Good Ideas
-
ఎవరి ఆలోచనో అది!..'స్నేహితుల బెంచ్'
నిన్న మా మనవడిని పాఠశాలలో దింపడానికి వెళ్ళాను చాలా రోజుల తరువాత. వాడిప్పుడు పదో తరగతి చదువుతున్నాడు. నాకు ఆ పాఠశాల ఆవరణలో రంగురంగుల బెంచ్ ఒకటి కనిపించింది. నేను మా మనవడిని అడిగాను నవ్వుతూ "ఎరా , మీ స్కూల్లో ఇదొక్కేటేనా బెంచి కూర్చోవడానికి" "కాదు తాతగారు, ఆ బెంచ్ 'స్నేహితుల బెంచి' అన్నాడు నా మనవడు నాతో. నేను ఆశ్చర్యంగా "అంటే ఏమిట్రా ? " నా మనవడు చిరునవ్వుతో అన్నాడు "తాతాగారు, పిల్లలు కొత్తగా చేరినప్పుడు లేదా ఎవరైనా ఒంటరిగా ఉన్నప్పుడు లేకపోతే ఆడుకోవడానికి ఎవరూ లేనప్పుడు ఆ బెంచి మీద కూర్చుంటారు. అలా ఒంటరిగా ఉన్న అబ్బాయిని చూసి, వాళ్ళతో జతకట్టడానికి, స్నేహం చెయ్యడానికి, ఆడుకోవడానికి , ఎవరో ఒకరు వచ్చి కూర్చుని స్నేహం చేస్తారు" అన్నాడు. నేను మనసులో ఎంత అద్భుతమైన ఆలోచన ఎవరిదో కానీ అనుకుని , మావాడిని అడిగాను "ఒరే, నువ్వెప్పుడన్నా ఆ బెంచి మీద కూర్చున్నావా?" "కూర్చున్నాను తాతగారు, నేను ఈ స్కూల్లో కొత్తగా చేరినప్పుడు, నాకు ఎవరూ పరిచయం లేనప్పుడు" అన్నాడు నాతో నెమ్మదిగా, ఎదో గుర్తు చేసుకుంటున్నట్టు. "నేను ఆ బెంచి మీద కూర్చున్నప్పుడు ఒక అబ్బాయి వచ్చి పరిచయం చేసుకుని నాతో అడుకున్నాడు. మేమిద్దరం అప్పటినుంచి బెస్ట్ ఫ్రెండ్స్ అని, నాకెప్పుడైనా ఎవరైనా ఆ బెంచి మీద కూర్చుని ఒంటరిగా కనిపిస్తే నేను వెళ్లి వాళ్ళతో కబుర్లు చెప్పి, వాళ్ళతో అడుకుంటాను తాతగారు" అన్నాడు . ఓ నిముషం ఆగి "ఆ బెంచ్ మీద కూర్చున్న వాళ్లు మూడో నాలుగో తరగతి పిల్లలైనా కూర్చుని వాళ్ళతో కబుర్లు చెప్తే బావుంటుంది తాతయ్య, వాళ్లెప్పుడు కనిపించినా అన్నయ్యా అంటూ నా దగ్గరకు పరుగెత్తుకువచ్చి పలకరిస్తారు" తరువాత వాడు వాడి క్లాస్ రూంలోకి వెళ్ళిపోయాడు. నాకెందుకో కొద్దిసేపు ఆ బెంచి మీద కూర్చోవాలి అనిపించి వెళ్లి కూర్చున్నాను. నా మనసు నా చిన్ననాటి రోజుల్లో నేను మొదటిసారి స్కూల్ కు వెళ్లడం గుర్తుకువచ్చింది. నేను స్కూల్లో చేరినప్పుడు నాకు స్నేహితులు ఎవరూ లేరు, ఎలా పరిచయాలు చేసుకోవాలో అన్న బిడియం ఒకటి. నేను చేరిన కొత్తలో మా టీచర్ పిల్లందరిని క్లాస్ ఉన్న ఎవరో ఒకరికి ఒక బొమ్మ గీసి ఇమ్మంది. అందరూ ఎదో ఒకటి గీసి వాళ్ళ వాళ్ళ స్నేహితులకిచ్చుకున్నారు. నాకు ఎవరూ ఇవ్వలేదు నేనూ ఎవరికి ఇవ్వలేదు. ఆ రోజు నాకు ఎంత ఏకాంతంగా అనిపించిందో నాకు బాగా గుర్తు. ఎంతో బెంగగా అనిపించింది స్నేహితులు లేకపోవడం అప్పుడు. ఆ రంగుల బెంచి మీద కూర్చుంటే నాకెంతో ఆనందమేసింది. ఎవరి ఆలోచనో కానీ కొత్తగా చేరిన పిల్లలు ఆడుకోవడానికి , జీవితాంతం చక్కటి స్నేహితులని సంపాదించుకోవడానికి చక్కటి దారి అనిపించింది. నెమ్మదిగా ఆ బెంచి మీద నుంచి లేచి బయటకు నడుస్తూ అనుకున్నాను నేను రోజూ ఉదయాన్నే నడిచే పార్కులో నలుగురు పెద్దవాళ్ళు కూర్చోవడానికి సరిపడే సిమెంట్ బెంచ్ చేయించాలి. ఆ బెంచిమీద స్నేహితుల బెంచి అని రాయించాలి, జీవిత చరమాంకంలో కొత్త స్నేహితులను సంపాదించుకోవాలి కష్టసుఖాలు చెప్పుకోవడానికి అనుకుంటూ ఇంటి దారి పెట్టను. నా చిన్ననాటి స్నేహితులు ఎక్కడెక్కడో స్థిరడ్డారు మరి. దగ్గరలో ఎవరు లేరు. ఉన్నవారితో స్నేహం చేస్తే ఎంత బాగుంటుందో. --సుబ్రమణ్యం వల్లూరి (చదవండి: డెత్ మిస్టరీ.. ఆరోజు ఏం జరిగింది? ఇప్పటికీ సమాధానం లేకుండానే..) -
కర్ణుడు స్వతహాగా మంచివాడే...కానీ...!!!
మహాభారతంలో కర్ణుడి వ్యక్తిత్వాన్ని పరిశీలిస్తే.... ఆయన పుట్టుకతో చెడ్డవాడు కాడు. కుంతీదేవికి, సూర్యభగవానుడికి జన్మించిన వాడు. నిజానికి పాండవులు యుద్ధంలో గెలుస్తారని ముందే తెలిసున్నవాడు. కురుసభలో రాయబారం ముగించుకుని శ్రీ కృష్ణ పరమాత్మ తిరిగి వెడుతూ కర్ణుడిని రథం ఎక్కించుకుని మాట్లాడుతూ వెళ్ళాడు. అప్పుడు కర్ణుడు –‘‘ధర్మరాజు నిజంగా ధర్మం ఎరిగినవాడు. దాన్ని పాటించేవాడు. ధర్మం అంతా పాండవులవైపే ఉంది. అందుకే సాక్షాత్ భగవంతుడవయిన నువ్వు ఆ పక్షాన ఉన్నావు. వారు గెలిచి తీరుతారు. ధర్మరాజు పట్టాభిషిక్తుడవుతాడు. దుర్యోధనాదులందరూ కూడా యుద్ధభూమిలో మడిసిపోతారు. ఎవరూ మిగలరు. కానీ దుర్యోధనుడిని నమ్మి ఇంతకాలం ఉండి అతడిని విడిచిపెట్టి రాలేను. నాకు కూడా మరణమే శరణ్యం. నేను కూడా అక్కడ మరణించాల్సిందే’’ అన్నాడు. అంటే – పాండవుల పక్షాన ధర్మం ఉందనీ, వారు గెలుస్తారని, వారి చేతిలో కౌరవులు మరణిస్తారని, తాను కూడా అక్కడే చనిపోతానని కర్ణుడికి ముందే తెలుసు. ఇన్ని తెలిసిన యోధానుయోధుడయిన కర్ణుడు జీవితాంతం తప్పులు చేస్తూ, ఎందుకు ప్రవర్తించాల్సి వచ్చింది !!! దుర్యోధనుడు పరమ క్రూరుడు. దుర్మార్గుడు. బద్దెనగారే మరొక పద్యంలో ‘‘తలనుండు విషము ఫణికిని, వెలయంగా తోకనుండు వశ్చికమునకున్ తలతోక యనకనుండును ఖలునకు నిలువెల్ల విషము..’’ అంటారు... ఖలుడు అంటే దుర్మార్గుడు. అటువంటి వాడికి మంచి ఆలోచనలు ఎలా వస్తాయి? అదే ధర్మరాజు పక్కన ఉంటే ...మంచి పనులు చేస్తూ ఉంటాడు.. అప్పడు ఆయన పక్కన ఉన్నవారికి కూడా అటువంటి మంచి పనులు చేయడానికి లేదా కలిసి పాలు పంచుకొనే అవకాశం దొరుకుతుంది. అలా చేస్తే ధర్మరాజు కూడా సంతోషిస్తూ ఉంటాడు. దుర్యోధనుడితో కలిసి ఉన్నందుకు అతని మెప్పుకోసం కర్ణుడు చేయకూడని పనులన్నీ చేస్తూ వెళ్ళాడు. చిట్టచివరకు ఏమయ్యాడు ...యుద్ధభూమిలో అర్జునుడి చేతిలో మరణాన్ని పొందాడు. అలాగే మనిషి ఎంత మంచివాడయినా, ఎంత చదువు చదువుకొన్నవాడయినా, ఎన్ని ఉత్తమ గుణాలు కలిగిఉన్నా... ఒక దుర్మార్గుడితో స్నేహం చేస్తే మాత్రం ఉన్న పేరుప్రతిష్ఠలు కూడా నశించిపోతాయి. సన్మార్గంలో ఉన్న వ్యక్తి దుర్మార్గులతో చేరితే... నల్లులు పట్టిన మంచం ఎలా దెబ్బలు తింటుందో అలాగే ఉంటుందని సుమతీ శతకకారుడు బద్దెనచెబుతూ ‘‘కొంచెపు నరు సంగతిచే /నంచితముగ గీడు వచ్చు నది యెట్లన్నన్ /గించిత్తు నల్లి కుట్టిన/ మంచమునకు జేటు వచ్చు మహిలో సుమతీ’’ అంటున్నారు. శవం మీద ఉన్న పూలదండనే కాదు, కింద జారిపడినా దాన్ని ఎవరూ తీసుకుని వాడుకోరు సరికదా... అసలు వేలితో ముట్టుకోరు. కర్రతో పక్కకు నెట్టేస్తారు. అదే దేవుడి మెడలో పడిన పూలదండ... మరుసటి రోజువరకు ఉన్నా, వాడిపోయినా.. కళ్ళకద్దుకుని తీసుకుని తలమీద పెట్టుకుంటారు, కొప్పుల్లో తురుముకుంటారు. పూలదండ తనంత తానుగా చేసిన మంచీ లేదు, చెడూ లేదు. శవంతో చేరితే గౌరవాన్ని పోగొట్టుకుంది, భగవంతుడి మెడను అలంకరిస్తే పవిత్ర ప్రసాదమయింది. ఎవరితో కలిసున్నామన్న దాన్నిబట్టి గౌరవమయినా, ఛీత్కారమయినా ఉంటుంది. ఇనుప ఊచ ఎంత గట్టిగా ఉంటుంది!!! అగ్నితో చేరితే మెత్తబడి ఇంటికి కిటీకీ ఊచవుతుంది, నీటితో చేరితే తుప్పుపట్టి నేలరాలిపోతుంది. అందుకే ఎప్పుడూ కూడా దుర్మార్గులతో స్నేహం చేయకూడదు. అలా చేస్తే మనం పాడయిపోవడమే కాదు, మనచుట్టూ ఉన్నవారిని కూడా భ్రష్టుపట్టించే ప్రమాదం ఉంటుందని తెలుసుకుని జీవితంలో ప్రతి క్షణం ఆచితూచి అడుగేస్తుండాలి. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
మంచి మాట: మీ చిత్తం ఎలాంటిది?
కొంతమంది ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతుంది, కాని కొందరు ఏది అనుకొంటే అదే జరుగుతుంది. దీనికి మూలకారణం ఆలోచనలే. అవే సానుకూల ఆలోచనలు, ప్రతికూల ఆలోచనలు. ఈ రెండింటికి మూలం చిత్తం. జ్ఞానాన్ని భద్రపరిచే స్థానాన్నే చిత్తం అంటారు. చిత్తంలో ఉన్న చెడు ఆలోచనలు మంచి ఆలోచనలుగా మారాలి. అప్పుడే మనం అనుకున్నవి అనుకున్నట్లుగా జరుగుతాయి. కర్మ చే యించేది మనస్సు, మనస్సుని నియంత్రించేది బుద్ధి. అహంకారం అంటే ప్రకృతి సిద్ధమైన... తన చుట్టూ వున్న పరిస్థితులను తనకు అనుకూలంగా సృష్టించుకోవాలనుకోవటమే. దీనినే మన పెద్దలు ఏమైంది ఇతనికి నిన్నటివరకు బాగానే ఉన్నాడు కదా, ఉన్నట్టుండి ఎందుకు ఇలా మారాడు అనీ లేదా ఇంతలోనే ఇతనిలో ఇంత మంచి మార్పు ఎలా వచ్చింది అనే వారు. దీనికి కారణం చిత్తం నుండి కర్మ ఆ సమయానికి ఆలా పనిచేయడమే. జీవికి వచ్చిపోయే జబ్బులు కూడా కొన్ని చిత్తానికి సంబంధించినవే, మనసు అనియంత్రిత అవయవాలను నియంత్రిస్తుంది. ఇది కలుషితమైతే దీనికి సంబంధించిన గుండె, మూత్రపిండాలు, కాలేయం, పేగులు మొదలైన అవయవాల పై ప్రభావం ఉంటుంది. నియంత్రించే వ్యవస్థ మొత్తం మెదడులో ఉంటుంది. మెదడులో ఏ అవయవానికి సంబంధించిన వ్యవస్థ చెడితే ఆ అవయవం పనిచేయదు. మెదడులో వున్న ఈ వ్యవస్థ సరికావాలంటే మనస్సులో ప్రక్షాళన జరగాలి. అందుకే ఈ మధ్యన వైద్యులు ప్రతి జబ్బుకు మనసు ప్రశాంతంగా ఉంచుకోండి లేదా ధ్యానం చెయ్యండి అని విరివిగా చెబుతున్నారు. మరి అవయవాలకు వచ్చే జబ్బుకు మనస్సుకు సంబంధించిన ధ్యానాలు ఎందుకు అంటే అన్నిటికి మూలం మనసే కనుక. మనసనేది ఆలోచనల ప్రవాహం. కోరికలు, వాంఛలూ ఆలోచనలతో సంక్రమించేవే. అంత వరకూ అనుభవంలోకి రాని దాన్ని అనుభవించాలనుకోవడం కోరిక. అదే అనుభవాన్ని మళ్ళీ మళ్ళీ పొందాలనుకోవడం వాంఛ. మనసు అల్లకల్లోలమైనప్పుడు మనం ఊపిరి వేగంగా తీసుకుంటాం. శ్వాసప్రక్రియలోక్రమబద్ధత ఉండదు. మనసును శాంత పరచడానికి శ్వాసను క్రమబద్ధం చేయడం ఒక పద్ధతి. నిండుగా గాలిని పీల్చి వదలడాన్ని క్రమం తప్పకుండా అభ్యసిస్తే నిశ్చలమైన మానసిక స్థితిని పొందవచ్చు. ప్రాణశక్తి మీద పట్టు సాధించడం కోసం ఊపిరిని నియంత్రించడమే ప్రాణాయామం. కోరికలు, వాంఛల నుంచి మనసును అధిగమించి స్వతంత్రంగా, వ్యక్తిగా ఉండగలిగే వారే యోగి. మనసును అధిగమించడమంటే దాన్ని నొక్కిపెట్టి ఉంచడం, నియంత్రించడం కాదు. మన ప్రవర్తనలో మార్పు చేసుకోవాలి. ఎదుటి వారి విజయానికి అసూయ చెందకుండా, అపజయాన్ని హేళన చేయకుండా ఉండాలి. విజయం, అపజయం, ఒకటి ఒకరు పొందితే. ఇంకొకరు కోల్పోతున్నారు, ఇంకొకరు కోల్పోతే, అది ఇంకెవరికో దక్కుతుంది. సుఖం, దుఃఖం. డబ్బు, ఆస్తి, అంతస్తులు అన్నీ నేడు నాది నాది అనుకున్నవి నిన్న వేరొకరివి, రేపు ఇంకెవరివో. అంటే ఏది ఎవరికి శాశ్వతం కాదు. నాది, నాకు అనే సుడిగుండాలలో ఇరుక్కొని మనసు పాడుచేసుకోవడమే సకల జబ్బులకు మూలం. ఈ సూత్రం అర్థం చేసుకొంటేనే ప్రశాంతత. ఏ ఇద్దరి మనస్సు, జీవన విధానం ఒకలాగే ఉండదు. కాని అందుకు విరుద్ధంగా తనకు అనుకూలంగా ఉండాలనుకోవడమే అహంకారం. ఈ అహంకారాన్ని మార్చుకొంటే చిత్తంలో వున్న చెడు కర్మలు అన్నీ మంచి కర్మలుగా మారి మనిషి జీవన విధానం మొత్తం మారిపోతుంది. అందుకే వెయ్యిమందిని వెయ్యిసార్లు యుద్ధంలో ఓడించిన వాడికన్నా తన మనసును జయించిన వాడే పరాక్రమవంతుడు’ అంటాడు గౌతమ బుద్ధుడు. మనస్సు అంటే సంకల్ప, వికల్పాల కలయిక నీరు నిర్మలంగా ఉన్నప్పుడు అందులో మన ప్రతిబింబం కనిపిస్తుంది. అందులో వేరే ఏమి కలిపినా నీరు కలుషితం అవుతుంది. ప్రతిబింబం అగోచరమౌతుంది. అలానే మనస్సులో మొదట చెడు ఆలోచనలు తరిమేయడానికి మంచి ఆలోచనలు చేయాలి. క్రమంగా మంచి ఆలోచనలూ తగ్గించాలి. అలా తగ్గించగా మనసు నిర్మలం అవుతుంది. –భువనగిరి కిషన్ యోగి -
‘అభివృద్ధికి ఐడియాస్ ఇవ్వండి’
వివిధ రంగాల అభివృద్ధిపై కలెక్టర్లు కసరత్తు చేయాలి: సీఎం సాక్షి, విజయవాడ బ్యూరో : ‘మీరు చెప్పాలనుకుంది చెప్పండి. రాష్ట్ర అభివృద్ధికి మంచి ఐడియాస్ ఉంటే వివరించండి. అలాకాకుండా...ఒకేసారి ఎగిరి దూకితే కాళ్లు విరిగిపోతాయ్ మరి. అనవసరమైన మాటలెందుకు?’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులపై సున్నితంగా మండిపడ్డారు. ప్రాథమికరంగ మిషన్‌పై శుక్రవారం విజయవాడలో జరిగిన సమీక్ష సమావేశంలో సీఎం పై విధంగా స్పందించారు. ఫిషరీస్ సెక్టార్‌కు సంబంధించిన చర్చ జరుగుతున్నపుడు ఆ శాఖకు చెందిన ఓ ఉద్యోగి లేచి మాట్లాడిన తీరుకు సీఎం మండిపడ్డారు. జిల్లాల అభివృద్ధికి అవసరమైన ప్రణాళికల రూపకల్పనలో కలెక్టర్లూ శ్రద్ధ చూపాలి. కొందరు అదనపు జేసీలు, జాయింటు కలెక్టర్లు ఏమడిగినా స్పందించడం లేదు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల వైపు దృష్టి సారించాలని, ఉద్యాన పంటలను ప్రమోట్ చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. కేంద్రం నుంచి గ్రాంట్లు రాబట్టేందుకు కృషి చేయాలని మంత్రి పుల్లారావు, ఉద్యాన శాఖ కమిషనర్ ఉషారాణికి సూచించారు. ఈ సందర్భంగా ఉద్యాన శాఖ ప్రగతిని ఉషారాణి, ఫిషరీస్ నివేదికను ఆ శాఖ కమిషనర్ రామశంకర నాయక్, పశుసంవర్థక శాఖ వృద్ధిని ముఖ్య కార్యదర్శి మన్మోహన్సింగ్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. లాం అసోసియేట్ డెరైక్టర్ ఈదర నారాయణ, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల కో-ఆపరేటివ్ అధికారులు చంద్రశేఖర్, ప్రవీణలు వ్యవసాయ రంగం, పరిశోధనల్లో అవసరాలను వివరించారు. క్లౌడ్ టెక్నాలజీ ద్వారా డెయిరీ, ఫిషరీస్, ఆక్వా రంగాల్లోని ప్రగతి డేటాను కంప్యూటర్లలో అప్లోడ్ చేసే బాధ్యతలను సీఎం చంద్రబాబు వశిష్టాగ్రూప్ ప్రతినిధి హరివర్మకు అప్పగించారు. కాగా ప్రాథమికరంగ మిషన్‌కు ‘రైతు కోసం’ అని కొత్త పేరు పెట్టారు. రాష్ట్ర ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ల వర్క్‌షాపులో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పేరుపై నిర్ణయం తీసుకున్నారు.