డిమాండ్ పరిస్థితులపై పరిశీలన అవసరం
నియంత్రణలోనే ద్రవ్యోల్బణం
2023–24లో వృద్ధి 6.5–7 శాతం
ఆర్థిక శాఖ సెప్టెంబర్ ఎడిషన్ వెల్లడి
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ పనితీరు సంతృప్తికరంగానే ఉందంటూ.. రానున్న రోజుల్లో డిమాండ్ పరిస్థితులపై పరిశీలన అవసరమని కేంద్ర ఆర్థిక శాఖ అభిప్రాయం వ్యక్తం చేసింది. ‘‘భారత ఆర్థిక వ్యవస్థపై సానుకూల దృక్పథం ఉంది. సాగు రంగం పట్ల సానుకూల అంచనాలు, పండుగల్లో డిమాండ్ మెరుగుపడుతుందన్న అంచనాలు, ప్రభుత్వం నుంచి అధిక మూలధన వ్యయాలు పెట్టుబడులకు ఊతమిస్తాయి’’అని సెపె్టంబర్ ఎడిషన్ నెలవారీ ఆర్థిక సమీక్షా నివేదికలో ఆర్థిక శాఖ పేర్కొంది. భారత ఆర్థిక వ్యవస్థ 2024–25 సంవత్సరానికి 6.5–7 శాతం మధ్య వృద్ధిని నమోదు చేస్తుందని అంచనా వేస్తున్నట్టు తెలిపింది.
వినియోగ సెంటిమెంట్ మృదువుగా మారడంతో పట్టణ డిమాండ్ మోస్తరు స్థాయికి చేరుకుంటున్నట్టు కనిపిస్తోందని.. సాధారణం మించి వర్షాలతో ఫూట్‌ఫాల్ (షాపులను సందర్శించే కస్టమర్లు) పరిమితంగా ఉండడం, కాలానుగుణ కారణాలతో ప్రజలు కొత్త కొనుగోళ్లకు దూరంగా ఉన్నట్టు వివరించింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక స్తబ్దత మరింత అధికం కావడం, అభివృద్ధి చెందిన దేశాల వాణిజ్య విధానాల్లో అనిశ్చితి ఇవన్నీ ఆర్థిక వృద్ధికి రిస్క్‌లుగా పేర్కొంది. వీటి ప్రభావాలు భారత ఆర్థిక వ్యవస్థపై ప్రసరించే రిస్క్ ఉందంటూ.. అదే జరిగితే డ్యూరబుల్ గూడ్స్‌పై వినియోగదారులు చేసే వ్యయాలపై ప్రభావం పడొచ్చని అంచనా వేసింది.
ద్రవ్యోల్బణం నియంత్రణలోనే..
వరుసగా రెండు నెలల పాటు తగ్గిన ద్రవ్యోల్బణం తిరిగి సెపె్టంబర్‌లో పెరిగిపోవడం తెలిసిందే. కానీ, కొన్ని కూరగాయలను మినహాయిస్తే ద్రవ్యోల్బణం దాదాపుగా నియంత్రణలోనే ఉన్నట్టు ఆర్థిక శాఖ నివేదిక తెలిపింది. రిజర్వాయర్లలో నీటిమట్టాలు మెరుగ్గా ఉండడం, ఖరీఫ్‌లో జోరుగా విత్తన సాగు వ్యవసాయ ఉత్పాదకత పట్ల ఆశాజనక అంచనాలకు వీలు కలి్పస్తోందని.. ఆహార ధాన్యాల నిల్వలు తగినంత ఉండడంతో మధ్యకాలంలో ధరల కట్టడికి వీలుంటుందని ఆర్థిక శాఖ నివేదిక తెలిపింది. అంతర్జాతీయ ఇన్వెస్టర్లలో భారత్ పట్ల సానుకూల సెంటిమెంట్ ఉన్నట్టు వెల్లడించింది.
స్థిరమైన వృద్ధి సాధించడం ద్వారానే ఈ సెంటిమెంట్‌ను వాస్తవిక పెట్టుబడులుగా మలుచుకునేందుకు అవకాశాలుంటాయని పేర్కొంది. నెల రోజుల్లోనే విదేశీ ఇన్వెస్టర్లు భారత మార్కెట్లో రూ.85వేల కోట్లకు పైగా అమ్మకాలు చేయడం ఈ సందర్భంగా గమనార్హం. విదేశాలతో ఆర్థిక కార్యకలాపాలు (ఎక్స్‌టర్నల్ సెక్టార్) మెరుగ్గా ఉన్నాయని ఈ నివేదిక తెలిపింది. పెరుగుతున్న పెట్టుబడులు, స్థిరమైన రూపాయి, మెరుగైన స్థితిలో విదేశీ మారకం నిల్వలను ప్రస్తావించింది. సెపె్టంబర్ చివరికి 700 బిలియన్ డాలర్లను విదేశీ మారకం నిల్వలు దాటిపోవడాన్ని గుర్తు చేసింది. తయారీ రంగంలో ఉపాధి అవకాశాలు క్రమంగా విస్తరిస్తున్నట్టు తెలిపింది.
వృద్ధి మందగమనంలోకి భారత్
జపాన్ బ్రోకరేజీ సంస్థ నోమురా
ముంబై: భారత ఆర్థిక వ్యవస్థ సైక్లికల్ వృద్ధి మందగమనంలోకి అడుగు పెట్టినట్టు జపాన్ బ్రోకరేజీ దిగ్గజం నోమురా ప్రకటించింది. జీడీపీ 7.2 శాతం వృద్ధి సాధిస్తుందన్న ఆర్‌బీఐ అంచనాలు మరీ ఆశావహంగా ఉన్నట్టు పేర్కొంది. 2024–25లో 6.7 శాతం, 2025–26లో 6.8 శాతం మేర భారత జీడీపీ వృద్ధి సాధిస్తుందన్న తమ అంచనాలు మరింత క్షీణించడానికి రిస్‌్కలు పెరుగుతున్నట్టు పేర్కొంది. వృద్ధి సూచికలు జీడీపీ మరింత మోస్తరు స్థాయికి చేరుకుంటుందని సూచిస్తున్నట్టు తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి దేశ జీడీపీ 7.2 శాతం వృద్ధిని సాధిస్తుందని ఇటీవలి ఆర్‌బీఐ ఎంపీసీ సమీక్ష తన గత అంచనాలను కొనసాగించడం తెలిసిందే.
పట్టణాల్లో వినియోగం సాధారణంగా మారుతున్నట్టు సంకేతాలు కనిపిస్తున్నాయని.. ప్యాసింజర్ వాహన విక్రయాలు తగ్గడం, విమాన ప్రయాణికుల రద్దీ మోస్తరు స్థాయికి దిగిరావడం, ఎఫ్‌ఎంసీజీ సంస్థల అమ్మకాలు దీనికి నిదర్శనాలుగా పేర్కొంది. పట్టణ వినియోగంలో ఈ బలహీన ధోరణి కొనసాగుతుందని తాము భావిస్తున్నట్టు నోమురా తెలిపింది. కంపెనీలు వేతన వ్యయాలను తగ్గించుకుంటున్న విషయాన్ని ప్రస్తావించింది. ‘‘కరోనా అనంతరం ఏర్పడిన పెంటప్ డిమాండ్ సమసిపోయింది. ద్రవ్య విధానం కఠినంగా మారింది. అన్ సెక్యూర్డ్ రుణాలపై ఆర్‌బీఐ ఆంక్షలు వ్యక్తిగత రుణాలు, ఎన్‌బీఎఫ్‌సీ రుణాల వృద్ధి క్షీణతకు దారితీశాయి’’ అని నోమురా తన నివేదికలో వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment