మాజీ అటార్నీ జనరల్ వాహనవతి కన్నుమూత
ముంబై: మాజీ అటార్నీ జనరల్ గులాం ఎస్సాజీ వాహనవతి (65) మంగళవారం గుండెపోటుతో ముంబైలో మరణించారు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు. కొంతకాలంగా ఊపిరితిత్తులకు సంబంధించిన ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న జీఈ వాహనవతి ఇటీవలే ముంబైలోని ఒక ఆసుపత్రిలో చేరారు. 2009లో యూపీఏ కూటమి కేంద్రంలో రెండవసారి గెలిచిన అనంతరం.. 13వ అటార్నీ జనరల్‌గా వాహనవతి మూడేళ్ల పదవీకాలానికి నియమితులయ్యారు. 2012లో ఆయన పదవీకాలాన్ని మరో రెండేళ్లపాటు పొడిగించారు. తర్వాత, నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గత మే నెల 27వతేదీన వాహనవతి అటార్నీ జనరల్ పదవికి రాజీనామా చేశారు.
గతంలో వాహనవతి, 2004 నుంచి 2009 వరకూ సొలిసిటర్ జనరల్‌గా, అంతకు ముందు మహారాష్ట్ర అడ్వొకేట్ జనరల్‌గా వ్యవహరించారు. వాహనవతి మృతిపట్ల మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ సంతాపం వ్యక్తంచేశారు. ఆయన మృతితో దేశం ఒక న్యాయకోవిదుడిని, అంకితభావంతో కూడిన ప్రభుత్వ అధికారిని కోల్పోయిందని మన్మోహన్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు.