డీల్ విలువ రూ.19,200 కోట్లు..
న్యూఢిల్లీ: దేశంలో మరో మెగా ఫార్మా డీల్‌కు తెరలేచింది. అగ్రగామి ఫార్మా కంపెనీల్లో ఒకటైన సన్ ఫార్మాస్యూటికల్స్... మరో దిగ్గజ కంపెనీ ర్యాన్‌బాక్సీ ల్యాబొరేటరీస్‌ను చేజిక్కించుకుంది. ఇరు కెంపెనీలు ఈ విషయాన్ని సోమవారం సంయుక్తంగా ప్రకటించాయి. పూర్తిగా స్టాక్స్ కేటాయింపు రూపంలో జరగనున్న ఈ ఒప్పందం విలువ 320 కోట్ల డాలర్లు(దాదాపు రూ.19,200 కోట్లు). ఈ డీల్ పూర్తయితే తమ ఉమ్మడి కంపెనీ... దేశంలో నంబర్ వన్ ఫార్మా కంపెనీ కానుందని సన్ ఫార్మా, ర్యాన్‌బాక్సీ పేర్కొన్నాయి. అంతేకాకుండా ప్రపంచంలోనే అయిదో అతిపెద్ద స్పెషాలిటీ జెనరిక్స్ తయారీ సంస్థగా ఆవిర్భవించనుందని కూడా వెల్లడించాయి. ఇరు కంపెనీల మొత్తం ఆదాయం దాదాపు 420 కోట్ల డాలర్లు(సుమారు రూ.25,000 కోట్ల పైచిలుకే)గా అంచనా.
జపాన్‌కు చెందిన దైచీ శాంక్యో మెజారిటీ వాటాదారుగా ఉన్న ర్యాన్‌బాక్సీ ఇటీవల కాలంలో అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ(యూఎస్ఎఫ్డీఏ) నుంచి నిషేధాల ఒత్తిడిని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. కాగా, గడిచిన రెండేళ్లలో దేశంలో చోటుచేసుకున్న రెండో అతిపెద్ద కొనుగోలు డీల్‌గా ఇది నిలుస్తుండటం గమనార్హం. ప్రతిపాదిత డీల్‌కు సన్ ఫార్మా డెరైక్టర్ల బోర్డు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఇరు కంపెనీల బోర్డులు డీల్‌కు షేర్‌హోల్డర్ల అనుమతి కోసం సిఫార్సు చేశాయి.
ఒప్పందం స్వరూపం ఇదీ...
ప్రతిపాదిత డీల్ ప్రకారం.. ఒక్కో ర్యాన్‌బాక్సీ షేరుకి 0.8 సన్‌ఫార్మా షేరును కేటాయించనున్నారు. అంటే ప్రతి ర్యాన్‌బాక్సీ వాటాదారులకు ప్రతి 5 షేర్లకు... 4 సన్ ఫార్మా షేర్లు లభిస్తాయన్న మాట. ర్యాన్‌బాక్సీ షేరు విలువ రూ.457 చొప్పున ఈ డీల్ కుదుర్చుకున్నట్లు లెక్క. గడిచిన 30 రోజుల సగటు షేరు ధరపై 18 శాతం అధిక మొత్తానికి... 60 రోజుల సగటు ధరపై 24.3 శాతం ప్రీమియంను సన్ ఫార్మా ఆఫర్ చేసినట్లవుతుంది. అయితే, 2008లో ర్యాన్‌బాక్సీలో 63.4 శాతం మేర వాటాను జపాన్ ఫార్మా దిగ్గజం దైచీ శాంక్యో సుమారు 460 కోట్ల డాలర్లకు(అప్పటి కరెన్సీ విలువ ప్రకారం దాదాపు రూ.22,000 కోట్లు) కొనుగోలు చేయడం విశేషం.
ఒక్కో షేరుకి సుమారు రూ.737 చొప్పున చెల్లించింది. తద్వారా ర్యాన్‌బాక్సీ ప్రమోటర్లు మాల్విందర్ సింగ్, శివీందర్ సింగ్‌లు సంస్థ నుంచి వైదొలిగారు. కాగా, అప్పటి డీల్ ప్రకారం చూస్తే... ఇప్పుడు దైచీ శాంక్యోకు ర్యాన్‌బాక్సీలో ఉన్న వాటాకు చాలా తక్కువ మొత్తమే లభిస్తోంది. సన్ ఫార్మా ప్రమోటర్లకు ప్రస్తుతం ఆ కంపెనీలో 63.7 శాతం వాటా ఉంది. షేర్ల కేటాయింపు కారణంగా ఈ డీల్ పూర్తయితే సన్ ఫార్మాలో దైచీ శాంక్యో రెండో అతిపెద్ద వాటాదారుగా నిలుస్తుంది.
సన్ ఫార్మాకు ఏంటి ప్రయోజనం...
ర్యాన్‌బాక్సీని సొంతం చేసుకోవడం వల్ల సన్ ఫార్మాకు ప్రపంచవ్యాప్తంగా అయిదు ఖండాల్లోనూ 65 దేశాల్లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహించే సామర్థ్యం దక్కుతుంది. 47 తయారీ ప్లాంట్లు ఈ ఉమ్మడి సంస్థ చేతిలో ఉంటాయి. ప్రపంచ స్పెషాలిటీ, జనరిక్ ఔషధ ఉత్పత్తుల మార్కెట్లో గణనీయమైన వాటాను సన్ ఫార్మా చేజిక్కించుకోగలుగుతుంది. దీంతోపాటు 629 కొత్త ఔషధ దరఖాస్తులు(ఆండాస్) కూడా లభిస్తాయి. గతంలో కూడా ఇబ్బందుల్లో ఉన్న ఫార్మా కంపెనీలను తక్కువ మొత్తాలకు చేజిక్కించుకుని వాటిని లాభాల బాటలోకి తీసుకొచ్చిన అనుభవం, సామర్థ్యం సన్‌ఫార్మా సొంతం. అమెరికాకు చెందిన కరా కో ఫార్మా, ఇజ్రాయెల్ సంస్థ టారో ఫార్మాలను ఇదే విధంగా దక్కించుకుని గాడిలో పెట్టగలిగింది. ఇప్పుడు ర్యాన్‌బాక్సీ డీల్‌కు కూడా సన్ ఫార్మా చాలా తక్కువే చెల్లిస్తోందనేది విశ్లేషకులు అభిప్రాయం.