‘జిమ్‌లో చేరాలి’ ‘టైమ్‌కి భోజనం చేయాలి’ ‘వాకింగ్ మొదలెట్టాలి’ ‘స్మోకింగ్ మానేయాలి’... ఇలా కొత్త సంవత్సరం నిర్ణయాలు తీసుకోవడం, మర్చిపోవడం, జోక్‌గా మార్చడం ఇకపై వద్దు. కొత్తగా ఆలోచించండి. ‘నాలో నుంచి ద్వేషం తీసేస్తాను’ ‘ఇక పై సహనాన్ని సాధన చేస్తాను’ ‘జ్ఞానాన్ని పెంచుకుంటాను’ ‘డిజిటల్ సమయాన్ని తగ్గించుకుని కుటుంబానికి కేటాయిస్తాను’ ఎంత బాగున్నాయి ఇలాంటి నిర్ణయాలు. రాబోయే కాలం వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సామాజికంగా మీకెన్నో సవాళ్లు విసరొచ్చు. వాటి కోసం సిద్ధం కండి. చెదరని సంకల్పాలు ఈ సంవత్సరం తీసుకోండి.
‘ఈ పని చేసి తీరాలి’, ‘ఇది జరిగి తీరాలి’ అని హెచ్చరించుకోకపోతే మనిషి ఏ పనీ చేయడు. తనకు తాను గట్టిగా చెప్పుకోవడం కూడా అవసరమే. ‘నిర్ణయం’ (డెసిషన్) తీసుకుంటే దానిని మార్చుకునే అవకాశం ఉంది. కాని సంకల్పం (విల్) తీసుకోవాలి. ఒక పని సంకల్పించాక దానిని ఇక మార్చకూడదు. పూర్వం దీక్షా కంకణాలు కట్టేవారు పెద్దలు. ఒక పని అనుకున్నాక పూర్తయ్యే వరకు ఆ పనిని గుర్తు చేస్తూ కట్టే కంకణం అన్నమాట. పని పూర్తయ్యాకే కంకణం విప్పాలి.
ఇప్పుడు 365 రోజుల పాటు విప్పడానికి వీల్లేని మనో కంకణం కట్టుకోవాలి కొత్త సంవత్సర సంకల్పంగా. ఎందుకు? ఎప్పటికప్పుడు జీవితాన్ని మెరుగు పర్చుకోవడానికి. సరి చేసుకోవడానికి. క్వాలిటీ ఆఫ్ లైఫ్ గడపడానికి. అర్థవంతంగా గడపడానికి. జీవితం జోక్ కాదు. తేలిగ్గా తీసుకునేది అంతకన్నా కాదు. చిన్న రాయి దెబ్బకు కూడా కకావికలం కావచ్చు జీవితం. అందువల్ల ఏమరుపాటుగా ఉండటానికి కూడా కొత్త సంవత్సర సంకల్పాలు తీసుకోవాలి. 2023లో వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, సామాజికంగా ఎటువంటి మెరుగుదలకు సంకల్పాలు తీసుకోవచ్చో చూద్దాం.
వ్యక్తిగతంగా...
1. భౌతికంగా ఎలా ఉన్నారు?: లావు, సన్నం తర్వాత. ముందు మీరు చురుగ్గా ఉన్నారా లేదా చూసుకోండి. ఆరోగ్యకరమైన శరీరం సగం సంతోషాన్ని, దేనినైనా ఎదుర్కొనవచ్చనే ధైర్యాన్ని ఇస్తుంది. మీకు మీరు దిలాసా ఇచ్చుకోవడానికి శరీరాన్ని చురుగ్గా ఉంచండి. వ్యాయామం, హెల్త్ చెకప్ అవసరం. సొంత వైద్యం మానాలి. అదే తగ్గిపోతుందిలే అనే నిర్లక్ష్యం వద్దు. శరీరమే ఆయుష్షు. మీ చర్యలతో మీకు మీరే ఆయుష్షు పోసుకోండి.
2. మానసికంగా: మానసిక ఉద్వేగాలు శరీరంపై ప్రభావం చూపుతాయి. కొన్ని లక్షణాలు జన్మతః, కొన్ని లక్షణాలు స్వభావరీత్యా ఏర్పడతాయి. వాటిలో పనికిమాలినవి వదిలేయండి. ఉదాహరణకు: ఈ సంవత్సరం అసూయ పడను అనుకుంటే చాలా మంది బంధువులు, స్నేహితులు, కలీగ్స్ మీకు ఆత్మీయులు అయిపోతారు. అసూయతోనే వారికి మీరు దూరం అవుతారు. అసూయ లేకపోతే ఇంత బలగం వస్తుంది. ద్వేషం, అత్యాశ, త్వరగా అందలం ఎక్కేయాలన్న కుతి... ఇవి వదులుకోవడం చాలా అవసరమైన సంకల్పాలు. ‘నా ప్రయాణం ఆరాంగా చేస్తాను. అంచెలంచెలుగా ముందుకు సాగుతాను. నా రేంజ్‌లో ఎంత పొందవచ్చో అంతా పొందుతాను. మిగిలినవారిని చూసి పోల్చుకోను’ అనుకోవడం మానసిక ఆరోగ్యానికి ఎంతో అవసరం.
3. ఉద్యోగపరంగా: వృత్తి నైపుణ్యం పెంచుకుంటాను అని సంకల్పించాలి. ఉన్న చోట ఉండిపోవడం తెలిసినదానితో ఆగిపోవడం సరి కాదు. పనిలో నైపుణ్యం పెరిగే కొద్దీ అందుకు అవసరమైన పరిజ్ఞానం పెంచుకునే కొద్దీ మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ‘ఈ ఉద్యోగం పోతే ఎలా’ అనే భయం పోతుంది. ‘ఎక్కడైనా బతకొచ్చు’ అనే ధైర్యం వస్తుంది. పని నేర్చుకోండి. మీ పనికి విలువ ఇచ్చే చోటుకు మారిపోండి.
కుటుంబపరంగా...
1. మొదట కుటుంబం: కుటుంబం మొదటి ్రపాధాన్యం అనుకోవాలి. భార్య లేదా భర్త ఉద్యోగాలు చేస్తున్నా వేరే అభిరుచుల్లో ఉన్నా పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నా కుటుంబమే మొదటి ్రపాధాన్యం. ‘రోజూ రాత్రి భోజనం కలిసి చేయాలి’ నిర్ణయాన్ని తప్పనిసరిగా అమలు చేస్తే ఇల్లు దాదాపుగా ఒక దారికి వచ్చినట్టు. ‘చె΄్తాను... వింటాను’ అనేది కూడా చాలా పెద్ద సంకల్పం. భార్యకు/భర్తకు చెప్పాలనుకున్నది చెప్పకపోవడం, వారు చెప్పేది వినకపోవడం కుటుంబాల్లో అగాధాలకు కారణం. పిల్లల విషయంలో ‘అడుగుతాను/వింటాను’ అనే సంకల్పం. పిల్లలు ఏం చేస్తున్నారు... వారి రొటీన్... స్నేహితులు... ఇవి అడగడం 365 రోజులూ చేయాల్సిందే. వారి మనసులో ఏముందో మాటల్లో పెట్టి వినాల్సిందే. ‘ఫోన్ టైమ్ తగ్గించుకుంటాను’ అని సంకల్పించుకుంటే, సోషల్ మీడియా టైమ్ కట్ చేసుకుంటే రాబోయే సంవత్సరం మీకెన్నో కౌటుంబిక ఆనందాలు ఇస్తుంది.
2. ఆర్థిక నిర్లక్ష్యం వద్దు: ఇతర నిర్లక్ష్యాల కంటే అర్థిక నిర్లక్ష్యం మూలాల మీద కొడుతుంది. ఆప్తులను దూరం చేస్తుంది. చేతులు నులుముకునేలా చేస్తుంది. ‘ఆర్థిక విషయాల్లో మరింత జాగ్రత్తగా ఉంటాను’ అనేది ముఖ్య సంకల్పం. కుటుంబం మొత్తం కలిసి ‘అనవసరమైనవి కొనం/ అనవసర ఖర్చులు చేయం/వేస్ట్‌ను నివారిస్తాం’ అనుకుంటే చాలా మంచి జరుగుతుంది. లైట్లు, గీజర్లు, స్టౌ, టీవీ, కంప్యూటర్ సమయానికి అందరూ ఆపినా చాలా పెద్ద విషయమే. ‘రాబోయే అవసరాలకు ఇప్పుడు ఎంత ఉంది’ అని చూసుకుంటే జాగ్రత్త అదే వస్తుంది.
3. చైతన్యంగా ఉంటాం: కుటుంబం ఆరోగ్యంగా, ఆర్థికంగా బాగున్నా చైతన్యం లేకుండా అజ్ఞానంతో ఉంటే ఎలా? పేపర్ తెప్పించండి. కుటుంబంలో ప్రతి ఒక్కరూ నెలకు ఒక పుస్తకమైనా చదవాలి అని సంకల్పించుకోవడం ఇంటికి వెలుతురు తీసుకురావడం.
సామాజికంగా...
మంచి ΄పౌరుడిగా మారండి: రోడ్డు మీద ఉమ్మను... ట్రాఫిక్ నియమాలు పాటిస్తాను.. అని అనుకోవడం కూడా చాలా పెద్ద విషయమే. ఒకటి సంస్కారం.. రెండోది ్రపాణానికి భద్రత. సమాజంలో ఒకరికి హాని చేసే ద్వేషాన్ని ప్రచారం చేయకుండా, ఒకరికి నష్టం చేసే అబద్ధంలో భాగంగా కాకుండా, ‘తెలిసీ కావాలనీ తప్పని తెలిసినా’ అలాంటి పనులు చేసి సామాజిక కలనేతకు నష్టం కలగించకుండా ఉంటాను అనుకోవడం అత్యంత ముఖ్యమైన సంకల్పం.
ఇక దీక్ష బూనడం మీ వంతు.
Comments
Please login to add a commentAdd a comment