మన దగ్గరే లక్షల కథలున్నాయి: ఇంద్రగంటి మోహనకృష్ణ
సృజనతో పాటు సాహిత్యాభిలాష కూడా ఉన్న దర్శకుడు పరిపూర్ణుడవుతాడు అనడానికి నిదర్శనం ఇంద్రగంటి మోహనకృష్ణ. చలం కథతో గ్రహణాన్ని తెరకెక్కించ గలిగాడంటే.. ఆ పరిపూర్ణతే కారణం. ట్రెడిషన్, ట్రెండ్... పొంతనలేని అంశాలివి. ఈ రెండిటినీ కలిపి ఒకేసారి చూడలేం. కానీ కలిపి చూపిస్తాడు ఇంద్రగంటి. అష్టాచెమ్మా, గోల్కొండ హైస్కూల్ చిత్రాల్లో ఆయన చేసిన మేజిక్ అదే. ఆయన దర్శకత్వం వహించిన ‘అంతకు ముందు-ఆ తరువాత’ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఇంద్రగంటితో కాసేపు...
**** ‘అంతకు ముందు- ఆ తరువాత’ అంటున్నారు. ఇంతకు దేని ముందు, దేని తర్వాత?
పెళ్లి ముందు.. పెళ్లి తర్వాత అనుకోవచ్చు. ‘ఐ లవ్యూ’ అనే మాటకు ముందు.. కమిటైన తర్వాత అని కూడా అనుకోవచ్చు. ప్రేమకు ముందు గానీ, పెళ్లికి ముందుగానీ.. తన భాగస్వామిని ఇష్టంతో చూస్తారు కానీ, లోతుగా మాత్రం ఎవ్వరూ చూడరు. ఎందుకంటే... వాళ్లిద్దరూ కలిసి బతికింది తక్కువ సమయంలో కాబట్టి. కానీ పెళ్లయ్యాక, ప్రేమలో దిగాక వారి మనోభావాలు మారిపోతాయి. కారణం.. ఇద్దరూ ఎక్కువ సమయాన్ని గడుపుతుంటారు. ఒకరి గురించి ఒకరికి చాలా విషయాలు తెలుస్తుంటాయి. అప్పుడే వాళ్లకు కొత్త కొత్త సందేహాలు తలెత్తుతుంటాయి. మనం సరైన భాగస్వామిని ఎంచుకున్నామా? అనే మీమాంసలోనే ఎక్కువ కాలం గడిపేస్తుంటారు. ఇలాంటి సమస్యలే ఓ యువజంటకు తలెత్తితే... వారి సందేహాలను వారు ఎలా నివృత్తి చేసుకున్నారు? అనేదే ఈ సినిమా.
**** ఇంత తెలివైన కథల్తో సినిమాలు తీస్తే.. ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారంటారా?
ప్రేక్షకుల మేథస్సుని తక్కువ అంచనా వేయకూడదు. జీవన ప్రయాణంలో ఎన్నో చూసుంటారు వాళ్లు. మనం ఏం చెప్పినా అర్థం చేసుకునే సామర్థ్యం ప్రేక్షకులకుంది. అయితే... ఓ అర్థంకానీ కథను తీసుకొచ్చి జనాలపై రుద్దాలనుకోవడం మాత్రం తప్పు. దర్శకుడు అనేవాడు చేయాల్సింది ఒక్కటే. నచ్చిన కథతోనే సినిమా తీయాలి. ఆ కథతో ప్రేక్షకుల్ని కూడా మెప్పించాలి.
**** సినిమా సినిమాకీ ఎందుకింత విరామం?
తనికెళ్ల భరణి నన్ను ‘హేలీ తోకచుక్క’ అంటుంటారు. లేట్‌గా సినిమాలు చేస్తానని ఆ బిరుదిచ్చారు(నవ్వుతూ). నా సినిమాలు ఆలస్యం కావడానికి కారణం నేనే. నాకు అసిస్టెంట్లు లేరు. నా కథలు నేనే రాసుకుంటాను. దానికి తగ్గ నిర్మాత దొరకాలి. అభిరుచికి తగ్గట్టు సినిమా చేయాలి. అందుకే ఈ ఆలస్యం.
**** ఎప్పుడూ సున్నితమైన కథలేనా? యాక్షన్ సినిమాలు కూడా చేయొచ్చుగా?
అనుబంధాల మధ్య పోరాటం అంటే నాకిష్టం. ఫిజికల్ వయొలెన్స్పై అంత ఆసక్తి ఉండదు.
**** అంటే మీ నుంచి అన్నీ ఇలాంటి కథలే వస్తాయా?
నా ‘గ్రహణం’ చలంగారి రచన ఆధారంగా చేసిన సినిమా. ‘మాయాబజార్’ ఓ సోషియో ఫాంటసీ కథ. ‘అష్టాచెమ్మా’ ఫ్యామిలీ నేపథ్యం. ‘గోల్కొండ హైస్కూల్’ క్రీడా నేపథ్యం. త్వరలో రానున్న ‘అంతకు ముందు- ఆ తరువాత’ రొమాంటిక్ కథాంశం. ఇప్పటివరకూ పొంతన లేని కథలతోనే సినిమాలు చేశాను. త్వరలో యాక్షన్ కథాంశంతో కూడా సినిమాలు చేస్తానేమో. నేనంటూ యాక్షన్ సినిమా చేస్తే... హీరోని మాత్రం దైవాంశ సంభూతునిగా చూపించను. హీరో ఇంట్రడక్షన్లోనే నాలుగొందలమందిని కొట్టేయడం నా స్కూల్ కాదు. నా యాక్షన్ హీరో కూడా సాధరణ వ్యక్తే అయ్యుంటాడు. స్ట్రగుల్స్ నుంచే అతని పోరాటం మొదలవుతుంది. అసలు నా దృష్టిలో యాక్షన్ సినిమా చేయడం తేలిక. ఆప్యాయతల్ని సింపుల్‌గా తెరపై క్యారీ చేయడమే కష్టం.
**** తెలుగులో కథల కొరత ఉందని చాలామంది అభిప్రాయం. నిజమేనా?
పచ్చి అబద్ధం. మనదగ్గరే లక్షల కథలున్నాయి. చలం, కొడవటిగంటి కుటుంబరావు లాంటివారి సాహిత్యం చదివితే... లెక్కలేనన్ని కథలు వాటంతటవే పుడతాయి. అంతెందుకు మన ఆధునిక కవులు చాలామంది మంచి కథలు రాస్తున్నారు. మహ్మద్ ఖదీర్‌బాబు లాంటివారి కథలు చదివితే ఆటోమేటిగ్గా మంచి కథలు దొరుకుతాయి. ప్రస్తుతం తమిళ దర్శకులు చేస్తున్నది అదే. వారి ప్రాచీన తమిళ సాహిత్యం ద్వారా గొప్ప గొప్ప కథలను సృష్టించుకుంటూ ముందుకు దూసుకుపోతున్నారు. ప్రయత్నం చేయకుండా కథలు లేవనుకుంటే ఎలా? ‘మాకు ఆస్కార్ ఎందుకురాదు?’ అని ఎదుటివారిని ప్రశ్నించడం కాదు. ఎందుకు రావాలి? అని మనకు మనం ప్రశ్నించుకోవాలి. అప్పుడు మనం చేస్తున్న తప్పులేంటో మనకు తెలుస్తాయి.
**** మీ డ్రీమ్ ప్రాజెక్ట్‌లు ఏమైనా ఉన్నాయా?
కొడవటిగంటి కుటుంబరావు కథలు సినిమాగా చేస్తే బావుంటుంది. అలాగే... బుచ్చిబాబు రాసిన ‘చివరకు మిగిలేది’ సినిమాగా చేస్తా.
**** ‘చివరకు మిగిలేది’ తీస్తే... అందులో ప్రధాన పాత్రలు చేసేవారు ఇప్పుడెవరున్నారు?
మీరు ఇలాంటి మిలియన్ డాలర్ల ప్రశ్నలు అడిగితే ఎలా?