ఇమ్మిగ్రేషన్ తనఖీల్లో చిక్కిన 'గోల్డ్‌క్వెస్ట్' నిందితుడు
హైదరాబాద్: నెల్లూరు జిల్లా కావలిలో గోల్డ్‌క్వెస్ట్ స్కీమ్స్ పేరుతో అనేక మందిని మోసం చేసిన క్వెస్ట్‌నెట్ ఎంటర్ప్రైజెస్ కేసులో మరో నిందితుడిని గురువారం అరెస్టు చేసినట్లు సీఐడీ అదనపు డీజీ టి.కష్ణప్రసాద్ చెప్పారు. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కావలి కేంద్రంగా వ్యవహారాలు నడిపిన క్వెస్ట్‌నెట్ సంస్థ వివిధ స్కీముల పేరుతో అనేక మందికి ఎరవేసి ఒక్కొక్కరి నుంచి 33 వేల రూపాయల నుంచి 66 వేల రూపాయల వరకు వసూలు చేసి మోసం చేసింది. ఈ మోసాలకు సంబంధించి స్థానిక టౌన్ పోలీసుస్టేషన్లో నమోదైన కేసు దర్యాప్తు నిమిత్తం సీఐడీకి బదిలీ అయింది.
కొందరు నిందితుల్ని అరెస్టు చేసిన పోలీసులు పరారీలో ఉన్న వారి కోసం లుక్ ఔట్ సర్క్యులర్ (ఎల్ఓసీ) జారీ చేశారు. అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలను అప్రమత్తం చేశారు. సదరు నిందితులు విదేశాలకు వెళ్లాలని ప్రయత్నించినా, తిరిగి వచ్చినా తక్షణం అదుపులోకి తీసుకుని తమకు సమాచారం ఇవ్వాల్సిందిగా ఈ నోటీసుల్లో ఇమ్మిగ్రేషన్ అధికారుల్ని కోరారు. ఈ నేపథ్యంలోనే బుధవారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయం నుంచి విదేశాలకు పారిపోవాలని ప్రయత్నించిన నిందితుడు రావి రమేష్ బాబు అక్కడి ఇమ్మిగ్రేషన్ తనిఖీల్లో చిక్కారు. విషయం తెలుసుకున్న సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారుల్లో రమేష్‌బాబు ఒకడని పోలీసులు తెలిపారు.
మనీ సర్క్యులేషన్ స్కీం పేరిట అమాయకులకు దేవుడి బొమ్మతో కూడిన నాణేలు అంటగడుతూ దాదాపు 1250 కోట్ల రూపాయలమేర ఆర్జించిన మలేషియా గోల్డ్‌క్వెస్ట్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పుష్పం అప్పలనాయుడిని గుంటూరు సిఐడి అధికారులు మార్చి నెలలో కావలిలో అరెస్టు చేశారు. ఈ కేసుతోపాటు ఆమెపై దేశవ్యాప్తంగా 21 కేసులు ఉన్నాయి. సిఐడి పోలీసులు 2009 నుంచి ఈమె కోసం గాలించారు. తానిచ్చే బంగారు పురాతన నాణెం ఎంతో విలువైనదంటూ అమాయకులను మోసగించారన్నది ఆమెపై అభియోగం. చెన్నైలో ఈ సంస్థకు చెందిన బంగారం, వెండి కాయిన్స్ గోడౌన్‌ను సీఐడీ సీజ్ చేసింది. మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రా, శ్రీలంకలోని ఈ సంస్థ డైరెక్టర్లపై కూడా కేసులు నమోదైయ్యాయి. మలేషియా కేంద్రంగా మనీ సర్క్యులేషన్ రాకెట్‌ను పుష్పం అప్పలనాయుడు నడిపినట్లు తెలుస్తోంది.