గోల్డీలాక్స్ దశలో భారత్: నోముర
న్యూఢిల్లీ: భారత్ ‘గోల్డీలాక్స్’ కాలంలో పయనిస్తున్నట్లు జపాన్ ఫైనాన్షియల్ సేవల దిగ్గజ సంస్థ... నోముర అభివర్ణించింది. ద్రవ్యోల్బణం మరీ అధికంగా కాకుండా... అలాగని మాంద్యంలోకి జారిపోయేంత తక్కువగా కాకుండా ఉండే పరిస్థితిని ఆర్థిక పరిభాషలో ‘గోల్డీలాక్స్’గా వ్యవహరిస్తారు. మరో రకంగా చెప్పాలంటే... ఆర్థిక పరిస్థితులు అన్నీ తగిన స్థాయిలో ఉండడమే ‘గోల్డీలాక్స్’. తాజా నివేదికలో నోముర పేర్కొన్న అంశాలను పరిశీలిస్తే..
{పస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 7.6 శాతంగా నమోదయ్యే అవకాశం. తక్కువ స్థాయిలో కొనసాగుతున్న ద్రవ్యోల్బణం, ఆర్థిక వ్యవస్థ క్రమ రికవరీ దీనికి ప్రధాన కారణం. అంతర్జాతీయంగా డిమాండ్ బలహీనంగా ఉన్నా... దేశీయంగా డిమాండ్ వృద్ధి తీరు బాగుంది.ఆగస్టు పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి తీరు (6.4 శాతం), సెప్టెంబర్ రిటైల్ ద్రవ్యోల్బణం (4.41 శాతం) భారత్ వృద్ధికి సంబంధించి సంస్థ అంచనాల పటిష్టతకు కారణం. ఆర్థిక సంవత్సరం సగటున ద్రవ్యోల్బణం 5 శాతం ఉండవచ్చు.
ఆర్‌బీఐ ఇప్పటికే తగిన స్థాయిలో రేట్ల కోత నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది మొదటి ఆరు నెలల వరకూ పాలసీ రేటు యథాతథంగా కొనసాగవచ్చు.కాగా పలు రేటింగ్, విశ్లేషణా, ఆర్థిక సంస్థల అంచనాలతో పోల్చితే.. తాజా నోముర వృద్ధి అంచనాలు కొంత బాగుండడం గమనార్హం. రిజర్వ్ బ్యాంక్ సెప్టెంబర్ 29 విధాన పరపతి సందర్భంగా తన వృద్ధి అంచనాను 7.6 శాతం నుంచి 7.4 శాతానికి తగ్గించింది. ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంక్, ఎన్‌సీఏఈఆర్‌లు ఈ రేటును 7.5 శాతంగా అంచనావేస్తున్నాయి. ఫిచ్ అంచనా 7.5 శాతం. ఏడీబీ, డీఎస్‌బీ 7.4 శాతంగా అంచనావేస్తున్నాయి.