జీఎంఆర్ ఏవియేషన్‌కు షాక్ | DGCA grounds 11 pilots of GMR Aviation | Sakshi
Sakshi News home page

జీఎంఆర్ ఏవియేషన్‌కు షాక్

Published Thu, Apr 17 2014 2:12 AM | Last Updated on Sat, Sep 2 2017 6:07 AM

జీఎంఆర్ ఏవియేషన్‌కు షాక్

జీఎంఆర్ ఏవియేషన్‌కు షాక్

న్యూఢిల్లీ: భద్రతా ప్రమాణాలను ఉల్లంఘించారంటూ జీఎంఆర్ ఏవియేషన్ కంపెనీకి చెందిన 11 మంది పైలట్లను, ఆరుగురు క్యాబిన్ సిబ్బందిని డీజీసీఏ మూడు నెలలపాటు పక్కన పెట్టింది. గత నెలలో జీఎంఆర్ ఏవియేషన్ సిబ్బంది నిర్బంధ పరీక్షలను ఎగ్గొట్టి పలు విమానాలు నడిపారని డీజీసీఏ వర్గాలు బుధవారం వెల్లడించాయి. గత సోమవారం రాహుల్ గాంధీని భువనేశ్వర్‌కు తరలించిన విమానం కూడా ఇందులో ఉందని పేర్కొన్నాయి.

విమానాన్ని నడపడానికి ముందు పైలట్లకు, క్యాబిన్ సిబ్బందికి శ్వాస పరీక్ష(బ్రీత్ అనాలిసిస్) నిర్వహించాల్సి ఉండగా దాన్ని ఎగ్గొట్టారు. ఈ పరీక్షలు నిర్వహించే బ్రీత్ అనలైజర్ అసలు పనిచేయడమే లేదని డీజీసీఏ వర్గాలు తెలిపాయి. మార్చి 12 నుంచి ఈ నెల 14 వరకు జీఎంఆర్ ఫ్లయింగ్ రికార్డులను ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ పరిశీలించింది. ముందస్తు పరీక్షలకు సంబంధించిన తప్పుడు సమాచారం పొందుపర్చినట్లు తమకు ఆధారాలు లభించాయని డీజీసీఏ అధికారులు పేర్కొన్నారు. రెండు విమానాలు కలిగిన జీఎంఆర్ ఏవియేషన్ కార్యకలాపాలు డీజీసీఏ నిర్ణయంతో దాదాపు స్తంభించినట్లయింది.  

 ఏ పరీక్షలనూ ఎగ్గొట్టలేదు: జీఎంఆర్
 డీజీసీఏ ఆరోపణలను జీఎంఆర్ ఏవియేషన్ తీవ్రంగా ఖండించింది. తాము ఏ పరీక్షనూ ఎగ్గొట్టలేదని డీజీసీఏకు లేఖ రాశామనీ, పక్కనపెట్టిన పైలట్లను, క్యాబిన్ సిబ్బందిని త్వరలోనే మళ్లీ తీసుకుంటారని ఆశిస్తున్నామనీ కంపెనీ ప్రతినిధి తెలిపారు. ప్రింటర్ మినహా బ్రీత్ అనలైజర్ చక్కగా పనిచేస్తోందని చెప్పారు. శ్వాస పరీక్షను సిబ్బంది ఎగ్గొట్టలేదనీ, డాక్టర్లు కూడా తప్పుడు రిపోర్టులు ఇవ్వలేదనీ ఆయన స్పష్టం చేశారు. గత నెలలో నడిపిన అన్ని విమానాలకు సంబంధించి పైలట్లు, క్యాబిన్ సిబ్బందికి పరీక్షలు నిర్వహించినట్లు ఇన్‌చార్జ్ డాక్టరు సర్టిఫై చేశారని తెలిపారు. సాంకేతిక సమస్యల కారణంగా ఆయా పరీక్షల ప్రింటెడ్ రిపోర్టులు రాలేదని చెప్పారు.

 నేతలకు మోజు...
 భువనేశ్వర్‌లో ఎన్నికల ప్రచా రం కోసం రాహుల్‌గాంధీ  ఇటీవలే ప్రయాణించిన జీఎంఆర్ ఫాల్కన్ 2000-ఎల్‌ఎక్స్ విమానాన్ని ఇందిరాగాంధీ కుటుంబ సభ్యులు విస్తృతంగా వినియోగిస్తుంటారు. జీఎంఆర్‌కే చెందిన హాకర్ -750 విమానాన్నీ, 2 బెల్ హెలికాప్టర్లనూ ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. నాన్- షెడ్యూల్డ్ ఆపరేటర్ల కార్యకలాపాలను డీజీసీఏ గత నెలలో ఆకస్మికంగా తనిఖీ చేసింది.

 కార్పొరేట్ల మొదలు రాజకీయ నాయకుల వరకు పలువురికి చెందిన విమాన సర్వీసులను పరిశీలించింది. ఎన్నికల సీజను కావడంతో రాజకీయ ప్రముఖులు ప్రైవేటు విమానాలను ఎక్కువగా వినియోగిస్తుంటారు. జీఎంఆర్ ఏవియేషన్‌కు చెందిన 11 మంది పైలట్లను, ఆరుగురు క్యాబిన్ సిబ్బందిని తాత్కాలికంగా పక్కన పెట్టడంతో నేతలు ఇతర కంపెనీల విమానాలపై ఆధారపడాల్సిందే.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement