ప్రియుడి ఇంటి ముందు యువతి బైఠాయింపు | young girl protests to justice her life cheated by lover | Sakshi
Sakshi News home page

ప్రియుడి ఇంటి ముందు యువతి బైఠాయింపు

Published Wed, May 9 2018 9:37 AM | Last Updated on Wed, May 9 2018 9:37 AM

young girl protests to justice her life cheated by lover - Sakshi

తణుకు: ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసి తనను శారీరకంగా అనుభవించి ముఖం చాటేస్తున్నాడని ఆరోపిస్తూ యువతి తన ప్రియుడి ఇంటి ముందు బైఠాయించింది. తణుకు మండలం దువ్వ గ్రామానికి చెందిన జవ్వాది మాధురినాగనవ్య అనే యువతి అదే గ్రామానికి చెందిన లంకదాసు శివగణేష్‌ ఏడాదిగా ప్రేమించుకుంటున్నారు. తణుకులోని ఒక సెల్‌ దుకాణంలో వీరిద్దరూ పనిచేస్తుండగా వీరి మధ్య ప్రేమ చిగురించింది. అయితే పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తున్నాడనే నెపంతో ఫిబ్రవరిలో శివగణేష్‌పై తణుకు రూరల్‌ పోలీసుస్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేసింది. 

దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు గణేష్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇటీవల బెయిల్‌పై వచ్చిన గణేష్‌ కేసు వాపసు తీసుకోకపోతే చంపేస్తానని బెదిరిస్తున్నాడంటూ యువతి ఆరోపిస్తోంది. శీతలపానీయాల్లో మత్తుమందు కలిపి తనను శారీరకంగా అనుభవించాడని ఆమె ఆరోపణలు చేస్తోంది. గణేష్‌ తండ్రి బాబూరావు సైతం పెళ్లి చేస్తానని మాట ఇచ్చి ఇప్పుడు మాటతప్పారని చెబుతోంది. 

మరోవైపు గ్రామానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు సైతం తనకు ఫోన్‌ చేసి చంపేస్తానని బెదిరిస్తున్నాడని బాధితురాలు కన్నీటి పర్యంతమవుతోంది. తనకు ప్రాణహాని ఉందని తనకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తానని ఆమె స్పష్టం చేస్తోంది. తణుకు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ కేఏ స్వామి, రూరల్‌ ఎస్సై సీహెచ్‌వీ రమేష్‌లు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు. గణేష్‌ కుటుంబసభ్యులు అందుబాటులో లేరు.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement