పుడితే కదా బతికేది | It Is Never Necessary to Kill a Viable Fetus to Save the Womans Life | Sakshi
Sakshi News home page

పుడితే కదా బతికేది

Published Fri, Mar 8 2019 1:17 AM | Last Updated on Fri, Mar 8 2019 1:17 AM

It Is Never Necessary to Kill a Viable Fetus to Save the Womans Life - Sakshi

‘నేను పుట్టక ముందే నా మీద హత్యాయత్నం జరిగింది’ అని మొదలవుతుంది ఒక నవల. ఇవాళ దేశంలో పుడుతున్న చాలామంది ఆడపిల్లలు ఆ హత్యాయత్నాన్ని తప్పించుకుని భూమ్మీద పడ్డవారే. అమ్మయ్య అని ఊపిరిపీల్చుకున్నవారే. జన్మించాక రాజ్యాంగం చాలా హక్కులు ఇచ్చింది. కాని జన్మించే హక్కుకే ఆడపిల్లకు పెద్ద గండం వచ్చి పడుతోంది.2017–18 సంవత్సరంలో ఈ దేశం కోల్పోయిన ఆడ శిశువుల సంఖ్య దాదాపు 7 కోట్లు అని ఒక అంచనా. మొదటి కాన్పులో అబ్బాయి పుడితే, లేదా గర్భంలో ఉన్నది అబ్బాయి అని తేలితే తల్లిదండ్రులు సంతోషంగా ఆ గర్భాన్ని ఆహ్వానిస్తారు. తర్వాతి కాన్పులో అమ్మాయిని అంగీకరించే అవకాశం ఉంది.

కాని తొలి కాన్పులో అమ్మాయి ఉందని తేలి, గత సంవత్సం అటువంటి గర్భాల్ని రాల్చేసిన సంఖ్య దాదాపు రెండున్నర కోట్లు.టెక్నాలజీ మనిషికి మేలు చేస్తుందని అనుకుంటాము కానీ అది చేసే చెడు కూడా ఉంటుంది. స్కానింగ్‌ సెంటర్లు రాకపూర్వం గర్భంలో ఉన్న శిశువులకు వచ్చే సమస్యలను తెలుసుకోవడం, పిండ ఆరోగ్యాన్ని గమనించడం కష్టంగా ఉండేది. స్కానింగ్‌ సెంటర్లు వచ్చాక పిండ ఆరోగ్య ప్రాధాన్యం వెనక్కు వెళ్లి ఆ పిండం అబ్బాయా అమ్మాయా తేలడం ముఖ్యం అయిపోయింది. లింగ నిర్థారణ పరీక్ష ఫలితం విచక్షణ లేకుండా బయటపెట్టడం వల్ల దేశంలో కోట్లాది అబార్షన్లు జరిగాయి. అవన్నీ ఆడశిశువును వద్దనుకున్నవే.

దీనిని గమనించిన ప్రభుత్వం 1994లో ‘ప్రీ కన్సెప్షన్‌ ప్రీనాటల్‌ డయాగ్నస్టిక్‌ యాక్ట్‌’ (పిసిపిఎన్‌డిటి యాక్ట్‌) తీసుకు వచ్చింది. దీనిప్రకారం స్కానింగ్‌ సెంటర్లలో లింగ నిర్థారణ చేయడం నేరం. కాని ఈ చట్టం వచ్చాక కూడా పరిస్థితి పూర్తిగా మెరుగవలేదని సర్వేలు చెబుతున్నాయి. 2016 ‘సెక్స్‌ రేషియో ఎట్‌ బర్త్‌’ (ఎస్‌ఆర్‌బి) లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి 1000 మంది అబ్బాయిలకు ఉన్న అమ్మాయిల సంఖ్య 806. ఇది జాతీయ సగటు 877 కంటే తక్కువ. తెలంగాణలో ఈ సంఖ్య కొంత మెరుగ్గా 881గా ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు ‘సివిల్‌ రిజిస్ట్రేషన్‌ సిస్టమ్‌’ ప్రకారం 2016కు ప్రకటించుకున్న సంఖ్యలు ఆంధ్రప్రదేశ్‌ 947గా, తెలంగాణ 917గా ఉన్నాయి. 

ఎవరైనా కొనుక్కోవచ్చు.. ఎలాగైనా చేయొచ్చు..
పిఎన్‌డిటి చట్టం ప్రకారం ప్రభుత్వ ధ్రువీకరణ లేని స్కానింగ్‌ సెంటర్లు గర్భిణులకు పరీక్షలు చేయకూడదు. వారికి దొంగ గుర్తింపు కార్డులు ఇవ్వడం, వేరే పేరు నమోదు చేసి పరీక్షించడం ఇవన్నీ నేరం. ప్రతి రికార్డు నిక్షిప్తం చేయాలి. యంత్ర తయారీ సంస్థలు కూడా గుర్తింపు ఉన్న సంస్థలకే స్కానింగ్‌ మెషినరీని అమ్మాల్సి ఉంటుంది. కాని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చాలామంది అనుమతి లేని వ్యక్తులు ఈ స్కానింగ్‌ సామగ్రిని కొనుగోలు చేసుకుంటున్నారు. చిన్న చిన్న సెంటర్లు పెట్టి గుట్టు చప్పుడు కాకుండా పరీక్షలు నిర్వహిస్తున్నారు. కొన్నిచోట్ల ఆర్‌.ఎం.పి డాక్టర్లే తమ క్లినిక్‌లలో ఈ సామగ్రి పెట్టి పరీక్షలు చేసి పుట్టేది ఆడపిల్లో మగపిల్లాడో చెప్పేస్తున్నారు. మామూలు స్కానింగ్‌కు ఆరువందల రూపాయలు అయితే అమ్మాయో అబ్బాయో చెప్పడానికి మూడు వేల నుంచి ఆరువేల రూపాయలు తీసుకుంటున్నారు.

దీనిని నిరోధించే అజమాయిషీ బృందాలు జిల్లాల వారీగా లేకపోవడం ఒక కారణం. ఈ అజమాయిషీ బృందాల ఖర్చు కేంద్రం భరించి ఆ నిధులు విడుదల చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోవడం లేదు. పైగా పిఎన్‌డిటి చట్టాన్ని అధికారులు తమకు గిట్టని డాక్టర్ల మీద కక్ష సాధింపు కోసం ఉపయోగిస్తున్నారని కొన్ని పెద్ద హాస్పిటళ్ల అధినేత గుర్రుగా ఉన్నారు. చాలా తక్కువ చోట్ల మాత్రమే కేసులు నమోదు అవుతున్నాయి. ఇటీవల హైదరాబాద్‌ సమీపంలోని ఇబ్రహీం పట్నంలో లింగ్‌ నిర్థారణ చేస్తున్న ఒక సెంటర్‌పై పోలీసులు మారువేషంలో వెళ్లి దాడి చేసి ఆ సెంటర్‌ను మూయించారు. కాని ఇలా రెండు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలోనూ జరగడం లేదు. ఈ చట్టం వచ్చాక లింగ నిర్ధారణ చేసి పట్టుబడి శిక్ష అనుభవించిన డాక్టర్‌ ఒక్కరూ లేరని తెలిస్తే దీని అమలు ఎంత బలహీనంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఢిల్లీ మోడల్‌ బెస్ట్‌
ఢిల్లీలో లింగ నిర్ధారణ పరీక్షలు చేసి ఆడ శిశువుల మరణానికి కారణమవుతున్న స్కానింగ్‌ సెంటర్లపై అక్కడి ప్రభుత్వం పెద్ద ఎత్తున దాడికి దిగింది. అటువంటి సెంటర్ల గురించి కచ్చితమైన సమాచారం ఇచ్చిన వ్యక్తికి యాభై వేల రూపాయల బహుమతి ప్రకటించింది. అందుకు సహకరించి ‘స్టింగ్‌ ఆపరేషన్‌’ లో పాల్గొన్న నిజ గర్భిణీకి ఏకంకా లక్షన్నర రూపాయల కానుక ప్రకటించింది. ఉత్తరాదిలో ఆడ శిశువుల మరణం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో హర్యాణా, రాజస్తాన్, ఢిల్లీ ముందు వరుసలో ఉన్నాయి. దక్షిణాదిలో ఈ దురవస్థకు దూరంగా ఉన్న రాష్ట్రంగా కేరళ మార్కులు కొట్టేసింది. మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో పరిస్థితి అంతంత మాత్రమే.ప్రజలలో మార్పు, ప్రభుత్వాల పూనిక ఆడపిల్లను పుట్టనిస్తాయి. ఆడపిల్లను ఎదగనిస్తాయి. ఆడపిల్లను కన్నందుకు సమాజం గర్వపడేలా వారు నిరూపించుకోవడానికి అవకాశమిస్తాయి. అటువంటి దశవైపు మనం త్వరత్వరగా అడుగులు వేయాలని ఆశిద్దాం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement