ఆచారం-అపచారం
జీవన కాలమ్
నాకేమో చక్రవర్తి రాజగోపా లాచార్యులుగారు, ఎం.జి. ఆర్., కరుణానిధిగారు ఎల్ల ప్పుడూ నల్లకళ్లద్దాలు పెట్టుకో వడం ఎబ్బెట్టుగా అనిపిస్తుం ది. అయితే వారికి ఏ కంటి జబ్బులో, మరేవో కారణాలు ఉండవచ్చు. కాగా, ఈ ముగ్గు రు నాయకులూ తమిళనాడు వారే కావడం మరో విశేషం. ఒకే రకం జబ్బున్న లేదా అలవాటున్న ముగ్గురు గొప్ప నాయకుల రాష్ట్రమది.
ఏది చేసినా చేయకపోయినా కన్ను ఎదుటి వ్యక్తి పట్ల మన మర్యాదనీ, గౌర వాన్నీ, అభిమానాన్ని - ఇన్నింటిని సూచి స్తుంది. కన్ను మన వ్యక్తిత్వాన్ని, శీలాన్ని ఆవిష్కరించే కిటికీ. కనుక కళ్లను దాచిపెట్టి ఎదుటి వ్యక్తిని పలకరించడం కాస్త అపచా రమే. ఇలాంటి అపచారాన్ని మొన్న ఛత్తీస్ గఢ్కి ప్రధాని వచ్చినప్పుడు ఇద్దరు కలెక్టర్లు చేశారు. వీరు మర్యాదల గురించీ, విధుల గురించీ, సంప్రదాయాల గురించీ సశాస్త్రీ యంగా తర్ఫీదు పొందినవారు. అయినా మొన్న బస్తర్ కలెక్టరు సతీష్ కటారియాగారు, దంతెవాడ కలెక్టరు దేవ సేనాపతిగారు - ఇద్దరూ ప్రధాని పర్యటనలో ఒకే రక మయిన సంప్రదాయ ఉల్లంఘన చేశారు. పాపం, తొడు క్కోడానికి వారిద్దరూ బంద్గాలాలు తెచ్చుకున్నారు. ఆ కారణంగానే టైలు తెచ్చుకోలేదు. ఎండ ఎక్కువగా ఉం డటంవల్లనూ, హుటాహుటిన ప్రధాని రావడం వల్లనూ- వారు బంద్గాలాని ధరించలేదు. ముఖ్యంగా నల్లకళ్లద్దాలను తీసేయలేదు. ఆ దృశ్యం- సినీమాకు భార్యతో వెళ్తూ దారిలో కనిపించిన పెద్ద మనిషి - ప్రధానిని - వారు సరదాగా పలకరించినట్టు కని పించింది. ఇది అపచారమని రాష్ట్ర ప్రభుత్వం వారిని హెచ్చరించింది.
అలనాడు- కొలువుల్లో పనిచేసిన వారూ, ప్రజా జీవితాన్ని గడిపిన వారూ చాలా మంది పెద్దలు తల పాగాలతో కనిపించడం చూస్తూనే ఉంటాం. సర్వేపల్లి రాధాకృష్ణన్, మోక్షగుండం విశ్వేశ్వరయ్య, సి.పి.రామ స్వామి అయ్యర్, గురజాడ అప్పారావు, కందుకూరి వీరేశలింగం, రఘుపతి వెంకటరత్నం నాయుడు, ముట్నూరి కృష్ణారావు, పారుపల్లి రామకృష్ణయ్య, వీణ వెంకట రమణదాసు, బాలగంగాధర తిలక్, లాలా లజ పతిరాయ్, మదనమోహన్ మాలవ్యా, స్వామి వివేకా నంద, నాటకాలకి కాక ప్రజల మధ్యకి వచ్చేటప్పుడు అద్దంకి శ్రీరామమూర్తిగారు తలపాగా చుట్టుకునేవారు. ఒక సంప్రదాయానికి కట్టుబడిన తరమది.
తాను ప్రజలకు ప్రధాన సేవకుడినని మోదీగారు పదే పదే చెప్పుకుంటూంటారు. ఆ లెక్కన ప్రజాసేవకు ఉద్యోగం చేస్తున్నవారు వీరిద్దరూ. పైగా ఇలాంటి మర్యా దలు ఆలిండియా సర్వీసు నిబంధనలలో ఒక భాగం. నాకెప్పుడూ పెద్దపెద్ద సభల్లో ప్రసంగిస్తున్న ప్రధాని, ముఖ్యమంత్రి వెనుక నల్లకళ్లద్దాలు పెట్టుకుని నిలబడే ఇద్దరు ఆఫీసర్లు అపశ్రుతిలాగ కనిపిస్తూంటారు. అయితే రహస్య పరిశోధకశాఖకు చెందిన వారి పని -తామెటు, ఎవరిని చూస్తున్నారో తెలియకుండా అందరినీ కనిపెట్ట డమేనని జ్ఞప్తికి వచ్చినప్పుడు రాజీపడతాను.
ఒక ముఖ్యమైన సంఘటన. 1982 ఏప్రిల్లో నటుడినయ్యాను. నా రెండో సినీమా క్రాంతికుమార్ ‘ఇది పెళ్లంటారా?’. ఆ సినీమాలో నా పాత్రకి మాసిన గెడ్డం ఉండాలి. పెంచమన్నాడు క్రాంతికుమార్. నేను కడప రేడియో స్టేషన్కి ఇన్చార్జిని. ఆ రెండు మూడు నెలల్లో అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డిగారు అనంత పూర్ వచ్చారు. ఆ సందర్భంలో స్థానిక సంస్థల అధిప తులు అక్కడ నిలవడం మర్యాద. నేనూ వెళ్లాను. ప్రొటో కాల్ ఆఫీసరు నన్ను చూసి, నా మాసిన గెడ్డం చూసి ఇబ్బంది పడిపోయాడు. నా కారణాలు చెప్పాను. ఆయ న అంగీకరించలేకపోయాడు. నన్ను రెండో వరసలో నిల బెట్టాడు. అదృష్టవశాత్తూ ఆ పర్యటనలో నా ప్రమే యం- కేవలం లాంఛనం తప్ప ఏమీలేదు. తీరా సంజీ వరెడ్డిగారు హెలికాప్టర్ దిగి సరాసరి కారు దగ్గరికి వెళ్లి ఎక్కేశారు. అది ప్రైవేట్ రాక అని గుర్తు. అలాంటి పర్యటనకి ప్రొటోకాల్ పట్టింపు ఎక్కువ ఉండదేమో.
ఏమయినా ప్రభుత్వపరంగా సేవా ధర్మం నీచమయిన మాటకాదు. ఈ దేశపు ప్రధాని ముందు నిలిచినప్పుడు- బాధ్య తాయుతమైన జిల్లా అధికారి - పది మం దికి మార్గదర్శకం కావలసిన అధికారి- లాంఛనాలను పాటించకపోవడం అప శ్రుతి. కొన్ని లాంఛనాలు వ్యవస్థకి ఒక గౌరవాన్నీ, గాం భీర్యాన్నీ ఇస్తాయి. కొన్నింటిని పాటించడం ఆయా స్థాయిలలో తప్పనిసరి.
ఒక ప్రముఖ వ్యక్తి వచ్చినప్పుడు లేచి నమస్కరిం చడం మర్యాద. నమస్కరించకపోతే? ఒక విలువ దెబ్బ తింటుంది. అంతే. అయితే ఒక అధికారికి మరో అధికారి ఇవ్వాల్సిన మర్యాద - కేవలం మర్యాద మాత్రమే కాదు. ఒక సంప్రదాయ పరిరక్షణ. బాధ్యత. ఇవ్వకపోతే? ఒక వ్యవస్థ గాంభీర్యం దెబ్బతింటుంది. తర్వాత ఏం జరుగు తుందన్నది వేరే విషయం. అది అరాచకం.
గొల్లపూడి మారుతీరావు