
అవార్డుతో శాస్త్రవేత్త డాక్టర్ తోట చిరంజీవి
తెనాలి: గ్రేటర్ నొయిడాలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ పరిశోధన, అభివృద్ధి కేంద్రం (ఆర్ అండ్ డీ) డిప్యూటీ జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్న తెనాలి శాస్త్రవేత్త డాక్టర్ తోట చిరంజీవి ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ పీకాక్ ఎకో ఇన్నోవేషన్–2021 అవార్డు అందుకున్నారు. రిఫైనరీలో వెలువడే వ్యర్థాలను విలువైన మెటీరియల్‌గా మార్చే, పర్యావరణ సమస్యలను పరిష్కరించే భారత్ జీఎస్సార్ క్యాట్ అనే ఉత్ప్రేరకాన్ని డాక్టర్ చిరంజీవి, ఆయన బృందం అభివృద్ధి చేసింది.
భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎంఎన్ వెంకటాచలయ్య నేతృత్వంలోని అవార్డుల జ్యూరీ సిఫార్సుల ఆధారంగా ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (ఐఓడీ) ఈ అవార్డును అందజేసింది. వీరు అభివృద్ధి చేసిన గ్యాసోలిన్ సల్ఫర్ తగ్గింపు ఉత్ప్రేరకం (భారత్ జీఎస్సార్ కాట్) ప్రయోగశాలలో విస్తృతమైన పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలతో భారతదేశంలో తొలిసారిగా చేసిన ఒక ప్రత్యేకమైన ఉత్పత్తి. దీనిని భారీస్థాయిలో ఉత్పత్తి చేసి, భారతీయ రిఫైనరీల్లో విజయవంతంగా ఉపయోగిస్తున్నారు. భారత్ జీఎస్సార్ కాట్‌కు పలు జాతీయ, అంతర్జాతీయ పేటెంట్లు లభించాయి. న్యూఢిల్లీలో వర్చువల్ విధానంలో ఈ అవార్డు ప్రకటించి, శుక్రవారం తనకు పంపినట్టు డాక్టర్ చిరంజీవి శనివారం వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment