gmc balayogi
-
బాలయోగిది హత్యే!
అమలాపురం టౌన్: పశ్చిమగోదావరి జిల్లాలో 19 ఏళ్ల కిందట జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన అప్పటి లోక్సభ స్పీకర్ జీఎంసీ బాలయోగిది హత్య అని ఉభయ రాష్ట్రాల శెట్టిబలజి మహానాడు అధ్యక్షుడు, వైఎస్సార్సీపీ నాయకుడు కుడుపూడి సూర్యనారాయణరావు ఆరోపించారు. ఈ హత్యా పథకంలో చంద్రబాబే సూత్రధారని ఆరోపించారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం అధికార అండతో ఆనాడు బాలయోగి హత్యను బయటకు రాకుండా చేసిందని ఆరోపించారు. అప్పటి నుంచి బాలయోగి కుటుంబాన్ని కన్నెత్తి కూడా చూడని టీడీపీ ముఖ్యనేతలు ఎన్నికలు వచ్చేసరికి ఆయన కుమారుడు హరీష్మాథూర్ని తెరమీదకు తీసుకొచ్చి సానుభూతితో ఓట్లు దండుకునేందుకు చూస్తున్నారని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత బాలయోగి మరణంపై సమగ్ర దర్యాప్తు చేయించాలని కోరుతూ ఇటీవల వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలసి వినతి పత్రం ఇచ్చినట్టు సూర్యనారాయణరావు తెలిపారు. బాలయోగి హత్యపై తమ వద్ద ఆధారాలు కూడా ఉన్నాయన్నారు. బాబు సోదరుడికి ఇంతటి దుస్థితా? ‘నా స్నేనిహితుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తినాయుడు ఇంట్లో అచేతనంగా ఉండటం తనను కలిచివేస్తోందని సూర్యనారాయణరావు ఆవేదన వ్యక్తం చేశారు. రామ్మూర్తినాయుడు ఆ దుస్థితిలో ఉండడానికి చంద్రబాబే కారణమని చెప్పారు. చంద్రబాబు తన స్వార్ధం కోసం రక్త సంబంధాలను కూడా లెక్క చేయరనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయన్నారు. సమావేశంలో శెట్టిబలిజ మహానాడు నాయకులు మట్టపర్తి నాగేంద్ర, బొంతు గోవిందశెట్టి తదితరులు పాల్గొన్నారు. -
ఒకే పార్టీ.. ఇద్దరు స్పీకర్లు
సాక్షి, అమరావతి : ఒకే పార్టీ నుంచి అటు పార్లమెంట్లోను, ఇటు అసెంబ్లీలోను ఒకే పార్టీ నుంచి ఎన్నికైన వారు స్పీకర్లుగా వ్యవహరించిన అరుదైన సందర్భం ఇది. తుని ఎమ్మెల్యేగా ఎన్నికైన యనమల రామకృష్ణుడు 1995–99 వరకూ అసెంబ్లీ స్పీకర్గా కొనసాగారు. ఎన్టీఆర్ను పదవీచ్యుతుడిని చేసి.. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన సమయంలోనూ రామకృష్ణుడే స్పీకర్ కావటం విశేషం. 1998లో ఎంపీగా ఎన్నికైన గంటి మోహనచంద్ర బాలయోగి అదే ఏడాది మార్చి 24న లోక్సభ స్పీకర్గా బాధ్యతలు చేపట్టారు. భారత పార్లమెంటులో తొలి దళిత స్పీకర్గా ఎన్నికయ్యారు. 2002 మార్చి 3న భీమవరం నుంచి ఢిల్లీకి హెలికాప్టర్లో వెళ్తూ కృష్ణా జిల్లా వద్ద హెలికాప్టర్ ప్రమాదంలో బాలయోగి మృత్యువాతపడ్డారు. నాయకుల తల్లి కొత్తపల్లి స్వాతంత్య్ర సమరయోధులు, చరిత్రకారులు, రాజ వంశీయుల పుట్టినిల్లుగా తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని కొత్తపల్లి ప్రసిద్ధి. గతంలో మండల కేంద్రమైన కొత్తపల్లి గ్రామంలో పిఠాపురం తాలూకా ఐదు వేల జనాభాతో అతిపెద్ద గ్రామంగా విరాజిల్లింది. అంతేకాక, దివ్య క్షేత్రంగా, కళా కేంద్రంగా, సంస్కతీ సంప్రదాయాలకు నిలయంగా, సాహితీ మందిరంగా, రాజకీయ చైతన్యానికి ఆనవాలుగా చరిత్రలో కీర్తింపబడింది. స్వాతంత్య్ర సమరయోధులు కొత్తపల్లి రావు అచ్చియ్యరావు, పుత్సల సత్యనారాయణ, రావు వెంకట జగ్గారావు, అల్లిక సన్యాసయ్య, జ్యోతుల కాశీస్వామి, జ్యోతుల శేషయ్య, చిట్టాడ చిన్న ముత్యాలు వంటి వారు కొత్తపల్లిలో జన్మించి దేశ అభ్యుదయానికి కృషిచేశారు. అలాగే, మహాత్మగాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, జయప్రకాష్ నారాయణ, టంగుటూరి ప్రకాశం పంతులు వంటి మహానేతలు కూడా కొత్తపల్లికి వచ్చి సందేశాలను అందజేసి ప్రజలను ఉత్తేజ పర్చారు. అటువంటి కొత్తపల్లి ఫిర్కా, కొండెవరంలో కాకినాడ ఎంపీగా పని చేసిన చెలికాని వెంకట రామారావు, పిఠాపురం తొలి ఎమ్మెల్యేగా పని చేసిన రావు వెంకట జగ్గారావులు జన్మించారు. అలాగే అభ్యుదయ రాజకీయ నాయకుడు సంపర మాజీ ఎమ్మెల్యే చెరుకువాడ వెంకటరత్నం కూడా కొండెవరంలోనే జన్మించారు. వీరంతా తమ ఆస్తులను అమ్మి ప్రజా సంక్షేమానికి కృషిచేశారు. స్వలాభాపేక్ష లేకుండా పాలించారనడానికి సాక్ష్యాలుగా కొండెవరంలో వారి గృహాలు ఇప్పటికి వారి బీదరికాన్ని గుర్తుకు తెస్తున్నాయి. – వీఎస్ వీఎస్ వరప్రసాద్, పిఠాపురం, తూర్పుగోదావరిజిల్లా -
అభివృద్ధి ప్రదాత బాలయోగి
అమలాపురం టౌన్ : లోక్ సభ స్పీకర్గా జిల్లాకు జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చిన లోక్ సభ స్పీకర్ దివంగత జీఎంసీ బాలయోగి జిల్లా అభివృద్ధి ప్రదాతగా నేటికీ జిల్లా గుండెల్లో చిరస్మరణీయుడిగా ఉన్నారని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. బాలయోగి జయంతి సందర్భంగా స్థానిక బాలయోగి ఘాట్లో ఆయన శనివారం ఘనంగా నివాళులర్పించారు. బాలయోగితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, అమలాపురం, పి.గన్నవరం ఎమ్మెల్యేలు అయితాబత్తుల ఆనందరావు, పులపర్తి నారాయణమూర్తి, ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం తదితరులు ఘాట్పై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. బాలయెగి జీవిత చరిత్రపై పీహెచ్డీ : ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ శివాజీ సాధారణ వ్యక్తి నుంచి జాతీయ స్థాయిలో అత్యున్నత పదవికి ఎదిగిన లోక్ సభ మాజీ స్పీకర్ దివంగత బాలయోగిని ఈ సీమ ఎప్పటికీ మరచిపోదని ఎస్సీ ఎస్టీ కమిషన్ రాష్ట్ర చైర్మన్ కారెం శివాజీ అన్నారు. స్థానిక బాలయోగి ఘాట్లో ఆయన ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ నన్నయ్య వర్శిటీలో బాలయోగి జీవిత చరిత్రపై పీహెచ్డీ డిగ్రీని త్వరలోనే ప్రవేశ పెట్టనున్నట్టు తెలిపారు. బాలయోగికి ఎంపీ నివాళి ఢిల్లీ పార్లమెంటు భవనంలోని బాలయోగి చిత్రపటానికి ఎంపీ డాక్టర్ పండుల రవీంద్రబాబు పూలమాలల వేసి నివాళులర్పించారు. ఈ మేరకు ఎంపీ కార్యాలయంలో ఓ ప్రకటనలో తెలిపింది.