monumental building
-
లేటు వయసులో ఘాటు ప్రేమ.. ఏకంగా రొటేటింగ్ హౌస్ కట్టించాడు!!
ప్రేమకు చిహ్నం చూపమంటే.. షాజహాన్ తన భార్య కోసం కట్టిన తాజ్‌మహల్ వెంటనే మదిలో మెదులుతుంది. ఐతే తరాలుగా ఎందరో తమకు ఇష్టమైన వారికోసం ఎన్నో కట్టారు. కానీ అంతగా గుర్తింపుకు నోచుకోలేదు. తాజాగా ఉత్తర బోస్నియాకు చెందిన 72 యేళ్ల వ్యక్తి భార్య కోసం రొటేటింగ్ హౌస్‌ను కట్టించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఆకు పచ్చ ముఖభాగం, రెడ్ మెటల్ రూఫ్‌తో 360 యాంగిల్లో తిరిగే ఈ రొటేటింగ్ హౌస్‌ను వోజిన్ కుసిక్ అనే వ్యక్తి, తన భార్య లుబికా కోసం నిర్మించాడు. కాలేజీ చదువుకూడా లేని కుసిక్ ఈ రొటేట్ హౌస్‌ను స్వయంగా డిజైన్ చేశాడట. కేవలం ఎలక్ట్రిక్ మోటార్లు, పాత మిలిటరీ రవాణా వాహన చక్రాలను ఉపయోగించి కట్టాడని అక్కడి స్థానిక మీడియాకు వెల్లడించాడు. జీవిత చరమాంకానికి చేరుకున్న తర్వాత, పిల్లలు కుటుంబ బాధ్యతలు తీసుకున్న ఇన్నేళ్లకి నా భార్య కోరిక తీర్చడానికి సమయం దొరికిందని చెప్పుకొచ్చాడు. కుసిక్ వివాహం చేసుకున్నాక భార్య, బిడ్డల కోసం అప్పట్లో ఒక ఇంటిని నిర్మించాడట. ఐతే ఆ టైంలో బెడ్ రూం సూర్యునికి ముఖాముఖిగా ఉండాలని భార్య కోరడంతో, భార్య అభీష్టానికి తగినట్లుగా గదుల నిర్మాణాన్ని మార్చాడు. రోడ్డుకి ఎదురుగా ముఖ ద్వారం వచ్చింది. దీంతో రోడ్డు మీద వెళ్లేవారందరినీ చూడాలనుకోవడం లేదని భర్తకు పిర్యాదు చేసింది భార్య. చాలా కష్టమైన పనైనప్పటికీ భార్య కోరుకున్నట్లు ప్రతిదీ మార్చవలసి వచ్చేదట. ‘ఇప్పుడైతే, మా ముందు తలుపు కూడా తిరుగుతుంది. రోడ్డు మీద వ్యక్తులెవరైనా కనిపిస్తే, ఆమె ఇంటిని తనకిష్టం వచ్చిన వైప్పుకు తిప్పుకోవచ్చు’అని సరదాగా మీడియాతో తన అనుభవాలను పంచుకున్నాడు. దీంతో ఈ వీడియోను నెటిజన్లు ఆసక్తిగా వీక్షిస్తున్నారు. చదవండి: అలాంటప్పుడు.. తాళం ఎందుకేసుకున్నావయ్యా!! -
స్మారక మందిరంగా జయలలిత నివాసం
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు మాజీ సీఎం, దివంగత జయలలిత నివసించిన చెన్నై పోయెస్ గార్డెన్‌లోని వేద నిలయాన్ని జయ స్మారక మందిరంగా మార్చాలని మద్రాసు హైకోర్టు బుధవారం తీర్పు చెప్పింది. జయ ఆస్తులపై ఆమె అన్న కుమార్తె దీప, కుమారుడు దీపక్లకూ వారసత్వపు హక్కు ఉంటుందని స్పష్టం చేసింది. జయకు రూ.913 కోట్ల స్థిర, చరాస్తులున్నాయి. ఆమె ఆకస్మిక మరణంతో ఆస్తులకు వారసులు ఎవరన్న అంశం వివాదమైంది. జయ ఆస్తుల పర్యవేక్షణకు ప్రైవేటు నిర్వాహకుడిని నియమించాల్సిందిగా కోరుతూ అన్నాడీఎంకే తిరుగుబాటు నేత పుహళేంది (ప్రస్తుతం పార్టీతో రాజీ), జానకిరామన్ అనే మరో వ్యక్తి మద్రాసు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన మద్రాసు హైకోర్టు బుధవారం తీర్పు చెప్పింది. -
వెలుగు.. కనుమరుగు
పెదవాల్తేరు(విశాఖ తూర్పు) : ఒకప్పటి చరిత్రకు.. నాటి జీవితం తీరుతెన్నులకు సాక్ష్యాధారాలు ఇప్పటికీ అక్కడక్కడా మిగిలిన గత వైభవ చిహ్నాలు. అప్పటి పాలనకు, జీవనానికి ఇవి కొండగురుతులు. ఇటువంటి నిర్మాణాలు విశాఖ వైభవానికి ప్రతీకలు. పాలనకు కేంద్రమై కళకళలాడే కలెక్టరేట్ నుంచి రోగులకు స్వస్థత చేకూర్చే కేజీహెచ్ వరకు.. ప్రేమ చిహ్నంగా వెలుగులీనే విశాఖ తాజ్ మహల్ నుంచి చదువుల చెట్టుగా వన్నెకెక్కిన సెయింట్ అలాషి యస్ స్కూల్ వరకు.. ఒకటా రెండా.. ఎన్నో.. ఎన్నెన్నో విశిష్ట నిర్మాణాలు. అన్నీ గతవైభవ ఘనకీర్తులకు నిదర్శనాలు. అయితే వీటిలో చాలామట్టుక పాలకుల నిర్లక్ష్యం కారణంగా చెరిగిపోతున్నాయి. చెదిరిపోతున్నాయి. కాల గమనంలో కనుమరుగవుతున్నాయి. వాటిని పరిరక్షించాల్సిన వారి బాధ్యతారాహిత్యం కారణంగా నిశ్శబ్దంగా అదృశ్యమైపోతున్నాయి. బుధవారం ప్రపంచ చారిత్రక కట్టడాల పరిరక్షణ దినోత్సవం జరుపుకొంటున్న నేపథ్యంలో తమను కాపాడేవారెవరని మౌనంగా ప్రశ్నిస్తున్నాయి. నాటి నిర్మాణాలు బ్రిటిష్ హయాంలో విశాఖలో ఎన్నో కట్టడాలు రూపుదిద్దుకున్నాయి. వీటిలో అధిక భాగం ఇప్పటికీ మనుగడ సాగిస్తున్నాయి. ముఖ్యంగా వన్‌టౌన్ ప్రాంతంలో పలు చారిత్రక కట్టడాలు కనిపిస్తాయి. కలెక్టరేట్, క్వీన్‌మేరీ ప్రభుత్వ బాలికల పాఠశాల, విక్టోరియా మహారాణి విగ్రహం, కురుపాం మార్కెట్, సెయింట్ ఎలాసియస్ మిషనరీ పాఠశాల, డచ్ సమాధులు, జగదాంబ జంక్షన్లో గల రెజిమెంటల్ లైన్స్ సమాధులు, పాత పోస్టాఫీసు దరి చర్చి, బురుజుపేటలోని చర్చి వుడా రూపొందించిన జాబితాలో చోటుచేసుకున్నాయి. అలాగే, పెదవాల్తేరులో గల రాణీచంద్రమణీదేవి ఆస్పత్రి, ఇప్పటి విశ్వప్రియ ఫంక్షన్ హాల్, కిర్లంపూడి లేఅవుట్లో గల విశాఖమ్యూజియం, కేజీహెచ్ వంటివెన్నో అప్పటి చరిత్రను గుర్తు చేస్తూ ఉంటాయి. బీచ్ ఒడ్డున ప్రేమచిహ్నంగా నిలిచిన వైజాగ్ తాజ్ మహల్.. పాతపోస్టాఫీసు దగ్గరి విక్టోరియా మహారాణి విగ్రహం వంటివి మాత్రమే కాక టౌన్‌హాల్, హవామహల్, టర్నర్ చౌల్ట్రీ వంటి నిర్మాణాలు చరిత్ర ప్రసిద్ధమైనవి. వీటిలో చాలామట్టుకు శిథిలమవుతున్నాయి. హెరిటేజ్ డేలను మొక్కుబడిగా నిర్వరిస్తూ వీటి సంరక్షణను కాస్తయినా పట్టించుకోని పాలకుల నిర్వాకం కారణంగా ఇవి క్రమంగా అదృశ్యమైపోయే పరిస్థితిలో ఉన్నాయి. ఈసారైనా పాలకుల దృష్టి వీటిపై పడుతుందంటే సందేహమే. -
గురజాడ భవన్ నిర్మాణంలో అలసత్వం తగదు
- మున్సిపల్ కౌన్సిల్ తీరుపై గొల్లపూడి ఆవేదన విజయనగరం ప్రముఖ సంఘ సంస్కర్త గురజాడ అప్పారావు పేరుతో విజయనగరంలో స్మారక భవనాన్ని నిర్మించడంలో అలసత్వం సరికాదని ప్రముఖ కవి, నటుడు గొల్లపూడి మారుతీరావు అన్నారు. గురజాడ స్మారక భవన నిర్మాణంపై మునిసిపల్ కౌన్సిల్లో ప్రతిపాదన వస్తే తిరస్కరించడం విచారకరమన్నారు. సోమవారం విజయనగరంలోని గురజాడ స్వగృహం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గొల్లపూడి మాట్లాడారు. గురజాడ స్మారక భవనం కోసం ఉద్యమం చేస్తామనడంతో కౌన్సిల్లో ప్రతిపాదన పెడతామని ఇప్పటికైనా చెప్పడం సంతోషకరమన్నారు. గురజాడ స్వగృహాన్ని ఆధునికీకరించి దాన్ని స్మారక భవనంగా అభివృద్ధి చేయాలన్నారు. గురజాడ భవన్ పరిరక్షణ కోసం ఉపన్యాసాలకు పరిమితం కాకుండా నిరంతరం కృషి చేయాలని సూచించారు. గురజాడ భవన్ ఆ నాటి జ్ఞాపకాలను తెలియజేసేదిగా ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విశాఖపట్నానికి చెందిన ప్రముఖ రచయిత రామతీర్థ మాట్లాడుతూ... 13 జిల్లాల్లోనూ గురజాడ భవనాలను నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.