GMR Aviation Company
-
పేరు మార్చుకున్న బడా కంపెనీ.. కారణం ఇదే
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విమానాశ్రయాల అభివృద్ధి, నిర్వహణలో ఉన్న జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరు మారింది. ఇక నుంచి జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌గా వ్యవహరిస్తారు. విమానాశ్రయేతర వ్యాపారాలను విడదీసిన తర్వాత కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 15 నుంచి కొత్త పేరు కార్యరూపంలోకి వచ్చిందని కంపెనీ ప్రకటించింది. ప్రస్తుతం హైదరాబాద్, ఢిల్లీతోపాటు ఫిలిప్పైన్స్‌లోని సెబు విమానాశ్రయాలు జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ నిర్వహణలో ఉన్నాయి. ఇండోనేషియాలోని కౌలనాము ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అభివృద్ధి, నిర్వహణ హక్కులను సంస్థ చేజిక్కించుకుంది. గోవా, ఆంధ్రప్రదేశ్‌లోని భోగాపురం, గ్రీస్‌లోని క్రీతి విమానాశ్రయాలను అభివృద్ధి చేస్తోంది. (క్లిక్ చేయండి: ఇన్‌స్ట్రాగామ్‌లో కొత్త ఫీచర్: చూశారా మీరు?) -
విమానాల గ్యారేజ్! ఇక్కడ విమానాలు రిపేర్ చేయబడును
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వైమానిక, అంతరిక్ష, రక్షణ రంగాలకు చెందిన పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన మౌలిక వసతుల కల్పనపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. ఈ రంగాల్లో కొత్తగా వస్తున్న నిర్వహణ, మరమ్మతులు, ఓవర్ హాలింగ్ (ఎంఆర్వో) రంగంలో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఆసక్తి చూపుతోంది. ఎంఆర్వో రంగంలో అంతర్జాతీయంగా అవకాశాలు పెరుగుతుండటంతో కొత్త అవకాశాలతో భారత్‌తో పాటు మధ్యప్రాచ్యం, ఆగ్నేయాసియా దేశాల అవసరాలు తీర్చొచ్చని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో జీఎంఆర్ ఏరోటెక్, ఎయిర్ ఇండియా ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎంఆర్వో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. బేగంపేట విమానాశ్రయంలో ఎంఆర్వో హబ్ ఏర్పాటు చేసేందుకు ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా సుముఖత చూపుతుండటంతో నిర్వహణ, మరమ్మ తులు, ఓవర్ హాలింగ్ రంగంలో పెట్టుబడులు ఆకర్షించాలని భావిస్తోంది. భారత్‌లో ఎంఆర్వో రంగం ఏటా 15% వృద్ధి రేటుతో ప్రస్తుతం రూ.10వేల కోట్ల పరిశ్రమగా ఎదుగుతుండటంతో మహారాష్ట్ర, ఢిల్లీ ఈ రంగంలో అవకాశాలను అందిపుచ్చుకోవాలనుకుంటున్నాయి. తెలంగాణ కూడా వీటి బాటలోనే నడవాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ఓఈఎం కంపెనీల పెట్టుబడులు వైమానిక, రక్షణ రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన ఒరిజినల్ ఎక్విప్మెంట్ మాన్యుఫాక్చరింగ్ (ఓఈఎం) కంపెనీలు ఇప్పటికే పెట్టుబడులతో రాష్ట్రానికి వచ్చాయి. దీంతో ఐదేళ్లుగా రాష్ట్రం ఏరోస్పేస్ హబ్‌గా మారుతోంది. లాక్‌హీడ్ మార్టిన్, బోయింగ్, జీఈ ఏవియేషన్ వంటి అంతర్జాతీయ సంస్థలతో పాటు టాటా, అదానీ, కల్యాణి వంటి దేశీయ కంపెనీలు కూడా హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. టాటా గ్రూప్ తమ ఏరోస్పేస్ ఉత్పత్తుల్లో 90 శాతం హైదరాబాద్ నుంచే తయారు చేస్తోంది. జీఈ, సాఫ్రాన్ హైదరాబాద్‌లో ఏరో ఇంజిన్ తయారీ కర్మాగారాలను ఏర్పాటు స్థాపించగా, బోయింగ్ సంస్థ అపాచీ, చినోక్స్ హెలీకాప్టర్లు, యుద్ధ విమానాల విడిభాగాలు, లాక్‌హీడ్ హెలికాప్టర్ క్యాబిన్లు, ఎఫ్–16 రెక్కలను తయారుచేస్తోంది. అంతర్జాతీయ ఏరోస్పేస్ సంస్థలు సీఎఫ్ఎం, ఫ్రాట్ అండ్ విట్నీ రాష్ట్రంలో ఇంజిన్ ట్రైనింగ్ సెంటర్లు కూడా నిర్వహిస్తున్నాయి. మౌలిక వసతులు, శిక్షణపై దృష్టి వైమానిక, రక్షణ రంగాల్లో అంతర్జాతీయ పెట్టుబడులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనతో పాటు నైపుణ్య శిక్షణపై దృష్టి సారించడం ద్వారా ఎంఆర్వో రంగం కూడా వృద్ధి చెందుతుందని పరిశ్రమల శాఖ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో సుమారు డజను వరకు డీఆర్డీఓ పరిశోధనశాలలు, ప్రభుత్వరంగ సంస్థలు ఉండగా, ఏరోస్పేస్ రంగంలో 25కు పైగా పెద్ద కంపెనీలు, సుమారు 1,200 వరకు అనుబంధ పరిశ్రమలు పని చేస్తున్నాయి. ఏరోస్పేస్ రంగం కోసం ఆదిబట్ల, ఎలిమినేడు ఏరోస్పేస్ పార్కులతో పాటు కొత్తగా మరో 3 కొత్త పార్కులను కూడా ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఎంఆర్వో రంగంలో నైపుణ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఉండటంతో కొత్తగా శిక్షణ సంస్థల ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. పౌర విమానయాన రంగంలో ఐఎస్బీ ద్వారా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, ఏరోనాటికల్ సొసైటీ ద్వారా ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (భూమిని కేటాయించారు) ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. అంతర్జాతీయ సంస్థలతో కలసి రాష్ట్ర ప్రభుత్వం ఏరోస్పేస్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఏరోస్పేస్ రంగంలో స్టార్టప్‌లను ప్రోత్సహిచేందుకు ‘టి హబ్’ఇప్పటికే అంతర్జాతీయ ఏరోస్పేస్ సంస్థలు బోయింగ్, ప్రాట్ అండ్ విట్నీ, కాలీన్స్ ఏరోస్పేస్ తదితరాలతో భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకుంది. చదవండి: అభివృద్ధిలో ప్రజా కోణం ఏది? -
జీఎంఆర్‌కు స్టాక్ ఎక్స్ఛేంజీల అనుమతి
ముంబై, సాక్షి: మౌలిక రంగ హైదరాబాద్ దిగ్గజం జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రణాళికలకు స్టాక్ ఎక్స్ఛేంజీల నుంచి గ్రీన్‌సిగ్నల్ లభించింది. వ్యాపార పునర్వ్యవస్థీకరణ కోసం చేసిన ప్రతిపాదనలకు ఎక్స్ఛేంజీలు ఆమోదించినట్లు జీఎంఆర్ తాజాగా వెల్లడించింది. పునర్వ్యవస్థీకరణలో భాగంగా విమానాశ్రయేతర బిజినెస్‌ను ప్రత్యేక కంపెనీగా విడదీసేందుకు కంపెనీ ఇప్పటికే ప్రణాళికలు రూపొందించింది. ఈ ప్రతిపాదనలపట్ల ఎలాంటి అభ్యంతరాలూ లేవని ఎక్స్ఛేంజీలు పేర్కొన్నట్లు జీఎంఆర్ తెలియజేసింది. దీంతో ఈ ప్రతిపాదనలపై ఆరు నెలల్లోగా జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ)కు దరఖాస్తు చేయనున్నట్లు వెల్లడించింది. ప్రతిపాదనల్లో భాగంగా కంపెనీ జీఎంఆర్ పవర్ ఇన్ఫ్రా, జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, జీఎంఆర్ పవర్ అండ్ అర్బన్ ఇన్ఫ్రా తదితరాకు సంబంధించి విలీనం, సర్దుబాట్లు తదితర చర్యలు చేపట్టనున్నట్లు తెలియజేసింది. ఈ ఏడాది ఆగస్ట్‌లో కంపెనీ వ్యూహాత్మక రీస్ట్రక్చరింగ్ ప్రణాళికలకు తెరతీసిన విషయం విదితమే. కాగా.. కార్పొరేట్ హోల్డింగ్ స్ట్రక్చర్‌ను సులభతరం చేసేందుకు వీలుగా ఎయిర్పోర్ట్యేతర బిజినెస్‌ను విడదీయనున్నట్లు ఇప్పటికే కంపెనీ తెలియజేసింది. (మార్కెట్ల పతనం- ఫార్మా షేర్ల జోరు) -
జీఎంఆర్ ఏవియేషన్‌కు షాక్
న్యూఢిల్లీ: భద్రతా ప్రమాణాలను ఉల్లంఘించారంటూ జీఎంఆర్ ఏవియేషన్ కంపెనీకి చెందిన 11 మంది పైలట్లను, ఆరుగురు క్యాబిన్ సిబ్బందిని డీజీసీఏ మూడు నెలలపాటు పక్కన పెట్టింది. గత నెలలో జీఎంఆర్ ఏవియేషన్ సిబ్బంది నిర్బంధ పరీక్షలను ఎగ్గొట్టి పలు విమానాలు నడిపారని డీజీసీఏ వర్గాలు బుధవారం వెల్లడించాయి. గత సోమవారం రాహుల్ గాంధీని భువనేశ్వర్‌కు తరలించిన విమానం కూడా ఇందులో ఉందని పేర్కొన్నాయి. విమానాన్ని నడపడానికి ముందు పైలట్లకు, క్యాబిన్ సిబ్బందికి శ్వాస పరీక్ష(బ్రీత్ అనాలిసిస్) నిర్వహించాల్సి ఉండగా దాన్ని ఎగ్గొట్టారు. ఈ పరీక్షలు నిర్వహించే బ్రీత్ అనలైజర్ అసలు పనిచేయడమే లేదని డీజీసీఏ వర్గాలు తెలిపాయి. మార్చి 12 నుంచి ఈ నెల 14 వరకు జీఎంఆర్ ఫ్లయింగ్ రికార్డులను ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ పరిశీలించింది. ముందస్తు పరీక్షలకు సంబంధించిన తప్పుడు సమాచారం పొందుపర్చినట్లు తమకు ఆధారాలు లభించాయని డీజీసీఏ అధికారులు పేర్కొన్నారు. రెండు విమానాలు కలిగిన జీఎంఆర్ ఏవియేషన్ కార్యకలాపాలు డీజీసీఏ నిర్ణయంతో దాదాపు స్తంభించినట్లయింది. ఏ పరీక్షలనూ ఎగ్గొట్టలేదు: జీఎంఆర్ డీజీసీఏ ఆరోపణలను జీఎంఆర్ ఏవియేషన్ తీవ్రంగా ఖండించింది. తాము ఏ పరీక్షనూ ఎగ్గొట్టలేదని డీజీసీఏకు లేఖ రాశామనీ, పక్కనపెట్టిన పైలట్లను, క్యాబిన్ సిబ్బందిని త్వరలోనే మళ్లీ తీసుకుంటారని ఆశిస్తున్నామనీ కంపెనీ ప్రతినిధి తెలిపారు. ప్రింటర్ మినహా బ్రీత్ అనలైజర్ చక్కగా పనిచేస్తోందని చెప్పారు. శ్వాస పరీక్షను సిబ్బంది ఎగ్గొట్టలేదనీ, డాక్టర్లు కూడా తప్పుడు రిపోర్టులు ఇవ్వలేదనీ ఆయన స్పష్టం చేశారు. గత నెలలో నడిపిన అన్ని విమానాలకు సంబంధించి పైలట్లు, క్యాబిన్ సిబ్బందికి పరీక్షలు నిర్వహించినట్లు ఇన్చార్జ్ డాక్టరు సర్టిఫై చేశారని తెలిపారు. సాంకేతిక సమస్యల కారణంగా ఆయా పరీక్షల ప్రింటెడ్ రిపోర్టులు రాలేదని చెప్పారు. నేతలకు మోజు... భువనేశ్వర్‌లో ఎన్నికల ప్రచా రం కోసం రాహుల్‌గాంధీ ఇటీవలే ప్రయాణించిన జీఎంఆర్ ఫాల్కన్ 2000-ఎల్ఎక్స్ విమానాన్ని ఇందిరాగాంధీ కుటుంబ సభ్యులు విస్తృతంగా వినియోగిస్తుంటారు. జీఎంఆర్‌కే చెందిన హాకర్ -750 విమానాన్నీ, 2 బెల్ హెలికాప్టర్లనూ ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. నాన్- షెడ్యూల్డ్ ఆపరేటర్ల కార్యకలాపాలను డీజీసీఏ గత నెలలో ఆకస్మికంగా తనిఖీ చేసింది. కార్పొరేట్ల మొదలు రాజకీయ నాయకుల వరకు పలువురికి చెందిన విమాన సర్వీసులను పరిశీలించింది. ఎన్నికల సీజను కావడంతో రాజకీయ ప్రముఖులు ప్రైవేటు విమానాలను ఎక్కువగా వినియోగిస్తుంటారు. జీఎంఆర్ ఏవియేషన్‌కు చెందిన 11 మంది పైలట్లను, ఆరుగురు క్యాబిన్ సిబ్బందిని తాత్కాలికంగా పక్కన పెట్టడంతో నేతలు ఇతర కంపెనీల విమానాలపై ఆధారపడాల్సిందే.