Girl protests
-
ప్రేమించానన్నాడు.. పెళ్లి అంటే వద్దంటున్నాడు
సాక్షి, పత్తికొండ టౌన్: ‘మూడేళ్లుగా ప్రేమించుకున్నాం.. పెళ్లి చేసుకోమంటే ఇపుడు వద్దంటున్నాడు. న్యాయం చేయండి’ అంటూ ఓ యువతి ప్రియుడి ఇంటి ముం దు బైఠాయించిన ఘటన శుక్రవారం కర్నూలు జిల్లా పత్తికొండలో జరిగింది. యువతి, ఆమె బంధువులు తెలిపిన వివరాలు.. పత్తికొండకు చెందిన పవన్ హైదబాద్‌లో ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన యువతి బీటెక్ చదివి ఇంటివద్దే ఉంటోంది. రైలు ప్రయాణంలో ఇద్దరికీ పరిచయం ఏర్పడి అనంతరం ప్రేమకు దారితీసింది. మూడేళ్లుగా వీరి ప్రేమ కొనసాగింది. పెళ్లి›చేసుకుందామని యువతి ప్రస్తావన తీసుకురావడంతో పవన్ అంగీకరించకపోవడంతో పాటు 10 నెలల నుంచి కలవకుండా, ఫోన్లో స్పందించకుండా దూరం పెట్టాడు. ఈ విషయమై వారం రోజుల క్రితం పత్తికొండకు బంధువులతో కలసి వచ్చిన యువతి.. పవన్ తనను పెళ్లి చేసుకోవాలని పెద్ద మనుషుల వద్ద పంచాయతీ పెట్టింది. పంచాయతీలో పవన్, వారి బంధువులు అంగీకరించకపోవడంతో న్యాయం చేయాలని కోరుతూ గురువారం ప్రియుడి ఇంటి ముందు బైఠాయించింది. సమాచారం తెలుసుకున్న పవన్, కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి ఎటో వెళ్లిపోయారు. ఎస్ఐ శ్రీనివాసులు, పోలీసుసిబ్బంది యువతిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చారు. సీఐ కృష్ణయ్య యువతి, వారి బంధువులతో మాట్లాడారు. పవన్‌ను స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తామని, పెళ్లికి అంగీకరించకపోతే కేసు నమోదు చేస్తామని హామీ ఇచ్చారు. -
ప్రియుడి ఇంటి ముందు యువతి బైఠాయింపు
తణుకు: ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసి తనను శారీరకంగా అనుభవించి ముఖం చాటేస్తున్నాడని ఆరోపిస్తూ యువతి తన ప్రియుడి ఇంటి ముందు బైఠాయించింది. తణుకు మండలం దువ్వ గ్రామానికి చెందిన జవ్వాది మాధురినాగనవ్య అనే యువతి అదే గ్రామానికి చెందిన లంకదాసు శివగణేష్ ఏడాదిగా ప్రేమించుకుంటున్నారు. తణుకులోని ఒక సెల్ దుకాణంలో వీరిద్దరూ పనిచేస్తుండగా వీరి మధ్య ప్రేమ చిగురించింది. అయితే పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తున్నాడనే నెపంతో ఫిబ్రవరిలో శివగణేష్‌పై తణుకు రూరల్ పోలీసుస్టేషన్లో ఆమె ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు గణేష్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇటీవల బెయిల్‌పై వచ్చిన గణేష్ కేసు వాపసు తీసుకోకపోతే చంపేస్తానని బెదిరిస్తున్నాడంటూ యువతి ఆరోపిస్తోంది. శీతలపానీయాల్లో మత్తుమందు కలిపి తనను శారీరకంగా అనుభవించాడని ఆమె ఆరోపణలు చేస్తోంది. గణేష్ తండ్రి బాబూరావు సైతం పెళ్లి చేస్తానని మాట ఇచ్చి ఇప్పుడు మాటతప్పారని చెబుతోంది. మరోవైపు గ్రామానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు సైతం తనకు ఫోన్ చేసి చంపేస్తానని బెదిరిస్తున్నాడని బాధితురాలు కన్నీటి పర్యంతమవుతోంది. తనకు ప్రాణహాని ఉందని తనకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తానని ఆమె స్పష్టం చేస్తోంది. తణుకు సర్కిల్ ఇన్స్పెక్టర్ కేఏ స్వామి, రూరల్ ఎస్సై సీహెచ్‌వీ రమేష్‌లు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు. గణేష్ కుటుంబసభ్యులు అందుబాటులో లేరు. -
పోలీసులు వేధిస్తున్నారంటూ..టవరెక్కిన యువతి
తణుకు: పోలీసులు విచారణ పేరుతో తమ కుటుంబాన్ని వేధిస్తున్నారంటూ పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ యువతి సెల్టవరెక్కింది. తణుకు పట్టణం సజ్జాపురం ప్రాంతానికి చెందిన కాళిదాసు నాగప్రసాద్‌కు ఓ యువతితో ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఆమెతో కలిసి అతను ఎక్కడికో వెళ్లిపోయాడు. సదరు యువతి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు నాగప్రసాద్ కుటుంబసభ్యులను పోలీసులు విచారిస్తున్నారు. తమను అకారణంగా పిలిపించి, వేధిస్తున్నారంటూ నాగప్రసాద్ సోదరి మీనా సోమవారం ఉదయం స్థానిక మున్సిపల్ కార్యాలయంలోని సెల్‌టవర్ పైకెక్కింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని సముదాయించటంతో ఆమె కిందికి దిగడంతో వివాదం సద్దుమణిగింది. -
రెండోరోజూ ప్రియురాలి నిరసన
శెట్టిపాలెం (వేములపల్లి) ప్రేమించి మోసగించిన వ్యక్తితోనే తనకు పెళ్లి జరిపించి న్యాయం చేయాలని ఓ ప్రియురాలు ప్రియుడి ఇంటిముందు చేపట్టిన నిరసన రెండోరోజుకు చేరింది. మండలంలోని శెట్టిపాలెం గ్రామానికి చెందిన పెదమాం రమణ ఇదే గ్రామానికి చెందిన ప్రియుడు నక్క విఘ్నేష్ ఇంటి ముందు శనివారం ఉదయం బైఠాయించింది. తనకు విఘ్నేష్‌తో వివాహం జరిపించనిదే ఆందోళనను విరమించబోనని స్పష్టం చేసింది. రెండో రోజు ఆదివారం కూడా విఘ్నేష్ ఇంటి ఎదుట కుటుంబ సభ్యులు, బంధువులతో కలసి బైఠాయించి నిరసన తెలిపింది. డీఎస్పీ విచారణ మిర్యాలగూడ డీఎస్పీ సందీప్ గోనె ఆదివారం శెట్టిపాలెం గ్రామానికి చేరుకొని బాధితురాలు పెదమాం రమణను విచారించి వివరాలు నమోదు చేసుకున్నారు. రమణతో పాటు తల్లిదండ్రులు, బంధువులను విచారించి వివరాలను సేకరించారు. అదేవిధంగా పోలీస్‌స్టేషన్‌లో ప్రియుడు నక్క విఘ్నేష్‌తో పాటు అతని తల్లిదండ్రుల నుంచి వాంగ్మూలాన్ని సేకరించారు. డీఎస్పీ వెంట మిర్యాలగూడ రూరల్ సీఐ కోట్ల నర్సింహారెడ్డి, ఎస్ఐ విజయ్‌కుమార్ ఉన్నారు.