మహిళా టీచర్లకు అదనపు భారం!
* మోడల్ స్కూళ్లలో బాలికల హాస్టళ్ల నిర్వహణ బాధ్యతలు
* ఇప్పటికే పని భారం ఎక్కువైందని ఆవేదన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో బాలికల కోసం నిర్మించిన హాస్టళ్ల నిర్వహణ బాధ్యత గందరగోళంగా మారింది. 175 మోడల్ స్కూళ్లలో చేపట్టిన బాలికల హాస్టళ్ల నిర్మాణాలు దాదాపు పూర్తి కావచ్చాయి. త్వరలోనే వాటిని ప్రారంభించి బాలికలకు నివాస వసతి కల్పించేందుకు విద్యా శాఖ సిద్ధమవుతోంది.
ఈ నేపథ్యంలో స్కూళ్లలో పనిచేసే టీచర్లే వార్డెన్ల విధులు నిర్వహించాలని సోమవారం విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మహిళా టీచర్లలో సీనియర్‌కు ఈ బాధ్యతలు అప్పగించాలని సూచించింది. హాస్టళ్లలోని వసతుల వివరాలు, వార్డెన్ బాధ్యతలు ఎవరికిఅప్పగిస్తున్నారనే అంశాలను ఈ నెల 15లోగా అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు నివేదిక పంపించాలని పేర్కొంది. దీంతో మహిళా టీచర్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
ఇప్పటికే తమకు పాఠశాలల్లో పనిభారం అధికంగా ఉందని, దీనికి తోడు వార్డెన్ బాధ్యతలు చూడటం కష్టమవుతుందని రాష్ట్ర మోడల్ స్కూల్ టీచర్ల అసోసియేషన్ వాపోతోంది. పైగా మోడల్ స్కూళ్లు మండల కేంద్రాలకు దూరంగా నిర్మానుష్య ప్రాంతాల్లో ఉన్నాయని, ఈ పరిస్థితుల్లో ఓ మహిళా టీచర్ వందమంది బాలికలతో ఉండటం శ్రేయస్కరం కాదని పేర్కొంది. పైగా వివాహితులైన టీచర్లు తమ కుటుంబాన్ని వదిలి ఉండటం (భర్త, కుటుంబ సభ్యులు ఉండటానికి వీల్లేదు కాబట్టి) సాధ్యం కాదంటోంది. ఈ నేపథ్యంలో హాస్టళ్ల నిర్వహణకు ప్రత్యేకంగా మహిళా వార్డెన్లను నియమించి రాత్రి వేళల్లో బాలికలకు రక్షణగా మహిళా కానిస్టేబుళ్లను నియమించాలని కోరుతోంది.