golden peacock award
-
తెనాలి శాస్త్రవేత్తకు ప్రతిష్టాత్మక గోల్డెన్ పీకాక్ అవార్డు
తెనాలి: గ్రేటర్ నొయిడాలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ పరిశోధన, అభివృద్ధి కేంద్రం (ఆర్ అండ్ డీ) డిప్యూటీ జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్న తెనాలి శాస్త్రవేత్త డాక్టర్ తోట చిరంజీవి ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ పీకాక్ ఎకో ఇన్నోవేషన్–2021 అవార్డు అందుకున్నారు. రిఫైనరీలో వెలువడే వ్యర్థాలను విలువైన మెటీరియల్‌గా మార్చే, పర్యావరణ సమస్యలను పరిష్కరించే భారత్ జీఎస్సార్ క్యాట్ అనే ఉత్ప్రేరకాన్ని డాక్టర్ చిరంజీవి, ఆయన బృందం అభివృద్ధి చేసింది. భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎంఎన్ వెంకటాచలయ్య నేతృత్వంలోని అవార్డుల జ్యూరీ సిఫార్సుల ఆధారంగా ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (ఐఓడీ) ఈ అవార్డును అందజేసింది. వీరు అభివృద్ధి చేసిన గ్యాసోలిన్ సల్ఫర్ తగ్గింపు ఉత్ప్రేరకం (భారత్ జీఎస్సార్ కాట్) ప్రయోగశాలలో విస్తృతమైన పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలతో భారతదేశంలో తొలిసారిగా చేసిన ఒక ప్రత్యేకమైన ఉత్పత్తి. దీనిని భారీస్థాయిలో ఉత్పత్తి చేసి, భారతీయ రిఫైనరీల్లో విజయవంతంగా ఉపయోగిస్తున్నారు. భారత్ జీఎస్సార్ కాట్‌కు పలు జాతీయ, అంతర్జాతీయ పేటెంట్లు లభించాయి. న్యూఢిల్లీలో వర్చువల్ విధానంలో ఈ అవార్డు ప్రకటించి, శుక్రవారం తనకు పంపినట్టు డాక్టర్ చిరంజీవి శనివారం వెల్లడించారు. -
రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు అపూర్వ ఘనత
ముంబై : రిలయన్స్ ఇండస్ట్రీస్ కేవలం లాభదాయకమైన కంపెనీగా మార్కెట్లో దూసుకుపోతుండటమే కాకుండా.. పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ సమాజానికి తన వంతు కృషి అందిస్తోంది. ముఖ్యంగా రిలయన్స్ ఫౌండేషన్(ఆర్ఎఫ్), సీఎస్ఆర్ సంస్థ ద్వారా సమాజానికి గణనీయమైన సహకారాన్ని అందిస్తోంది. విజయంతంగా ఈ కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమాలను అందిస్తుండటంతో, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 2017 సంవత్సరానికి గాను గోల్డెన్ పీకాక్ అవార్డును గెలుచుకుంది. సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా మాజీ జడ్జీ అరిజిత్ పాస్యత్ ఆధ్వర్యంలోని అవార్డుల జ్యూరీ గోల్డెన్ పీకాక్ అవార్డు 2017కి రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను ఎంపికచేసింది. వ్యవస్థాపకురాలు, చైర్మన్ నీతా అంబానీ ఆధ్వర్యంలో రిలయన్స్ ఫౌండేషన్ దేశవ్యాప్తంగా 13,500 గ్రామాలు, 74 అర్బన్ ప్రాంతాల్లో 15 మిలియన్ మంది ప్రజలకు తన సేవా కార్యక్రమాలను అందిస్తోంది. రిలయన్స్ పౌండేషన్ విద్య, క్రీడలు, ఆరోగ్యం, గ్రామీణ పరివర్తన, పట్టణ పునరుద్దరణ, విపత్తు ప్రతిస్పందన, మహిళల సాధికారత, ప్రమోషన్ , భారతీయ సంస్కృతి పరిరక్షణ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. రిలయన్స్ తన కార్పొరేట్ సామాజిక కార్యక్రమాల కోసం మూడు మోడ్స్‌ను ఎన్నుకుంది. డైరెక్ట్ ఎంగేజ్మెంట్(నిపుణుల టీమ్ ద్వారా కార్యక్రమాలు అందించడం), పార్టనర్షిప్స్(భాగస్వామ్య సంస్థల ద్వారా అందించడం), లెవరేజింగ్ టెక్నాలజీ ద్వారా రిలయన్స్ తన సేవలను అందిస్తోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ తన 40 ఏళ్ల ప్రస్తానంలో పలు మైలురాయిలను చేధించింది. రెండు దశాబ్దాలకు పైగా కంపెనీ తన దాతృత్వ కార్యక్రమాలతో సామాజిక విలువలను అందిస్తోంది. గోల్డెన్ పీకాక్ అవార్డులను నెలకొల్పి 25 ఏళ్లకు పైగా అయింది. స్థానికంగా, అంతర్జాతీయంగా అందించే ఉత్తమమైన సేవా కార్యక్రమాలకు గాను దీన్ని అందిస్తారు. మూడు స్థాయిల్లో ఇండిపెండెంట్ అసెసర్స్ అవార్డు దరఖాస్తుదారులను పరిశీలించిన అనంతరం, చివరికి గ్రాండ్ జ్యూరీ ఈ అవార్డు గ్రహీతలను ఎంపికచేస్తోంది. ఈ క్రమంలోనే 2017 గోల్డెన్ పీకాక్ అవార్డులకు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎంపికైంది. -
ఎల్ఐసీకి గోల్డెన్ పీకాక్ అవార్డు
భారత జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ)కు 2015 సంవత్సరానికిగాను గోల్డెన్ పీకాక్ అవార్డు లభించింది. కార్పొరేట్ గవర్నెర్స్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు ఎల్ఐసీ ఈ ప్రతిష్టాత్మక అవార్డు పొందింది. లండన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో సంస్థ తరఫున ఎల్ఐసీ ఇంటర్నేషనల్ చీఫ్ మేనేజర్ కేఆర్ అశోక్ ఈ అవార్డును అందుకున్నారు. బ్రిటన్ కేబినెట్ మంత్రి, డ్యూష్ ఆఫ్ లాన్‌కాస్టర్ చాన్సలర్ ఆలీవర్ లిట్విన్ అవార్డులను ప్రదానం చేశారు. లుక్రామ్ గ్రూప్ వ్యవస్థాపకులు, చైర్మన్ మిలింద్ కాంగ్లే, హిందూజా గ్రూప్ ఆఫ్ కంపెనీల కో-చైర్మన్ గోపీచంద్ పీ హిందూజా, ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెరైక్టర్స్ ప్రెసిడెంట్ లెఫ్టినెంట్ జనరల్ జేఎస్ అహ్లువాలియా(రిటైర్డ్), రీడింగ్ వెస్ట్ పార్లమెంట్ సభ్యులు (బ్రిటన్) అలోక్ శర్మ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
గోల్డెన్ పీకాక్ అవార్డుకు సింగరేణి ఎంపిక
సాక్షి, హైదరాబాద్: బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకతలతో పాటు వినూత్న పర్యావరణహిత చర్యలతో దేశంలో ప్రత్యేక గుర్తింపు పొందిన సింగరేణి సంస్థ 2015 సంవత్సరానికి ప్రతిష్టాత్మక గోల్డెన్ పీకాక్ అవార్డుకు ఎంపికైంది. సోమవారం దుబాయిలో జరిగిన ఐఓడీ అంతర్జాతీయ సదస్సులో ఈ అవార్డును సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్... యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వ కల్చర్, యూత్ కమ్యూనిటీ డెవలప్మెంట్ మంత్రి షేక్ నహ్యాన్ బిన్ ముభారఖ్ అల్ నహ్యాన్ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ ఏడాది ఐఓడీ సంస్థ వారి ఆధ్వర్యంలో జరిగిన ఎంపికలో సింగరేణి సంస్థకు ఈ ‘గోల్డెన్ పీకాక్ ఇన్నోవేటీవ్ ప్రొడక్స్/సర్వీస్ అవార్డు 2015’ను ఇవ్వడానికి నిర్ణయించారు.