ఆ ఫీలింగ్ మంచి కిక్ ఇస్తోంది
‘వర్షం’ హిట్ ప్రభాస్ కెరీర్‌ని మంచి మలుపు తిప్పిన విషయం తెలిసిందే. ఆ సినిమా తీసింది దర్శకుడు శోభన్. మహేశ్ బాబుతో ‘బాబి’ సినిమా తీసిందీ ఆయనే. 2008లో శోభన్ ఆకస్మికంగా చనిపోయారు. తండ్రి కన్న కలలను నిజం చేస్తూ, శోభన్ తనయుడు సంతోష్ శోభన్ ఇప్పుడు ‘తను-నేను’ చిత్రం ద్వారా హీరోగా పరిచయం అయ్యాడు. స్వీయదర్శకత్వంలో పి. రామ్మోహన్ నిర్మించిన ఈ చిత్రం నేడు తెర మీద కొస్తోంది. ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడుతూ -‘‘రామ్మోహన్‌గారు తీసిన ‘గోల్కొండ హైస్కూల్’ సినిమాలో ఓ ముఖ్యపాత్ర చేశాను.
ఆయన డెరైక్షన్‌లోనే హీరోగా పరిచయం కావడం ఆనందంగా ఉంది. నేను బెంగుళూరులో చదువుకున్నాను. వేసవి సెలవుల్లో హైదరాబాద్ వచ్చినప్పుడు ఈ సినిమా స్క్రిప్ట్ ఇచ్చి చదవమన్నారు. చదువుతున్నప్పుడే మంచి స్క్రిప్ట్ అనిపించింది. మాస్, క్లాస్ అనే తేడా లేకుండా అన్ని వయసుల వారికీ రీచ్ అవుతుంది. అవికా గోర్ గురించి చెప్పాలంటే నటన విషయంలో ఆమె నా కన్నా సీనియర్. కానీ నా లాంటి కొత్త హీరోతో నటించడానికి ఒప్పుకోవడం చాలా గొప్పగా అనిపించింది. సినిమాల మీద పిచ్చి ప్రేమ మా నాన్నగారి నుంచే నాకు వచ్చింది.
త్రివిక్రమ్, ప్రభాస్, రవితేజ, ప్రభుదేవా వంటి సినీ ప్రముఖులు నాకు బెస్ట్ విషెస్ చెప్పడం ఆనందంగా ఉంది. ఫస్ట్ కాపీ చూసి హీరోలు నాని, రాజ్‌తరుణ్ బాగుందని మెచ్చుకున్నారు. మహేశ్‌బాబు నా సినిమా గురించి ట్వీట్ చేశారు. ఆయనకు నేను తెలుసు అనే ఫీలింగ్ నాకు మంచి కిక్ ఇస్తోంది. వీళ్లు నాకిచ్చిన సపోర్ట్ మర్చిపోలేను’’ అన్నారు.