రెక్కలు తొడిగిన ఆశలు
- రాష్ట్రానికి తొలిసారిగా పౌరవిమానయానశాఖ
- విశాఖ విమానాశ్రయానికి మంచి రోజులు
- అంతర్జాతీయఖ్యాతి వస్తుందని ప్రయాణికుల ఆశాభావం
గోపాలపట్నం, న్యూస్‌లైన్: విశాఖ విమానాశ్రయానికి మంచి రోజులొస్తాయన్న ఆశలు చిగురిస్తున్నాయి. విజయనగరం ఎంపీ అశోక్ గజపతిరాజుకు కేంద్ర పౌరవిమానయాన శాఖమంత్రి పదవి దక్కడంతో కోస్తాంధ్ర వాసుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. విశాఖకు అంతర్జాతీయ ఖ్యాతి లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇంత వరకూ పౌరవిమానయానశాఖ మంత్రి పదవులు ఇతర రాష్ట్రాల వారికే దక్కాయి. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో విజయనగరం జిల్లాకు చెందిన ఎంపీ అశోక్ గజపతికి ఈ పదవి దక్కడం విశేషం. అశోక్ గజపతి వల్ల అంతర్జాతీయ విమానాశ్రయాల సరసన విశాఖ విమానాశ్రయం చేరుతుందని, కోస్తాంధ్రకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ప్రయాణికులు ఆకాంక్షిస్తున్నారు. ఇప్పటికే విశాఖ విమానాశ్రయం నుంచి ఆరు విమాన సంస్థలు 34 సర్వీసులు నడుపుతున్నాయి.
దేశ విదేశాలకు విమానాలు నడుస్తున్నాయి. ఏటా 11 లక్షలు ప్రయాణిస్తున్నారు. తాజాగా అశోక్ గజపతికి పౌరవిమానయానశాఖ పదవి లభించడంతో పెట్టుబడిదారులతో ఆర్థిక పురోగతి సాధించడంతో పాటు పారిశ్రామిక ప్రగతి ఉంటుందని కోస్తాంధ్రవాసులు అభిప్రాయపడుతున్నారు.
ఈ కష్టాలు తీరాలి : విశాఖలో ఫార్మా, ఐటీ, అనేక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలున్నా పూర్తిస్థాయి విదేశీ విమానాలు రావడం లేదు. ఒకవేళ విదేశీ విమాన సంస్థలు వచ్చినా ప్రభుత్వం అనుమతించడంలేదన్న విమర్శలున్నాయి. పాత విమానాశ్రయాన్ని కంటైనర్ కార్గో టెర్మినల్‌గా అభివృద్ది చేస్తామని చెప్పినా ఇంతవరకు చేయలేదు. దీంతో కంపెనీలు తెలంగాణకు వెళ్లాల్సి వస్తోంది. 24బై7 సేవలకు నేవీ మోకాలడ్డుతోంది. దీని వల్ల విదేశీ క్లయింట్ల రాకపోకలకు, విశాఖ వాసులకు అసౌకర్యంగా ఉంది.
శుభపరిణామం
అశోక్ గజపతి పౌర విమానయానశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించడం హర్షణీయం.. శుభపరిణామం. విశాఖ ఎయిర్ పోర్టుకు ఇంకా పలు దేశీయ, విదేశీయ విమానాలు వస్తాయి. ఆశోక్ చొరవతో విశాఖకు మంచి భవిష్యత్తు ఉంటుందన్న నమ్మకం ఉంది. కోలాలంపూర్, బాంకాక్, షార్జా, శ్రీలంక తదితర దేశాలకు విమానాలు నడిపే విధంగా ఆయనపై ఒత్తిడి తెస్తాం. - డి.వరదారెడ్డి, భారత విమాన ప్రయాణికుల సంఘం అధ్యక్షుడు