సాక్షి, అమరావతి : ఒకే పార్టీ నుంచి అటు పార్లమెంట్‌లోను, ఇటు అసెంబ్లీలోను ఒకే పార్టీ నుంచి ఎన్నికైన వారు స్పీకర్లుగా వ్యవహరించిన అరుదైన సందర్భం ఇది. తుని ఎమ్మెల్యేగా ఎన్నికైన యనమల రామకృష్ణుడు 1995–99 వరకూ అసెంబ్లీ స్పీకర్‌గా కొనసాగారు. ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడిని చేసి.. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన సమయంలోనూ రామకృష్ణుడే స్పీకర్ కావటం విశేషం. 1998లో ఎంపీగా ఎన్నికైన గంటి మోహనచంద్ర బాలయోగి అదే ఏడాది మార్చి 24న లోక్‌సభ స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టారు. భారత పార్లమెంటులో తొలి దళిత స్పీకర్‌గా ఎన్నికయ్యారు. 2002 మార్చి 3న భీమవరం నుంచి ఢిల్లీకి హెలికాప్టర్‌లో వెళ్తూ కృష్ణా జిల్లా వద్ద హెలికాప్టర్ ప్రమాదంలో బాలయోగి మృత్యువాతపడ్డారు.
నాయకుల తల్లి కొత్తపల్లి
స్వాతంత్య్ర సమరయోధులు, చరిత్రకారులు, రాజ వంశీయుల పుట్టినిల్లుగా తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని కొత్తపల్లి ప్రసిద్ధి. గతంలో మండల కేంద్రమైన కొత్తపల్లి గ్రామంలో పిఠాపురం తాలూకా ఐదు వేల జనాభాతో అతిపెద్ద గ్రామంగా విరాజిల్లింది. అంతేకాక, దివ్య క్షేత్రంగా, కళా కేంద్రంగా, సంస్కతీ సంప్రదాయాలకు నిలయంగా, సాహితీ మందిరంగా, రాజకీయ చైతన్యానికి ఆనవాలుగా చరిత్రలో కీర్తింపబడింది.
స్వాతంత్య్ర సమరయోధులు కొత్తపల్లి రావు అచ్చియ్యరావు, పుత్సల సత్యనారాయణ, రావు వెంకట జగ్గారావు, అల్లిక సన్యాసయ్య, జ్యోతుల కాశీస్వామి, జ్యోతుల శేషయ్య, చిట్టాడ చిన్న ముత్యాలు వంటి వారు కొత్తపల్లిలో జన్మించి దేశ అభ్యుదయానికి కృషిచేశారు. అలాగే, మహాత్మగాంధీ, పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ, జయప్రకాష్ నారాయణ, టంగుటూరి ప్రకాశం పంతులు వంటి మహానేతలు కూడా కొత్తపల్లికి వచ్చి సందేశాలను అందజేసి ప్రజలను ఉత్తేజ పర్చారు.
అటువంటి కొత్తపల్లి ఫిర్కా, కొండెవరంలో కాకినాడ ఎంపీగా పని చేసిన చెలికాని వెంకట రామారావు, పిఠాపురం తొలి ఎమ్మెల్యేగా పని చేసిన రావు వెంకట జగ్గారావులు జన్మించారు. అలాగే అభ్యుదయ రాజకీయ నాయకుడు సంపర మాజీ ఎమ్మెల్యే చెరుకువాడ వెంకటరత్నం కూడా కొండెవరంలోనే జన్మించారు. వీరంతా తమ ఆస్తులను అమ్మి ప్రజా సంక్షేమానికి కృషిచేశారు. స్వలాభాపేక్ష లేకుండా పాలించారనడానికి సాక్ష్యాలుగా కొండెవరంలో వారి గృహాలు ఇప్పటికి వారి బీదరికాన్ని గుర్తుకు తెస్తున్నాయి.
– వీఎస్ వీఎస్ వరప్రసాద్, పిఠాపురం, తూర్పుగోదావరిజిల్లా
Comments
Please login to add a commentAdd a comment