ఐఎంఎఫ్ చీప్ ఎకానమిస్ట్ గీతా గోపినాథ్
మరో భారతీయ సంతతి మహిళకు అపూర్వ గౌరవం దక్కింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ(ఐఎంఎఫ్)కు చీఫ్ ఎకానమిస్ట్‌గా భారతీయర సంతతి మహిళ గీతా గోపినాథ్ నియమితులయ్యారు. ఐఎంఎఫ్ రీసెర్చ్ డిపార్ట్‌మెంట్ ఎకానమిక్ కౌన్సిలర్‌గా, డైరెక్టర్‌గా గీతా గోపినాథ్‌ను నియమిస్తున్నట్టు ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టియానే లగార్డే ప్రకటించారు. మౌరైస్(మౌరి) అబ్స్ట్‌ఫెల్డ్ ఈ ఏడాది చివరిన పదవి విరమణ చేయనుండటంతో, ఆ స్థానంలో గీతా గోపినాథ్‌ను నియమిస్తూ ఐఎంఎఫ్ నిర్ణయం తీసుకుంది. గీతా గోపినాథ్ ప్రస్తుతం హార్వర్డ్ యూనివర్సిటీలో ఎకానమిక్స్‌కు, ఇంటర్నేషనల్ స్టడీస్‌లో జాన్ జవాన్స్ట్రా ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
‘గీత ప్రపంచంలో ఉన్న అత్యుత్తమ ఆర్థికవేత్తల్లో ఒకరు. మంచి విద్యా ప్రావీణ్యముంది. నాయకత్వ బాధ్యతల్లో మంచి ట్రాక్ రికార్డును సొంతం చేసుకున్నారు. విస్తృతమైన అంతర్జాతీయ అనుభవముంది’ అని లగార్డే అన్నారు. ఆమె అసాధారణమైన ప్రతిభను గుర్తించి, తమ చీఫ్ ఎకానమిస్ట్‌గా గీతను నియమించాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. గీత అమెరికన్ ఎకానమిక్ రివ్యూకి కో-ఎడిటర్‌గా కూడా ఉన్నారు. నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకానమిక్ రీసెర్చ్‌లో మాక్రో ఎకానమిక్స్ ప్రొగ్రామ్‌కు, ఇంటర్నేషనల్ ఫైనాన్స్‌కు కో-డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఎక్స్చేంజ్ రేట్లు, వాణిజ్యం, అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం, ద్రవ్య పరపతి విధానం, రుణాలు, అభివృద్ధి చెందుతున్న మార్కెట్ సంక్షోభాలు వంటి అంశాలపై 40 పరిశోధన ఆర్టికల్స్‌కు గీతనే రచయిత.
గీతా గోపినాథ్ గురించి...
గీత భారత్‌లో పుట్టి పెరిగారు. ఆమెకు అమెరికా పౌరసత్వం ఉంది. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బీఏ డిగ్రీ పొందారు. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకానమిక్స్, యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ నుంచి ఎంఏ డిగ్రీలు పొందారు. ఆ అనంతరం 2001లో ప్రిన్స్‌స్టన్ యూనివర్సిటీలో ఎకానమిక్స్‌లో పీహెచ్‌డీ చేశారు. అదే ఏడాది యూనివర్సిటీ ఆఫ్ చికాగాలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరారు. 2005లో హార్వర్డ్‌కు వెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment