గర్భంలోనే నూరేళ్లు
కన్నైనా తెరవకుండానే కడతేరుతున్న ‘ఆడబిడ్డలు’
రాష్ట్రంలో వెయ్యి మంది బాలురకు 979 మంది బాలికలు
జాతీయ కుటుంబ ఆరోగ్య సమీక్షలో వెల్లడి
బెంగళూరు: ‘బేటీ బచావో’ దేశ వ్యాప్తంగా ప్రస్తుతం వినిపిస్తున్న నినాదం ఇది. అంతేకాదు ఆడబిడ్డలను మనం కాపాడే స్థాయి నుంచి మన దేశ పరువును ఒలింపిక్స్‌లో కాపాడారంటూ కూడా మురిసిపోయాం. కానీ ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే. నాణేనికి మరోవైపు ఉన్న కోణాన్ని పరిశీలిస్తే మాత్రం వాస్తవ పరిస్థితులు మరోలా ఉన్నాయి. ఆడబిడ్డలను ఆదిలోనే, తల్లి గర్భంలోనే తుంచేసే విష సంస్కృతి ఇప్పటికీ అలాగే కొనసాగుతోంది. ఎన్ని నినాదాలు వినిపించినా, ఎన్ని చట్టాలు తెచ్చినా ఆడబిడ్డలపై వివక్ష ఇంకా సజీవంగానే ఉంది. ఈ విషయం ఇటీవల దేశ వ్యాప్తంగా నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సమీక్షలో వెల్లడైంది. 2005-06లో దేశ వ్యాప్తంగా బాల, బాలికల నిష్పత్తి 1000:922గా ఉండగా, 2015-16 నాటికి ఈ నిష్పత్తి 1000:910కి పడిపోయింది. ఇక కర్ణాటక విషయానికి వస్తే ఇక్కడి పరిస్థితి కూడా ఏమంత భిన్నంగా లేదు. 2005-06లో కర్ణాటకలో బాల, బాలికల నిష్పత్తి 1000:1028 కాగా, 2015-16 నాటికి ఈ నిష్పత్తి 1000:979కి పడిపోయింది.
విద్యావంతుల్లోనూ కనిపిస్తున్న జాడ్యం..
జాతీయ కుటుంబ ఆరోగ్య సమీక్ష ప్రకారం ఆడబిడ్డలను తల్లి గర్భంలోనే కడతేర్చే సంస్కతి నిరక్షరాస్యుల్లో మాత్రమే కాదు, చదువుకున్న వారిలో సైతం కనిపిస్తోంది. ఆడ, మగ అనే లింగబేధాన్ని విద్యావంతులైన తల్లిదండ్రులు కూడా చూపిస్తుండడంతో పసిమొగ్గలకు తల్లిగర్భంలోనే నూరేళ్లు నిండిపోతున్నాయి. విద్యావంతులైన తల్లిదండ్రులు సైతం మొదట తమకు మగబిడ్డే పుట్టాలని ఆశిస్తున్నారంటే ఆశ్చర్యం కలగక మానదు. ఇక అలాకాకుండా మొదటి కాన్పులో ఆడిబిడ్డ పుట్టినా, రెండోసారి మాత్రం తప్పక మగబిడ్డే కావాలని కోరుకుంటున్నారు. అలా కాకుండా లింగనిర్ధారణ పరీక్షల్లో రెండోసారి కూడా ఆడశిశువే అని తెలిస్తే వెంటనే ఆ బిడ్డ ఆయువును అనంత వాయువుల్లో కలిపేస్తున్నారు. ఇక అనేక శ్రీమంత, మధ్య తరగతి కుటుంబాల్లో సైతం ఇదే పరిస్థితి కనిపిస్తోందనే విషయం ఆందోళన కలిగించక మానదు. ఇక ఇందుకు జాతీయ కుటుంబ ఆరోగ్య సమీక్ష గణాంకాలే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. విద్యావంతులైన వారు, సంపన్న వర్గాలు ఎక్కువగా కనిపించే బెంగళూరు నగరంలో సైతం బాలికల సంఖ్య 916కు పడిపోయింది. ఇదే సందర్భంలో తుమకూరు, కోలారు, మండ్య వంటి ప్రాంతాల్లో ఈ సంఖ్య 984, 978, 995గా ఉండడం గమనించదగ్గ విషయం.
జిల్లాల వారీగా పరిశీలిస్తే..
ఇక జిల్లాల వారీగా బాల, బాలికల నిష్పత్తిని పరిశీలిస్తే బెంగళూరు నగర-916, బెంగళూరు గ్రామీణ-946, బెళగావి-973, మైసూరు-985, తుమకూరు-984, కలబుర్గి-971, బళ్లారి- 983, విజయపుర-960, దావణగెరె-972, బాగల్‌కోటె-989, ధార్వాడ- 971, మండ్య-995, హాసన్-1010, శివమొగ్గ-998, బీదర్- 956, చిత్రదుర్గ- 974, హావేరి-950, కోలారు-978, కొప్పళ-986, చిక్కబళ్లాపుర-972.
చట్టాలు సరిగ్గా అమలుకాకనే..
ఇక ఇప్పటికీ ఈ వివక్ష ఇలాగే కొనసాగుతుండడానికి కారణం చట్టాలు సరిగ్గా అమలు కాకపోవడమే అసలైన కారణమని చెబుతున్నారు సామాజిక నిపుణులు. లింగనిర్ధారణ పరీక్షలు జరపరాదన్న నిబంధనలు ఇప్పటికీ సరిగ్గా అమలు కావడం లేదని చెబుతున్నారు. అనేక ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో ఉన్న ల్యాబొరేటరీల్లో ఇప్పటికీ యదేచ్ఛగా లింగనిర్ధారణ పరీక్షలు జరుగుతూనే ఉన్నాయనేది వీరి వాదన. ఈ నేపథ్యంలో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ఈ అంశంపై మరింతగా దష్టి సారించడంతో పాటు ప్రజల్లో చైతన్యం కల్పించే దిశగా కార్యక్రమాలను ప్రభుత్వాలు మరింతగా చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు అభిప్రాయపడుతున్నారు.