
ఐఎంఎఫ్ చీఫ్ ఎకనామిస్ట్ గీతా గోపీనాథ్ (ఫైల్ ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఊహించిన దానికంటే చాలా లోతైన మాంద్యంలోకి వెళ్లిపోతోందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ చీఫ్ ఎకనామిస్ట్ గీతా గోపీనాథ్ వ్యాఖ్యానించారు. కరోనాతో దాదాపు అన్ని దేశాల్లో ఆర్థిక వ్యవస్థలు కుదేలవ్వడంతో వృద్ధిరేటు తగ్గునుందని పేర్కొన్నారు.
ముఖ్యంగా 2020 ఆర్థిక సంవత్సరానికి భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు ఏకంగా 4.5 శాతం పడిపోయిందని, భారతదేశం వృద్ధి 2 సంవత్సరాలలో ఒక శాతం కంటే కొద్దిగా ఎక్కువ ఉంటుందన్నారు. కానీ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకోవడంతో భారత్ కూడా నెమ్మదిగా కోలుకుంటుందని పేర్కొన్నారు. కరోనా కట్టడి విషయంలో భారత్ బాగానే వ్యవహరించినప్పటికీ, పరీక్షల సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. అలాగే ప్రస్తుత సంక్షోభ సమయంలో పేదలకు నగదు బదిలీ, ప్రతి ఒక్కరికి అవసరమైన ఉద్యోగాలను సృష్టించడం చాలా ముఖ్యం అని గీతా గోపీనాథ్ పేర్కొన్నారు. (చైనా ఉత్పత్తుల బహిష్కరణ సాధ్యమేనా?)
గీతా గోపీనాథ్ పేర్కొన్న కొన్ని కీలక అంశాలు
- దేశాలు ప్రపంచీకరణపై పునరాలోచనలో ఉన్నప్పటికీ ప్రపంచ సంక్షోభం ప్రపంచ సహకారంతోనే పరిష్కారమవుతుంది.
- రానున్న సమీపకాలంలో దేశాలు వైద్య ఎగుమతులపై ఆంక్షలు పెట్టబోతున్నాయి. కానీ ఈ విషయంలో ప్రపంచ దేశాల మధ్య సహకారం అవసరం.
- ప్రస్తుతం ప్రధాన సవాలు ఆరోగ్య సంక్షోభం. అధిక జనాభా గల దేశంలో పడకల సంఖ్య అంతర్జాతీయ సగటుకు దూరంగా ఉంది. కానీ, తీసుకున్న చర్యలు బావున్నాయి. ఇది చాలా కష్టమైన సమయం. ప్రధాన నగరాలన్నీ కరోనాతో పోరాడుతున్నాయి.
- ఆరోగ్య సామర్థ్యాలను, పరీక్షల సామర్థ్యాన్ని పెంచాలి. సామాజిక భద్రతా చర్యల్ని చేపట్టాలి. పేదలకు నగుదును అందుబాటులో వుంచాలి. ఎక్కువ ఉద్యోగ కల్పన అవసరమయ్యే సమగ్ర విధానాన్ని అవలంబించాలి. వలస కార్మికులు తిరిగి నగరాలకు రావటానికి ప్రస్తుతం ఇష్టపడరు. ఇది సమస్య అవుతుంది. ప్రభుత్వం వారికి నగదును అందించాల్సిన అవసరం ఉంది. స్థానికంగా వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఇది ఆర్థికవ్యవస్థ రికవరీకి చాలా సహాయపడుతుంది.
- అంతర్జాతీయ వాణిజ్యంలో భారతదేశం పాత్ర పెద్దది కనుక భారీ సంస్కరణలు అవసరం. డిజిటల్ ఫ్రంట్‌లోభారత్ చాలా బాగా రాణించింది. అదే తరహాలో వైద్యపరంగా కూడా రాణించాలి. సంస్కరణలను వేగవంతం చేయడం కచ్చితంగా దేశానికి సహాయపడుతుంది. (గణేష్ విగ్రహాలు కూడా చైనా నుంచేనా: నిర్మలా సీతారామన్)
కాగా చరిత్రలోనే తొలిసారిగా 2020లో అన్ని ప్రాంతాల్లో ప్రతికూల వృద్ధిరేటును అంచనా వేస్తున్నామని బుధవారం గీతా గోపీనాథ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తొలి త్రైమాసికంలో కాస్త రికవరీ ఉన్నప్పటికీ చైనా వృద్ధిరేటును ఒక శాతంగా అంచనా వేశామన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ 4.5 శాతం తగ్గుతుందని, 1961 తర్వాత ఇదే అత్యంత తగ్గుదల అని ఆమె పేర్కొన్నారు. అయితే, 2021లో వృద్ధిరేటు 6 శాతానికి పుంజుకుంటుందన్నారు.