Fetal killings
-
ఆడపిల్ల అని తెలియగానే కడుపులోనే చిదిమేస్తున్నారు
జననాల్లో బాలిక నిష్పత్తి రోజురోజుకూ తగ్గుతూ వస్తోంది. చదువు, సంస్కారం ఉన్నవారు సైతం అమ్మాయిపై వివక్ష చూపుతూనే ఉన్నారు. ఎన్ని చట్టాలు ఉన్నా.. ప్రమాదం నుంచి మాతృత్వాన్ని కాపాడలేక పోతున్నారు. వరంగల్ నగరంతో పాటు జిల్లాలో ఈ ఏడాది మే ఒకటి నుంచి ఆగస్టు 22 వరకు 3,830 మంది శిశువులు జన్మించారు. ఇందులో 2,045 మంది మగ శిశువులు ఉంటే.. ఆడపిల్లలు 1,785 మంది ఉన్నారు. లింగ నిష్పత్తి పరిశీలిస్తే 260 సంఖ్య తేడా కనిపిస్తోంది. ఇది జిల్లా వైద్యారోగ్య అధికారిక గణాంకాల ప్రకారమే. గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షలతో పాటు భ్రూణ హత్యలు జరుగుతున్నాయనడానికి ఈ లెక్క లే నిదర్శనమన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే మే 29న లింగ నిర్ధారణ పరీక్షలతో సంబంధమున్న ప్రభుత్వ వైద్యులతో సహా 18 మందిని వరంగల్ కమిషనరేట్ పోలీసులు అరెస్టు చేయడం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయినా ఇప్పటికీ వరంగల్ నగరంతో పాటు నర్సంపేట తదితర ప్రాంతాల్లోని వివిధ ఆస్పత్రులు, క్లినిక్‌ల్లో గుట్టుచప్పుడు కాకుండా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారని తెలుస్తోంది. అధికారుల నిర్లక్ష్యం.. ముఖ్యంగా వైద్యారోగ్య శాఖ విభాగాధికారుల నిర్లక్ష్యంతోనే ఆయా ఆస్పత్రులు, క్లినిక్, స్కానింగ్ కేంద్రాల్లో యథేచ్ఛగా లింగ నిర్ధారణ పరీక్షల దందా సాగిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల జిల్లా మల్టీ మెంబర్ అప్రోప్రైట్ అథారిటీ అధ్యక్షతన గర్భస్థ పిండ లింగ నిర్ధారణ చట్టంలో దరఖాస్తు చేసుకున్న స్కానింగ్ సెంటర్లకు అనుమతిచ్చారు. 2001 నుంచి పీసీ అండ్ పీఎన్డీటీ యాక్ట్ కింద అల్ట్రా సౌండ్ స్కానింగ్ క్లినిక్‌లు, ఇమేజింగ్ సెంటర్లు ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ అయినవి 102 ఉంటే.. 68 మాత్రమే నడుస్తున్నాయని, 34 నడవడంలేదని వైద్యాధికారులు చెబుతున్నారు. కఠినంగా వ్యవహరించాల్సిందే.. కేసీఆర్ కిట్ ప్రకారం జిల్లాలో 1,000 మంది మగ పిల్లలకు ఆరేళ్ల పిల్లలు 873 మంది మాత్రమే ఉండడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. ఇటు ఆస్పత్రులు, అటు స్కానింగ్ కేంద్రాల్లోని బోర్డులపై లింగ నిర్ధారణ పరీక్షలు నేరమని ప్రదర్శిస్తున్నా కొందరు వైద్యుల కాసుల కక్కుర్తితో ఆడపిల్లలను కడుపులోనే చిదిమేస్తున్నారన్న విషయాన్ని మూడు నెలల క్రితం పోలీసుల దాడుల్లో పట్టుబడిన లింగ నిర్ధారణ ముఠాతో బహిర్గతమైంది. అయినా ఇప్పటికీ గుట్టుచప్పుడు కాకుండా ఎక్కడికక్కడా లింగ నిర్ధారణ పరీక్షలు, ఆపై భ్రూణహత్యలు జరుగుతున్నాయనే ఆరోపణలుండడం ఆందోళన కలిగిస్తోంది. దీనిపై జిల్లావైద్యారోగ్య అధికారులు కఠినంగా వ్యవహరిస్తేనే ఆడపిల్లల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న వాదన బలంగా వినిపిస్తోంది. పరీక్షలు, భ్రూణ హత్యలు..! వివక్ష వేళ్లూనుకుంటోంది. గుట్టుచప్పుడు కాకుండా లింగ నిర్ధారణ జరుగుతోంది. ఆడపిల్ల అని తెలిస్తే కడుపులోనే చిదిమేస్తున్నారు. ప్రభుత్వం ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా.. భ్రూణ హత్యలు ఆగట్లేదు. కొన్నాళ్లుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆడశిశువుల జననాలు తగ్గుతున్నాయి. ఇటీవల లింగ నిర్ధారణ ముఠా అరెస్టయినా.. మరికొన్ని చోట్ల యథేచ్ఛగా ఈదందా సాగుతోందనే విమర్శలున్నాయి. అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోకపోతే భవిష్యత్ తరాలకు ‘అమ్మ’ కరువయ్యే ప్రమాదం ఉంది. లింగ వ్యత్యాసంపై అధ్యయనం చేస్తాం.. దుగ్గొండి మండలంలో 95 మంది మగ పిల్లలు పుడితే 68 మంది మాత్రమే ఆడ పిల్లలు ఉన్నారు. దీనికి విరుద్ధంగా గీసుగొండ మండలంలో 96 మంది మగపిల్లలు పుడితే 111 మంది ఆడ పిల్లలు జన్మించారు. లింగ వ్యత్యాసం అధికంగా ఉన్న మండలాల్లో క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలకు శ్రీకారం చుడతాం. భవిష్యత్‌లో ఎదురయ్యే పరిణామాల గురించి వివరిస్తాం. అలాగే ఆస్పత్రులు, స్కానింగ్ సెంట ర్ల కార్యకలాపాలపై నిఘా ఉంచుతాం. – డాక్టర్ వెంకటరమణ, జిల్లా వైద్య, ఆరోగ్యాధికారి, వరంగల్ -
పుడితే కదా బతికేది
‘నేను పుట్టక ముందే నా మీద హత్యాయత్నం జరిగింది’ అని మొదలవుతుంది ఒక నవల. ఇవాళ దేశంలో పుడుతున్న చాలామంది ఆడపిల్లలు ఆ హత్యాయత్నాన్ని తప్పించుకుని భూమ్మీద పడ్డవారే. అమ్మయ్య అని ఊపిరిపీల్చుకున్నవారే. జన్మించాక రాజ్యాంగం చాలా హక్కులు ఇచ్చింది. కాని జన్మించే హక్కుకే ఆడపిల్లకు పెద్ద గండం వచ్చి పడుతోంది.2017–18 సంవత్సరంలో ఈ దేశం కోల్పోయిన ఆడ శిశువుల సంఖ్య దాదాపు 7 కోట్లు అని ఒక అంచనా. మొదటి కాన్పులో అబ్బాయి పుడితే, లేదా గర్భంలో ఉన్నది అబ్బాయి అని తేలితే తల్లిదండ్రులు సంతోషంగా ఆ గర్భాన్ని ఆహ్వానిస్తారు. తర్వాతి కాన్పులో అమ్మాయిని అంగీకరించే అవకాశం ఉంది. కాని తొలి కాన్పులో అమ్మాయి ఉందని తేలి, గత సంవత్సం అటువంటి గర్భాల్ని రాల్చేసిన సంఖ్య దాదాపు రెండున్నర కోట్లు.టెక్నాలజీ మనిషికి మేలు చేస్తుందని అనుకుంటాము కానీ అది చేసే చెడు కూడా ఉంటుంది. స్కానింగ్ సెంటర్లు రాకపూర్వం గర్భంలో ఉన్న శిశువులకు వచ్చే సమస్యలను తెలుసుకోవడం, పిండ ఆరోగ్యాన్ని గమనించడం కష్టంగా ఉండేది. స్కానింగ్ సెంటర్లు వచ్చాక పిండ ఆరోగ్య ప్రాధాన్యం వెనక్కు వెళ్లి ఆ పిండం అబ్బాయా అమ్మాయా తేలడం ముఖ్యం అయిపోయింది. లింగ నిర్థారణ పరీక్ష ఫలితం విచక్షణ లేకుండా బయటపెట్టడం వల్ల దేశంలో కోట్లాది అబార్షన్లు జరిగాయి. అవన్నీ ఆడశిశువును వద్దనుకున్నవే. దీనిని గమనించిన ప్రభుత్వం 1994లో ‘ప్రీ కన్సెప్షన్ ప్రీనాటల్ డయాగ్నస్టిక్ యాక్ట్’ (పిసిపిఎన్డిటి యాక్ట్) తీసుకు వచ్చింది. దీనిప్రకారం స్కానింగ్ సెంటర్లలో లింగ నిర్థారణ చేయడం నేరం. కాని ఈ చట్టం వచ్చాక కూడా పరిస్థితి పూర్తిగా మెరుగవలేదని సర్వేలు చెబుతున్నాయి. 2016 ‘సెక్స్ రేషియో ఎట్ బర్త్’ (ఎస్ఆర్బి) లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి 1000 మంది అబ్బాయిలకు ఉన్న అమ్మాయిల సంఖ్య 806. ఇది జాతీయ సగటు 877 కంటే తక్కువ. తెలంగాణలో ఈ సంఖ్య కొంత మెరుగ్గా 881గా ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు ‘సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్’ ప్రకారం 2016కు ప్రకటించుకున్న సంఖ్యలు ఆంధ్రప్రదేశ్ 947గా, తెలంగాణ 917గా ఉన్నాయి. ఎవరైనా కొనుక్కోవచ్చు.. ఎలాగైనా చేయొచ్చు.. పిఎన్డిటి చట్టం ప్రకారం ప్రభుత్వ ధ్రువీకరణ లేని స్కానింగ్ సెంటర్లు గర్భిణులకు పరీక్షలు చేయకూడదు. వారికి దొంగ గుర్తింపు కార్డులు ఇవ్వడం, వేరే పేరు నమోదు చేసి పరీక్షించడం ఇవన్నీ నేరం. ప్రతి రికార్డు నిక్షిప్తం చేయాలి. యంత్ర తయారీ సంస్థలు కూడా గుర్తింపు ఉన్న సంస్థలకే స్కానింగ్ మెషినరీని అమ్మాల్సి ఉంటుంది. కాని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చాలామంది అనుమతి లేని వ్యక్తులు ఈ స్కానింగ్ సామగ్రిని కొనుగోలు చేసుకుంటున్నారు. చిన్న చిన్న సెంటర్లు పెట్టి గుట్టు చప్పుడు కాకుండా పరీక్షలు నిర్వహిస్తున్నారు. కొన్నిచోట్ల ఆర్.ఎం.పి డాక్టర్లే తమ క్లినిక్‌లలో ఈ సామగ్రి పెట్టి పరీక్షలు చేసి పుట్టేది ఆడపిల్లో మగపిల్లాడో చెప్పేస్తున్నారు. మామూలు స్కానింగ్‌కు ఆరువందల రూపాయలు అయితే అమ్మాయో అబ్బాయో చెప్పడానికి మూడు వేల నుంచి ఆరువేల రూపాయలు తీసుకుంటున్నారు. దీనిని నిరోధించే అజమాయిషీ బృందాలు జిల్లాల వారీగా లేకపోవడం ఒక కారణం. ఈ అజమాయిషీ బృందాల ఖర్చు కేంద్రం భరించి ఆ నిధులు విడుదల చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోవడం లేదు. పైగా పిఎన్డిటి చట్టాన్ని అధికారులు తమకు గిట్టని డాక్టర్ల మీద కక్ష సాధింపు కోసం ఉపయోగిస్తున్నారని కొన్ని పెద్ద హాస్పిటళ్ల అధినేత గుర్రుగా ఉన్నారు. చాలా తక్కువ చోట్ల మాత్రమే కేసులు నమోదు అవుతున్నాయి. ఇటీవల హైదరాబాద్ సమీపంలోని ఇబ్రహీం పట్నంలో లింగ్ నిర్థారణ చేస్తున్న ఒక సెంటర్‌పై పోలీసులు మారువేషంలో వెళ్లి దాడి చేసి ఆ సెంటర్‌ను మూయించారు. కాని ఇలా రెండు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలోనూ జరగడం లేదు. ఈ చట్టం వచ్చాక లింగ నిర్ధారణ చేసి పట్టుబడి శిక్ష అనుభవించిన డాక్టర్ ఒక్కరూ లేరని తెలిస్తే దీని అమలు ఎంత బలహీనంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఢిల్లీ మోడల్ బెస్ట్ ఢిల్లీలో లింగ నిర్ధారణ పరీక్షలు చేసి ఆడ శిశువుల మరణానికి కారణమవుతున్న స్కానింగ్ సెంటర్లపై అక్కడి ప్రభుత్వం పెద్ద ఎత్తున దాడికి దిగింది. అటువంటి సెంటర్ల గురించి కచ్చితమైన సమాచారం ఇచ్చిన వ్యక్తికి యాభై వేల రూపాయల బహుమతి ప్రకటించింది. అందుకు సహకరించి ‘స్టింగ్ ఆపరేషన్’ లో పాల్గొన్న నిజ గర్భిణీకి ఏకంకా లక్షన్నర రూపాయల కానుక ప్రకటించింది. ఉత్తరాదిలో ఆడ శిశువుల మరణం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో హర్యాణా, రాజస్తాన్, ఢిల్లీ ముందు వరుసలో ఉన్నాయి. దక్షిణాదిలో ఈ దురవస్థకు దూరంగా ఉన్న రాష్ట్రంగా కేరళ మార్కులు కొట్టేసింది. మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో పరిస్థితి అంతంత మాత్రమే.ప్రజలలో మార్పు, ప్రభుత్వాల పూనిక ఆడపిల్లను పుట్టనిస్తాయి. ఆడపిల్లను ఎదగనిస్తాయి. ఆడపిల్లను కన్నందుకు సమాజం గర్వపడేలా వారు నిరూపించుకోవడానికి అవకాశమిస్తాయి. అటువంటి దశవైపు మనం త్వరత్వరగా అడుగులు వేయాలని ఆశిద్దాం. -
రాఖీ సాక్షిగా
మణికట్టుకు కడుతున్న రాఖీ ఎందుకివాళ బాధపడుతోంది? పువ్వులా వికసించే రాఖీ ఎందుకు వడలిపోయినట్టుగా అనిపిస్తోంది? అసలు రాఖీకొచ్చిన బాధ ఏంటి? కలుగుతున్న కష్టమేంటి? రాఖీ కరువయ్యారా? రక్షణ బరువయ్యిందా? ఆగండాగండి! ఇవాళ రాఖీ పండగ. రాఖీ స్వగతం వింటే సోదరులకే కాదు... అక్కాచెల్లెళ్లకు కూడా కళ్ళు చెమరుస్తాయి. ఆ అందమైన బంధాన్ని మళ్లీ బలపరచాలన్న స్ఫూర్తి కలుగుతుంది.. రాఖీ... అంటే భారతీయుల పరిభాషలో రక్షణ. అంటే నేనే! అన్న, తమ్ముడు, కొన్నిచోట్ల నాన్నకు కూడా అక్క, చెల్లి, కూతురు నన్ను మణికట్టుకు కడతారు.. జీవితాంతం తమకు అండగా, రక్షగా ఉండమని! అందుకే ఈ వేడుక రక్షాబంధన్ అయింది. ఒకరకంగా ఇది నా పుట్టినరోజు. నాది నిన్నమొన్నటి జన్మ కాదు. పురాణకాలంలోనే పురుడు పోసుకున్నాను. ఎప్పుడు పుట్టానో చెప్పలేను కాని నాటి నుంచయితే ఉనికిలో ఉన్నా! నాకు గుర్తున్నంత వరకు నా పుట్టిన రోజులు.. మీలో చాలామందికి తెలిసినవి.. నెమరు వేసుకునేవి మరోమారు గుర్తు చేస్తా! ఇది ద్వాపర యుగం నాటిది.. ఓ రోజు... శ్రీ కృష్ణుడు చెరుకుగడను విరుచుకుంటుంటే దాని పేడు తగిలి వేలు కోసుకుపోయింది. జలజల రక్తం కారడం మొదలైంది. పక్కనే ఉన్న రుక్మిణి కంగారు పడి ఆ పక్కనే ఉన్న చెలికత్తెలను పురమాయించింది కట్టుకట్టడానికి గుడ్డ తెమ్మని. ఈ పక్కనే ఉన్న ద్రౌపది క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన కొంగు చించి శ్రీకృష్ణుడి వేలుకు గట్టిగా చుట్టి రక్తప్రవాహానికి అడ్డుకట్టవేసింది. కృష్ణుడు ఆప్యాయంగా ద్రౌపది తల నిమిరి.. ‘‘చెల్లెమ్మా.. ఆపదకాలంలో నీకు రక్షణ గా నిలిచి నీ రుణం తీర్చుకుంటాను’’ అని మాట ఇచ్చాడు. దుశ్శాసనుడు నిండుసభలో ద్రౌపదిని అవమానించినప్పుడు ఆమె అభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడి ఇచ్చిన మాటను నెరవేర్చుకున్నాడు. ఇదీ రక్షాబంధనమే! ఇంకో జ్ఞాపకం కూడా చెప్తా.. ఒకసారి యమునా నది యమధర్మరాజు ముంజేతికి నన్ను కట్టింది. సంతోషపడిన యమధర్మరాజు ‘‘నీకు మరణం అనేది ఉండదు. నిత్యం పరవళ్లు తొక్కుతూ ఉంటావ్’ అని ఆశీర్వదించాడు. ‘‘నువ్వే కాదు రాఖీ కట్టిన ఏ సోదరైనా సోదరుల రక్షణలో చిరంజీవులుగా వర్థిల్లుతారు’’ అనే వరమూ ఇచ్చారు. అప్పుడు తెలిసింది నాకు నా శక్తేంటో! చరిత్ర సరే... ‘‘పైనవన్నీ యుగాలనాటివి.. పైగా పురాణాలంటున్నావు.. వాటిల్లో నిజమెంతో.. అబద్ధమెంతో?’’ అని ఫేస్ క్వశ్చన్మార్క్లా పెట్టారు? ఒకే అయితే చరిత్రలోని సంఘటనలే చెప్తాను. అలెగ్జాండర్ ది గ్రేట్ తెలుసు కదా? దండయాత్రలతో ప్రపంచాన్ని చుడుతూ మన దేశానికీ వచ్చాడు. ఇక్కడ పురుషోత్తముడు అనే చక్రవర్తి గొప్ప వీరుడు, మహా శూరుడు అని అలెగ్జాండర్తోపాటు అతని భార్య రుక్సానా కూడా విన్నది. అలాంటి పరాక్రమవంతుడు యుద్ధంలో తన భర్తను మట్టుపెట్టేస్తాడేమోనని భయపడింది. అప్పుడు నా గురించి తెలుసుకొని.. సేవకుడి ద్వారా పురుషోత్తముడి దగ్గరకు పంపింది. నన్ను తన మణికట్టుకు ముడివేసుకొని తనను సోదరిగా స్వీకరించమని.. యుద్ధంలో అలెగ్జాండర్‌ను వధించకుండా వదిలేయమని విన్నవించుకుంది. అన్నట్టుగానే పురుషోత్తముడు యుద్ధంలో అలెగ్జాండర్‌ను వధించే అవకాశం వచ్చినా.. వదిలేసి రుక్సానాకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. దీనినే ఇంకోలా కూడా చెప్పుకుంటారు. పురుషోత్తముడి భార్య సంయుక్త అలెగ్జాండర్‌కు రాఖీ కట్టిందని, ఆమెను చెల్లిగా భావించిన అలెగ్జాండర్, పురుషోత్తముడికి ప్రాణభిక్ష పెట్టాడనీ కూడా చెబుతారు. కథ ఏదైతేనేం... నాకున్న పవర్ అదీ! నన్ను కట్టిన అక్క, చెల్లి ధనమాన, ప్రాణాలే కాదు సౌభాగ్యాన్నీ కాపాడతా. జీవితాంతం రక్షగా నిలుస్తా! పరువుకోసం.. హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లో అట... తమ కులం కాని వాళ్లను ప్రేమించారని.. వాళ్లనే పెళ్లి చేసుకుంటామని పట్టుబట్టారనికడుపున పుట్టిన బిడ్డలని కూడా చూడకుండా నరికి పోగులు పెట్టారు. పదిమందిలో పరువు కోసం కన్నపిల్లల ప్రాణాలనే బలిపెట్టారు. వాళ్లనుకునే పేరుప్రతిష్టలను నిలుపుకోవడం కోసం ఆ ఇళ్లల్లో ఆడపిల్లలను చంపడానికి ఇంటి పెద్ద సహా అన్నాతమ్ముళ్లు కూడా సిద్ధపడుతున్నారు. భద్రతకు భావమే లేకుండా చేస్తున్నారు. భ్రూణ హత్యలు పుట్టాక అమ్మాయి మీద కక్షగట్టి చేస్తున్న నీచాలు ఒకెత్తయితే.. పుట్టకుండా చూసే పాతకం ఒకెత్తు. గర్భంలో ఉన్నది ఆడపిల్ల అని తెలిసిందంటే చాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లోనే కాదు పక్కరాష్ట్రమైన మహారాష్ట్రలాంటి చోట్ల కూడా అబార్షన్‌తో ఆ పిల్లకు పుట్టుకలేకుండా చేస్తున్నారు. ఒకవేళ పుట్టినా పురిట్లోనే గొంతునొక్కేస్తున్నారు. ఇవన్నీ కాక.. ప్రతి అన్న, తమ్ముడు, మామయ్య, బాబాయ్, చివరకు తాతయ్య వయసు వృద్ధులు కూడా ఇంట్లోంచి బయటకు వెళితే చాలు.. పరాయి ఆడపిల్ల కనపడితే చాలు ఈవ్‌టీజింగ్, వెకిలి నవ్వులు, అసభ్యప్రవర్తనలు, అవాకులు, చవాకులతో అమ్మాయిలు గడపదాటకుండా కట్టడి చేస్తున్నారు. దినదినగండం.. నూరేళ్ల ఆయుష్షును తలపిస్తున్నారు! వీళ్లంతా అన్నదమ్ములు, తాతతండ్రులే అయినప్పుడు.. నా సాక్షిగా ప్రతి ఇంటి ఆడపిల్లకు భద్రతనివ్వాలి కదా.. రక్షణగా నిలవాలి కదా! మరెందుకు ఇలా కాల్చుకు తింటున్నారు? అర్థమైంది.. అంటే నా అస్తిత్వంతో అమ్మాయిలంతా భద్రంగా ఉంటున్నారని అనుకున్నాను. ప్రతియేటా నా పుట్టిన రోజుకి నన్ను వాళ్ల సోదరుల చేతులకు కట్టి రక్షణను కానుకగా స్వీకరిస్తున్నారనే భ్రమలో ఉన్నాను. అసలు రక్షాబంధన్‌కు విలువే ఇవ్వట్లేదు ఇన్ని వాస్తవాలు సాక్ష్యాలుగా కనిపిస్తున్నాయి. నన్ను ఒక పండుగలా సంవత్సరానికి ఒక్కరోజుకు పరిమితం చేశారు. దాని స్ఫూర్తిని అవగతం చేసుకోలేదు. ఏడుపొస్తుంది నాకు.. ఇన్నాళ్లు ఎంత విర్రవీగాను.. ఈ మగాళ్లలాగే. నాదేదో అద్భుతమైన జన్మ అని.. లోకంలోని అమ్మాయి సంక్షేమం, శ్రేయస్సు కోసం కారణజన్మురాలిగా అవతరించానని గర్వపడ్డాను. ఇప్పుడు సిగ్గుపడుతున్నాను. అయినా నా ధర్మం మరిచిపోను. రక్షణ.. భద్రత స్వీయ బాధ్యత అని తెలిసొచ్చింది. అందుకే ఇప్పటి నుంచి నన్ను మీకు మీరే కట్టుకోండి అమ్మాయిలూ.. మీ భద్రత, మీ రక్షణను మీ చేతుల్లోనే పెట్టుకోండి. నాకు పవిత్రత కన్నా ప్రాక్టికాలిటీని ఆపాదించండి. సంత్సరానికి ఒక్కసారి కాదు... ప్రతిరోజును రాఖీపౌర్ణమిని చేసుకోండి. నేను మీ ముంజేతికున్న శక్తిని, యుక్తిని, ఆత్మవిశ్వాసాన్ని అని మరచిపోకండి. నిజమా? మరి ఇవేంటి? ‘‘పురాణాలను, చరిత్రను చూపించి నిన్ను నువ్వు భలే రొమాంటిసైజ్ చేసుకుంటున్నావ్.. బాగానే ఉంది. నీ ఉనికికి అది అవసరం కూడా! కాని వర్తమాన భారతం చూడు.. అక్క, చెల్లి, తల్లి, బిడ్డ పడుతున్న యాతన చూడు..’’ అంటారా? .. విశాఖపట్టణం జిల్లాలోని వాకపల్లిలో రక్షణనివ్వాల్సిన పోలీసులే ఆదివాసి ఆడబిడ్డల మీద లైంగిక దాడి చేశారు. వాళ్ల ఆత్మగౌరవాన్ని కించపరిచారు. దేశాన్ని కంటికిరెప్పలా కాపుకాయాల్సిన జవాన్లు కశ్మీరు ఆడపిల్లల మానాభిమానాల్ని మంటగలిపారు. తమకు జరిగిన అన్యాయాన్ని నోరెత్తి ఎక్కడా చెప్పుకోనివ్వకుండా చేశారు. పోలీసుల, జవాన్ల అహంకారం వాకపల్లికో.. కశ్మీర్‌కో పరిమితం కాలేదు.. దేశంలోని ఎనిమిది దిక్కులకూ వ్యాపించింది. అన్న.. తండ్రి.. జన్మనిచ్చిన తండ్రే కూతుళ్ల పాలిట భక్షకుడిగా మారుతుంటే జవాన్లను, పోలీస్‌లను అని ఏం లాభం? ఇదేదో పల్లెటూరులో జరిగిన దారుణం కాదు.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాజధాని.. హైదరాబాద్ నగరంలో బయటపడ్డ విషాదం! పన్నెండేళ్ల కూతురికి ఆత్మస్థయిర్యమై.. ఆమె వెనకాల నిలబడాల్సిన తండ్రి.. కన్న బిడ్డ అనే ఇంగితం కూడా మరచి ఆ పిల్లపట్ల పైశాచికంగా ప్రవర్తించాడు. మూడేళ్లపాటు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇంట్లో కూడా అమ్మాయిలకు రక్షణ లేదని నిరూపించాడు. ఇంకెక్కడో బిహార్‌లో.. అన్న తన చెల్లి పట్ల ఇలాంటి నిర్వాకమే వెలగబెట్టాడట. బయటి వాళ్ల నుంచి చెల్లికి అపాయం కలగకుండా చూడాల్సిన అన్నే చెల్లెలిని చెరిచాడు. ఆ తప్పును పెద్దవాళ్ల ముందు బయటపెడుతుందని చెల్లి గొంతు కోసేశాడు. భగవంతుడా.. ఇంకా ఏమేమి చూడాలి? ఎన్ని ఘోరాల గురించి వినాలి? కదిలే కార్లల్లో.. బస్సుల్లో.. నాలుగు గోడల కప్పు కింద.. కన్నవాళ్ల సంరక్షణలోనే భద్రత లేనప్పుడు వీధుల్లో.. నడి బజారుల్లో.. కదిలే కార్లల్లో.. బస్సుల్లో ఎక్కడిది? నిర్భయను కదిలే బస్సులోనే కబళించారట. భారత దేశం నా మాతృభూమి, భారతీయులంతా నా సహోదరులు.. అన్న ప్రతిజ్ఞను మరచి మరీ నిర్భయ జీవితాన్ని చెరిచారు. భవిష్యత్తు గురించి బంగారు కలలు కన్నది, ఏదో సాధించాలనే తపనతో ఉత్తరప్రదేశ్ నుంచి ఢిల్లీ వచ్చింది. తండ్రి ఉన్న ఆస్తి అంతా అమ్మి కూతురును ఫిజియోథెరపీలో చేర్పించాడు. మంచి ఫిజియోథెరపిస్ట్‌గా పేరు తెచ్చుకుంటుందని తల్లిదండ్రులు ఆశపడ్డారు. వాళ్ల కోరికను నెరవేర్చాలనే పట్టుదలతో చదువుతోంది. ఈ లోపే బస్సులో దుర్మార్గులు ఆమె కలలను కుళ్లబొడిచారు. బతుకును బుగ్గిపాలు చేశారు. ఇది జరిగిన కొద్దిరోజులకే అయిదేళ్ల గుడియా.. ఇంటిపక్క అన్నయ్య కోరికకు బలైంది దారుణంగా! ఇలాంటివి ప్రపంచానికి తెలిసినవి వందల్లో.. తెలియనివి వేలల్లో ఉన్నాయ్! అమ్మేస్తున్నారు... ఆడపిల్లను లక్ష్మీదేవిగా కొలవడం.. రాతలకు, మాటలకే పరిమితం. ఇప్పుడైతే అమ్మాయి పుడితే భారంగానే భావిస్తున్నారు. అందుకే వదిలించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కొందరు రైల్వేస్టేషన్లు, బస్‌స్టాండుల్లో, వీథుల్లో, చివరకు చెత్త కుప్పల దగ్గరా ఉట్టిగానే వదిలేసి వెళితే.. కొంతమంది అమ్మేసి కాసులు తీసుకుంటున్నారు. ఇది కన్నవాళ్లు మూటగట్టుకుంటున్న పాపమైతే.. ఇంకొంతమంది తమకూ కూతుళ్లు, అక్కాచెల్లెళ్లు ఉంటారు అని మరచి తమ ఇంటి ఆడపిల్ల కాకపోతే చాలు అనుకొని ఇంకే ఇంటి ఆడపిల్ల అమాయకంగా కనిపించినా మాయచేసి.. మోసంచేసి చేతులు మారుస్తున్నారు, ట్రాఫికింగ్‌తో క్యాష్ చేసుకుంటున్నారు. క్షమించలేని తప్పుకు పాల్పడుతున్నారు. -
భ్రూణ హత్యలు సిగ్గు చేటు
కడప సెవెన్‌రోడ్స్ : జిల్లా అన్ని రంగాల్లో ముందున్నప్పటికీ భ్రూణ హత్యలు చోటుచేసుకోవడం సిగ్గుచేటుగా భావించాలని కలెక్టర్ కేవీ సత్యనారాయణ అన్నారు. మంగళవారం కొత్త కలెక్టరేట్లో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ప్రతి వెయ్యి మంది బాలురకు 918 మంది బాలికలు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయన్నారు. ఈ వ్యత్యాసాన్ని సరిదిద్దేందుకే బేటీ బచావో–బేటీ పడావో కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. భ్రూణ హత్యల నివారణపై గ్రామాల్లో అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లా లీగల్ సెల్ అథారిటీ సెక్రటరీ ప్రసాద్ మాట్లాడుతూ భ్రూణ హత్యల నిషేధ చట్టంపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. డీఎస్పీ ఈజీ అశోక్‌కుమార్ మాట్లాడుతూ లింగ నిర్ధారణ చట్టాల అమలు కోసం పోలీసుశాఖ సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. వైద్య ఆరోగ్యశాఖ అదనపు అధికారి అరుణ సులోచన, ఐసీడీఎస్ ఏపీడీ ఆదిలక్ష్మి, డీఐఓ నాగరాజు, జిల్లా శిశు సంరక్షణ అధికారి శివప్రసాద్‌రెడ్డి, డీఎంహెచ్ఓ రామిరెడ్డి, డీఆర్డీఏ పీడీ అనిల్‌కుమార్, స్టెప్ సీఈఓ మమత తదితరులు పాల్గొన్నారు. -
‘భ్రూణ హత్యల నియంత్రణలో నిర్లక్ష్యం’
న్యూఢిల్లీ: ఆడ శిశువుల భ్రూణ హత్యలను అరికట్టడంలో కేంద్రప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై సుప్రీంకోర్టు విరుచుకుపడింది. చట్టాలను ప్రభుత్వం అమలు చేయకుండా విధికి వదిలేస్తోందని దుయ్యబట్టింది. లింగ నిర్ధరణ నిషేధ చట్టం అమలుకుతీసుకున్న చర్యలు, వాటి వల్ల వచ్చిన ఫలితాలు ఏమిటో నాలుగు వారాల్లో చెప్పాలని కేంద్రంతోపాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. దేశంలో ఆరేళ్లలోపు బాలబాలికల నిష్పత్తి తగ్గిపోతోందంటూ ఓ ఎన్జీవో దాఖలు చేసిన పిల్‌పై ఈ ఆదేశాలు జారీ చేసింది. 2011 సెన్సస్ ప్రకారం దేశంలో ప్రతి వెయ్యి మంది బాలురకు 914 మంది బాలికలే ఉన్నారు. వారిపై చర్యలెందుకు తీసుకోకూడదు? ఆయుధాలను అక్రమంగా అమ్ముతూ పట్టుబడి నామమాత్రపు జరిమానాతో బయటపడ్డ సైనికాధుకారులపై చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలని సుప్రీం కేంద్రాన్ని ఆదేశించింది