అనిశ్చిత ప్రపంచంలో ‘వెలుగు’ భారత్..!
వాషింగ్టన్: నెమ్మదించిన ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ ఒక వెలుగురేఖగా అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) చీఫ్ క్రిస్టినా లగార్డ్ అభివర్ణించారు. వాషింగ్టన్‌లో చేసిన ఒక ప్రసంగంలో ఆమె ఈ వ్యాఖ్య చేశారు. ప్రపంచంలో పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు తీవ్ర అనిశ్చితిలో చిక్కుకున్నట్లు పేర్కొన్నారు. అమెరికా వడ్డీరేట్ల పెంపు అవకాశాలు, చైనాలో బలహీనతలు అనిశ్చితికి కారణమవుతున్నాయని, తీవ్ర మార్కెట్ ఒడిదుడుకులకు దారితీస్తున్నాయని ఆమె అన్నారు. ఇంకా ఏమన్నారంటే...
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 2015లో మందగమనంలోనే కొనసాగుతుంది. వచ్చే ఏడాది కొంత పుంజుకోవచ్చు. ఎగుమతుల ఆధారిత ఆర్థిక వ్యవస్థ చైనా వృద్ధి మందగమనంలోకి జారిపోతోంది. ఆర్థిక వ్యవస్థలో సంస్కరణలు తెస్తుండడం చైనాకు సంబంధించి ఆహ్వానించదగిన పరిణామం. ఆదాయాల పెంపునకు, ప్రజల జీవన ప్రమాణాల మెరుగు దిశలో ఈ చర్యలు దోహదపడతాయని భావిస్తున్నాం. వెరసి దీర్ఘకాలంలో వృద్ధి పురోగతికి దోహదపడే వీలుంది.
క రష్యా, బ్రెజిల్ వంటి ఆర్థిక వ్యవస్థలు సైతం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. లాటిన్ అమెరికాలోని పలు దేశాలు వేగంగా ఆర్థిక మందగమనంలోకి జారిపోతున్నాయి. చిన్న స్థాయి ఆదాయ దేశాలపై కూడా ప్రతికూల ప్రభావాలు పెరుగుతున్నాయి. ఆయా అంశాలన్నీ అంతర్జాతీయ ఆర్ధిక పరిస్థితులను తీవ్రంగా బలహీనపరుస్తున్నాయి. ఫైనాన్షియల్ స్థిరత్వం ఇప్పటికిప్పుడు జరుగుతుందన్న భరోసా లేదు.
కొంతలో కొంత ఆశావహ అంశం ఏమిటంటే- అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు స్వల్పంగా కోలుకుంటున్న సంకేతాలు కనిపిస్తుండడం. యూరో ప్రాంతం, జపాన్ సానుకూల వృద్ధిలోకి మారుతున్నాయి. అమెరికా, బ్రిటన్‌లలో కూడా పరిస్థితి మెరుగుపడుతోంది. అంతర్జాతీయ మందగమనం, కమోడిటీ ధరల క్షీణత వంటి అంశాల కారణంగా ప్రపంచ వాణిజ్య వృద్ధి పడిపోతోంది. క్రూడ్ ధరలు పడిపోతుండడం వనరుల ఆధారిత ఆర్థిక వ్యవస్థలకు ఇబ్బందిగా మారింది.