IMF chief Christine lagarde
-
ఐఎంఎఫ్ చీఫ్ ఎకానమిస్ట్‌గా గీతా గోపినాథ్
మరో భారతీయ సంతతి మహిళకు అపూర్వ గౌరవం దక్కింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ(ఐఎంఎఫ్)కు చీఫ్ ఎకానమిస్ట్‌గా భారతీయర సంతతి మహిళ గీతా గోపినాథ్ నియమితులయ్యారు. ఐఎంఎఫ్ రీసెర్చ్ డిపార్ట్మెంట్ ఎకానమిక్ కౌన్సిలర్‌గా, డైరెక్టర్‌గా గీతా గోపినాథ్‌ను నియమిస్తున్నట్టు ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టియానే లగార్డే ప్రకటించారు. మౌరైస్(మౌరి) అబ్స్ట్ఫెల్డ్ ఈ ఏడాది చివరిన పదవి విరమణ చేయనుండటంతో, ఆ స్థానంలో గీతా గోపినాథ్‌ను నియమిస్తూ ఐఎంఎఫ్ నిర్ణయం తీసుకుంది. గీతా గోపినాథ్ ప్రస్తుతం హార్వర్డ్ యూనివర్సిటీలో ఎకానమిక్స్కు, ఇంటర్నేషనల్ స్టడీస్‌లో జాన్ జవాన్స్ట్రా ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ‘గీత ప్రపంచంలో ఉన్న అత్యుత్తమ ఆర్థికవేత్తల్లో ఒకరు. మంచి విద్యా ప్రావీణ్యముంది. నాయకత్వ బాధ్యతల్లో మంచి ట్రాక్ రికార్డును సొంతం చేసుకున్నారు. విస్తృతమైన అంతర్జాతీయ అనుభవముంది’ అని లగార్డే అన్నారు. ఆమె అసాధారణమైన ప్రతిభను గుర్తించి, తమ చీఫ్ ఎకానమిస్ట్‌గా గీతను నియమించాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. గీత అమెరికన్ ఎకానమిక్ రివ్యూకి కో-ఎడిటర్‌గా కూడా ఉన్నారు. నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకానమిక్ రీసెర్చ్‌లో మాక్రో ఎకానమిక్స్ ప్రొగ్రామ్‌కు, ఇంటర్నేషనల్ ఫైనాన్స్‌కు కో-డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఎక్స్చేంజ్ రేట్లు, వాణిజ్యం, అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం, ద్రవ్య పరపతి విధానం, రుణాలు, అభివృద్ధి చెందుతున్న మార్కెట్ సంక్షోభాలు వంటి అంశాలపై 40 పరిశోధన ఆర్టికల్స్‌కు గీతనే రచయిత. గీతా గోపినాథ్ గురించి... గీత భారత్‌లో పుట్టి పెరిగారు. ఆమెకు అమెరికా పౌరసత్వం ఉంది. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బీఏ డిగ్రీ పొందారు. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకానమిక్స్, యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ నుంచి ఎంఏ డిగ్రీలు పొందారు. ఆ అనంతరం 2001లో ప్రిన్స్‌స్టన్ యూనివర్సిటీలో ఎకానమిక్స్‌లో పీహెచ్డీ చేశారు. అదే ఏడాది యూనివర్సిటీ ఆఫ్ చికాగాలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరారు. 2005లో హార్వర్డ్‌కు వెళ్లారు. -
భారత మహిళకు భద్రత చాలా అవసరం
వాషింగ్టన్: కశ్మీర్‌లోని కఠువాలో బాలికపై హత్యాచార ఘటనను అంతర్జాతీయ ద్రవ్యనిధి చీఫ్ క్రిస్టీన్ లగార్డ్ దురదృష్టకరంగా అభివర్ణించారు. దీన్ని నిరసిస్తూ భారత్‌లో జరుగుతున్న నిరసనలపై స్పందిస్తూ ‘భారత్‌తో జరుగుతున్న ఆందోళనలు ప్రతిఘటనకు సూచన. భారత అధికారులు, ప్రధాని మోదీ దీనిపై దృష్టి సారిస్తారని భావిస్తున్నాను. భారత మహిళకు భద్రత చాలా అవసరం’ అని ఆమె అన్నారు. భారత్‌లో కొనసాగుతున్న సంస్కరణ జోరు వచ్చే ఎన్నికల సంవత్సరంలో కొనసాగటం కష్టమేనని తెలిపారు. ‘భారత్‌లో ప్రస్తుతం జరుగుతున్న ఆర్థిక సంస్కరణ వేగం వచ్చే కొద్ది నెలల్లో ఇలాగే కొనసాగుతుం దని చెప్పలేం. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ సంస్కరణలు తగ్గుతాయి’ అని గురువారం అంతర్జాతీయ ఆర్థిక సంస్థలతో జరిగిన సమావేశంలో ఆమె తెలిపారు. జీఎస్టీ, దివాళా చట్టం వంటివి చాలా గొప్ప సంస్కరణలని ఆమె ప్రశంసించారు. -
అనిశ్చిత ప్రపంచంలో ‘వెలుగు’ భారత్..!
వాషింగ్టన్: నెమ్మదించిన ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ ఒక వెలుగురేఖగా అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) చీఫ్ క్రిస్టినా లగార్డ్ అభివర్ణించారు. వాషింగ్టన్లో చేసిన ఒక ప్రసంగంలో ఆమె ఈ వ్యాఖ్య చేశారు. ప్రపంచంలో పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు తీవ్ర అనిశ్చితిలో చిక్కుకున్నట్లు పేర్కొన్నారు. అమెరికా వడ్డీరేట్ల పెంపు అవకాశాలు, చైనాలో బలహీనతలు అనిశ్చితికి కారణమవుతున్నాయని, తీవ్ర మార్కెట్ ఒడిదుడుకులకు దారితీస్తున్నాయని ఆమె అన్నారు. ఇంకా ఏమన్నారంటే... ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 2015లో మందగమనంలోనే కొనసాగుతుంది. వచ్చే ఏడాది కొంత పుంజుకోవచ్చు. ఎగుమతుల ఆధారిత ఆర్థిక వ్యవస్థ చైనా వృద్ధి మందగమనంలోకి జారిపోతోంది. ఆర్థిక వ్యవస్థలో సంస్కరణలు తెస్తుండడం చైనాకు సంబంధించి ఆహ్వానించదగిన పరిణామం. ఆదాయాల పెంపునకు, ప్రజల జీవన ప్రమాణాల మెరుగు దిశలో ఈ చర్యలు దోహదపడతాయని భావిస్తున్నాం. వెరసి దీర్ఘకాలంలో వృద్ధి పురోగతికి దోహదపడే వీలుంది. క రష్యా, బ్రెజిల్ వంటి ఆర్థిక వ్యవస్థలు సైతం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. లాటిన్ అమెరికాలోని పలు దేశాలు వేగంగా ఆర్థిక మందగమనంలోకి జారిపోతున్నాయి. చిన్న స్థాయి ఆదాయ దేశాలపై కూడా ప్రతికూల ప్రభావాలు పెరుగుతున్నాయి. ఆయా అంశాలన్నీ అంతర్జాతీయ ఆర్ధిక పరిస్థితులను తీవ్రంగా బలహీనపరుస్తున్నాయి. ఫైనాన్షియల్ స్థిరత్వం ఇప్పటికిప్పుడు జరుగుతుందన్న భరోసా లేదు. కొంతలో కొంత ఆశావహ అంశం ఏమిటంటే- అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు స్వల్పంగా కోలుకుంటున్న సంకేతాలు కనిపిస్తుండడం. యూరో ప్రాంతం, జపాన్ సానుకూల వృద్ధిలోకి మారుతున్నాయి. అమెరికా, బ్రిటన్లలో కూడా పరిస్థితి మెరుగుపడుతోంది. అంతర్జాతీయ మందగమనం, కమోడిటీ ధరల క్షీణత వంటి అంశాల కారణంగా ప్రపంచ వాణిజ్య వృద్ధి పడిపోతోంది. క్రూడ్ ధరలు పడిపోతుండడం వనరుల ఆధారిత ఆర్థిక వ్యవస్థలకు ఇబ్బందిగా మారింది. -
భారత్.. ఓ భాగ్య రేఖ
ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టీన్ లగార్డ్ వ్యాఖ్యలు.. ⇒ సంస్కరణల దిశగా చర్యలు భేష్... ⇒ అయితే వీటిని అమలు చేయడమే కీలకం ⇒ ప్రైవేటు రంగ పెట్టుబడుల పెంపుపై మరింత దృష్టిపెట్టాలి... ⇒ ఈ ఆర్థిక సంవత్సరం వృద్ది రేటు 7.2 శాతం, వచ్చే ఏడాది 7.5 శాతంగా అంచనా... న్యూఢిల్లీ: ఆనిశ్చితి, మందగమనంలో కొట్టుమిట్టాడుతున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ ఒక వెలుగు రేఖలా తళుక్కుమంటోందని అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) చీఫ్ క్రిస్టీన్ లగార్డ్ అభివర్ణించారు. సంస్కరణల విషయంలో భారత్ చేపడుతున్న చర్యలు భేషుగ్గా ఉన్నాయని.. అయితే, వీటిని అమలు చేయడమే అత్యంత కీలకమైన అంశమని పేర్కొన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం భారత్‌కు వచ్చిన ఆమె ఇక్కడి లేడీ శ్రీరామ్ కాలేజ్‌లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రైవేటు రంగంలో పెట్టుబడులకు ఊతమిచ్చేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని లగార్డ్ సూచించారు. సోమవారం ఆమె ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశమయ్యారు. సబ్సిడీల హేతుబద్దీకరణ, వస్తు సేవల పన్ను(జీఎస్టీ) వంటి ప్రధానమైన సంస్కరణల విషయంలో భారత ప్రభుత్వం చొరవను లగార్డ్ ప్రశంసించారు. ‘ఈ సంస్కరణలు సాహసోపేతమైనవి. వీటిని చిత్తశుద్ధితో విజయవంతంగా అమలు చేయాలి. వ్యాపారాలకు మెరుగైన వాతావరణం కల్పించేందుకు అవసరమైన కార్మిక సంస్కరణలు ప్రారంభస్థాయిలో ఉన్నాయి. ప్రైవేటు పెట్టుబడులు పెరిగేందుకు వీలుగా స్థిరమైన నియంత్రణ వ్యవస్థ కూడా అత్యవసరం. ఈ అంశాలన్నింటిపైనా ఇక్కడి విధాన నిర్ణేతలు దృష్టిపెడుతుండడం చూస్తే వీటిని అమలు చేయగలరన్న నమ్మకం కలుగుతోంది’ అని లగార్డ్ పేర్కొన్నారు. వృద్ధి జోరులో ప్రపంచంలోనే టాప్..! భారత్‌లో తాజా సంస్కరణల పురోగతితో వ్యాపార విశ్వాసం పుంజుకుంటోందని ఐఎంఎఫ్ చీఫ్ చెప్పారు. కొత్త స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) సిరీస్‌పై వ్యాఖ్యానిస్తూ... భారత్ ఆర్థిక వృద్ధి రేటు 2014-15 ఏడాదికి 7.2 శాతంగా ఉండొచ్చని.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 7.5 శాతానికి ఎగబాకవచ్చని అంచనా వేశారు. దీని ప్రకారం ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన వృద్ధిని సాధించే దేశంగా భారత్ నిలుస్తుందని కూడా ఆమె పేర్కొన్నారు. ప్రపంచంలో అనేక దేశాలు వృద్ధి తిరోగమనంతో ఆపసోపాలు పడుతుంటే.. భారత్ దీనికి పూర్తి భిన్నంగా దూసుకెళ్తోందన్నారు. బహుశా ఈ ఏడాది చైనా వృద్ధి రేటును కూడా అధిగమించవచ్చన్నది తమ అంచనా అన్నారు. బేస్ సంవత్సరాన్ని 2004-05 నుంచి 2011-12కు మార్చిన కేంద్ర ప్రభుత్వం తాజాగా కొత్త జీడీపీ గణాంకాలను విడుదల చేయడం తెలిసిందే. దీని ప్రకారం 2013-14 జీడీపీ వృద్ధి రేటును 4.7% నుంచి ఏకంగా 6.9 శాతానికి పెంచారు. ఈ ఏడాది వృద్ధి రేటు 7.4 శాతంగా ఉండొచ్చని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 8.5 శాతానికి దూసుకెళ్తుందని బడ్జెట్లో అంచనా వేయడం తెలిసిందే. బాలీవుడ్.. చికెన్ టిక్కా మసాలా.. యోగా..! విభిన్న రంగాల్లో భారతీయ నిపుణుల ప్రతిభను లగార్డ్ కొనియాడారు. ప్రపంచంలోనే అత్యంత చౌకైన విధానాలతో భారత్ సాధిస్తున్న విజయాలను ప్రస్తావించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ)లో అగ్రగామిగానే కాదు అత్యంత తక్కువ ఖర్చుతో మార్స్ మిషన్‌ను పూర్తిచేసి ప్రపంచ దేశాల్లో భారత్ తనదైన ఖ్యాతిని దక్కించుకుందన్నారు. ఈ సందర్భంగా భారత్‌కు సంబంధించిన కొన్ని ఆకట్టుకునే అంశాలను ప్రస్తావించారు. యోగా.. ఆయుర్వేదం... బాలీవుడ్.. చికెన్ టిక్కా మసాలా ఇలా అనేక ప్రత్యేకతలను ఇండియా ప్రపంచానికి పరిచయం చేసిందని పేర్కొన్నారు. జర్మనీ-జపాన్‌లను మించిపోతుంది... భారత్‌కు ఉజ్వలమైన భవిష్యత్తు కళ్లముందు కనబడుతోందని.. ఆర్థిక వ్యవస్థ 2009తో పోలిస్తే 2019 నాటికి రెట్టింపునకు పైగా ఎగబాకే అవకాశాలు ఉన్నాయని లగార్డ్ చెప్పారు. ప్రస్తుతం జీడీపీ విలువ దాదాపు 2 ట్రిలియన్ డాలర్లుగా అంచనా. దేశాల మధ్య కొనుగోలు శక్తి వ్యత్యాసాలను మినహాయించి చూస్తే.. భారత్ ఆర్థిక వ్యవస్థ 2019కల్లా జపాన్, జర్మనీల ఉమ్మడి ఆర్థిక వ్యవస్థను సైతం మించిపోనుందని చెప్పారు. అంతేకాకుండా... వర్ధమాన ఆర్థిక వ్యవస్థల్లో భారత్ తర్వాత స్థానాల్లో ఉన్న రష్యా, బ్రెజిల్, ఇండోనేసియాల మొత్తం జీడీపీ విలువను కూడా భారత్ అధిగమించే అవకాశం ఉందని లెక్కగట్టారు. ఇక 2030 నాటికి ప్రపంచంలోనే అత్యధిక జానాభాగల దేశంగా కూడా భారత్ అవతరించనుందని లగార్డ్ పేర్కొన్నారు. ఇంకా ఏమన్నారంటే.. ⇒ దిగొచ్చిన క్రూడ్ ధరలు ఇంధన సబ్సిడీల తగ్గుదలకు దోహదం చేస్తాయి. మధ్య తరగతి ప్రజల పొదుపు రేటు పెరగడానికి.. సబ్సిడీలను ప్రత్యక్షంగా నగదు రూపంలో అందించేందుకు వీలవుతుంది. ⇒ బాలికల కోసం ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన బేటీ బచావో.. బేటీ పడావో కార్యక్రమం ప్రశంసనీయం. మహిళల సామర్థ్యాన్ని వినియోగించుకొని ముందుకెళ్లే దిశగా భారత్ అడుగులు వేస్తోంది. ⇒ ఆర్థిక సంక్షోభం పోయి ఆరేళ్లయినా అంత ర్జాతీయ రికవరీ మందకొడిగానే ఉంది. ⇒ అమెరికాలో పటిష్ట వృద్ధి జరుగుతున్నా, ముడిచమురు ధరల నేలకు దిగొచ్చినా.. ప్రపంచ వృద్ధి రేటు పుంజుకోవడం లేదు.