global financial system
-
‘అనిశ్చితి పరిస్థితులు ఉన్నప్పటికీ.. భారత్ తట్టుకుని నిలబడుతోంది’
న్యూఢిల్లీ: వృద్ధి, ద్రవ్యోల్బణం, కరెన్సీ అస్థిరతలకు సంబంధించి తాజా గణాంకాలు ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లు, ఆర్థిక వ్యవస్థను అధ్వాన్నంగా ఉన్నాయని సూచిస్తున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. ఎక్కువ కాలం అధిక వడ్డీ రేట్ల వ్యవస్థ కొనసాగే పరిస్థితులు కనిపిస్తున్నాయని కూడా పేర్కొన్నారు. ఫిక్స్డ్ ఇన్కమ్ మనీ మార్కెట్ అండ్ డెరివేటివ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఫిమ్డా), ప్రైమరీ డీలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (పీడీఏఐ) వార్షిక సమావేశం శుక్రవారం దుబాయ్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ► అంతర్జాతీయ అనిశ్చితి పరిస్థితులు ఉన్నప్పటికీ, ఈ ఒడిదుడుకులను భారత్ తట్టుకుని నిలబడగలుగుతోంది. ► దేశంలో ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు, కరెంట్ అకౌంట్‌లోటు వంటి స్థూల ఆర్థిక అంశాలు ఎకానమీ పటిష్టతను సూచిస్తున్నాయి. ► మన ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా, స్థిరంగా ఉంది. బ్యాంకులు, కార్పొరేట్లు సంక్షోభానికి ముందు కంటే మంచి ఫలితాలను సాధిస్తున్నాయి. బ్యాంక్ రుణం రెండంకెలలో పెరుగుతోంది. ఒక చీకటి ప్రపంచంలో మనం ఒక ప్రకాశవంతమైన ప్రదేశాన్ని చూస్తున్నాము. రిటైల్ ద్రవ్యోల్బణం నవంబర్, డిసెంబర్లలో అదుపులోనికి వచ్చింది. ► ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ అనిశ్చితితో ఉన్నప్పటికీ, ఆర్థిక మార్కెట్లు అస్థిరంగా ఉన్నప్పటికీ, భౌగోళిక రాజకీయ పరిస్థితి ఉద్రిక్తంగా కొనసాగుతున్నప్పటికీ మనం ఆశావాదంతో, విశ్వాసంతో వాటిని ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నాము. -
దేశం... ధనవంతుల భోజ్యం?
బలవంతుడిదే రాజ్యం అని లోకోక్తి. కానీ, ఇప్పుడు ధనవంతుడిదే రాజ్యం. ఈ సమకాలీన సామాజిక పరిస్థితి కళ్ళ ముందు కనిపిస్తున్నదే అయినా, తాజాగా లెక్కలతో సహా వెల్లడైంది. ప్రభుత్వేతర సంస్థ ‘ఆక్స్‌ఫామ్ ఇంటర్నేషనల్’ తన తాజా ప్రపంచ సంపద నివేదికలో ససాక్ష్యంగా కుండబద్దలు కొట్టింది. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సు తొలి రోజు సోమవారం ఆక్స్‌ఫామ్ విడుదల చేసిన ఈ నివేదికలోని అంశాలు ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. కరోనా కాలం నుంచి ప్రపంచమంతటా ఆర్థిక అంతరాలు బాగా పెరిగాయన్న వాదన అక్షరాలా నిజ మని రుజువు చేస్తున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమై, నిరుద్యోగం పెరిగిన వేళ ప్రపంచంలోనూ, భారత్‌లోనూ సంపద అంతా కొద్దిమంది చేతుల్లోనే పోగుపడుతుండడం ఆందోళనకరం. 2020 నుంచి కొత్తగా సమకూరిన 42 లక్షల డాలర్లలో మూడింట రెండు వంతుల సంపద ప్రపంచంలోని ఒకే ఒక్క శాతం అపర కుబేరుల గుప్పెట్లో ఉంది. మిగతా ప్రపంచ జనాభా సంపాదించిన సొమ్ముకు ఇది దాదాపు రెట్టింపు అనే నిజం విస్మయపరుస్తుంది. మన దేశానికొస్తే అగ్రశ్రేణి ఒక్క శాతం మహా సంపన్నుల చేతిలోనే 2012 నుంచి 2021 మధ్య జరిగిన సంపద సృష్టిలో 40 శాతానికి పైగా చేరింది. ఇక, దేశ జనాభాలో అడుగున ఉన్నవారిలో సగం మంది వాటా మొత్తం 3 శాతమే. కరోనా వేళ ధనికులు మరింత ధనవంతులయ్యారు. కరోనాకు ముందు భారత్‌లో 102 మంది బిలి యనీర్లుంటే, ఇప్పుడు వారి సంఖ్య 166కు పెరిగింది. కరోనా నుంచి గత నవంబర్‌కు దేశంలో శత కోటీశ్వరుల సంపద 121 శాతం పెరిగింది. మరోమాటలో నిమిషానికి 2.5 కోట్ల వంతున, రోజుకు రూ. 3,068 కోట్లు వారి జేబులో చేరింది. కనివిని ఎరుగని ఈ తేడాలు కళ్ళు తిరిగేలా చేస్తున్నాయి. అలాగే, సంపన్నుల కన్నా, పేద, మధ్యతరగతి వారిపైనే అధిక పన్ను భారం పడుతోందన్న మాట ఆగి, ఆలోచించాల్సిన విషయం. భారత్‌లో జీఎస్టీ ద్వారా వస్తున్న ఆదాయంలో 64 శాతం జనాభాలోని దిగువ సగం మంది నించి ప్రభుత్వం పిండుతున్నదే. అగ్రస్థానంలోని 10 శాతం ధనికుల ద్వారా వస్తున్నది 4 శాతమే అన్న మాట గమనార్హం. ఇవన్నీ సముద్రంలో నీటిబొట్లు. భారతదేశం శరవేగంతో కేవలం సంపన్నుల రాజ్యంగా రూపాంతరం చెందుతోందన్న అంచనా మరింత గుబులు రేపుతోంది. ధనికుల దేవిడీగా మారిన వ్యవస్థలో దళితులు, ఆదివాసీలు, ముస్లిమ్‌లు, మహిళలు, అసంఘటిత కార్మికుల లాంటి అణగారిన వర్గాల బాధలకు అంతమెక్కడ? అర్ధాకలితో అలమటిస్తున్నవారికీ, మధ్యతరగతికీ మెతుకు విదల్చడానికి సందేహిస్తున్న పాలకులు జేబు నిండిన జనానికి మాత్రం గత బడ్జెట్లోనూ కార్పొరేట్ పన్నుల్లో తగ్గింపు, పన్ను మినహాయింపులు, ఇతర ప్రోత్సాహకాలు ఇవ్వడం విడ్డూరం. ధనికులకు పన్ను రాయితీలిస్తే, వారి సంపద క్రమంగా దిగువవారికి అందుతుందనేది ఓ భావన. అది వట్టి భ్రమ అని ఆక్స్‌ఫామ్ తేల్చేసింది. కొద్దిరోజుల్లో కొత్త బడ్జెట్ రానున్న వేళ పెరుగుతున్న ఆర్థిక అంతరాన్ని చక్కదిద్దడానికి సంపద పన్ను విధించాలంటోంది. పేద, గొప్ప తేడాలు ఇప్పుడు ఎంతగా పెరిగాయంటే, భారత్‌లో అగ్రస్థానంలో నిలిచిన తొలి 10 మంది కుబేరులపై 5 శాతం పన్ను వేసినా చాలు. దాంతో దేశంలో పిల్లలందరినీ మళ్ళీ బడి బాట పట్టించవచ్చు. దేశంలోకెల్లా మహా సంపన్నుడైన గౌతమ్ అదానీ సంపద నిరుడు 2022లో 46 శాతం మేర పెరిగింది. దేశంలోని అగ్రశ్రేణి 100 మంది అపర కుబేరుల సమష్టి సంపద ఏకంగా 66 వేల కోట్ల డాలర్లకు చేరింది. అదానీ ఒక్కరికే 2017 – 2021 మధ్య చేకూరిన లబ్ధిపై 20 శాతం పన్ను వేస్తే, రూ. 1.79 లక్షల కోట్లు వస్తుంది. దాంతో దేశంలోని ప్రాథమిక పాఠశాల టీచర్లలో 50 లక్షల పైమందికి ఏడాదంతా ఉపాధినివ్వవచ్చని ఆక్స్‌ఫామ్ ఉవాచ. ఈ అంచనాలు తార్కికంగా బాగున్నా, ఆచరణాత్మకత, గత అనుభవాలను కూడా గమనించాలి. సంపద పన్ను సంగతే తీసుకుంటే, మనదేశంలో 1957లోనే దాన్ని ప్రవేశపెట్టారు. కానీ, భారీ ఎగవేతలతో లాభం లేకపోయింది. అసమానతలూ తగ్గలేదు. చివరకు, సంపద పన్ను వసూళ్ళతో పోలిస్తే, వాటి వసూలుకు అవుతున్న ఖర్చు ఎక్కువుందంటూ 2016–17 బడ్జెట్లో అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ దాన్ని ఎత్తేశారు. అందుకే, మళ్ళీ సంపద పన్ను విధింపు ఆలోచనపై సమగ్రంగా కసరత్తు అవసరం. పన్నుల వ్యవస్థలో మార్పులు తేవాలి. కాకుంటే, భారత్ లాంటి దేశంలో మధ్యతరగతిని పక్కనపెడితే, మహా సంపన్నులపై ఏ పన్ను వేసినా, అడ్డదోవలో దాన్ని తప్పించుకొనే పనిలో ఉంటారనేది కాదనలేని వాస్తవం. కాబట్టి, భారీ పన్నుల ప్రతిపాదన కన్నా దేశ సామాజిక – ఆర్థిక విధానంలో వారిని భాగం చేయడం లాంటి ఆలోచనలు చేయాలి. విద్య, వైద్యం, ప్రాథమిక వసతి సౌకర్యాల కల్పనల్లో ఈ కుబేరుల సంపదను పెట్టేలా చూడాలి. దారిద్య్ర నిర్మూలనకు కార్పొరేట్ అనుకూలత కన్నా సామాన్య ప్రజానుకూల విధానాలే శరణ్యం. స్త్రీ, పురుష వేతన వ్యత్యాసాన్నీ నివారించాలి. కార్పొరేట్ భారతావనిలో సీఈఓలు ఓ సగటు మధ్యశ్రేణి ఉద్యోగితో పోలిస్తే 241 రెట్ల (కరోనాకు ముందు ఇది 191 రెట్లు) ఎక్కువ జీతం సంపాదిస్తున్న వేళ... సత్వరం ఇలాంటి పలు దిద్దుబాటు చర్యలు అవసరం. గత 15 ఏళ్ళలో 41 కోట్లమందిని దారిద్య్ర రేఖకు ఎగువకు తెచ్చామని లెక్కలు చెప్పి, సంబరపడితే చాలదు. ఇప్పటికీ అధికశాతం పేదసాదలైన ఈ దేశంలో ఆర్థిక అంతరాలు సామాజిక సంక్షోభానికి దారి తీయక ముందే పాలకులు విధానపరమైన మార్పులు చేయడమే మార్గం. -
ఆర్థిక రంగంలో నూతన ఒరవడులు
గాంధీనగర్/సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రపంచ ఆర్థిక రంగంలో నూతన ఒరవడులను సృష్టించే దేశాల సరసన భారత్ నిలిచిందని ప్రధాని మోదీ చెప్పారు. ఈ ఘటన సాధించిన దేశ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచ అగ్రగామి ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన భారత్..ప్రస్తుత, భవిష్యత్ పాత్రను పోషించగల సంస్థలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. శుక్రవారం గాంధీనగర్ సమీపంలో ఇంటర్నేషనల్ ఫైనాన్స్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ(ఐఎఫ్ఎస్సీఏ) శంకుస్థాపన అనంతరం గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్(గిఫ్ట్)లో ప్రధాని ప్రసంగించారు. గిఫ్ట్ ఏర్పాటు ద్వారా అంతర్జాతీయ ఆర్థిక సేవల్లో భారత్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా జరిగే రియల్ టైం డిజిటల్ పేమెంట్స్‌లో భారత్ వాటా 40% వరకు ఉందన్నారు. విద్యార్థులు దేశ ప్రగతికి సారథులు నేటి విద్యార్థులు రేపటి దేశ ప్రగతికి సారథులుగా నిలవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. చెన్నై గిండిలోని అన్నా యూనివర్సిటీ 42వ స్నాతకోత్సవంలో ఆయన విశిష్ట అతిథిగా హాజరై ప్రసంగించారు. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి అధ్యక్షతన జరిగిన స్నాతకోత్సవంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గౌరవ అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని 69 మంది విద్యార్థులకు బంగారు పతకాలను ప్రదానం చేశారు. ప్రపంచం మొత్తం భారతీయ యువతను గమనిస్తోందని, వారే దేశాభివృద్ధిలో కీలకమన్నారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం ద్వారా అన్నా యూనివర్సిటీకి ప్రపంచ స్థాయి పేరు ప్రఖ్యాతులు లభించాయన్నారు. కరోనా కాలంలో దేశం ఎదుర్కొన్న అనేక సవాళ్లకు, విద్యావేత్తలు, వైద్య నిపుణులు, పారిశుద్ధ్య కార్మికులు, ప్రతి ఒక్కరి వల్లే పరిష్కారం లభించిందన్నారు. -
భారత్.. ఓ భాగ్య రేఖ
ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టీన్ లగార్డ్ వ్యాఖ్యలు.. ⇒ సంస్కరణల దిశగా చర్యలు భేష్... ⇒ అయితే వీటిని అమలు చేయడమే కీలకం ⇒ ప్రైవేటు రంగ పెట్టుబడుల పెంపుపై మరింత దృష్టిపెట్టాలి... ⇒ ఈ ఆర్థిక సంవత్సరం వృద్ది రేటు 7.2 శాతం, వచ్చే ఏడాది 7.5 శాతంగా అంచనా... న్యూఢిల్లీ: ఆనిశ్చితి, మందగమనంలో కొట్టుమిట్టాడుతున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ ఒక వెలుగు రేఖలా తళుక్కుమంటోందని అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) చీఫ్ క్రిస్టీన్ లగార్డ్ అభివర్ణించారు. సంస్కరణల విషయంలో భారత్ చేపడుతున్న చర్యలు భేషుగ్గా ఉన్నాయని.. అయితే, వీటిని అమలు చేయడమే అత్యంత కీలకమైన అంశమని పేర్కొన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం భారత్‌కు వచ్చిన ఆమె ఇక్కడి లేడీ శ్రీరామ్ కాలేజ్‌లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రైవేటు రంగంలో పెట్టుబడులకు ఊతమిచ్చేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని లగార్డ్ సూచించారు. సోమవారం ఆమె ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశమయ్యారు. సబ్సిడీల హేతుబద్దీకరణ, వస్తు సేవల పన్ను(జీఎస్టీ) వంటి ప్రధానమైన సంస్కరణల విషయంలో భారత ప్రభుత్వం చొరవను లగార్డ్ ప్రశంసించారు. ‘ఈ సంస్కరణలు సాహసోపేతమైనవి. వీటిని చిత్తశుద్ధితో విజయవంతంగా అమలు చేయాలి. వ్యాపారాలకు మెరుగైన వాతావరణం కల్పించేందుకు అవసరమైన కార్మిక సంస్కరణలు ప్రారంభస్థాయిలో ఉన్నాయి. ప్రైవేటు పెట్టుబడులు పెరిగేందుకు వీలుగా స్థిరమైన నియంత్రణ వ్యవస్థ కూడా అత్యవసరం. ఈ అంశాలన్నింటిపైనా ఇక్కడి విధాన నిర్ణేతలు దృష్టిపెడుతుండడం చూస్తే వీటిని అమలు చేయగలరన్న నమ్మకం కలుగుతోంది’ అని లగార్డ్ పేర్కొన్నారు. వృద్ధి జోరులో ప్రపంచంలోనే టాప్..! భారత్‌లో తాజా సంస్కరణల పురోగతితో వ్యాపార విశ్వాసం పుంజుకుంటోందని ఐఎంఎఫ్ చీఫ్ చెప్పారు. కొత్త స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) సిరీస్‌పై వ్యాఖ్యానిస్తూ... భారత్ ఆర్థిక వృద్ధి రేటు 2014-15 ఏడాదికి 7.2 శాతంగా ఉండొచ్చని.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 7.5 శాతానికి ఎగబాకవచ్చని అంచనా వేశారు. దీని ప్రకారం ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన వృద్ధిని సాధించే దేశంగా భారత్ నిలుస్తుందని కూడా ఆమె పేర్కొన్నారు. ప్రపంచంలో అనేక దేశాలు వృద్ధి తిరోగమనంతో ఆపసోపాలు పడుతుంటే.. భారత్ దీనికి పూర్తి భిన్నంగా దూసుకెళ్తోందన్నారు. బహుశా ఈ ఏడాది చైనా వృద్ధి రేటును కూడా అధిగమించవచ్చన్నది తమ అంచనా అన్నారు. బేస్ సంవత్సరాన్ని 2004-05 నుంచి 2011-12కు మార్చిన కేంద్ర ప్రభుత్వం తాజాగా కొత్త జీడీపీ గణాంకాలను విడుదల చేయడం తెలిసిందే. దీని ప్రకారం 2013-14 జీడీపీ వృద్ధి రేటును 4.7% నుంచి ఏకంగా 6.9 శాతానికి పెంచారు. ఈ ఏడాది వృద్ధి రేటు 7.4 శాతంగా ఉండొచ్చని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 8.5 శాతానికి దూసుకెళ్తుందని బడ్జెట్లో అంచనా వేయడం తెలిసిందే. బాలీవుడ్.. చికెన్ టిక్కా మసాలా.. యోగా..! విభిన్న రంగాల్లో భారతీయ నిపుణుల ప్రతిభను లగార్డ్ కొనియాడారు. ప్రపంచంలోనే అత్యంత చౌకైన విధానాలతో భారత్ సాధిస్తున్న విజయాలను ప్రస్తావించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ)లో అగ్రగామిగానే కాదు అత్యంత తక్కువ ఖర్చుతో మార్స్ మిషన్‌ను పూర్తిచేసి ప్రపంచ దేశాల్లో భారత్ తనదైన ఖ్యాతిని దక్కించుకుందన్నారు. ఈ సందర్భంగా భారత్‌కు సంబంధించిన కొన్ని ఆకట్టుకునే అంశాలను ప్రస్తావించారు. యోగా.. ఆయుర్వేదం... బాలీవుడ్.. చికెన్ టిక్కా మసాలా ఇలా అనేక ప్రత్యేకతలను ఇండియా ప్రపంచానికి పరిచయం చేసిందని పేర్కొన్నారు. జర్మనీ-జపాన్‌లను మించిపోతుంది... భారత్‌కు ఉజ్వలమైన భవిష్యత్తు కళ్లముందు కనబడుతోందని.. ఆర్థిక వ్యవస్థ 2009తో పోలిస్తే 2019 నాటికి రెట్టింపునకు పైగా ఎగబాకే అవకాశాలు ఉన్నాయని లగార్డ్ చెప్పారు. ప్రస్తుతం జీడీపీ విలువ దాదాపు 2 ట్రిలియన్ డాలర్లుగా అంచనా. దేశాల మధ్య కొనుగోలు శక్తి వ్యత్యాసాలను మినహాయించి చూస్తే.. భారత్ ఆర్థిక వ్యవస్థ 2019కల్లా జపాన్, జర్మనీల ఉమ్మడి ఆర్థిక వ్యవస్థను సైతం మించిపోనుందని చెప్పారు. అంతేకాకుండా... వర్ధమాన ఆర్థిక వ్యవస్థల్లో భారత్ తర్వాత స్థానాల్లో ఉన్న రష్యా, బ్రెజిల్, ఇండోనేసియాల మొత్తం జీడీపీ విలువను కూడా భారత్ అధిగమించే అవకాశం ఉందని లెక్కగట్టారు. ఇక 2030 నాటికి ప్రపంచంలోనే అత్యధిక జానాభాగల దేశంగా కూడా భారత్ అవతరించనుందని లగార్డ్ పేర్కొన్నారు. ఇంకా ఏమన్నారంటే.. ⇒ దిగొచ్చిన క్రూడ్ ధరలు ఇంధన సబ్సిడీల తగ్గుదలకు దోహదం చేస్తాయి. మధ్య తరగతి ప్రజల పొదుపు రేటు పెరగడానికి.. సబ్సిడీలను ప్రత్యక్షంగా నగదు రూపంలో అందించేందుకు వీలవుతుంది. ⇒ బాలికల కోసం ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన బేటీ బచావో.. బేటీ పడావో కార్యక్రమం ప్రశంసనీయం. మహిళల సామర్థ్యాన్ని వినియోగించుకొని ముందుకెళ్లే దిశగా భారత్ అడుగులు వేస్తోంది. ⇒ ఆర్థిక సంక్షోభం పోయి ఆరేళ్లయినా అంత ర్జాతీయ రికవరీ మందకొడిగానే ఉంది. ⇒ అమెరికాలో పటిష్ట వృద్ధి జరుగుతున్నా, ముడిచమురు ధరల నేలకు దిగొచ్చినా.. ప్రపంచ వృద్ధి రేటు పుంజుకోవడం లేదు.