Girls ratio
-
ఆడపిల్ల అని తెలియగానే కడుపులోనే చిదిమేస్తున్నారు
జననాల్లో బాలిక నిష్పత్తి రోజురోజుకూ తగ్గుతూ వస్తోంది. చదువు, సంస్కారం ఉన్నవారు సైతం అమ్మాయిపై వివక్ష చూపుతూనే ఉన్నారు. ఎన్ని చట్టాలు ఉన్నా.. ప్రమాదం నుంచి మాతృత్వాన్ని కాపాడలేక పోతున్నారు. వరంగల్ నగరంతో పాటు జిల్లాలో ఈ ఏడాది మే ఒకటి నుంచి ఆగస్టు 22 వరకు 3,830 మంది శిశువులు జన్మించారు. ఇందులో 2,045 మంది మగ శిశువులు ఉంటే.. ఆడపిల్లలు 1,785 మంది ఉన్నారు. లింగ నిష్పత్తి పరిశీలిస్తే 260 సంఖ్య తేడా కనిపిస్తోంది. ఇది జిల్లా వైద్యారోగ్య అధికారిక గణాంకాల ప్రకారమే. గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షలతో పాటు భ్రూణ హత్యలు జరుగుతున్నాయనడానికి ఈ లెక్క లే నిదర్శనమన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే మే 29న లింగ నిర్ధారణ పరీక్షలతో సంబంధమున్న ప్రభుత్వ వైద్యులతో సహా 18 మందిని వరంగల్ కమిషనరేట్ పోలీసులు అరెస్టు చేయడం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయినా ఇప్పటికీ వరంగల్ నగరంతో పాటు నర్సంపేట తదితర ప్రాంతాల్లోని వివిధ ఆస్పత్రులు, క్లినిక్ల్లో గుట్టుచప్పుడు కాకుండా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారని తెలుస్తోంది. అధికారుల నిర్లక్ష్యం.. ముఖ్యంగా వైద్యారోగ్య శాఖ విభాగాధికారుల నిర్లక్ష్యంతోనే ఆయా ఆస్పత్రులు, క్లినిక్, స్కానింగ్ కేంద్రాల్లో యథేచ్ఛగా లింగ నిర్ధారణ పరీక్షల దందా సాగిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల జిల్లా మల్టీ మెంబర్ అప్రోప్రైట్ అథారిటీ అధ్యక్షతన గర్భస్థ పిండ లింగ నిర్ధారణ చట్టంలో దరఖాస్తు చేసుకున్న స్కానింగ్ సెంటర్లకు అనుమతిచ్చారు. 2001 నుంచి పీసీ అండ్ పీఎన్డీటీ యాక్ట్ కింద అల్ట్రా సౌండ్ స్కానింగ్ క్లినిక్లు, ఇమేజింగ్ సెంటర్లు ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ అయినవి 102 ఉంటే.. 68 మాత్రమే నడుస్తున్నాయని, 34 నడవడంలేదని వైద్యాధికారులు చెబుతున్నారు. కఠినంగా వ్యవహరించాల్సిందే.. కేసీఆర్ కిట్ ప్రకారం జిల్లాలో 1,000 మంది మగ పిల్లలకు ఆరేళ్ల పిల్లలు 873 మంది మాత్రమే ఉండడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. ఇటు ఆస్పత్రులు, అటు స్కానింగ్ కేంద్రాల్లోని బోర్డులపై లింగ నిర్ధారణ పరీక్షలు నేరమని ప్రదర్శిస్తున్నా కొందరు వైద్యుల కాసుల కక్కుర్తితో ఆడపిల్లలను కడుపులోనే చిదిమేస్తున్నారన్న విషయాన్ని మూడు నెలల క్రితం పోలీసుల దాడుల్లో పట్టుబడిన లింగ నిర్ధారణ ముఠాతో బహిర్గతమైంది. అయినా ఇప్పటికీ గుట్టుచప్పుడు కాకుండా ఎక్కడికక్కడా లింగ నిర్ధారణ పరీక్షలు, ఆపై భ్రూణహత్యలు జరుగుతున్నాయనే ఆరోపణలుండడం ఆందోళన కలిగిస్తోంది. దీనిపై జిల్లావైద్యారోగ్య అధికారులు కఠినంగా వ్యవహరిస్తేనే ఆడపిల్లల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న వాదన బలంగా వినిపిస్తోంది. పరీక్షలు, భ్రూణ హత్యలు..! వివక్ష వేళ్లూనుకుంటోంది. గుట్టుచప్పుడు కాకుండా లింగ నిర్ధారణ జరుగుతోంది. ఆడపిల్ల అని తెలిస్తే కడుపులోనే చిదిమేస్తున్నారు. ప్రభుత్వం ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా.. భ్రూణ హత్యలు ఆగట్లేదు. కొన్నాళ్లుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆడశిశువుల జననాలు తగ్గుతున్నాయి. ఇటీవల లింగ నిర్ధారణ ముఠా అరెస్టయినా.. మరికొన్ని చోట్ల యథేచ్ఛగా ఈదందా సాగుతోందనే విమర్శలున్నాయి. అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోకపోతే భవిష్యత్ తరాలకు ‘అమ్మ’ కరువయ్యే ప్రమాదం ఉంది. లింగ వ్యత్యాసంపై అధ్యయనం చేస్తాం.. దుగ్గొండి మండలంలో 95 మంది మగ పిల్లలు పుడితే 68 మంది మాత్రమే ఆడ పిల్లలు ఉన్నారు. దీనికి విరుద్ధంగా గీసుగొండ మండలంలో 96 మంది మగపిల్లలు పుడితే 111 మంది ఆడ పిల్లలు జన్మించారు. లింగ వ్యత్యాసం అధికంగా ఉన్న మండలాల్లో క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలకు శ్రీకారం చుడతాం. భవిష్యత్లో ఎదురయ్యే పరిణామాల గురించి వివరిస్తాం. అలాగే ఆస్పత్రులు, స్కానింగ్ సెంట ర్ల కార్యకలాపాలపై నిఘా ఉంచుతాం. – డాక్టర్ వెంకటరమణ, జిల్లా వైద్య, ఆరోగ్యాధికారి, వరంగల్ -
ఆడపిల్లలు తగ్గిపోతున్నారు!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఆడపిల్లల సంఖ్య తగ్గుతోంది. గత ఆర్థిక సంవత్సరం కంటే, ఈ ఆర్థిక సంవత్సరం (ఇప్పటివరకు)లో తేడా కనిపిస్తోంది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (హెచ్ఎంఐఎస్) ఈ నెల దేశవ్యాప్తంగా మగ, ఆడ శిశువుల నిష్పత్తిని ప్రకటించింది. అప్పుడే పుట్టిన శిశువులను ఆధారం చేసుకొని ఈ నిష్పత్తిని అంచనా వేసింది. ఆ నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా మగ, ఆడ శిశువుల నిష్పత్తి ప్రతీ వెయ్యి మగ శిశువులకు 2018–19 ఆర్థిక సంవత్సరంలో 932 మంది ఆడ శిశువులు జన్మించారు. అలాగే 2019–20 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 934 మంది ఆడ శిశువులు పుట్టారు. అదే కాలంలో తెలంగాణలో చూస్తే దేశ సగటు కంటే ఎక్కువే ఉన్నా, గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఆ సంఖ్య రాష్ట్రంలో తక్కువగా ఉండటం గమనార్హం. 2018–19లో తెలంగాణలో ప్రతీ వెయ్యి మంది మగ శిశువులకు 957 మంది ఆడ శిశువులు జన్మించగా, 2019–20 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 950 మంది ఆడ శిశువులు జన్మించినట్లు కేంద్ర నివేదిక తెలిపింది. 2017–18లో తెలంగాణలో మగ, ఆడ శిశువుల నిష్పత్తి మరింత దారుణంగా ఉండేది. అప్పుడు ప్రతీ వెయ్యి మంది మగ శిశువులకు 925 మంది మాత్రమే ఆడ శిశువులున్నారు. 2018–19లో మొత్తం 5,30,146 మంది పిల్లలు జన్మించగా, ఈ ఏడాది ఇప్పటివరకు 4,82,097 మంది జన్మించినట్లు నివేదిక వివరించింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యల్పంగా.. ఈ రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఖమ్మం, పెద్దపల్లి జిల్లాలు స్త్రీ పురుషుల నిష్పత్తిలో ఆదర్శంగా ఉండటం విశేషం. ఖమ్మం జిల్లాలో 2018–19 ఆర్థిక సంవత్సరంలో ప్రతీ వెయ్యి మంది మగ శిశువులకు 1,057 మంది ఆడ శిశువులు జన్మించగా, 2019–20 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ఆ సంఖ్య మరింతగా పెరిగి 1,177కు చేరుకోవడం విశేషం. ఇక పెద్దపల్లి జిల్లాలో వారి నిష్పత్తి 2018–19 ఆర్థిక సంవత్సరంలో వెయ్యి మంది మగ శిశువులకు 1,031 మంది ఆడ శిశువులు జన్మించగా, 2019–20 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 1,012 ఉండటం గమనార్హం. యాదాద్రి భువనగిరి జిల్లాలో మాత్రం గత ఆర్థిక సంవత్సరంలో ప్రతీ వెయ్యి మంది మగ శిశువులకు 885 మంది జన్మించగా, ఈ ఆర్థిక సంవత్సరంలో 850కు పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో మగ శిశువులతో పోలిస్తే ఆడ శిశువులు తక్కువగా పుట్టిన జిల్లాలు భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, కొమురంభీం, కరీంనగర్, మహబూబ్నగర్, నిర్మల్, నల్లగొండ, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, యాదాద్రి భువనగిరి జిల్లాలున్నాయి. మిగిలిన జిల్లాల్లో గతేడాదితో పోలిస్తే ఆడ శిశువుల నిష్పత్తి పెరిగింది. ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో కడుపులోనే ఉన్నప్పుడు స్కానింగ్ ద్వారా ఆడ శిశువులను ముందే గుర్తించి భ్రూణ హత్యలు చేస్తున్నారన్న విమర్శలున్నాయి. కొందరు డాక్టర్లు, ప్రైవేటు ప్రాక్టీషనర్లు ఈ విషయంలో డబ్బులకు కక్కుర్తిపడి ఆడపిల్లలు పుట్టకుండా అబార్షన్లు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఎంత చైతన్యం తెస్తున్నా ఈ విషయంలో కొందరు తల్లిదండ్రుల్లో మార్పు రావడం లేదని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. అయితే మొత్తంగా చూస్తే ఐదారేళ్లతో పోలిస్తే కొంచెం పరిస్థితి మారిందంటున్నారు. -
కడుపులోనే కత్తెర
సాక్షి, నెల్లూరు: జిల్లాలో లింగ నిర్ధారణ, భ్రూణహత్యలు రహస్యంగా జరిగిపోతున్నాయి. సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్నా.. అమాయకత్వం, పేదరికం, అవగాహన లోపంతో కడుపులో పడింది ఆడపిల్ల అని గుర్తించి గ్రామీణులు అబార్షన్లు చేయించుకుంటున్నారు. అన్నీ తెలిసిన కొందరు వైద్యులే ధనార్జనే ధ్యేయంగా అబార్షన్లు చేస్తుండటంతో ఆడ పిల్లలు బాహ్యప్రపంచం చూడకుండానే పిండంగానే కాలగర్భంలో కలిసిపోతున్నారు. కాదు చంపేస్తున్నారు. ఈ భ్రూణ హత్యలకు ఆరోగ్యశాఖ సిబ్బందే పరోక్షంగా సహకరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఆడ, మగ అని అడగటం, చెప్పడం చట్ట రీత్యా నేరం. ఇలాంటి ప్రభుత్వ నినాదాలన్నీ ఆస్పత్రుల గోడలకే పరిమితమవుతున్నాయి. ఫలితంగా జిల్లాలో బాలికల నిష్పత్తి రోజు రోజుకు తగ్గిపోతుంది. జిల్లాలో బాలికలు 939 మందే.. జిల్లాలో బాలికల శాతం నానాటికి దిగజారిపోతోంది. 2001లో వెయ్యి మంది పురుషులకు 984 మంది స్త్రీలు ఉండగా వీరిలో 0–6 ఏళ్ల లోపు ప్రతి వెయ్యి మంది బాలురకు 954 మంది బాలికలు ఉన్నారు. 2011 నాటికి 939కు చేరుకుంది. 2017 0–6 ఏళ్లలోపు వారిలో ప్రతి వెయ్యి మంది బాలురుకు 945 మంది బాలికలు ఉన్నారు. గతేడాది లెక్కల పక్రారం ప్రతి 1000 మంది బాలురుకు 928 మందే బాలికలు ఉన్నట్లు సమాచారం. ఈ సంఖ్య గణనీయంగా పడిపోతోంది. ప్రతి వెయ్యి మంది బాలురుకు 953 మందికి పైగా బాలికలు ఉండాలని వైద్యారోగ్యశాఖ లెక్కలు చెబుతున్నాయి. ఇష్టారాజ్యంగా స్కానింగ్ కేంద్రాలు.. జిల్లాలో ఇప్పటి వరకు ప్రభుత్వ అనుమతి పొందిన 209 స్కానింగ్ కేంద్రాలు ఉండగా మరి కొన్ని కేంద్రాలు అనుమతి లేకుండానే పని చేస్తున్నాయి. వీటిపై నిఘా పెట్టాల్సిన జిల్లా వైద్యారోగ్యశాఖ ఆ దిశగా చర్యలు చేపట్టిన పరిస్థితి లేదు. గతంలో పని చేసిన డీఎంహెచ్ఓలు కొన్ని స్కానింగ్ సెంటర్లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి నామమాత్రపు చర్యలకే పరిమితమయ్యారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లోని స్కానింగ్ కేంద్రాల్లో యథేచ్ఛగా లింగ నిర్ధారణ చేస్తున్నారు. దీంతో ఆడ శిశువు అని తెలియగానే వెంటనే అబార్షన్ చేయడం పరిపాటి అయింది. జిల్లాలో నెలకు 60కుపైగా అబార్షన్లు జరుగుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఉదయగిరి, ఆత్మకూరు, నాయుడుపేట, కావలి, గూడూరు, నెల్లూరు నగరంలోని పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసుకున్న సొంత స్కానింగ్ కేంద్రాల్లో ఈ తరహా పరీక్షలు ఎక్కువగా జరుగుతున్నట్లు పలు ఆరోపణలు ఉన్నాయి. మరి కొన్ని ఆస్పత్రుల్లో పోర్టబుల్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ యంత్రాలను నిషేధించినా కొన్ని చోట్ల వాటిని వినియోగిస్తున్నట్లు సమాచారం. పేదరిక భయం, ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కాసులకు కక్కుర్తి పడి కొందరు డాక్టర్లు యథేచ్ఛగా లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ఆడపిల్ల అని తేలితే కడుపులోనే కరిగిస్తున్నారు. లేదంటే యథేచ్ఛగా ఆస్పత్రుల్లోనే అబార్షన్లు చేస్తున్నారు. దీని వల్ల జిల్లాలో బాలిక నిష్పత్తి తగ్గిపోతుంది. లింగ నిర్ధారణ చేస్తున్న స్కానింగ్ కేంద్రాలపై చర్యలు తీసుకోవాల్సిన వైద్యారోగ్యశాఖాధికారులు మాముళ్ల మత్తులో మునిగి తేలుతున్నట్లు విమర్శలున్నాయి. ఉన్నతాధికారులు ఆదేశించినప్పుడో, మీడియాలో వార్తలు వచ్చినప్పుడో తప్ప వారు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు మేల్కోకపోతే భవిష్యత్లో అనంత నష్టం తప్పదంటున్నారు పలువురు వైద్య నిపుణులు. లింగనిర్ధారణ చేస్తే కఠిన చర్యలు స్కానింగ్ కేంద్రాల్లో లింగనిర్ధారణ చేసినట్లు రుజువైతే వెంటనే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇటువంటి ఘటనులు జరిగితే రూ.10 వేలు జరిమానాతో పాటు కేసులు నమోదు చేస్తాం. లింగ నిర్ధారణకు వ్యతిరేకంగా ఉన్న పీసీ, పీఎన్డీటీ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. చట్టం అమలవుతోందో లేదో తెలుసుకునేందుకు త్వరలోనే ఆస్పత్రులను ఆకస్మికంగా తనిఖీలు నిర్వహిస్తామన్నారు. – జయశ్రీ, వైద్యశాఖమదర్ అండ్ చైల్డ్ డైరెక్టర్ -
గర్భంలోనే నూరేళ్లు
కన్నైనా తెరవకుండానే కడతేరుతున్న ‘ఆడబిడ్డలు’ రాష్ట్రంలో వెయ్యి మంది బాలురకు 979 మంది బాలికలు జాతీయ కుటుంబ ఆరోగ్య సమీక్షలో వెల్లడి బెంగళూరు: ‘బేటీ బచావో’ దేశ వ్యాప్తంగా ప్రస్తుతం వినిపిస్తున్న నినాదం ఇది. అంతేకాదు ఆడబిడ్డలను మనం కాపాడే స్థాయి నుంచి మన దేశ పరువును ఒలింపిక్స్లో కాపాడారంటూ కూడా మురిసిపోయాం. కానీ ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే. నాణేనికి మరోవైపు ఉన్న కోణాన్ని పరిశీలిస్తే మాత్రం వాస్తవ పరిస్థితులు మరోలా ఉన్నాయి. ఆడబిడ్డలను ఆదిలోనే, తల్లి గర్భంలోనే తుంచేసే విష సంస్కృతి ఇప్పటికీ అలాగే కొనసాగుతోంది. ఎన్ని నినాదాలు వినిపించినా, ఎన్ని చట్టాలు తెచ్చినా ఆడబిడ్డలపై వివక్ష ఇంకా సజీవంగానే ఉంది. ఈ విషయం ఇటీవల దేశ వ్యాప్తంగా నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సమీక్షలో వెల్లడైంది. 2005-06లో దేశ వ్యాప్తంగా బాల, బాలికల నిష్పత్తి 1000:922గా ఉండగా, 2015-16 నాటికి ఈ నిష్పత్తి 1000:910కి పడిపోయింది. ఇక కర్ణాటక విషయానికి వస్తే ఇక్కడి పరిస్థితి కూడా ఏమంత భిన్నంగా లేదు. 2005-06లో కర్ణాటకలో బాల, బాలికల నిష్పత్తి 1000:1028 కాగా, 2015-16 నాటికి ఈ నిష్పత్తి 1000:979కి పడిపోయింది. విద్యావంతుల్లోనూ కనిపిస్తున్న జాడ్యం.. జాతీయ కుటుంబ ఆరోగ్య సమీక్ష ప్రకారం ఆడబిడ్డలను తల్లి గర్భంలోనే కడతేర్చే సంస్కతి నిరక్షరాస్యుల్లో మాత్రమే కాదు, చదువుకున్న వారిలో సైతం కనిపిస్తోంది. ఆడ, మగ అనే లింగబేధాన్ని విద్యావంతులైన తల్లిదండ్రులు కూడా చూపిస్తుండడంతో పసిమొగ్గలకు తల్లిగర్భంలోనే నూరేళ్లు నిండిపోతున్నాయి. విద్యావంతులైన తల్లిదండ్రులు సైతం మొదట తమకు మగబిడ్డే పుట్టాలని ఆశిస్తున్నారంటే ఆశ్చర్యం కలగక మానదు. ఇక అలాకాకుండా మొదటి కాన్పులో ఆడిబిడ్డ పుట్టినా, రెండోసారి మాత్రం తప్పక మగబిడ్డే కావాలని కోరుకుంటున్నారు. అలా కాకుండా లింగనిర్ధారణ పరీక్షల్లో రెండోసారి కూడా ఆడశిశువే అని తెలిస్తే వెంటనే ఆ బిడ్డ ఆయువును అనంత వాయువుల్లో కలిపేస్తున్నారు. ఇక అనేక శ్రీమంత, మధ్య తరగతి కుటుంబాల్లో సైతం ఇదే పరిస్థితి కనిపిస్తోందనే విషయం ఆందోళన కలిగించక మానదు. ఇక ఇందుకు జాతీయ కుటుంబ ఆరోగ్య సమీక్ష గణాంకాలే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. విద్యావంతులైన వారు, సంపన్న వర్గాలు ఎక్కువగా కనిపించే బెంగళూరు నగరంలో సైతం బాలికల సంఖ్య 916కు పడిపోయింది. ఇదే సందర్భంలో తుమకూరు, కోలారు, మండ్య వంటి ప్రాంతాల్లో ఈ సంఖ్య 984, 978, 995గా ఉండడం గమనించదగ్గ విషయం. జిల్లాల వారీగా పరిశీలిస్తే.. ఇక జిల్లాల వారీగా బాల, బాలికల నిష్పత్తిని పరిశీలిస్తే బెంగళూరు నగర-916, బెంగళూరు గ్రామీణ-946, బెళగావి-973, మైసూరు-985, తుమకూరు-984, కలబుర్గి-971, బళ్లారి- 983, విజయపుర-960, దావణగెరె-972, బాగల్కోటె-989, ధార్వాడ- 971, మండ్య-995, హాసన్-1010, శివమొగ్గ-998, బీదర్- 956, చిత్రదుర్గ- 974, హావేరి-950, కోలారు-978, కొప్పళ-986, చిక్కబళ్లాపుర-972. చట్టాలు సరిగ్గా అమలుకాకనే.. ఇక ఇప్పటికీ ఈ వివక్ష ఇలాగే కొనసాగుతుండడానికి కారణం చట్టాలు సరిగ్గా అమలు కాకపోవడమే అసలైన కారణమని చెబుతున్నారు సామాజిక నిపుణులు. లింగనిర్ధారణ పరీక్షలు జరపరాదన్న నిబంధనలు ఇప్పటికీ సరిగ్గా అమలు కావడం లేదని చెబుతున్నారు. అనేక ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో ఉన్న ల్యాబొరేటరీల్లో ఇప్పటికీ యదేచ్ఛగా లింగనిర్ధారణ పరీక్షలు జరుగుతూనే ఉన్నాయనేది వీరి వాదన. ఈ నేపథ్యంలో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ఈ అంశంపై మరింతగా దష్టి సారించడంతో పాటు ప్రజల్లో చైతన్యం కల్పించే దిశగా కార్యక్రమాలను ప్రభుత్వాలు మరింతగా చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు అభిప్రాయపడుతున్నారు.