good days
-
కొత్త సంకల్పాలు 2023: మూస నిర్ణయాలు వద్దు.. పాత నిర్లక్ష్యాలూ వద్దు
‘జిమ్‌లో చేరాలి’ ‘టైమ్‌కి భోజనం చేయాలి’ ‘వాకింగ్ మొదలెట్టాలి’ ‘స్మోకింగ్ మానేయాలి’... ఇలా కొత్త సంవత్సరం నిర్ణయాలు తీసుకోవడం, మర్చిపోవడం, జోక్‌గా మార్చడం ఇకపై వద్దు. కొత్తగా ఆలోచించండి. ‘నాలో నుంచి ద్వేషం తీసేస్తాను’ ‘ఇక పై సహనాన్ని సాధన చేస్తాను’ ‘జ్ఞానాన్ని పెంచుకుంటాను’ ‘డిజిటల్ సమయాన్ని తగ్గించుకుని కుటుంబానికి కేటాయిస్తాను’ ఎంత బాగున్నాయి ఇలాంటి నిర్ణయాలు. రాబోయే కాలం వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సామాజికంగా మీకెన్నో సవాళ్లు విసరొచ్చు. వాటి కోసం సిద్ధం కండి. చెదరని సంకల్పాలు ఈ సంవత్సరం తీసుకోండి. ‘ఈ పని చేసి తీరాలి’, ‘ఇది జరిగి తీరాలి’ అని హెచ్చరించుకోకపోతే మనిషి ఏ పనీ చేయడు. తనకు తాను గట్టిగా చెప్పుకోవడం కూడా అవసరమే. ‘నిర్ణయం’ (డెసిషన్) తీసుకుంటే దానిని మార్చుకునే అవకాశం ఉంది. కాని సంకల్పం (విల్) తీసుకోవాలి. ఒక పని సంకల్పించాక దానిని ఇక మార్చకూడదు. పూర్వం దీక్షా కంకణాలు కట్టేవారు పెద్దలు. ఒక పని అనుకున్నాక పూర్తయ్యే వరకు ఆ పనిని గుర్తు చేస్తూ కట్టే కంకణం అన్నమాట. పని పూర్తయ్యాకే కంకణం విప్పాలి. ఇప్పుడు 365 రోజుల పాటు విప్పడానికి వీల్లేని మనో కంకణం కట్టుకోవాలి కొత్త సంవత్సర సంకల్పంగా. ఎందుకు? ఎప్పటికప్పుడు జీవితాన్ని మెరుగు పర్చుకోవడానికి. సరి చేసుకోవడానికి. క్వాలిటీ ఆఫ్ లైఫ్ గడపడానికి. అర్థవంతంగా గడపడానికి. జీవితం జోక్ కాదు. తేలిగ్గా తీసుకునేది అంతకన్నా కాదు. చిన్న రాయి దెబ్బకు కూడా కకావికలం కావచ్చు జీవితం. అందువల్ల ఏమరుపాటుగా ఉండటానికి కూడా కొత్త సంవత్సర సంకల్పాలు తీసుకోవాలి. 2023లో వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, సామాజికంగా ఎటువంటి మెరుగుదలకు సంకల్పాలు తీసుకోవచ్చో చూద్దాం. వ్యక్తిగతంగా... 1. భౌతికంగా ఎలా ఉన్నారు?: లావు, సన్నం తర్వాత. ముందు మీరు చురుగ్గా ఉన్నారా లేదా చూసుకోండి. ఆరోగ్యకరమైన శరీరం సగం సంతోషాన్ని, దేనినైనా ఎదుర్కొనవచ్చనే ధైర్యాన్ని ఇస్తుంది. మీకు మీరు దిలాసా ఇచ్చుకోవడానికి శరీరాన్ని చురుగ్గా ఉంచండి. వ్యాయామం, హెల్త్ చెకప్ అవసరం. సొంత వైద్యం మానాలి. అదే తగ్గిపోతుందిలే అనే నిర్లక్ష్యం వద్దు. శరీరమే ఆయుష్షు. మీ చర్యలతో మీకు మీరే ఆయుష్షు పోసుకోండి. 2. మానసికంగా: మానసిక ఉద్వేగాలు శరీరంపై ప్రభావం చూపుతాయి. కొన్ని లక్షణాలు జన్మతః, కొన్ని లక్షణాలు స్వభావరీత్యా ఏర్పడతాయి. వాటిలో పనికిమాలినవి వదిలేయండి. ఉదాహరణకు: ఈ సంవత్సరం అసూయ పడను అనుకుంటే చాలా మంది బంధువులు, స్నేహితులు, కలీగ్స్ మీకు ఆత్మీయులు అయిపోతారు. అసూయతోనే వారికి మీరు దూరం అవుతారు. అసూయ లేకపోతే ఇంత బలగం వస్తుంది. ద్వేషం, అత్యాశ, త్వరగా అందలం ఎక్కేయాలన్న కుతి... ఇవి వదులుకోవడం చాలా అవసరమైన సంకల్పాలు. ‘నా ప్రయాణం ఆరాంగా చేస్తాను. అంచెలంచెలుగా ముందుకు సాగుతాను. నా రేంజ్లో ఎంత పొందవచ్చో అంతా పొందుతాను. మిగిలినవారిని చూసి పోల్చుకోను’ అనుకోవడం మానసిక ఆరోగ్యానికి ఎంతో అవసరం. 3. ఉద్యోగపరంగా: వృత్తి నైపుణ్యం పెంచుకుంటాను అని సంకల్పించాలి. ఉన్న చోట ఉండిపోవడం తెలిసినదానితో ఆగిపోవడం సరి కాదు. పనిలో నైపుణ్యం పెరిగే కొద్దీ అందుకు అవసరమైన పరిజ్ఞానం పెంచుకునే కొద్దీ మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ‘ఈ ఉద్యోగం పోతే ఎలా’ అనే భయం పోతుంది. ‘ఎక్కడైనా బతకొచ్చు’ అనే ధైర్యం వస్తుంది. పని నేర్చుకోండి. మీ పనికి విలువ ఇచ్చే చోటుకు మారిపోండి. కుటుంబపరంగా... 1. మొదట కుటుంబం: కుటుంబం మొదటి ్రపాధాన్యం అనుకోవాలి. భార్య లేదా భర్త ఉద్యోగాలు చేస్తున్నా వేరే అభిరుచుల్లో ఉన్నా పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నా కుటుంబమే మొదటి ్రపాధాన్యం. ‘రోజూ రాత్రి భోజనం కలిసి చేయాలి’ నిర్ణయాన్ని తప్పనిసరిగా అమలు చేస్తే ఇల్లు దాదాపుగా ఒక దారికి వచ్చినట్టు. ‘చె΄్తాను... వింటాను’ అనేది కూడా చాలా పెద్ద సంకల్పం. భార్యకు/భర్తకు చెప్పాలనుకున్నది చెప్పకపోవడం, వారు చెప్పేది వినకపోవడం కుటుంబాల్లో అగాధాలకు కారణం. పిల్లల విషయంలో ‘అడుగుతాను/వింటాను’ అనే సంకల్పం. పిల్లలు ఏం చేస్తున్నారు... వారి రొటీన్... స్నేహితులు... ఇవి అడగడం 365 రోజులూ చేయాల్సిందే. వారి మనసులో ఏముందో మాటల్లో పెట్టి వినాల్సిందే. ‘ఫోన్ టైమ్ తగ్గించుకుంటాను’ అని సంకల్పించుకుంటే, సోషల్ మీడియా టైమ్ కట్ చేసుకుంటే రాబోయే సంవత్సరం మీకెన్నో కౌటుంబిక ఆనందాలు ఇస్తుంది. 2. ఆర్థిక నిర్లక్ష్యం వద్దు: ఇతర నిర్లక్ష్యాల కంటే అర్థిక నిర్లక్ష్యం మూలాల మీద కొడుతుంది. ఆప్తులను దూరం చేస్తుంది. చేతులు నులుముకునేలా చేస్తుంది. ‘ఆర్థిక విషయాల్లో మరింత జాగ్రత్తగా ఉంటాను’ అనేది ముఖ్య సంకల్పం. కుటుంబం మొత్తం కలిసి ‘అనవసరమైనవి కొనం/ అనవసర ఖర్చులు చేయం/వేస్ట్‌ను నివారిస్తాం’ అనుకుంటే చాలా మంచి జరుగుతుంది. లైట్లు, గీజర్లు, స్టౌ, టీవీ, కంప్యూటర్ సమయానికి అందరూ ఆపినా చాలా పెద్ద విషయమే. ‘రాబోయే అవసరాలకు ఇప్పుడు ఎంత ఉంది’ అని చూసుకుంటే జాగ్రత్త అదే వస్తుంది. 3. చైతన్యంగా ఉంటాం: కుటుంబం ఆరోగ్యంగా, ఆర్థికంగా బాగున్నా చైతన్యం లేకుండా అజ్ఞానంతో ఉంటే ఎలా? పేపర్ తెప్పించండి. కుటుంబంలో ప్రతి ఒక్కరూ నెలకు ఒక పుస్తకమైనా చదవాలి అని సంకల్పించుకోవడం ఇంటికి వెలుతురు తీసుకురావడం. సామాజికంగా... మంచి ΄పౌరుడిగా మారండి: రోడ్డు మీద ఉమ్మను... ట్రాఫిక్ నియమాలు పాటిస్తాను.. అని అనుకోవడం కూడా చాలా పెద్ద విషయమే. ఒకటి సంస్కారం.. రెండోది ్రపాణానికి భద్రత. సమాజంలో ఒకరికి హాని చేసే ద్వేషాన్ని ప్రచారం చేయకుండా, ఒకరికి నష్టం చేసే అబద్ధంలో భాగంగా కాకుండా, ‘తెలిసీ కావాలనీ తప్పని తెలిసినా’ అలాంటి పనులు చేసి సామాజిక కలనేతకు నష్టం కలగించకుండా ఉంటాను అనుకోవడం అత్యంత ముఖ్యమైన సంకల్పం. ఇక దీక్ష బూనడం మీ వంతు. -
దశ తిరిగింది !
దశాబ్దాలుగా కనీస సౌకర్యాలకు నోచుకోని ఆ రెండు గ్రామాల దశ ఒక్క ఫోన్ కాల్‌తో మారబోతోంది. రావికమతం మండలం పశులబంద, జీలుగులోవ గిరిజన గ్రామాలకు రోడ్డు, విద్యుత్, మంచినీరు సౌకర్యాలు కల్పించాలని వచ్చిన వినతిపై జిల్లా యంత్రాంగం స్పందించింది. ఇటీవల సాక్షి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్‌తో నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమంలో కొంతమంది గిరిజనులు తమ సమస్యలను చెప్పుకున్నారు. స్పందించిన కలెక్టర్ ఆ రెండు గ్రామాలకు కనీస సౌకర్యాలు కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు. ఆ గ్రామాలను తహసీల్దార్ పి.కనకారావు, ఎంపీడీవో రామచంద్రరావు, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులు సందర్శించారు. విద్యుత్, తాగునీరు, రోడ్ల పనులకు శ్రీకారం చుట్టడంతో గిరిజనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మహారాణిపేట,(విశాఖ దక్షిణ): రావికమతం మండలం పశులబంద, జీలుగులోవ గిరిజన గ్రామాలు కొనేళ్ల వరకూ రెవెన్యూ రికార్డుల్లో లేవు. దీంతో అభివృద్ధి ఈ ఊర్లవైపు తొంగిచూలేదు. సుమారు మూడేళ్ల క్రితం రెవెన్యూ రికారుల్లో చేర్చినప్పటికీ పాలకులు పట్టించుకోలేదు. దీంతో ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎంత మంది పాలకులు వచ్చినా అభివృద్ధి ఆనవాళ్లు ఇక్కడ కనిపించలేదు. కళ్యాణపులోవకు ఆరు కిలో మీటర్ల దూరంలో సామాలమ్మ కొండల్లో పశులబంద, జీలుగులోవ గిరిజన గ్రామాలు ఉన్నాయి. విద్యుత్ సౌకర్యం లేదు. మంచినీరు దొరకదు. కనీసం రోడ్డు కూడా లేదు. ఈ గ్రామాల్లో 18 గిరిజన కుటుంబాలుండగా (కోందు తెగ).. 50 మందికి పైగా జీవిస్తున్నారు. అడవిలో పండే వాటినే తింటూ.. కొండకోనల్లో అడవి జంతువులు, క్రిమికీటకాల మధ్య జీవనం సాగిస్తున్నారు. ఓటు హక్కులేదు. రేషన్, ఆధార్‌కార్డులకు నోచుకోలేదు. వీరు ఏ మండలంలో ఉన్నారో..ఏ పంచాయతీకి చెందిన గుర్తింపు లేకుండా పోయింది. ఎలాంటి ప్రభుత్వపథకాలు అందడం లేదు. విద్యుత్ సరఫరా లేక చీకట్లో అవస్థలు పడుతున్నారు. కట్టెలను వెలిగించి వచ్చే వెలుతురులో రాత్రి భోజనం చేసి నిద్రలోకి జారుకుంటారు. ఈ విషయం తెలుసుకున్న జీసీసీ గతంలో ఓ సారి రెండు గ్రామల గిరిజనులకు కిరోసిన్ సరఫరా చేసింది. తరువాత ఆ ప్రక్రియ కూడా నిలిచిపోయింది. ఓ స్వచ్ఛంద సేవాసంస్థ సహకారంతో గ్రావిటీ పథకం ఏర్పాటు చేసి కుళాయి ద్వారా నీరు సరఫరా చేశారు. ప్రస్తుతం అది కూడా పాడైంది. దీంతో గెడ్డలో ఊరే నీటిని తెచ్చుకొని అవసరాలు తీర్చుకుంటున్నారు. రోడ్డు సదుపాయం లేకపోవడంతో అత్యవసర సమయంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ గ్రామాల్లో ఉపాధి హామీ పథకం పనులు కూడా జరగడం లేదు. జీసీసీ కూడా ఈ గ్రామాలవైపు పూర్తిస్థాయిలో కన్నెత్తి చూడలేదు. ఈ పరిస్థితిలో ఇటీవల కలెక్టర్ వినయ్‌చంద్‌తో సాక్షి నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమలో పాల్గొన్న కొంతమంది గిరిజన సంఘ నాయకులు ఈ గ్రామాల దుస్థితిని చెప్పారు. తక్షణమే స్పందించిన ఆయన గ్రామాలకు వెళ్లి పరిస్థితిని చూడమని ఆదేశించారు. దీంతో రావికమతం తహసీల్దార్ పి.కనకారావు, ఎంపీడీవో రామచంద్రరావు, విద్యుత్ శాఖ అధికారులు పశులబంద, జీలుగులోవ గ్రామాలను సందర్శించారు. విద్యుత్, రోడ్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. దీంతో గిరిజనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మమ్మల్ని ఆదుకోండి.. అడవిని నమ్ముకొని జీవిస్తున్నాం. కనీస సౌకర్యాలు లేవు. తాగడానికి నీరు లేదు. తమను ఎవరూ పట్టించుకోవడం లేదు. తాగునీరు, విద్యుత్ సరఫరా చేయాలి. రోడ్డు వేయాలి. కొర్రగాసి, పశువులబంద ఏ మండలంలో ఉన్నాయో? పశులబండ, జీలుగులో గిరిజన గ్రామాలు ఏ మండలంలో ఉన్నాయో కూడా తెలియడం లేదు. రావికమతం అని చెబుతున్నా ఆ మండల అధికారులు మా వైపు చూడడం లేదు. ఏమైనా ఆధారం ఉందా అని అడుతున్నారు. సాక్షి ఫోన్ ఇన్ కార్యక్రమంలో కలెక్టర్ వినయ్‌చంద్‌తో మాట్లాడే అవకాశం కలిగింది. తమకు ఎంతో ఆనందం కలిగింది. విద్యుత్, తాగునీరు, రహదారులు లేవని చెప్పాం. కలెక్టర్ స్పందించారు. సాక్షికి కృతజ్ఞతలు. – కె.గోవిందరావు, మైదాన ప్రాంత గిరిజన సంఘం జిల్లా కన్వీనర్ -
మోడల్ స్కూళ్లకు మంచి రోజులు
శ్రీకాకుళం న్యూకాలనీ: మోడల్ స్కూళ్లకు (ఆదర్శ పాఠశాలలు) మంచి రోజులు రానున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఆదరణకు నోచుకోని మోడల్ స్కూళ్లు వైఎస్సార్సీపీ ప్రభుత్వం.. సర్కారులో విలీనం చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఇందుకు సంబంధించి పూర్తిస్తాయితో ప్రతిపాదనలు సిద్ధం చేసి అందజేయాలని మోడల్ స్కూళ్ల సొసైటీకి ప్రభుత్వం ఆదేశించింది. దీంతో మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 2012లో మోడల్ స్కూల్ విధానం.. 2012లో మోడల్ స్కూల్ విధానాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా తెరపైకి తీసుకొచ్చాయి. ఇదే సమయంలో జిల్లాకు 14 మోడల్ స్కూళ్లను కేటాయించారు. తొలినాళ్లలో నిర్దేషిత నిష్పత్తి ప్రకారం నిధులు కేటాయింపు జరుగుతుండేవి. 2014 ఎన్నికల తర్వాత సీన్ రివర్స్ అయింది. అటు కేంద్రంలో బీజేపీ, ఇటు రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత మోడల్ స్కూళ్లు పూర్తిగా నిరాదరణకు గురయ్యాయి. కనీస నిధులకు నోచుకోకుండా పాఠశాలల నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. 2012 డీఎస్సీ ద్వారా నియామకమైన ఉపాధ్యాయులు పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. ప్రయోజనాలకు నోచుకోని ఉపాధ్యాయులు.. 2012 డీఎస్సీ విధానం ద్వారా నియామకమై 2013 మే నుంచి జిల్లాలో 160 మంది ఉపాధ్యాయులు మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్నారు. ఇందులో పీజీటీ, టీజీటీలున్నారు. నియామకమై వారంతా ప్రభుత్వ రెగ్యులర్ ఉపాధ్యాయులైనప్పటికీ వారు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రయోజనాలకు, రాయితీలకు నోచుకోలేదు. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో తీవ్రంగా మోసపోయారు. గత ఐదేళ్లు జీతాలు కూడా సరిగ్గా అందలేదు. ప్రభుత్వ ఉపాధ్యాయులకు లభిస్తున్న పెన్షన్ విధానం, హెల్త్‌కార్డులు, కారుణ్య నియామకాలు, ఏపీజీఎల్‌ఐసీ, పీఎఫ్ వంటివి లేకపోవడం శోచనీయం. మోడల్ స్కూళ్లలో పనిచేస్తూ చనిపోయిన ఉపాధ్యాయుల కుటుంబాలకు ఎటువంటి ఆదరణ, ప్రయోజనాలు లేకపోవడంతో ఆయా కుటుంబాలు రోడ్డునపడిన సంఘటనలు రాష్ట్రంలో అనేకం ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఎన్నోసార్లు ఆందోళనలు చేసిన ప్రయోజనం లేకపోయింది. పాదయాత్రలో సీఎం జగన్ హామీ మేరకు.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్పయాత్ర పేరిట చేపట్టిన పాదయాత్ర సమయంలో మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు కలిశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు కచ్చితంగా న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి ప్రతి నెలా జీతాలను మంజూరు చేస్తూ వస్తోంది. అదే విధంగా పాఠశాలలో పనిచేస్తున్న రెగ్యులర్ ఉపాధ్యాయులు, సిబ్బందికి ప్రభుత్వ టీచర్ల మాదరిగా అన్ని రకాలైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రతిపాదనలు సిద్ధంచేయాలని, మోడల్ స్కూల్స్ సొసైటీ ఈసీ (కార్యనిర్వహణ కమిటీ) సిఫార్సులను పంపాలని ప్రభుత్వం సోమవారం మెమో విడుదల చేసింది. మోడల్ స్కూళ్లపై విధానపరమైన నిర్ణయం ప్రకటించడంతో ఉపాధ్యాయులు, సిబ్బంది సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏపీఎంఎస్ ఉపాధ్యాయుల హర్షం.. ప్రభుత్వ నిర్ణయం పట్ల ఏపీ మోడల్ స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు గుంట లక్ష్మీనారాయణ, శ్రీకాకుళం జిల్లా అధ్యక్షడు పి.వాసుదేవరావు, కార్యదర్శి బి.సురేష్, గౌరవాధ్యక్షుడు సీహెచ్ కృష్ణారావు, కోశాధికారి పి.రాము, కార్యవర్గ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. రెగ్యులర్ ఉపాధ్యాయులకు లభిస్తున్న అన్ని ప్రయోజనాలు, రాయితీలు కల్పించి తమ జీవితాల్లో ఆనందాన్ని నింపాలని, న్యాయం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. -
భవిష్యత్తులో ‘తెలుగు’ వెలుగులు
తెలుగు వర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ శివారెడ్డి తెయూలో తెలుగు అధ్యాపకుల సదస్సు తెయూ(డిచ్పల్లి): భవిష్యత్తులో తెలుగు వెలుగులీనుతుందని తెలుగు విశ్వవిద్యాలయం మాజీ ఉప కులపతి ఎల్లూరి శివారెడ్డి తెలిపారు. తెలుగుకు ప్రాచీన హోదా దక్కడంతో భవిష్యత్‌లో మన భాషకు మంచి రోజులు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ యూనివర్సిటీ తెలుగు అధ్యయన శాఖ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన తెలుగు అధ్యాపకుల నాలుగో సమావేశంలో శివారెడ్డి ప్రసంగించారు. తెలుగుకు ప్రాచీన హోదా దక్కడానికి తెలంగాణ ప్రభుత్వం చేసిన కృషియే ప్రధాన కారణమని, తెలంగాణ సాంస్కృతిక సంచాలకుడు మామిడి హరికృష్ణ అభినందనీయుడని ఆయన పేర్కొన్నారు. హృదయానందాన్ని పంచేదే సాహిత్యమని, తెలుగు అధ్యాపకులు ఎవరికీ తీసిపోరని, ఆత్మగౌరవంతో ఉండాలని పిలుపునిచ్చారు. తెలుగు అధ్యాపకులు హృదయ వికాసం చేస్తారని, తెలుగును శక్తివంతం చేయాలంటే ఇతర భాషలపై పట్టు సాధించాలని వివరించారు. తెలుగు భాష మహోన్నతమైనదని, భాష, యాస, నుడికారం, జాతీయాలపై పట్టుతోనే సీఎం కేసీఆర్ ఒక మహా ఉద్యమాన్ని నిర్మించ గలిగారని తెయూ రిజిస్ట్రార్ జయప్రకాశ్‌రావు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ భాషపై పట్టుతోనే ప్రజలను కదిలించ గలిగారన్నారు. తెలుగు అధ్యయన శాఖ అధిపతి, ప్రిన్సిపల్ కనకయ్య మాట్లాడుతూ.. తెయూ తెలుగు అధ్యయన శాఖ రాష్ట్రంలో ప్రత్యేకతను సంతరించుకుందన్నారు. ఆణిముత్యాలాంటి అధ్యాపకులు, విభాగానికి గొప్ప పేరు తెచ్చారని అన్నారు. ఈ సందర్భంగా ‘సాహితీ మంజీర, సాహితీ కిన్నెర’ అనే పుస్తకాలను అతిథులు ఆవిష్కరించారు. అనంతరం ప్రొఫెసర్ శివారెడ్డి, రిజిస్ట్రార్ జయప్రకాశ్‌రావు, సీవోఈగా నియమితులైన కనకయ్యను ఘనంగా సన్మానించారు. సహాయ ఆచార్యులు బాలశ్రీనివాసమూర్తి, లావణ్య, త్రివేణి, బీవోఎస్ లక్ష్మణ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. -
‘జాతీయవాదులకు’ మంచి రోజులు వచ్చేశాయి
అవలోకనం మహత్తరమైన మన భారత జాతీయవాదులు, తమ సొంత ప్రజలకు వ్యతిరేకంగానే ఆగ్రహావేశాలను రేకెత్తిస్తున్నారు. మన కపట జాతీయవాదులు తమ సొంత పౌరుల మతం లేదా భావజాలం గురించి వారి వెంటపడుతున్నారు. వారి ఆగ్రహం అంతా అంతర్గత శత్రువు గురించే. అది దేశం మీద ప్రేమ లేదా మరే ఇతర ప్రేమా కాదు... విద్వేషం, విరోధం. భారత ముస్లింలను, భారత దళితులను అణచివేయడం జాతీయవాదం కాదు. ఏ విదేశీ పత్రికైనా చూడండి. భారత్ గురించి ఉండే వార్తలన్నీ ప్రతికూలమైనవే. ఎందుకు? నివారించగలిగిన ఒకే విధమైన ఘటనలు క్రమం తప్పకుండా జరుగుతున్నాయని ప్రపంచం భావిస్తోంది కాబట్టి. అవి ఉద్దేశపూర్వకంగా జరుగుతున్నవేమోననే అనుమానం కలగకుండా ఉండటం తేలికేం కాదు. మహారాష్ట్రలో ఒక ముస్లిం శాసన సభ్యుడ్ని, అతడు ‘‘భారత్ మాతా కీ జై’’ (తల్లి భారతికి విజయం) అనడానికి బదులు ‘‘జై హింద్’’ (భారత దేశానికి విజయం) అనే అంటానని అన్నందుకు శాసనసభ నుంచి సస్పెండ్ చేశారు. ఈ రెండు నినాదాల మధ్య ఉన్న తేడా ఏమిటో నాకూ క చ్చితంగా తెలియదు. కానీ అది శిక్షార్హమైందనేది మాత్రం స్పష్టం. భారత వ్యతిరేకమైన రాతలేవీ రాయడం లేదని హామీ ఇవ్వాలని ఉర్దూ రచయితలందరినీ మార్చి 19న కోరారు. కేంద్ర మానవ వనరుల మంత్రి స్మృతి ఇరానీ నిర్దేశనలోని ‘నేషనల్ కౌన్సిల్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఉర్దూ లాంగ్వేజ్’(ఎన్‌యూపీయూఎల్), ఉర్దూ రచయితలను దిగువ ప్రకటనపై సంతకం చేయాలని కోరింది: ‘నేను.........ను ........... కొడుకు/కూతురు ,........ శీర్షికగల నా పుస్తకం/పత్రికను ఎన్‌యూపీయూఎల్ ఆర్థిక సహాయ పథకం కింద పెద్ద మొత్తంలో కొనుగోలు చేయడానికి ఆమోదం పొందాను. ఇందులో భారత ప్రభుత్వ విధానాలకు లేదా దేశ ప్రయోజనాలకు వ్యతిరేకమైనది, దేశంలోని వివిధ వర్గాల మధ్య ఏ విధమైన వైమనస్యానికి కారణమయ్యేది ఏదీ లేదు. ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థ దేని నుంచీ దీనికి ఆర్థిక సహాయం అందలేదు.’’ ఇదీ ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ పత్రిక తెలిపిన విషయం. జాతీయవాదులకు, జాతి వ్యతిరేకులకు మధ్య సాగుతున్న మోసపూరితమైన, ఈ సొంత తయారీ చర్చ త్వరలోనే సమసిపోతుందని ఆశపడుతున్న నాలాంటి వాళ్లకు ఈ వార్త నిరుత్సాహం కలిగించింది. నాకైతే ఇప్పుడు సాగుతున్న ప్రపంచ క్రికెట్ కప్ వంటి విషయాల గురించి రాయాలని ఉంది. కానీ ఈ వార్తా కథనం వల్ల... మధ్యయుగాల కాలపు ఈ నిత్య పోరాటంలో నేను కూడా ఏదో ఒక పక్షాన నిలవడం తప్ప, గత్యంతరం లేకపోయింది. మన హిందుత్వ జాతీయవాదులు ప్రచారం చేస్తున్నది విభిన్న తరహా జాతీయవాదం. అది, మరో దేశంతో పోలిస్తే మరొక దేశంలోని వారికి తమ పట్ల ఉండే భావం అని చెప్పే యూరోపియన్ జాతీయవాదం కాదు. సెర్బియన్లను, ఆస్ట్రో-హంగేరియన్లు, వారిని రష్యన్లు, వారిని జర్మన్లు, వారిని ఫ్రెంచ్‌వాళ్లు ద్వేషించటం వల్ల ప్రపంచ యుద్ధం జరిగింది. ఇటాలియన్లు ఆ యుద్ధంలో ఎందుకు చేరారో నాకైతే గుర్తులేదు. కానీ బ్రిటిష్‌వాళ్లు ప్రతి ఒక్కరినీ ద్వేషించేవారనేది మాత్రం నిజం. ఒక్కసారి నిప్పు అంటుకున్నదే చాలు, అంతా ఒకరిపైకి మరొకరు విరుచుకుపడ్డారు. టర్కులను, అరబ్బులను, భారతీయులను, తత్పర్యవసానంగా అమెరికా వంటి దేశాలనూ అందులోకి ఈడ్చారు. రెండు ప్రపంచ యుద్ధాలలో ఆ దేశాలు తమకు తాము చేసుకున్న హాని ఫలితంగా యూరోపియన్ దేశాలు తమ సంకుచితత్వాన్ని కోల్పోయాయి. అదే ఆ తర్వాత వారిలో యూరోపియన్ యూనియన్ పట్ల ఉత్సాహాన్ని రేకెత్తించింది. ఈయూ అంటేనే, తమ తమ జాతీయతలను వదుల్చుకుని, తమ సరిహద్దులను, మార్కెట్లను ఒకరికొకరు తెరుచుకోవాలని కోరుకున్న ప్రజా సముదాయాలు. కాగా, నేటి భారతదేశంలోని మన ‘జాతీయవాదం’ మరో జాతికి వ్యతిరేకమైనది కాదు, ఇతర భారతీయులకు వ్యతిరేకమైనది. అందుకే ఇది విభిన్నమైనది. మహత్తరమైన మన భారత జాతీయవాదులు, మరో దేశానికి వ్యతిరేకంగా కాదు, తమ సొంత ప్రజలకు వ్యతిరేకంగానే ఆగ్రహావేశాలను రేకెత్తిస్తున్నారు. మన కపట జాతీయవాదులు తమ సొంత పౌరుల మతం లేదా భావజాలం గురించి వెంటపడుతున్నారు. వారికి పట్టేది, వారి ఆగ్రహం అంతా అంతర్గత శత్రువు గురించే. అది దేశం మీద ప్రేమ కాదు లేదా మరే ఇతర ప్రేమా కాదు. అది విద్వేషం, విరోధం. భారత ముస్లింలను, భారత దళితులను అణచివేయడం జాతీయవాదం కాదు. ‘జాతి వ్యతిరేకత’ అని మనం అభియోగంగా అతి తేలికగా వాడేసే ఈ పదం నేడు యూరోపియన్ భాషలలో నిజంగా వాడుకలో ఉన్నది కాదు. భారతీయుల వంటి ప్రాచీన కాలపు ప్రజలు మాత్రమే వాడేది. జాతి అనేది ఏ అర్థాన్ని ఇస్తుందో దానికి వ్యతిరేకమైన విషయలకే అది ప్రాతినిధ్యం వహిస్తోంది. భారత్ మాతా కీ జై అనడం గాక, ఏది నిజమైన జాతీయవాదమో నిర్ణయించేది ఎవరు? నిజంగానే నాకు భారత జాతీయవాదం అంటే ఏమిటో తెలియదు. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ జాతీయవాదం అంటే ఏమిటనే అంశంపై బహిరంగ ఉపన్యాసాల పరంపరను నిర్వహిస్తోంది. వీడియోల సెట్టుగా అవి అందుబాటులోకి వస్తున్నాయి. అవి విద్వద్వంతమైనవే అయినా సామాన్యులకు సైతం అందుబాటులో ఉంటాయి. అదో గొప్ప కృషే. కానీ అందులో చాలా భాగం భారతీయుల మీదనే వృథా చేస్తారేమోనని నా భయం. మీరెంత ఘోరంగా ప్రవర్తించినా ఫర్వాలేదు, భారత్ మాతా కీ జై అని అంటున్నంత కాలం మీరీ దేశంలో జాతీయవాదే. వార్తా పత్రికల్లోనే వచ్చిన మరో కథనం, ఇద్దరు ముస్లింల గురించినది. వారిలో ఒకరు 15 ఏళ్ల పిల్లాడు. సరిగ్గా అమెరికన్ ఆఫ్రికన్లను అమెరికాలో చేసినట్టే... వాళ్లను కూడా చెట్టుకు కట్టేసి చిత్రహింసల పాలు చేసి చంపారు. వారిద్దరూ గేదెలను మేపుకుంటున్నారు. కాబట్టి వారి నేరం ఏమిటో స్పష్టం కాలేదు. అయితే ఈ విద్వేషాన్ని ఎక్కడి నుంచి రేకెత్తిస్తున్నారనేది మాత్రం పూర్తిగా కచ్చితంగా తెలిసినదే. ఇదేమైనా ప్రభుత్వం కాస్త ఆగేట్టు చేస్తుందా? ఎంతమాత్రమూ చేయదు. ఇంకా మరింత ‘‘జాతీయవాదం’’ కోసం పిలుపునివ్వడం కోసం ఈ వారాంతంలో బీజేపీ జాతీయ కార్యవర్గం సమావేశం కానున్నది. ఇప్పటికీ మనకున్నది సరిపోదా? నాగరిక సమాజంలో భారత ప్రతిష్టపై ఇది ఎలాంటి ప్రభావాన్ని కలుగజేస్తుందో బీజేపీ వాళ్లకు తెలియదా? ఏ విదేశీ పేపర్‌ను లేదా పత్రికైనా తీసుకోండి. భారత్ గురించి అందులో ఉండే వార్తలన్నీ ప్రతికూలమైనవే. ఎందుకు? నివారించగలిగిన ఒకే విధమైన ఘటనలు క్రమం తప్పకుండా జరుగుతున్నాయని మనలో చాలా మందిమి, మిగతా ప్రపంచమూ కూడా భావిస్తోంది కాబట్టి. ఈ పరిస్థితుల్లో అవి ఉద్దేశపూర్వకంగా జరుగుతున్నవేమోననే అనుమానం కలగకుండా ఉండటం తేలికేం కాదు. విద్వేషం నిండిన, కపట జాతీయవాదులకు మంచి రోజులు వచ్చేశాయి. - ఆకార్ పటేల్ వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com -
దేశానికి మంచి రోజులొచ్చాయి: సోనాక్షి
ముంబై: కేంద్రంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం పట్ల బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా సంతోషం వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి రావడంతో దేశానికి మంచి రోజులు వచ్చాయని చెప్పారు. సోనాక్షి తండ్రి బీజేపీ నేత శత్రుఘ్న సిన్హా లోక్‌సభకు ఎంపికయ్యారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చినందుకు తమకు సంతోషంగా ఉందని, ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో మార్పులు తీసుకువస్తుండటం శుభపరిణామమని సోనాక్షి చెప్పారు. మోడీ మంత్రి వర్గంలో ఏడుగురి మహిళలకు స్థానం కల్పించడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. కాగా కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ విద్యార్హతపై చెలరేగిన వివాదంపై స్పందించేందుకు నిరాకరించారు. తమ ఇంట్లో సినిమాలు, రాజకీయాల గురించి అరుదుగా మాట్లాడుతామని సోనాక్షి చెప్పారు. -
రెక్కలు తొడిగిన ఆశలు
రాష్ట్రానికి తొలిసారిగా పౌరవిమానయానశాఖ విశాఖ విమానాశ్రయానికి మంచి రోజులు అంతర్జాతీయఖ్యాతి వస్తుందని ప్రయాణికుల ఆశాభావం గోపాలపట్నం, న్యూస్‌లైన్: విశాఖ విమానాశ్రయానికి మంచి రోజులొస్తాయన్న ఆశలు చిగురిస్తున్నాయి. విజయనగరం ఎంపీ అశోక్ గజపతిరాజుకు కేంద్ర పౌరవిమానయాన శాఖమంత్రి పదవి దక్కడంతో కోస్తాంధ్ర వాసుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. విశాఖకు అంతర్జాతీయ ఖ్యాతి లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇంత వరకూ పౌరవిమానయానశాఖ మంత్రి పదవులు ఇతర రాష్ట్రాల వారికే దక్కాయి. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో విజయనగరం జిల్లాకు చెందిన ఎంపీ అశోక్ గజపతికి ఈ పదవి దక్కడం విశేషం. అశోక్ గజపతి వల్ల అంతర్జాతీయ విమానాశ్రయాల సరసన విశాఖ విమానాశ్రయం చేరుతుందని, కోస్తాంధ్రకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ప్రయాణికులు ఆకాంక్షిస్తున్నారు. ఇప్పటికే విశాఖ విమానాశ్రయం నుంచి ఆరు విమాన సంస్థలు 34 సర్వీసులు నడుపుతున్నాయి. దేశ విదేశాలకు విమానాలు నడుస్తున్నాయి. ఏటా 11 లక్షలు ప్రయాణిస్తున్నారు. తాజాగా అశోక్ గజపతికి పౌరవిమానయానశాఖ పదవి లభించడంతో పెట్టుబడిదారులతో ఆర్థిక పురోగతి సాధించడంతో పాటు పారిశ్రామిక ప్రగతి ఉంటుందని కోస్తాంధ్రవాసులు అభిప్రాయపడుతున్నారు. ఈ కష్టాలు తీరాలి : విశాఖలో ఫార్మా, ఐటీ, అనేక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలున్నా పూర్తిస్థాయి విదేశీ విమానాలు రావడం లేదు. ఒకవేళ విదేశీ విమాన సంస్థలు వచ్చినా ప్రభుత్వం అనుమతించడంలేదన్న విమర్శలున్నాయి. పాత విమానాశ్రయాన్ని కంటైనర్ కార్గో టెర్మినల్‌గా అభివృద్ది చేస్తామని చెప్పినా ఇంతవరకు చేయలేదు. దీంతో కంపెనీలు తెలంగాణకు వెళ్లాల్సి వస్తోంది. 24బై7 సేవలకు నేవీ మోకాలడ్డుతోంది. దీని వల్ల విదేశీ క్లయింట్ల రాకపోకలకు, విశాఖ వాసులకు అసౌకర్యంగా ఉంది. శుభపరిణామం అశోక్ గజపతి పౌర విమానయానశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించడం హర్షణీయం.. శుభపరిణామం. విశాఖ ఎయిర్ పోర్టుకు ఇంకా పలు దేశీయ, విదేశీయ విమానాలు వస్తాయి. ఆశోక్ చొరవతో విశాఖకు మంచి భవిష్యత్తు ఉంటుందన్న నమ్మకం ఉంది. కోలాలంపూర్, బాంకాక్, షార్జా, శ్రీలంక తదితర దేశాలకు విమానాలు నడిపే విధంగా ఆయనపై ఒత్తిడి తెస్తాం. - డి.వరదారెడ్డి, భారత విమాన ప్రయాణికుల సంఘం అధ్యక్షుడు