కిరోసిన్‌కు ‘పొగ’
- ఈ నెల కోటాలో కోత
- జిల్లాకు ఇవ్వాల్సింది 1800 కిలోలీటర్లు.. ఇచ్చింది 1224 కిలోలీటర్లు
- దానినే చౌక దుకాణాలకు సర్దుబాటు చేసిన అధికారులు
- చివరిలో వచ్చే కార్డుదారులకు మొండిచేయే..
కాకినాడ సిటీ : చౌక దుకాణాల ద్వారా సబ్సిడీపై ఇస్తున్న కిరోసిన్‌కు ‘పొగ’ పెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. రేషన్ కార్డులపై ఇస్తున్న ఒకటి రెండు లీటర్ల కిరోసిన్‌ను రెండు మూడు నెలల్లో పూర్తిగా ఎత్తివేయాలని భావిస్తోంది. రాష్ట్రాన్ని పొగ రహితంగా ప్రకటించే ప్రయత్నంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు చెబుతున్నారు. ఇందులో భాగంగా ఈ నెలలో జిల్లాకు కిరోసిన్ కేటాయింపులను ఆలస్యం చేసింది. మామూలుగా ప్రతి నెలా 20వ తేదీలోగానే చౌకదుకాణాలకు తరువాతి నెల సరుకుల కేటాయింపులు పూర్తయ్యేవి. కానీ ఈ నెలలో కార్డుదారులకు సరుకుల పంపిణీ ప్రారంభించిన మూడు రోజులకు ప్రభుత్వం జిల్లాకు కిరోసిన్ కోటా కేటాయింపులు ఇచ్చింది. అది కూడా ఇవ్వాలిన కోటాలో కోత పెట్టింది.
జిల్లాలోని మొత్తం 2,647 చౌక దుకాణాల పరిధిలో అన్నపూర్ణ, అంత్యోదయ అన్న యోజన, తెల్ల కార్డుదారులు 16,11,494 మంది ఉన్నారు. జిల్లావ్యాప్తంగా కార్డుదారుల్లో వంటగ్యాస్ కనెక్షన్ లేనివారికి 2 లీటర్లు, ఉన్నవారికి ఒక లీటరు చొప్పున కిరోసిన్ ఇస్తున్నారు. దీని ప్రకారం జిల్లాకు 1800 కిలోలీటర్ల కిరోసిన్ కావాలి. కానీ ప్రభుత్వం కోత పెట్టడంతో 1224 కిలోలీటర్ల కిరోసిన్ మాత్రమే ఇంతవరకూ వచ్చింది.
అరకొర కేటాయింపులే..
చాలీచాలకుండా వచ్చిన ఆ కిరోసిన్‌ను సర్దుబాటు చేసేందుకు పౌర సరఫరాల అధికారులు తర్జనభర్జన పడ్డారు. చివరకు జిల్లాకు అరకొరగా వచ్చిన కిరోసిన్‌ను ఒక్కో చౌక దుకాణానికి 75 శాతం చొప్పున కేటాయించారు. దీని ప్రకారం హోల్‌సేల్ కిరోసిన్ డీలర్లు రేషన్ దుకాణాలకు సరుకు తరలిస్తున్నారు. ఇప్పటివరకూ సగంమంది రేషన్ డీలర్లకు మాత్రమే కిరోసిన్ అందించారు. మిగిలినవారికి పూర్తి స్థాయిలో ఇవ్వడానికే మరో రెండు రోజులు పడుతుందని చెబుతున్నారు. దీనినిబట్టి కార్డుదారులకు కిరోసిన్ చేరడానికి మరిన్ని రోజులు పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే 40 శాతం మంది కార్డుదారులు కిరోసిన్ లేకుండానే ఉన్న సరుకులు తీసుకుని వెళ్లిపోయారు. అరకొర కేటాయింపుల కారణంగా ముందుగా వచ్చేవారికి తప్ప చివరిలో వచ్చేవారికి కిరోసిన్ దొరకని పరిస్థితి ఏర్పడనున్నది.
భారమన్న ఉద్దేశంతోనే..
ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీని భారంగా భావిస్తున్న ప్రభుత్వం దానిని ఎలాగోలా వదిలించుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఇప్పటికే కేంద్రం చక్కెర సబ్సిడీని తొలగించడంతో రాష్ట్ర ప్రభుత్వం రేషన్ దుకాణాలకు ఈ నెల పంచదారను విడుదల చేయలేదు. గోదాంలలో ఉన్న అరకొర నిల్వలనే జిల్లా అధికారులు చౌక దుకాణాలకు సర్దుబాటు చేశారు. కిరోసిన్ విషయానికి వస్తే.. పట్టణ ప్రాంతాల్లోని కార్డుదారులకు గతంలో ఇస్తున్న 4 లీటర్ల కిరోసిన్‌ను గత నెల నుంచి 2 లీటర్లకు ప్రభుత్వం కుదించింది. తాజాగా ఈ నెల కేటాయింపుల్లోనే కోత పెట్టింది.
కిరోసిన్ పంపిణీ చేపట్టాం
జిల్లాలోని కార్డుదారులకు కిరోసిన్ పంపిణీ చేపట్టాం. కేటాయింపులు ఆలస్యం కావడంతో పంపిణీలో జాప్యం జరిగింది. గత నెల సీబీ, ఈ నెల కేటాయించిన కోటా కలుపుకుని చౌకదుకాణాలకు కిరోసిన్‌ను సర్దుబాటు చేశాం.