భ్రూణ హత్యలు సిగ్గు చేటు
కడప సెవెన్‌రోడ్స్ :
జిల్లా అన్ని రంగాల్లో ముందున్నప్పటికీ భ్రూణ హత్యలు చోటుచేసుకోవడం సిగ్గుచేటుగా భావించాలని కలెక్టర్ కేవీ సత్యనారాయణ అన్నారు. మంగళవారం కొత్త కలెక్టరేట్‌లో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ప్రతి వెయ్యి మంది బాలురకు 918 మంది బాలికలు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయన్నారు. ఈ వ్యత్యాసాన్ని సరిదిద్దేందుకే బేటీ బచావో–బేటీ పడావో కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు.
భ్రూణ హత్యల నివారణపై గ్రామాల్లో అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లా లీగల్ సెల్ అథారిటీ సెక్రటరీ ప్రసాద్ మాట్లాడుతూ భ్రూణ హత్యల నిషేధ చట్టంపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. డీఎస్పీ ఈజీ అశోక్‌కుమార్ మాట్లాడుతూ లింగ నిర్ధారణ చట్టాల అమలు కోసం పోలీసుశాఖ సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. వైద్య ఆరోగ్యశాఖ అదనపు అధికారి అరుణ సులోచన, ఐసీడీఎస్ ఏపీడీ ఆదిలక్ష్మి, డీఐఓ నాగరాజు, జిల్లా శిశు సంరక్షణ అధికారి శివప్రసాద్‌రెడ్డి, డీఎంహెచ్‌ఓ రామిరెడ్డి, డీఆర్‌డీఏ పీడీ అనిల్‌కుమార్, స్టెప్ సీఈఓ మమత తదితరులు పాల్గొన్నారు.