ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టీన్ లగార్డ్ వ్యాఖ్యలు..
⇒ సంస్కరణల దిశగా చర్యలు భేష్...
⇒ అయితే వీటిని అమలు చేయడమే కీలకం
⇒ ప్రైవేటు రంగ పెట్టుబడుల పెంపుపై మరింత దృష్టిపెట్టాలి...
⇒ ఈ ఆర్థిక సంవత్సరం వృద్ది రేటు 7.2 శాతం, వచ్చే ఏడాది 7.5 శాతంగా అంచనా...
న్యూఢిల్లీ: ఆనిశ్చితి, మందగమనంలో కొట్టుమిట్టాడుతున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ ఒక వెలుగు రేఖలా తళుక్కుమంటోందని అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) చీఫ్ క్రిస్టీన్ లగార్డ్ అభివర్ణించారు. సంస్కరణల విషయంలో భారత్ చేపడుతున్న చర్యలు భేషుగ్గా ఉన్నాయని.. అయితే, వీటిని అమలు చేయడమే అత్యంత కీలకమైన అంశమని పేర్కొన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం భారత్‌కు వచ్చిన ఆమె ఇక్కడి లేడీ శ్రీరామ్ కాలేజ్‌లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రైవేటు రంగంలో పెట్టుబడులకు ఊతమిచ్చేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని లగార్డ్ సూచించారు. సోమవారం ఆమె ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశమయ్యారు.
సబ్సిడీల హేతుబద్దీకరణ, వస్తు సేవల పన్ను(జీఎస్‌టీ) వంటి ప్రధానమైన సంస్కరణల విషయంలో భారత ప్రభుత్వం చొరవను లగార్డ్ ప్రశంసించారు. ‘ఈ సంస్కరణలు సాహసోపేతమైనవి. వీటిని చిత్తశుద్ధితో విజయవంతంగా అమలు చేయాలి. వ్యాపారాలకు మెరుగైన వాతావరణం కల్పించేందుకు అవసరమైన కార్మిక సంస్కరణలు ప్రారంభస్థాయిలో ఉన్నాయి. ప్రైవేటు పెట్టుబడులు పెరిగేందుకు వీలుగా స్థిరమైన నియంత్రణ వ్యవస్థ కూడా అత్యవసరం. ఈ అంశాలన్నింటిపైనా ఇక్కడి విధాన నిర్ణేతలు దృష్టిపెడుతుండడం చూస్తే వీటిని అమలు చేయగలరన్న నమ్మకం కలుగుతోంది’ అని లగార్డ్ పేర్కొన్నారు.
వృద్ధి జోరులో ప్రపంచంలోనే టాప్..!
భారత్‌లో తాజా సంస్కరణల పురోగతితో వ్యాపార విశ్వాసం పుంజుకుంటోందని ఐఎంఎఫ్ చీఫ్ చెప్పారు. కొత్త స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) సిరీస్‌పై వ్యాఖ్యానిస్తూ... భారత్ ఆర్థిక వృద్ధి రేటు 2014-15 ఏడాదికి 7.2 శాతంగా ఉండొచ్చని.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 7.5 శాతానికి ఎగబాకవచ్చని అంచనా వేశారు. దీని ప్రకారం ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన వృద్ధిని సాధించే దేశంగా భారత్ నిలుస్తుందని కూడా ఆమె పేర్కొన్నారు.
ప్రపంచంలో అనేక దేశాలు వృద్ధి తిరోగమనంతో ఆపసోపాలు పడుతుంటే.. భారత్ దీనికి పూర్తి భిన్నంగా దూసుకెళ్తోందన్నారు. బహుశా ఈ ఏడాది చైనా వృద్ధి రేటును కూడా అధిగమించవచ్చన్నది తమ అంచనా అన్నారు. బేస్ సంవత్సరాన్ని 2004-05 నుంచి 2011-12కు మార్చిన కేంద్ర ప్రభుత్వం తాజాగా కొత్త జీడీపీ గణాంకాలను విడుదల చేయడం తెలిసిందే. దీని ప్రకారం 2013-14 జీడీపీ వృద్ధి రేటును 4.7% నుంచి ఏకంగా 6.9 శాతానికి పెంచారు. ఈ ఏడాది వృద్ధి రేటు 7.4 శాతంగా ఉండొచ్చని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 8.5 శాతానికి దూసుకెళ్తుందని బడ్జెట్లో అంచనా వేయడం తెలిసిందే.
బాలీవుడ్.. చికెన్ టిక్కా మసాలా.. యోగా..!
విభిన్న రంగాల్లో భారతీయ నిపుణుల ప్రతిభను లగార్డ్ కొనియాడారు. ప్రపంచంలోనే అత్యంత చౌకైన విధానాలతో భారత్ సాధిస్తున్న విజయాలను ప్రస్తావించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ)లో అగ్రగామిగానే కాదు అత్యంత తక్కువ ఖర్చుతో మార్స్ మిషన్‌ను పూర్తిచేసి ప్రపంచ దేశాల్లో భారత్ తనదైన ఖ్యాతిని దక్కించుకుందన్నారు. ఈ సందర్భంగా భారత్‌కు సంబంధించిన కొన్ని ఆకట్టుకునే అంశాలను ప్రస్తావించారు. యోగా.. ఆయుర్వేదం... బాలీవుడ్.. చికెన్ టిక్కా మసాలా ఇలా అనేక ప్రత్యేకతలను ఇండియా ప్రపంచానికి పరిచయం చేసిందని పేర్కొన్నారు.
జర్మనీ-జపాన్‌లను మించిపోతుంది...
భారత్‌కు ఉజ్వలమైన భవిష్యత్తు కళ్లముందు కనబడుతోందని.. ఆర్థిక వ్యవస్థ 2009తో పోలిస్తే 2019 నాటికి రెట్టింపునకు పైగా ఎగబాకే అవకాశాలు ఉన్నాయని లగార్డ్ చెప్పారు. ప్రస్తుతం జీడీపీ విలువ దాదాపు 2 ట్రిలియన్ డాలర్లుగా అంచనా. దేశాల మధ్య కొనుగోలు శక్తి వ్యత్యాసాలను మినహాయించి చూస్తే.. భారత్ ఆర్థిక వ్యవస్థ 2019కల్లా జపాన్, జర్మనీల ఉమ్మడి ఆర్థిక వ్యవస్థను సైతం మించిపోనుందని చెప్పారు. అంతేకాకుండా... వర్ధమాన ఆర్థిక వ్యవస్థల్లో భారత్ తర్వాత స్థానాల్లో ఉన్న రష్యా, బ్రెజిల్, ఇండోనేసియాల మొత్తం జీడీపీ విలువను కూడా భారత్ అధిగమించే అవకాశం ఉందని లెక్కగట్టారు. ఇక 2030 నాటికి ప్రపంచంలోనే అత్యధిక జానాభాగల దేశంగా కూడా భారత్ అవతరించనుందని లగార్డ్ పేర్కొన్నారు. ఇంకా ఏమన్నారంటే..
⇒ దిగొచ్చిన క్రూడ్ ధరలు ఇంధన సబ్సిడీల తగ్గుదలకు దోహదం చేస్తాయి. మధ్య తరగతి ప్రజల పొదుపు రేటు పెరగడానికి.. సబ్సిడీలను ప్రత్యక్షంగా నగదు రూపంలో అందించేందుకు వీలవుతుంది.
⇒ బాలికల కోసం ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన బేటీ బచావో.. బేటీ పడావో కార్యక్రమం ప్రశంసనీయం. మహిళల సామర్థ్యాన్ని వినియోగించుకొని ముందుకెళ్లే దిశగా భారత్ అడుగులు వేస్తోంది.
⇒ ఆర్థిక సంక్షోభం పోయి ఆరేళ్లయినా అంత ర్జాతీయ రికవరీ మందకొడిగానే ఉంది.
⇒ అమెరికాలో పటిష్ట వృద్ధి జరుగుతున్నా, ముడిచమురు ధరల నేలకు దిగొచ్చినా.. ప్రపంచ వృద్ధి రేటు పుంజుకోవడం లేదు.
భారత్.. ఓ భాగ్య రేఖ
Published Tue, Mar 17 2015 2:22 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM
Advertisement