నీ సేవలు మాకొద్దు
- గూడూరు కమిషనర్ జాయినింగ్‌ను అడ్డుకున్న విష్ణు వర్గీయులు
- నగర పంచాయతీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
గూడూరు: ‘నీ సేవలు మాకు అవసరం లేదు.. ఇక్కడ జాయిన్ కావడానికి వీల్లేదు.. వెనక్కు వెళ్లిపో’ అంటూ గూడూరు నగర పంచాయతీకి బదిలీపై వచ్చిన కమిషనర్ నఈమ్ అహమ్మద్‌ను గురువారం టీడీపీ కోడుమూరు ఇన్చార్జి డి. విష్ణువర్దన్ రెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు. ఈ ఘటనతో గూడూరులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇక్కడ కమిషనర్‌గా పని చేస్తున్న ఎల్.రమేష్‌బాబు కర్నూలు కార్పొరేషన్‌కు, అనంతపురం జిల్లా మడకశిర కమిషనర్‌గా ఉన్న నఈమ్ అహమ్మద్‌ను ఇక్కడికి బదిలీ చేస్తూ నాలుగు రోజుల క్రితం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు నఈమ్ అహమ్మద్ స్థానిక కార్యాలయానికి చేరుకోగా విష్ణు వర్గానికి చెందిన మున్సిపల్ వైస్ చైర్మన్ కె.రామాంజనేయులు, కౌన్సిలర్లు డి.రఘునాథ్, చాంద్‌బాషా, మాజీ వైస్ ఎంపీపీ కరుణాకరరాజు, తెలుగు యువత మండల అధ్యక్షుడు రేమట వెంకటేష్, జెడ్పీటీసీ మాజీ మెంబర్ ఎల్.వెంకటేశ్వర్లు, టీడీపీ పట్టణ కమిటీ అధ్యక్షుడు కంబగిరి గిడ్డయ్య తదితరులు వాదనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఎస్ఐ పవన్‌కుమార్ సిబ్బందితో వచ్చి సర్ధి చెప్పినా అంగీకరించలేదు. చివరకు కమిషనర్ జాయిన్ అయిన వెంటనే సెలవుల్లో వెళ్లిపోతానని ప్రదేయపడినా ఒప్పుకోలేదు. తర్వాత శుక్రవారం జాయినింగ్ అవ్వండని వైస్ చైర్మన్ స్పష్టం చేయగా అందుకు కమిషనర్ సమ్మతించలేదు.
అందుబాటులో లేని సిబ్బంది..
కమిషనర్.. విష్ణు వర్గీయుల గొడవ కారణంగా కార్యాలయ సిబ్బంది అక్కడి నుంచి జారుకున్నారు. మేనేజర్ వెంకటేశ్వర్లు అక్కడే ఉన్నా లీవ్ పెట్టినట్లు కమిషనర్‌కు వివరించారు. జాయినింగ్ రిపోర్టును తీసుకోవడానికి సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో కమిషనర్ ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి వారి ఆదేశాల మేరకు సెల్ఫ్ జాయినింగ్ అయినట్లు ప్రకటించారు.