. గత ఏడాది ఒక్కో నెలలో వందకు పైగా బాల్య వివాహాలపై ఫిర్యాదుల రాగా.. ఈ ఏడాది జనవరి నెలలో ఆ సంఖ్య గణనీయంగా తగ్గింది. జనవరి నెలలో 60 బాల్య వివాహాలపై ఫిర్యాదులు రాగా.. అందులో 57 బాల్య వివాహాలను ప్రభుత్వం నివారించింది.
ఏలూరు జిల్లాలో రెండు, పల్నాడు జిల్లాలో ఒకటి కలిపి మొత్తం మూడు బాల్య వివాహాలు మాత్రమే జరగ్గా.. అందులో రెండు వివాహాలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. మొత్తం 26 జిల్లాలకు గాను 17 జిల్లాల్లో మాత్రమే జనవరి నెలలో ఫిర్యాదులు వచ్చాయి. మిగతా తొమ్మిది జిల్లాల్లో ఒక్క ఫిర్యాదు కూడా రాలేదు. బాల్య వివాహాలపై 1098 హెల్ప్‌లైన్‌తో పాటు వివిధ మార్గాల ద్వారా ఫిర్యాదులు రాగానే సంబంధిత శాఖల సిబ్బంది అప్రమత్తమై రంగంలోకి దిగుతున్నారు.
గ్రామస్థాయి నుంచే పటిష్ట చర్యలు
బాల్య వివాహాల నివారణకు గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో బాల్య వివాహాల నిషేధ, పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేసింది. బాల్య వివాహాల నివారణకు సంబంధించి వివిధ శాఖల అధికారులు, సిబ్బందికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చింది. యుక్త వయసులో ఉన్న బాలికల తల్లిదండ్రులకు బాల్య వివాహాలు వల్ల ఉత్పన్నమయ్యే చెడు ప్రభావాలపై అవగాహన సమావేశాల్ని నిర్వహిస్తున్నారు.
బాల్య వివాహాల నివారణలో భాగంగా వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫాకు కనీసం పదవ తరగతి ఉత్తీర్ణత సాధించాలనే నిబంధన విధించారు. బాల్య వివాహాల నిరోధించడంపై రోజువారీ, నెలవారీ చేపడుతున్న చర్యలు ఫలిస్తున్నాయి. గత నెలలో ఫిర్యాదులు గణనీయంగా తగ్గడం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది.
బాల్య వివాహాల నివారణకు నెలవారీ క్యాలండర్
‘బేటీ బచావో.. బేటీ పఢావో’ (ఆడపిల్లను రక్షించండి. ఆడపిల్లలకు చదువు చెప్పండి) పథకం కింద జిల్లాల వారీగా రూ.5.56 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఆ నిధులతో బాలికల విద్యతో పాటు బాల్య వివాహాల నివారణకు అవసరమైన కార్యకలాపాలను నెలవారీ క్యాలెండర్‌గా నిర్వహిస్తున్నారు. ఈ పథకం కింద ఆడ పిల్లలకు విద్యనందించడం, లింగ వివక్షను నివారించడం, ఆడ పిల్లల రక్షణ, సంరక్షణ, బాల్య వివాహాల నివారణ కార్యకలాపాలను జిల్లాల వారీగా నిర్వహిస్తున్నారు. దీనికి తోడు బాల్య వివాహాల నివారణకు తీసుకుంటున్న చర్యలపై సీఎస్ కేఎస్ జవహర్‌రెడ్డి ప్రతినెలా జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment