రాఖీ సాక్షిగా
మణికట్టుకు కడుతున్న రాఖీ ఎందుకివాళ బాధపడుతోంది? పువ్వులా వికసించే రాఖీ ఎందుకు వడలిపోయినట్టుగా అనిపిస్తోంది?
అసలు రాఖీకొచ్చిన బాధ ఏంటి?
కలుగుతున్న కష్టమేంటి?
రాఖీ కరువయ్యారా?
రక్షణ బరువయ్యిందా?
ఆగండాగండి!
ఇవాళ రాఖీ పండగ.
రాఖీ స్వగతం వింటే
సోదరులకే కాదు...
అక్కాచెల్లెళ్లకు కూడా కళ్ళు చెమరుస్తాయి.
ఆ అందమైన బంధాన్ని
మళ్లీ బలపరచాలన్న స్ఫూర్తి కలుగుతుంది..
రాఖీ... అంటే భారతీయుల పరిభాషలో రక్షణ. అంటే నేనే! అన్న, తమ్ముడు, కొన్నిచోట్ల నాన్నకు కూడా అక్క, చెల్లి, కూతురు నన్ను మణికట్టుకు కడతారు.. జీవితాంతం తమకు అండగా, రక్షగా ఉండమని! అందుకే ఈ వేడుక రక్షాబంధన్ అయింది. ఒకరకంగా ఇది నా పుట్టినరోజు. నాది నిన్నమొన్నటి జన్మ కాదు. పురాణకాలంలోనే పురుడు పోసుకున్నాను. ఎప్పుడు పుట్టానో చెప్పలేను కాని నాటి నుంచయితే ఉనికిలో ఉన్నా! నాకు గుర్తున్నంత వరకు నా పుట్టిన రోజులు.. మీలో చాలామందికి తెలిసినవి.. నెమరు వేసుకునేవి మరోమారు గుర్తు చేస్తా! ఇది ద్వాపర యుగం నాటిది.. ఓ రోజు... శ్రీ కృష్ణుడు చెరుకుగడను విరుచుకుంటుంటే దాని పేడు తగిలి వేలు కోసుకుపోయింది. జలజల రక్తం కారడం మొదలైంది. పక్కనే ఉన్న రుక్మిణి కంగారు పడి ఆ పక్కనే ఉన్న చెలికత్తెలను పురమాయించింది కట్టుకట్టడానికి గుడ్డ తెమ్మని. ఈ పక్కనే ఉన్న ద్రౌపది క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన కొంగు చించి శ్రీకృష్ణుడి వేలుకు గట్టిగా చుట్టి రక్తప్రవాహానికి అడ్డుకట్టవేసింది.
కృష్ణుడు ఆప్యాయంగా ద్రౌపది తల నిమిరి.. ‘‘చెల్లెమ్మా.. ఆపదకాలంలో నీకు రక్షణ గా నిలిచి నీ రుణం తీర్చుకుంటాను’’ అని మాట ఇచ్చాడు. దుశ్శాసనుడు నిండుసభలో ద్రౌపదిని అవమానించినప్పుడు ఆమె అభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడి ఇచ్చిన మాటను నెరవేర్చుకున్నాడు. ఇదీ రక్షాబంధనమే! ఇంకో జ్ఞాపకం కూడా చెప్తా.. ఒకసారి యమునా నది యమధర్మరాజు ముంజేతికి నన్ను కట్టింది. సంతోషపడిన యమధర్మరాజు ‘‘నీకు మరణం అనేది ఉండదు. నిత్యం పరవళ్లు తొక్కుతూ ఉంటావ్’ అని ఆశీర్వదించాడు. ‘‘నువ్వే కాదు రాఖీ కట్టిన ఏ సోదరైనా సోదరుల రక్షణలో చిరంజీవులుగా వర్థిల్లుతారు’’ అనే వరమూ ఇచ్చారు. అప్పుడు తెలిసింది నాకు నా శక్తేంటో!
చరిత్ర
సరే... ‘‘పైనవన్నీ యుగాలనాటివి.. పైగా పురాణాలంటున్నావు.. వాటిల్లో నిజమెంతో.. అబద్ధమెంతో?’’ అని ఫేస్ క్వశ్చన్‌మార్క్‌లా పెట్టారు? ఒకే అయితే చరిత్రలోని సంఘటనలే చెప్తాను. అలెగ్జాండర్ ది గ్రేట్ తెలుసు కదా? దండయాత్రలతో ప్రపంచాన్ని చుడుతూ మన దేశానికీ వచ్చాడు. ఇక్కడ పురుషోత్తముడు అనే చక్రవర్తి గొప్ప వీరుడు, మహా శూరుడు అని అలెగ్జాండర్‌తోపాటు అతని భార్య రుక్సానా కూడా విన్నది. అలాంటి పరాక్రమవంతుడు యుద్ధంలో తన భర్తను మట్టుపెట్టేస్తాడేమోనని భయపడింది. అప్పుడు నా గురించి తెలుసుకొని.. సేవకుడి ద్వారా పురుషోత్తముడి దగ్గరకు పంపింది.
నన్ను తన మణికట్టుకు ముడివేసుకొని తనను సోదరిగా స్వీకరించమని.. యుద్ధంలో అలెగ్జాండర్‌ను వధించకుండా వదిలేయమని విన్నవించుకుంది. అన్నట్టుగానే పురుషోత్తముడు యుద్ధంలో అలెగ్జాండర్‌ను వధించే అవకాశం వచ్చినా.. వదిలేసి రుక్సానాకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. దీనినే ఇంకోలా కూడా చెప్పుకుంటారు. పురుషోత్తముడి భార్య సంయుక్త అలెగ్జాండర్‌కు రాఖీ కట్టిందని, ఆమెను చెల్లిగా భావించిన అలెగ్జాండర్, పురుషోత్తముడికి ప్రాణభిక్ష పెట్టాడనీ కూడా చెబుతారు. కథ ఏదైతేనేం... నాకున్న పవర్ అదీ! నన్ను కట్టిన అక్క, చెల్లి ధనమాన, ప్రాణాలే కాదు సౌభాగ్యాన్నీ కాపాడతా. జీవితాంతం రక్షగా నిలుస్తా!
పరువుకోసం..
హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లో అట... తమ కులం కాని వాళ్లను ప్రేమించారని.. వాళ్లనే పెళ్లి చేసుకుంటామని పట్టుబట్టారనికడుపున పుట్టిన బిడ్డలని కూడా చూడకుండా నరికి పోగులు పెట్టారు. పదిమందిలో పరువు కోసం కన్నపిల్లల ప్రాణాలనే బలిపెట్టారు. వాళ్లనుకునే
పేరుప్రతిష్టలను నిలుపుకోవడం కోసం ఆ ఇళ్లల్లో ఆడపిల్లలను చంపడానికి ఇంటి పెద్ద సహా అన్నాతమ్ముళ్లు కూడా సిద్ధపడుతున్నారు.
భద్రతకు భావమే లేకుండా చేస్తున్నారు.
భ్రూణ హత్యలు
పుట్టాక అమ్మాయి మీద కక్షగట్టి చేస్తున్న నీచాలు ఒకెత్తయితే.. పుట్టకుండా చూసే పాతకం ఒకెత్తు. గర్భంలో ఉన్నది ఆడపిల్ల అని తెలిసిందంటే చాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లోనే కాదు పక్కరాష్ట్రమైన మహారాష్ట్రలాంటి చోట్ల కూడా అబార్షన్‌తో ఆ పిల్లకు పుట్టుకలేకుండా చేస్తున్నారు. ఒకవేళ పుట్టినా పురిట్లోనే గొంతునొక్కేస్తున్నారు.
ఇవన్నీ కాక.. ప్రతి అన్న, తమ్ముడు, మామయ్య, బాబాయ్, చివరకు తాతయ్య వయసు వృద్ధులు కూడా ఇంట్లోంచి బయటకు వెళితే చాలు.. పరాయి ఆడపిల్ల కనపడితే చాలు ఈవ్‌టీజింగ్, వెకిలి నవ్వులు, అసభ్యప్రవర్తనలు, అవాకులు, చవాకులతో అమ్మాయిలు గడపదాటకుండా కట్టడి చేస్తున్నారు. దినదినగండం.. నూరేళ్ల ఆయుష్షును తలపిస్తున్నారు! వీళ్లంతా అన్నదమ్ములు, తాతతండ్రులే అయినప్పుడు.. నా సాక్షిగా ప్రతి ఇంటి ఆడపిల్లకు భద్రతనివ్వాలి కదా.. రక్షణగా నిలవాలి కదా! మరెందుకు ఇలా కాల్చుకు తింటున్నారు?
అర్థమైంది.. అంటే నా అస్తిత్వంతో అమ్మాయిలంతా భద్రంగా ఉంటున్నారని అనుకున్నాను. ప్రతియేటా నా పుట్టిన రోజుకి నన్ను వాళ్ల సోదరుల చేతులకు కట్టి రక్షణను కానుకగా స్వీకరిస్తున్నారనే భ్రమలో ఉన్నాను. అసలు రక్షాబంధన్‌కు విలువే ఇవ్వట్లేదు ఇన్ని వాస్తవాలు సాక్ష్యాలుగా కనిపిస్తున్నాయి. నన్ను ఒక పండుగలా సంవత్సరానికి ఒక్కరోజుకు పరిమితం చేశారు. దాని స్ఫూర్తిని అవగతం చేసుకోలేదు. ఏడుపొస్తుంది నాకు.. ఇన్నాళ్లు ఎంత విర్రవీగాను.. ఈ మగాళ్లలాగే. నాదేదో అద్భుతమైన జన్మ అని.. లోకంలోని అమ్మాయి సంక్షేమం, శ్రేయస్సు కోసం కారణజన్మురాలిగా అవతరించానని గర్వపడ్డాను. ఇప్పుడు సిగ్గుపడుతున్నాను. అయినా నా ధర్మం మరిచిపోను. రక్షణ.. భద్రత స్వీయ బాధ్యత అని తెలిసొచ్చింది. అందుకే ఇప్పటి నుంచి నన్ను మీకు మీరే కట్టుకోండి అమ్మాయిలూ.. మీ భద్రత, మీ రక్షణను మీ చేతుల్లోనే పెట్టుకోండి. నాకు పవిత్రత కన్నా ప్రాక్టికాలిటీని ఆపాదించండి. సంత్సరానికి ఒక్కసారి కాదు... ప్రతిరోజును రాఖీపౌర్ణమిని చేసుకోండి. నేను మీ ముంజేతికున్న శక్తిని, యుక్తిని, ఆత్మవిశ్వాసాన్ని అని మరచిపోకండి.
నిజమా? మరి ఇవేంటి?
‘‘పురాణాలను, చరిత్రను చూపించి నిన్ను నువ్వు భలే రొమాంటిసైజ్ చేసుకుంటున్నావ్.. బాగానే ఉంది. నీ ఉనికికి అది అవసరం కూడా! కాని వర్తమాన భారతం చూడు.. అక్క, చెల్లి, తల్లి, బిడ్డ పడుతున్న యాతన చూడు..’’ అంటారా? .. విశాఖపట్టణం జిల్లాలోని వాకపల్లిలో రక్షణనివ్వాల్సిన పోలీసులే ఆదివాసి ఆడబిడ్డల మీద లైంగిక దాడి చేశారు. వాళ్ల ఆత్మగౌరవాన్ని కించపరిచారు. దేశాన్ని కంటికిరెప్పలా కాపుకాయాల్సిన జవాన్లు కశ్మీరు ఆడపిల్లల మానాభిమానాల్ని మంటగలిపారు. తమకు జరిగిన అన్యాయాన్ని నోరెత్తి ఎక్కడా చెప్పుకోనివ్వకుండా చేశారు. పోలీసుల, జవాన్ల అహంకారం వాకపల్లికో.. కశ్మీర్‌కో పరిమితం కాలేదు.. దేశంలోని ఎనిమిది దిక్కులకూ వ్యాపించింది.
అన్న.. తండ్రి..
జన్మనిచ్చిన తండ్రే కూతుళ్ల పాలిట భక్షకుడిగా మారుతుంటే జవాన్లను, పోలీస్‌లను అని ఏం లాభం? ఇదేదో పల్లెటూరులో జరిగిన దారుణం కాదు.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాజధాని.. హైదరాబాద్ నగరంలో బయటపడ్డ విషాదం! పన్నెండేళ్ల కూతురికి ఆత్మస్థయిర్యమై.. ఆమె వెనకాల నిలబడాల్సిన తండ్రి.. కన్న బిడ్డ అనే ఇంగితం కూడా మరచి ఆ పిల్లపట్ల పైశాచికంగా ప్రవర్తించాడు. మూడేళ్లపాటు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇంట్లో కూడా అమ్మాయిలకు రక్షణ లేదని నిరూపించాడు. ఇంకెక్కడో బిహార్‌లో.. అన్న తన చెల్లి పట్ల ఇలాంటి నిర్వాకమే వెలగబెట్టాడట. బయటి వాళ్ల నుంచి చెల్లికి అపాయం కలగకుండా చూడాల్సిన అన్నే చెల్లెలిని చెరిచాడు. ఆ తప్పును పెద్దవాళ్ల ముందు బయటపెడుతుందని చెల్లి గొంతు కోసేశాడు. భగవంతుడా.. ఇంకా ఏమేమి చూడాలి? ఎన్ని ఘోరాల గురించి వినాలి?
కదిలే కార్లల్లో.. బస్సుల్లో..
నాలుగు గోడల కప్పు కింద.. కన్నవాళ్ల సంరక్షణలోనే భద్రత లేనప్పుడు వీధుల్లో.. నడి బజారుల్లో.. కదిలే కార్లల్లో.. బస్సుల్లో ఎక్కడిది? నిర్భయను కదిలే బస్సులోనే కబళించారట. భారత దేశం నా మాతృభూమి, భారతీయులంతా నా సహోదరులు.. అన్న ప్రతిజ్ఞను మరచి మరీ నిర్భయ జీవితాన్ని చెరిచారు. భవిష్యత్తు గురించి బంగారు కలలు కన్నది, ఏదో సాధించాలనే తపనతో ఉత్తరప్రదేశ్ నుంచి ఢిల్లీ వచ్చింది. తండ్రి ఉన్న ఆస్తి అంతా అమ్మి కూతురును ఫిజియోథెరపీలో చేర్పించాడు. మంచి ఫిజియోథెరపిస్ట్‌గా పేరు తెచ్చుకుంటుందని తల్లిదండ్రులు ఆశపడ్డారు. వాళ్ల కోరికను నెరవేర్చాలనే పట్టుదలతో చదువుతోంది. ఈ లోపే బస్సులో దుర్మార్గులు ఆమె కలలను కుళ్లబొడిచారు. బతుకును బుగ్గిపాలు చేశారు. ఇది జరిగిన కొద్దిరోజులకే అయిదేళ్ల గుడియా.. ఇంటిపక్క అన్నయ్య కోరికకు బలైంది దారుణంగా! ఇలాంటివి ప్రపంచానికి తెలిసినవి వందల్లో.. తెలియనివి వేలల్లో ఉన్నాయ్!
అమ్మేస్తున్నారు...
ఆడపిల్లను లక్ష్మీదేవిగా కొలవడం.. రాతలకు, మాటలకే పరిమితం. ఇప్పుడైతే అమ్మాయి పుడితే భారంగానే భావిస్తున్నారు. అందుకే వదిలించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కొందరు రైల్వేస్టేషన్లు, బస్‌స్టాండుల్లో, వీథుల్లో, చివరకు చెత్త కుప్పల దగ్గరా ఉట్టిగానే వదిలేసి వెళితే.. కొంతమంది అమ్మేసి కాసులు తీసుకుంటున్నారు. ఇది కన్నవాళ్లు మూటగట్టుకుంటున్న పాపమైతే.. ఇంకొంతమంది తమకూ కూతుళ్లు, అక్కాచెల్లెళ్లు ఉంటారు అని మరచి తమ ఇంటి ఆడపిల్ల కాకపోతే చాలు అనుకొని ఇంకే ఇంటి ఆడపిల్ల అమాయకంగా కనిపించినా మాయచేసి.. మోసంచేసి చేతులు మారుస్తున్నారు, ట్రాఫికింగ్‌తో క్యాష్ చేసుకుంటున్నారు. క్షమించలేని తప్పుకు పాల్పడుతున్నారు.