- మున్సిపల్ కౌన్సిల్ తీరుపై గొల్లపూడి ఆవేదన
విజయనగరం
ప్రముఖ సంఘ సంస్కర్త గురజాడ అప్పారావు పేరుతో విజయనగరంలో స్మారక భవనాన్ని నిర్మించడంలో అలసత్వం సరికాదని ప్రముఖ కవి, నటుడు గొల్లపూడి మారుతీరావు అన్నారు. గురజాడ స్మారక భవన నిర్మాణంపై మునిసిపల్ కౌన్సిల్‌లో ప్రతిపాదన వస్తే తిరస్కరించడం విచారకరమన్నారు. సోమవారం విజయనగరంలోని గురజాడ స్వగృహం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గొల్లపూడి మాట్లాడారు.
గురజాడ స్మారక భవనం కోసం ఉద్యమం చేస్తామనడంతో కౌన్సిల్‌లో ప్రతిపాదన పెడతామని ఇప్పటికైనా చెప్పడం సంతోషకరమన్నారు. గురజాడ స్వగృహాన్ని ఆధునికీకరించి దాన్ని స్మారక భవనంగా అభివృద్ధి చేయాలన్నారు. గురజాడ భవన్ పరిరక్షణ కోసం ఉపన్యాసాలకు పరిమితం కాకుండా నిరంతరం కృషి చేయాలని సూచించారు.
గురజాడ భవన్ ఆ నాటి జ్ఞాపకాలను తెలియజేసేదిగా ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విశాఖపట్నానికి చెందిన ప్రముఖ రచయిత రామతీర్థ మాట్లాడుతూ... 13 జిల్లాల్లోనూ గురజాడ భవనాలను నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.