వైజాగ్ తాజ్‌మహల్
పెదవాల్తేరు(విశాఖ తూర్పు) : ఒకప్పటి చరిత్రకు.. నాటి జీవితం తీరుతెన్నులకు సాక్ష్యాధారాలు ఇప్పటికీ అక్కడక్కడా మిగిలిన గత వైభవ చిహ్నాలు. అప్పటి పాలనకు, జీవనానికి ఇవి కొండగురుతులు. ఇటువంటి నిర్మాణాలు విశాఖ వైభవానికి ప్రతీకలు. పాలనకు కేంద్రమై కళకళలాడే కలెక్టరేట్ నుంచి రోగులకు స్వస్థత చేకూర్చే కేజీహెచ్ వరకు.. ప్రేమ చిహ్నంగా వెలుగులీనే విశాఖ తాజ్ మహల్ నుంచి చదువుల చెట్టుగా వన్నెకెక్కిన సెయింట్ అలాషి యస్ స్కూల్ వరకు.. ఒకటా రెండా.. ఎన్నో.. ఎన్నెన్నో విశిష్ట నిర్మాణాలు.
అన్నీ గతవైభవ ఘనకీర్తులకు నిదర్శనాలు. అయితే వీటిలో చాలామట్టుక పాలకుల నిర్లక్ష్యం కారణంగా చెరిగిపోతున్నాయి. చెదిరిపోతున్నాయి. కాల గమనంలో కనుమరుగవుతున్నాయి. వాటిని పరిరక్షించాల్సిన వారి బాధ్యతారాహిత్యం కారణంగా నిశ్శబ్దంగా అదృశ్యమైపోతున్నాయి. బుధవారం ప్రపంచ చారిత్రక కట్టడాల పరిరక్షణ దినోత్సవం జరుపుకొంటున్న నేపథ్యంలో తమను కాపాడేవారెవరని మౌనంగా ప్రశ్నిస్తున్నాయి.
నాటి నిర్మాణాలు
బ్రిటిష్ హయాంలో విశాఖలో ఎన్నో కట్టడాలు రూపుదిద్దుకున్నాయి. వీటిలో అధిక భాగం ఇప్పటికీ మనుగడ సాగిస్తున్నాయి. ముఖ్యంగా వన్‌టౌన్ ప్రాంతంలో పలు చారిత్రక కట్టడాలు కనిపిస్తాయి. కలెక్టరేట్, క్వీన్‌మేరీ ప్రభుత్వ బాలికల పాఠశాల, విక్టోరియా మహారాణి విగ్రహం, కురుపాం మార్కెట్, సెయింట్ ఎలాసియస్ మిషనరీ పాఠశాల, డచ్ సమాధులు, జగదాంబ జంక్షన్‌లో గల రెజిమెంటల్ లైన్స్ సమాధులు, పాత పోస్టాఫీసు దరి చర్చి, బురుజుపేటలోని చర్చి వుడా రూపొందించిన జాబితాలో చోటుచేసుకున్నాయి. అలాగే, పెదవాల్తేరులో గల రాణీచంద్రమణీదేవి ఆస్పత్రి, ఇప్పటి విశ్వప్రియ ఫంక్షన్ హాల్, కిర్లంపూడి లేఅవుట్‌లో గల విశాఖమ్యూజియం, కేజీహెచ్ వంటివెన్నో అప్పటి చరిత్రను గుర్తు చేస్తూ ఉంటాయి.
బీచ్ ఒడ్డున ప్రేమచిహ్నంగా నిలిచిన వైజాగ్ తాజ్ మహల్.. పాతపోస్టాఫీసు దగ్గరి విక్టోరియా మహారాణి విగ్రహం వంటివి మాత్రమే కాక టౌన్‌హాల్, హవామహల్, టర్నర్ చౌల్ట్రీ వంటి నిర్మాణాలు చరిత్ర ప్రసిద్ధమైనవి. వీటిలో చాలామట్టుకు శిథిలమవుతున్నాయి. హెరిటేజ్ డేలను మొక్కుబడిగా నిర్వరిస్తూ వీటి సంరక్షణను కాస్తయినా పట్టించుకోని పాలకుల నిర్వాకం కారణంగా ఇవి క్రమంగా అదృశ్యమైపోయే పరిస్థితిలో ఉన్నాయి. ఈసారైనా పాలకుల దృష్టి వీటిపై పడుతుందంటే సందేహమే.
Comments
Please login to add a commentAdd a comment