జననాల్లో బాలిక నిష్పత్తి రోజురోజుకూ తగ్గుతూ వస్తోంది. చదువు, సంస్కారం ఉన్నవారు సైతం అమ్మాయిపై వివక్ష చూపుతూనే ఉన్నారు. ఎన్ని చట్టాలు ఉన్నా.. ప్రమాదం నుంచి మాతృత్వాన్ని కాపాడలేక పోతున్నారు. వరంగల్ నగరంతో పాటు జిల్లాలో ఈ ఏడాది మే ఒకటి నుంచి ఆగస్టు 22 వరకు 3,830 మంది శిశువులు జన్మించారు. ఇందులో 2,045 మంది మగ శిశువులు ఉంటే.. ఆడపిల్లలు 1,785 మంది ఉన్నారు. లింగ నిష్పత్తి పరిశీలిస్తే 260 సంఖ్య తేడా కనిపిస్తోంది. ఇది జిల్లా వైద్యారోగ్య అధికారిక గణాంకాల ప్రకారమే.
గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షలతో పాటు భ్రూణ హత్యలు జరుగుతున్నాయనడానికి ఈ లెక్క లే నిదర్శనమన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే మే 29న లింగ నిర్ధారణ పరీక్షలతో సంబంధమున్న ప్రభుత్వ వైద్యులతో సహా 18 మందిని వరంగల్ కమిషనరేట్ పోలీసులు అరెస్టు చేయడం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయినా ఇప్పటికీ వరంగల్ నగరంతో పాటు నర్సంపేట తదితర ప్రాంతాల్లోని వివిధ ఆస్పత్రులు, క్లినిక్‌ల్లో గుట్టుచప్పుడు కాకుండా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారని తెలుస్తోంది.
అధికారుల నిర్లక్ష్యం..
ముఖ్యంగా వైద్యారోగ్య శాఖ విభాగాధికారుల నిర్లక్ష్యంతోనే ఆయా ఆస్పత్రులు, క్లినిక్, స్కానింగ్ కేంద్రాల్లో యథేచ్ఛగా లింగ నిర్ధారణ పరీక్షల దందా సాగిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల జిల్లా మల్టీ మెంబర్ అప్రోప్రైట్ అథారిటీ అధ్యక్షతన గర్భస్థ పిండ లింగ నిర్ధారణ చట్టంలో దరఖాస్తు చేసుకున్న స్కానింగ్ సెంటర్లకు అనుమతిచ్చారు. 2001 నుంచి పీసీ అండ్ పీఎన్‌డీటీ యాక్ట్ కింద అల్ట్రా సౌండ్ స్కానింగ్ క్లినిక్‌లు, ఇమేజింగ్ సెంటర్లు ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ అయినవి 102 ఉంటే.. 68 మాత్రమే నడుస్తున్నాయని, 34 నడవడంలేదని వైద్యాధికారులు చెబుతున్నారు.
కఠినంగా వ్యవహరించాల్సిందే..
కేసీఆర్ కిట్ ప్రకారం జిల్లాలో 1,000 మంది మగ పిల్లలకు ఆరేళ్ల పిల్లలు 873 మంది మాత్రమే ఉండడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. ఇటు ఆస్పత్రులు, అటు స్కానింగ్ కేంద్రాల్లోని బోర్డులపై లింగ నిర్ధారణ పరీక్షలు నేరమని ప్రదర్శిస్తున్నా కొందరు వైద్యుల కాసుల కక్కుర్తితో ఆడపిల్లలను కడుపులోనే చిదిమేస్తున్నారన్న విషయాన్ని మూడు నెలల క్రితం పోలీసుల దాడుల్లో పట్టుబడిన లింగ నిర్ధారణ ముఠాతో బహిర్గతమైంది. అయినా ఇప్పటికీ గుట్టుచప్పుడు కాకుండా ఎక్కడికక్కడా లింగ నిర్ధారణ పరీక్షలు, ఆపై భ్రూణహత్యలు జరుగుతున్నాయనే ఆరోపణలుండడం ఆందోళన కలిగిస్తోంది. దీనిపై జిల్లావైద్యారోగ్య అధికారులు కఠినంగా వ్యవహరిస్తేనే ఆడపిల్లల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న వాదన బలంగా వినిపిస్తోంది.
పరీక్షలు, భ్రూణ హత్యలు..!
వివక్ష వేళ్లూనుకుంటోంది. గుట్టుచప్పుడు కాకుండా లింగ నిర్ధారణ జరుగుతోంది. ఆడపిల్ల అని తెలిస్తే కడుపులోనే చిదిమేస్తున్నారు. ప్రభుత్వం ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా.. భ్రూణ హత్యలు ఆగట్లేదు. కొన్నాళ్లుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆడశిశువుల జననాలు తగ్గుతున్నాయి. ఇటీవల లింగ నిర్ధారణ ముఠా అరెస్టయినా.. మరికొన్ని చోట్ల యథేచ్ఛగా ఈదందా సాగుతోందనే విమర్శలున్నాయి. అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోకపోతే భవిష్యత్ తరాలకు ‘అమ్మ’ కరువయ్యే ప్రమాదం ఉంది.
లింగ వ్యత్యాసంపై అధ్యయనం చేస్తాం..
దుగ్గొండి మండలంలో 95 మంది మగ పిల్లలు పుడితే 68 మంది మాత్రమే ఆడ పిల్లలు ఉన్నారు. దీనికి విరుద్ధంగా గీసుగొండ మండలంలో 96 మంది మగపిల్లలు పుడితే 111 మంది ఆడ పిల్లలు జన్మించారు. లింగ వ్యత్యాసం అధికంగా ఉన్న మండలాల్లో క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలకు శ్రీకారం చుడతాం. భవిష్యత్‌లో ఎదురయ్యే పరిణామాల గురించి వివరిస్తాం. అలాగే ఆస్పత్రులు, స్కానింగ్ సెంట ర్ల కార్యకలాపాలపై నిఘా ఉంచుతాం.
– డాక్టర్ వెంకటరమణ,
జిల్లా వైద్య, ఆరోగ్యాధికారి, వరంగల్
Comments
Please login to add a commentAdd a comment