Goldilaks
-
యూరోపా యాత్రకు లైన్‌క్లియర్!
అంతరిక్ష పరిశోధనల్లో సరికొత్త అధ్యాయానికి రంగం సిద్ధమైంది... గురుగ్రహ ఉపగ్రహం యూరోపాపైకి నాసా ప్రయోగించనున్న... యూరోపా క్లిప్పర్ ప్రాజెక్టుకు గ్రీన్‌లైట్ పడింది. ఎలన్ మస్క్ కంపెనీ స్పేస్ఎక్స్కు చెందిన ఫాల్కన్ హెవీ రాకెట్‌పై 2024లో క్లిప్పర్ యూరోపా చుట్టూ చక్కర్లు కొట్టనుంది. సముద్రాలతో నిండిన ఆ ఉపగ్రహంపై జీవం ఉందా? లేదా తెలుసుకోవడమే లక్ష్యం! భూమికి ఆవల మనిషి జీవించేందుకు అనువైన పరిస్థితులు ఎక్కడైనా ఉన్నాయా? అన్నది తెలుసుకునేందుకు చాలాకాలంగానే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సౌర కుటుంబానికి ఆవల వేల సంఖ్యలో గ్రహాలను ఇప్పటికే గుర్తించినప్పటికీ ఈ ఎక్సోప్లానెట్లలో జీవం ఆనవాళ్లు కానీ.. జీవించేందుకు అనువైన పరిస్థితులు కానీ ఇప్పటివరకూ గుర్తించ లేదు. సూర్యుడికి (ఇతర గ్రహ వ్యవస్థల్లోనైతే మాతృ నక్షత్రం) తగినంత దూరంలో ఉండటం.. భూమితో సరిపోలేలా రాళ్లు రప్పలతో, నీళ్లతో ఉండటం జీవం ఉండేందుకు అత్యవసరమన్నది శాస్త్రవేత్తల అంచనా. ఇలాంటి పరిస్థితులు ఉన్న ప్రాంతాన్ని గోల్డీలాక్స్ జోన్ అని పిలుస్తుంటారు. సౌర కుటుంబంలోని గురు గ్రహానికి ఉన్న నాలుగు ఉపగ్రహాల్లో ఒకటైన యూరోపా కొంచెం అటు ఇటుగా ఈ గోల్డీలాక్స్ జోన్లోనే ఉంది. పైగా ఆ ఉపగ్రహంలో మహా సముద్రాలు ఉన్నాయని చాలా కాలంగా తెలుసు. ఈ నేపథ్యంలోనే యూరోపా చుట్టూ చక్కర్లు కొడుతూ దాన్ని మరింత నిశితంగా పరిశీలించేందుకు జరుగుతున్న యూరోపా క్లిప్పర్ ప్రాజెక్టుకు ప్రాధాన్యం ఏర్పడింది. ఆ వివరాలు... 1610లో గెలీలియో గురుగ్రహం వైపు తన దుర్భిణిని మళ్లించి చూసినప్పుడు అతడికి గ్రహంతోపాటు వెలుగులు చిమ్ముతున్న నాలుగు చుక్కల్లాంటివి కనిపించాయి. గురుగ్రహానికి ఉన్న 67 ఉపగ్రహాల్లో అతిపెద్దవైన నాలుగు ఉపగ్రహాలివి. వీటిల్లో అతి చిన్నది యూరోపా! నాసా ప్రయోగించనున్న యూరోపా క్లిప్పర్ కంటే ముందు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ 2022లోనే జూపిటర్ ఐసీమూన్ ఎక్స్‌ప్లోరర్ లేదా జ్యూస్ పేరుతో ఓ పరిశోధక నౌకను యూరోపా పైకి ప్రయోగించనుంది. భవిష్యత్తులో అణుశక్తితో నడిచే జలాంతర్గాములను యూరోపాలోని సముద్రాల్లో ప్రయాణించేలా చేసి ఆ ఉపగ్రహం గురించి మరింత క్షుణ్ణంగా అర్థం చేసుకునేందుకూ ప్రణాళికలు ఉన్నాయి! – సాక్షి, నేషనల్ డెస్క్ -
గోల్డీలాక్స్ దశలో భారత్: నోముర
న్యూఢిల్లీ: భారత్ ‘గోల్డీలాక్స్’ కాలంలో పయనిస్తున్నట్లు జపాన్ ఫైనాన్షియల్ సేవల దిగ్గజ సంస్థ... నోముర అభివర్ణించింది. ద్రవ్యోల్బణం మరీ అధికంగా కాకుండా... అలాగని మాంద్యంలోకి జారిపోయేంత తక్కువగా కాకుండా ఉండే పరిస్థితిని ఆర్థిక పరిభాషలో ‘గోల్డీలాక్స్’గా వ్యవహరిస్తారు. మరో రకంగా చెప్పాలంటే... ఆర్థిక పరిస్థితులు అన్నీ తగిన స్థాయిలో ఉండడమే ‘గోల్డీలాక్స్’. తాజా నివేదికలో నోముర పేర్కొన్న అంశాలను పరిశీలిస్తే.. {పస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 7.6 శాతంగా నమోదయ్యే అవకాశం. తక్కువ స్థాయిలో కొనసాగుతున్న ద్రవ్యోల్బణం, ఆర్థిక వ్యవస్థ క్రమ రికవరీ దీనికి ప్రధాన కారణం. అంతర్జాతీయంగా డిమాండ్ బలహీనంగా ఉన్నా... దేశీయంగా డిమాండ్ వృద్ధి తీరు బాగుంది.ఆగస్టు పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి తీరు (6.4 శాతం), సెప్టెంబర్ రిటైల్ ద్రవ్యోల్బణం (4.41 శాతం) భారత్ వృద్ధికి సంబంధించి సంస్థ అంచనాల పటిష్టతకు కారణం. ఆర్థిక సంవత్సరం సగటున ద్రవ్యోల్బణం 5 శాతం ఉండవచ్చు. ఆర్బీఐ ఇప్పటికే తగిన స్థాయిలో రేట్ల కోత నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది మొదటి ఆరు నెలల వరకూ పాలసీ రేటు యథాతథంగా కొనసాగవచ్చు.కాగా పలు రేటింగ్, విశ్లేషణా, ఆర్థిక సంస్థల అంచనాలతో పోల్చితే.. తాజా నోముర వృద్ధి అంచనాలు కొంత బాగుండడం గమనార్హం. రిజర్వ్ బ్యాంక్ సెప్టెంబర్ 29 విధాన పరపతి సందర్భంగా తన వృద్ధి అంచనాను 7.6 శాతం నుంచి 7.4 శాతానికి తగ్గించింది. ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంక్, ఎన్సీఏఈఆర్లు ఈ రేటును 7.5 శాతంగా అంచనావేస్తున్నాయి. ఫిచ్ అంచనా 7.5 శాతం. ఏడీబీ, డీఎస్బీ 7.4 శాతంగా అంచనావేస్తున్నాయి.